గోరటి వెంకన్నఈ పేరు చెబితే మనశ్శరీరాలు పులకించిపోతాయి. అతని పాట మన రక్తనాళాల్లో సంలీనమై ప్రవహిస్తుంది. ఈ ముద్దుబిడ్డని కన్నతల్లి ఈరమ్మ. తండ్రి నర్సింహ్మ, ఏప్రిల్ 4, 1964న వెంకన్న కెవ్వుమన్న తొలిరాగంతో మహబూబ్ నగర్ జిల్లా తెలకపల్లి మండలం గౌరారం పల్లె ధన్యతనొందింది. మూడో తరగతి వరకు గౌరారంలో, తర్వాత పదోతరగతి వరకు రఘపతిపేటలో చదువుకున్నారు. కల్వకుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివే రోజుల నాటికే వెంకన్న కవిత్వ రచన మొదలు పెట్టారు. పాటలు పాడటం, విద్యార్థి ఉద్యమాల్లో భాగస్వామ్యం అతని జీవితంలో అంతర్భాగమయ్యాయి. జడ్చర్లలో డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు డిగ్రీకళాశాల నుంచి 1985లో బి.ఏ.లో పట్టా పుచ్చుకున్నారు. అదే ఏడాది హైదరాబాద్ లోని ఆంధ్రసారస్వత పరిషత్ కళాశాలలో ఎం.ఏ. తెలుగులో చేరారు. రెండో సంవత్సరంలో ఉండగా ఉద్యోగం రావడంతో చదువుకి మధ్యలోనే స్వస్తి చెప్పాల్సి వచ్చింది. 1987లో నాగర్ కర్నూలులో జూనియర్ అసిస్టెంట్గా నాగర్కర్నూలులోని కోఆపరేటివ్ డిపార్టమెంట్లో చేరిక. ప్రస్తుతం అక్కడే సబ్ డివిజనల్ కోఆపరేటివ్ ఆఫీసరుగా పనిచేస్తున్నారు.
చిన్నప్పట్నించి సృజనాత్మకంగా వ్యవహరించడం వెంకన్న నైజం. పాటలు, ఆటలు ఆడటం, సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రదర్శనలు ఇవ్వడం అతని అభిరుచి, అలవాటు. రఘపతి పేటలో వడ్ల వెంకటయ్య పద్యాలు పాడటం విని పాడటం నేర్చుకున్నాడు. బడిలో కొన్ని ఏకపాత్రాభినయాలు చేసిన వెంకన్నకి రంగస్థలమంటే ప్రీతి. ఇప్పటికీ రంగస్థలం మీద పౌరాణిక పాత్రల్లో నటిస్తున్నారు. హైస్కూలు దశలోనే కీర్తనలు, పద్యాలు రాసిన వెంకన్న విద్యార్థి ఉద్యమాల్లో క్రియాశీలకపాత్ర వహించారు. హైస్కూలు దశలోనే పద్యాలు, కీర్తనలు, పాటలు రాశారు. ఉద్యమాల్లో పాల్గొనే వేళ అతని పాట పదునెక్కింది. అతని కంఠస్వరం కొత్తరాగాల్ని ఆలపించింది. 1986 తర్వాత విప్లవోద్యమాలతో సంబంధం వెంకన్న పాటకి గమనాన్ని, గమ్యాన్ని సూచించాయి. అవగాహనలో నైశిత్యం అతనికి దృష్టి వైశాల్యాన్ని ఇచ్చింది. ఈ క్రమంలోనే పాటకి వున్న బలం అర్థమైంది. పాటలో కవితాత్మక సౌందర్యం తారాస్థాయిని అందుకోడానికి అతని మూలాలు, అతని నేల ప్రాశస్త్యం, విస్తృత అధ్యయనం తోడ్పడ్డాయి. అతని పాటలు గేయరూప కవితలు.
ఇదివరలో రెండు పుస్తకాలు వచ్చాయి. 1. ఏకునాదం మోత, 2. రేలపూతలు, పాటల ఆల్బమ్స్ అయిదు వచ్చాయి. తొలుత ‘ఎన్ కౌంటర్’ సినిమాకు పాట రాశారు. శ్రీరాములయ్య’ చిత్రంలో నటించారు. పాడారు. సినిమాలకు దాదాపు అరవై దాకా పాటలు రాశారు. కొన్ని సినిమాల్లో నటించారు. ‘ధూంధాం’ చిత్రంలో తనే కథానాయకుడు. ‘పల్లె కన్నీరు పెడుతుందో’ పాట తెలుగునాట దశదిశలా వ్యాపించి, అతని కవితా సౌందర్యాన్ని లోకానికి తెలియజెప్పింది. గ్లోబలైజేషన్ కి వ్యతిరేకంగా వచ్చిన రచనల్లో ఇదే అగ్రగామి గీతం. ఒక బైరాగిలా, తాత్వికునిలా తన పాటల ద్వారా లోకాన్ని మేల్కొల్పడం వెంకన్న పాటల్లోని విశిష