సినిమా చూడటం ఒక కళ

‘ఒక దృశ్యం కొన్ని అర్ధ తాత్పర్యాలు’ – వంశీకృష్ణ

కవిగా, కథకునిగా ప్రయాణం మొదలెట్టిన వంశీకృష్ణ వ్యాసంగంలో ఇపుడు సినిమా ప్రధాన భూమికని పోషిస్తున్నది. తనకు తెలిసీ తెలియకనే సినిమాలతో తన కాలాన్ని ముడివేసుకున్నాడు. ఫలితంగా సినిమాని ఎలా చూడాలో చెబుతున్నాడు. సినిమా ఒక కళారూపం. సినిమా తీయడం ఒక కళ. సినిమా చూడటం కూడా ఒక కళ. సినిమాను ఎలా చూడాలో, ఎలా అర్థం చేసుకోవాలో వంశీ వ్యాసాలు చెబుతాయి. సినిమాలు అందరూ చూస్తారు. కాని వాటిని సరిగా అర్థం చేసుకునే వారు అరుదు. ఎందుకు బాగుందో, ఎందుకు బాగోలేదో ఎవరికివారు తమ అభిప్రాయాలు చెబుతారు. అయితే బాగోలేకపోతే ఎందుకు బాగోలేదో, బాగుంటే ఏ అంశాల కారణంగా బాగుందో సాధికారికంగా చెప్పగల సత్తా వంశీకి ఉంది. ఆ చెప్పడంలో తనదయిన కంఠస్వరం ఉంది. అదే వంశీ సినిమా వ్యాసాల పట్ల ఆకర్షణకు మూలం.
తను రాసే ఏ వ్యాసమైనా ఒకటి రెండు వాక్యాలు చదివితే ఆసాంతం వదలకుండా చదువుతాం. అలా పాఠకుల్ని లాక్కుపోయే వచనశైలి వంశీ వ్యాసాల్లో కనిపిస్తుంది. అంతటి సమ్మోహన శక్తి వంశీ పదాలకీ, వాక్యాలకీ, వాక్యాల నడుమ సున్నితంగా కలసిపోయిన ఆర్ద్రతలో ఉంది. అందుకే ఆత్మీయంగా పాఠకుల మననసు అల్లుకుపోతుంది. వంశీ వ్యాసం. ఒక ఉన్మత్త పరవశానికి లోను చేస్తుంది. ఈ కారణంగానే వంశీ వ్యాసం రాగానే చదవడం అలవాటయింది. ఒకసారి వంశీ వాక్యానికి అలవాటు పడవారు తన అక్షరాలు కనిపిస్తే చదవకుండా ఉండలేని మనోస్థితికి లోనవుతారు. ఈ కారణంగా వంశీకృష్ణకు ఒక పాఠకవర్గం అప్రయత్నంగానే సమకూరింది.

వంశీ సినిమాల గురించి రాసినా, కవిత్వం గురించి రాసినా, కవిత్వమే రాసినా ఇష్టంగా, ప్రేమగా, పరవశంగా చదివేందుకు ఉత్సుకత చూపే పాఠకులున్నారు. ఒకసారి వంశీ వ్యాసాలు చదివినవారు. మరల తన పేరు కనిపిస్తే పక్కకు తప్పుకుపోలేరు. అనుకోకుండానే వంశీ అక్షరాల వెంట పరుగులెత్తుతారు. అలా పరుగెత్తించే వచనశైలి వంశీ కలానికి చేకూరింది. కొత్త పాఠకుల్ని ఆకర్షించే దివ్యమైన శక్తి ఏదో వంశీ అక్షరాలకు ఉంది. ఈ కారణంగానే వంశీ వ్యాసాలు ప్రచురించడం సంపాదకునిగా ఇష్టమైన పని. జర్నలిస్టుగా నేను చేస్తున్న పనికి సాఫల్యతను, సంతృప్తిని ఇస్తాయి వంశీ రచనలు.
ఈ ఇష్టమే వంశీ వ్యాసాలు అటు ‘పాలపిట్ట’లోనూ, ఇటు నవతెలంగాణ “సోపతి’లోనూ ప్రచురించడానికి, అటు తర్వాత పుస్తకాలుగా తీసుకురావడానికి ప్రేరణ.
నవతెలంగాణ ‘సోపతి’లో 07 సెప్టెంబర్ 2014 నుంచి 17 జూన్ 2018 వరకు ప్రచురించిన వంశీ సినిమా వ్యాసాల సమాహారం ఈ పుస్తకం. ఇందులోని 43 వ్యాసాల్లో అనేక కోణాలు దర్శనమిస్తాయి. ‘ఒక దృశ్యం కొన్ని అర్ధ తాత్పర్యాలు’ అని పేరు పెట్టడానికి కారణమిదే. సినిమాల గురించి, సినిమా రంగం గౌరవాన్ని పెంచిన వ్యక్తుల సృజనాత్మక కంట్రిబ్యూషన్ గురించి ఆయా సందర్భాలకు అనుగుణంగా వంశీ రాసిన వ్యాసాలివి. సినిమా పట్ల మన అభిరుచి సరయిన దిశలో పాదుకోడానికి వంశీ వ్యాసాలు తోడ్పడతాయి. ఈ త్తమాభిరుచిని సమకూర్చుకోడానికి అవసరమైన జవసత్వాలని సమకూరుస్తాయి. గొప్ప సినిమాల్లోని ఔదాత్యాన్ని పరిచయం చేస్తాయి. తెలుగు సినిమా, తెలంగాణ సినిమా గురించి మనం ఎంతో మాట్లాడుతుంటాం. కానీ వీటికి ఆవల ఉన్న ప్రపంచ సినిమాల్లోని ఔన్నత్యాన్ని వంశీ వ్యాసాలు తెలియజేస్తాయి.

భారీ బడ్జెట్లు, వంద కోట్ల క్లబ్బుల్లో చేరడం గొప్ప కాదు. హృదయాన్ని చెమరింపజేసే లక్షణం ఉన్న సినిమా విలువైనది, విశిష్టమైనది. మన అంతరంగాలని కదిపి కుదిపి కలవరానికి లోను చేసే గుణమేదో లేకపోతే అది సినిమానే కాదనే అవగాహనని అందిస్తాయి. వంశీ వ్యాసాలు. ఒక సినిమాలోని విలక్షణమైన కోణాల గురించి వంశీ చెప్పాడంటే ఆ సినిమాని చూడకుండా ఉండలేము. అంతటి కుతూహలానికి లోను చేస్తుంది వంశీ వ్యాసం. ఇలాంటి వ్యాసాలు ఆ వారంతోనో, ఆ నెలతోనో ముగిసిపోయేవి కాదు. వాటిని మరల మరల చదువుకోవాలనిపించే కళాత్మక సౌందర్యమేదో ఈ వ్యాసాల్లో ఉంటుంది.
మానవ సంబంధాల్లోని వైరుధ్యాలను, ప్రేమలోని సున్నితమైన, సంక్లిష్టమైన పార్శ్వాలను సినిమాలు ఏమేరకు పట్టుకున్నాయో, ఏవిధంగా ప్రతిఫలించాయో వంశీ సినిమా వ్యాసాలు చెబుతాయి. ఆస్కార్ అవార్డు పొందిన స్టిల్ అలైస్’ గురించి వంశీ వ్యాసం చదివితే ఆ సినిమా చూసేందుకు ఆత్రపడతాం. అలాగే మసాన్, కోర్టు, సైరత్, దంగల్ సినిమాల విశిష్టత గురించి వంశీ చెబితే విస్మయం చెందుతాం.
సినిమాల గురించే కాదు, ఒక కళారూపంగా సినీరంగ ప్రతిష్టని ఇనుమడింపజేసిన బాలచందర్, బాపు రమణ, జాహ్నుబారువా, ముబారక్ బేగం, సత్యజిత్ రే, శశికపూర్, ఎం.ఎస్. విశ్వనాథన్, సినారె మొదలైన ప్రముఖుల గురించి రాసిన వ్యాసాలు వారికి వంశీ సమర్పిస్తున్న సముచిత నివాళిగా తలపిస్తాయి. తెలుగు సినిమా, తెలంగాణ సినిమా గురించి రాసిన వ్యాసాలు మనం ఇంకా ఎంత దూరం ప్రయాణించాలో సూచిస్తాయి. డబ్బు చేసుకోడం తప్ప కళగా రాణించలేని తెలుగు సినిమారంగ దుస్థితిని తెలియజేస్తాయి. ఈ దురవస్థకు లాభమే తప్ప కాసింత కళాదృష్టి లేని పెట్టుబడి వికృత నైజం కారణమని వంశీ వ్యాసాలు చదివితే బోధపడుతుంది.
సినిమా ప్రపంచంలోని భిన్నకోణాల్ని పరిచయం చేసే ఈ వ్యాసాలు చదవడం పాఠకుని సృజనాత్మక సమయాన్ని ఉద్దీపింపజేస్తాయి. కొత్త ఆలోచనలకు ఆస్కారమిస్తాయి. సినిమా రంగ పోకడలపైన పరిత అవగాహన పరిధిని విశాలం చేస్తాయి. మంచి సినిమాలను చూసే, మంచి సంగీతాన్ని వినే ఉత్తమాభిరుచిని ప్రోది చేస్తాయి. అందుకే వంశీ వ్యాసాలు చదవడం వినూత్నమైన సృజనానుభవం.

– గుడిపాటి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap