అనాధగా మిగిలిన అజరామరమైన “ కాళ్ళ” కళా సంపద

చిత్రకళా రంగంలో ”కాళ్ళ” అనే పేరుతో ప్రసిద్ధి చెందిన చిత్రకారుడి అసలు పేరు సత్యనారాయణ అనే విషయం కళా రంగంలో ఉన్న ఎంతో మందికి సైతం తెలియదు అంటే ఆశ్చర్యపోనక్కరలేదు. లోకంలో కొందరే గొప్ప వ్యక్తులున్నట్లే గొప్ప కళాకారులు కూడా కొందరే. వ్యక్తి గతంగా గొప్పవాడైన ప్రతి మనిషి కళాకారుడిగా గొప్పవాడు కాలేడు. అలాగే కళాకారుడిగా గొప్పవాడైన ప్రతి మనిషి వ్యక్తిగతంగా గొప్పవాడు కాలేడు.

చిత్రకారుడు గా కాళ్ళ ఎంత గొప్ప వాడో,వ్యక్తిగా కుడా అతడు అంతే గొప్పవాడు.అందుకే కేవలం అతని కళ ను గురించి మాత్రమే వర్ణించి ఊరుకుంటే ఎంత అసంపూర్నమౌతుందో కేవలం వ్యక్తిగా మాత్రమే చెప్పి ఊరుకున్నప్పటికి అంతే అసంపూర్ణమౌతుంది. అందుకే అతని గురించి రాయాల్సి వొచ్చినప్పుడు రెండింటికి సమప్రాధాన్యత ఈయవల్సివుంటుంది. అందుకే కాళ్ళ గురించి చెప్పుకున్నప్పుడు సాధారణ జనావలిలో అతడొక మనిషి అనుకుంటే పొరపాటే, అతను సాధారణ మనిషి కంటే ఉన్నతమైన వాడు. ఎందుకంటే అందరిలా కాళ్ళ బ్రతకడం కోసమే జీవించలేదు. జీవించడంకోసం బ్రతికిన వ్యక్తి ,ఇక్కడ జీవించడం అంటే తినడం, తాగడం, నిద్రపోవడం కాకుండా అంతకంటే బిన్నంగా ఆలోచించడం,జ్ఞానంతో నడవడం, ఒకరికి హాని చేయకుండా వుండడం, సమాజం పట్ల భాద్యత తో కూడిన సత్ ప్రవర్తనతో మెలగడం, తానెంచుకున్న పనిని త్రికరణ శుద్ధిగా నమ్మి చేయడం. సమాజంలో జరుగుతున్న అసమానతలపై మౌనంగా ఉండకుండా కనీసం తనదైన మాధ్యమంలో వ్యక్తం చేయడం .కడుపు నిండడానికి అన్నపానాదుల కంటే రంగులు బ్రష్షులే అధికంగా వినియోగించడం. అది బలమా ? లేక బలహీనత అని అనుకుంటే రెండు అని చెప్పాల్సి వుంటుంది కారణం జీర్ణక్రియ ముగిసిన పిదప విసర్జన క్రియ జరగకపోతే ఎంత అసౌకరానికి గురౌతామో కాళ్ళ కూడా బొమ్మలు వేయక పోతే అంతే అసౌకర్యానికి గురౌతాడు.అది అతని బలహీనతేకాదు బలం కుడా

మనసుకు ఇబ్బంది కలిగించే అంశాలపై మౌనంగా తనదైన భాషలో కుంచె, వర్ణాలతో యుద్ధం చేసిన వ్యక్తి .అందుకే సామాజిక అంశాలు అతని చిత్రాలకు ప్రధాన వస్తువులుగా మారాయి. కర్మాగార కర్కశ యంత్రాలమధ్య నలిగిపోయే బాల కార్మికులు కర్షకులు, కాన్వెంట్ చదువుల భారాన్ని మోయలేని బాలబాలికలు, మతం ముసుగు లో జరిగే చాందసవాదపు మోసాలు, కామాంధుల కౌగిలిలో నలిగిపోయే బాలబాలికలు, చెరచబడ్డ స్త్రీలు, గ్లొబలైజేషన్ విష వలయంలో కొట్టుకుపోయే వృత్తి పని వాళ్ళు, బహుళ జాతి కంపెనీల మోసాలకు బలిపశువులైన బడుగు రైతులు, పత్తి రైతుల ఈతి బాధలు ఇతర శ్రమ జీవులు ఒకటేమిటి ఏ చిత్రం చూసినా సమాజంలోని అసమానతలను కుళ్ళు కుతంత్రాలను ఎత్తి చూపిస్తూ ప్రేక్షకుల హృదయాలను చలింపజేసేవే. లాతూరు భూకంపం మరియు, గుజరాత్ లో జరిగిన గోద్రా మత అల్లర్ల గురించి చలించిపోయి అతడు వేసిన చిత్రాలు చూసిన ఎవరికైనా నిజంగా మనసు కలతకు గురిచేసి హృదయాల్ని ద్రవింపజేస్తాయి. నిజానికి ఏ చిత్రకారుడైనా అందమైన చిత్రాలు వేసీ జనాల్ని ఆకర్షించి మంచి పేరు నాలుగు డబ్బులు సంపాదించుకోవడంద్వారా ఒక సౌకర్యవంతమైన జీవనాన్ని కొనసాగించడం అనేది ఒక సగటు కళాకారుడి యొక్క ఆలోచనగా వుంటుంది. కాని ఆర్ధికంగా సగటు మనిషి కంటే దిగువ స్థాయిలో ఉన్నప్పటికీ కళను మాత్రం ఏనాడూ ఆర్ధిక కోణంలో చూడకుండా కేవలం తన ఆత్మ సంతృప్తి కోసమే చిత్రరచనను చివరివరకు చేసిన నిజమైన కళాకారుడు కాళ్ళ

ఉత్తరాంద్ర విజయనగరంలో పుట్టి కోస్తాంధ్ర ఏలూరులో చదివి దక్షిణ తెలంగాణా ఖమ్మంలో స్థిరపడిన కాళ్ళ జీవితం నిజంగా ఎన్నో గొప్ప ఒడిదుడుకుల సుడిగుండం అని చెప్పాలి. బ్రతుకు దెరువు కోసం రిక్షా తొక్కడం మొదలు స్క్రీన్ ప్రింటింగ్ వరకు ఎన్నో ఇతర పనులు చేసిన వ్యక్తి.ఆ పనులు ద్వారా సంపాదించిన డబ్బును తినడానికంటే రంగులు బ్రషులు కొనడానికే వినియోగించాడు. జీవితం ఎంత దయనీయమైనప్పటికీ డబ్బుకోసం అర్రులు చాచని వ్యక్తిత్వం. మంచితనానికి మాత్రం వెన్నలా కరిగిపోయే నైజం అతని తత్వం. ఇప్పటికి మూడు దశాబ్దాల క్రితం ఖమ్మం లో డాక్టర్ హరీష్ అనే కళా ప్రియుడైన వైద్యుడి కోరిక పై ఖమ్మం రావడం నాటి నుండి హరీష్ యొక్క కళాభిలాషకు ముగ్దుడై ఖమ్మం లోనే స్థిరపడి పోవడం, హరీష్ గారు కుడా కాళ్ళ యొక్క సృజనాత్మకత కు ముగ్ధుడై తన జీవితాంతం కాళ్ళకు ఆశ్రయమిచ్చి ఆదరించడం వల్లనే హరీష్ గారు బ్రతికి ఉన్నంతకాలంలో కాళ్ళ నిర్విరామంగా తన సృజనకు కార్యరూపాన్ని ఇవ్వగలిగారు . కాని 2006 లో డాక్టర్ హరీష్ గారు మరణానంతరం మరల అతని కళా సృజనకు అంతరాయం ఏర్పడిందనే చెప్పాలి.

కాళ్ళ చదివింది కేవలం ప్ర్రాదమిక స్థాయి విద్య నే. కాని అతని చదువుకు మించిన గొప్ప జ్ఞానం అతనిలో వుండేది. అతనితో మాటలు కలిపినప్పుడు ఎన్ని విషయాలు వొస్తాయో విన్నవారికే తెలుస్తుంది.కేవలం ఒక్క సంగీతం సాహిత్యం, చిత్రలేఖనములే కాక జాతీయ అంతర్జాతీయ విషయాల గురించి కుడా ఎంతో సాధికారికంగా మాట్లాడే వ్యక్తి.ఆయా రంగాల్లో ప్రముఖ వ్యక్తుల గురించి కూడా ఎన్నో విషయాలు చెప్పేవాడు. అంత జ్ఞానం ఎలా వొచ్చిందోనని విన్నప్పుడు మాకు నిజంగానే విస్మయం కలిగేది.దానికి కారణం పుస్తకాలు ఎక్కువగా చదవడమే అతని కలెక్షన్ లో ఎన్నో మంచి మంచి పుస్తకాలుండేవి.గొప్ప గొప్ప రచయితలు, కవులు కళాకారులు కాళ్ళ బొమ్మ కోసం మహా నగరాల నుండి ఖమ్మంలో పాండురంగాపురం ఊరి చివర విసిరేసినట్టుండే ఆయన కొంపకు రావడం జరుగుతూ వుండేది. ప్రఖ్యాత నవలా రచయిత డాక్టర్ కేశవరెడ్డి తన గొప్ప గొప్ప నవలలన్నింటికి ముఖ పత్రాలు అందించింది కాళ్ళ నే. మరో గొప్ప కథా రచయిత జాతశ్రీ సంకలనాలన్ని కాళ్ళ చేతిలో రూపుదిద్దుకున్నవే, ఇండియా టుడే పత్రిక విడుదల చేసిన కొన్ని ప్రత్యేక సంకలనాలు కాళ్ళ చిత్రాలతో అలంకరింప బడ్డాయి. అలాగే ప్రఖ్యాత చిత్రకారుడు మోహన్, హిందూ కార్టూనిస్ట్ సురేంద్ర,శ్రీనివాస్ ప్రసాద్, కవి సీతారాం, ప్రసేన్, డాక్టర్ హరీష్, ఆనందాచారి ఎందరెందరో గొప్ప గొప్ప కళాకారులు అతని స్నేహన్ని ఎంతో ఇష్టంగా భావించేవారు.

కాళ్ళతో నాకు పన్నెండేళ్ళ అనుభందం. 2006 లో అనుకుంటాను మిత్రుడు హ్యారీ నేను కాళ్ళ ముగ్గురం కలిసి ఖమ్మం లో చిత్ర కళా ప్రదర్శన చేసినప్పటినుండి మా మధ్య స్నేహం రోజురోజుకి పెరుగుతూ వొచ్చింది. 2010 లో కళాసాగర్ గారి ఆధ్వర్యంలో 64కళలు.కం ప్రారంబించినప్పుడు చిత్రకళా శీర్షికలో నేను మొట్ట మొదటగా పరిచయం చేసిన చిత్రకారుడు కూడా కాళ్ళనే. అందులో బాగంగా కాళ్ళ ఇంటిలో ఆయన చిత్రాలను నా మరో మిత్రుడు బీర శ్రీనివాస్ తో కలిసి చూసినప్పుడు నిజంగా ఎంతో ఆవేదన చెందాము. ఇంతటి అసమాన కళాకారుడి చిత్రాలకు తగిన ప్రాచుర్యం రాలేదే అని. దానికి కారణం అతని పేదరికం కొంతైతే ప్రచారానికి ఇష్టపడని అతని నైజం మరికొంత కారణం కాళ్ళ ఇద్దరు కొడుకులు చిత్రకళా రంగంలో కొనసాగుతూ ఒక పాత కంప్యూటర్ ఇవ్వడంతో ఏడు పదుల దగ్గర వయసులో కూడా కంప్యూటర్లో ఫోటో షాప్ వర్క్ నేర్చుకుని డిజిటల్ చిత్రాలు వేయడం గొప్ప విశేషం ఈ పద్దతిలో అతడు సృష్టించిన “పంచ భూతాలు”భూమి. నీరు,అగ్ని, వాయువు, ఆకాసము అలాగే “ఆరు ఋతువుల” చిత్రాలను చూస్తే వాటిల్లో ఎంతో సృజనాత్మకత అద్భుతమైన అతని పనితనం మనకు కనిపిస్తుంది.గత సంవత్సరం ఏదైనా కంపెనీ వాళ్ళచే నూతన సంవత్సరపు కేలండర్ గా ఆ చిత్రాలను వేయించాలని ఎంతో ఆశ పడ్డాను కాని అది నెరవేరలేదు. గతంలో భద్రాచలము నందలి సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ అధికారిణిగా మరియు ఖమ్మం జిల్లా జాయింట్ కలెక్టర్ గ పనిచేసి నేడు ఆదిలాబాద్ కలెక్టర్ గ పనిచేస్తున్న ఐ.ఏ.ఎస్. అధికారిని దివ్యదేవరాజన్ గారి కోరికపై నేడు అంతరిచిపోతున్న గిరిజన సాంప్రదాయ పండుగలు నేటి గిరిజన యువతకు తెలియాలనే ఉద్దేశ్యంతో వారి పండుగలకు నేను, కాళ్ళ, బీర శ్రీనివాస్ కలిసి వేసిన చిత్రాలతో దివ్య మేడం గారు ఒక అందమైన పుస్తకము తీసుకు రావడం ఒక మధుర స్మృతి. అలాగే కొద్ది నెలల క్రితమే కల్యాణి ఆల్ రౌండర్ అనే యు ట్యూబ్ చానల్ వారితో కాళ్ళగారి ఇంటర్వ్యూ చేయించడం నాకు కాస్త సంతృప్తి కలిగించిన అంశం.

హరీష్ గారి మరణం, ఆపై తన బార్యకోటమ్మ గారి అనారోగ్యం కాళ్ళ కళా జీవితంపై ఎంతో మార్పుని తీసుకు వొచ్చాయి,అయినప్పటికీ పిల్లలు ఇద్దరు మంచి చిత్రకారులుగా తీర్చిదిద్ద బడ్డారు.పెద్ద కుమారుడు పైడి రాజు చిత్రాలపై కాళ్ళ ప్రభావం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఇటీవలనే తన ప్రధమ కుమారుడు ఖమ్మంలోని యువ చిత్రకారులతో యానిమేషన్ రంగంలో ముందుకు నడిపించాలనే ఉద్దేశ్యంతో ఒక స్టూడియో తీసుకుని దాన్ని ముందుకు తీసుకు వెళ్తున్న క్రమంలో అకస్మాతుగా కాళ్ళ అనారోగ్యం బారిన పడి నెల రోజులుగా హాస్పిటల్ లో వైద్యం తీసుకుంటూ ఈ నవంబర్ 24 న శాశ్వతంగా లోకాన్ని వొదిలి వెళ్ళిపోవడం భాద కలిగించిన విషయం. తన చివరి ఆకాంక్షగ కూడా తన పార్ధివ దేహాన్ని వైధ్యవిధ్యార్దుల ఉపయోగం నిమిత్తం ఇవ్వమనడం అతని గొప్పతనం. ఆ విదంగానే తన కుమారులు ఖమ్మం మెడికల్ కాలేజికి అతని పార్ధివ దేహాన్ని అప్పగించడం జరిగింది.

నేడు చిత్రకారుడు కాళ్ళ లేడు. కానీ అతను సృష్టించిన ఎంతో కళా సంపద దిక్కుతోచని స్థితిలో అనాదగా మిగిలింది.ఇలాంటి దయనీయ స్థితిలో అభ్యుదయ వాదులు కళాకారులు కాళ్ళ శ్రేయోభిలాషులు మరియు ఖమ్మం ప్రభుత్వ అధికారులు కలిసి అతని చిత్ర సంపదను కనుమరుగు కాకుండా భావితరాలకు తెలియజేసేందుకు కాళ్ళ పేరు మీదుగా ఒక గేలరీలో భద్రపరచవల్సిన అవసరం వుంది. ఈ ప్రయత్నం దిశగా అందరు కృషి చేయడమే ఆ మహా కళాకారునికి మనము సమర్పించే సరైన నివాళి.

– వెంటపల్లి సత్యనారాయణ,  9491378313

3 thoughts on “అనాధగా మిగిలిన అజరామరమైన “ కాళ్ళ” కళా సంపద

  1. ఆయన కళా జ్ఞాని, కళ కళ కొసమే ఐనా తన కళ లో మాత్రం పూర్తిగా సమకాలీన సమాజంలో తన కళ్ళముందు జరుగుతున్న అంశాలే ఆయన కాన్వాస్ మీద ఇతివృత్తాలయ్యేవి, ఆయన లాంటి మనిషి, కళాకారుడు నభూతో నభవిష్యతి, ఆయన ఆత్మకు శాంతి కలుగుగాక. ఆయన చిత్రాలను అమ్మటం ఆయనకు ఇష్టంఉండేదికాదు, కనీసం ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఆయన చిత్రాలకు గ్యాలరీ ఏర్పాటుచేస్తే భావి తరాలకు ఎంతగానో ఉపయోగపడతాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap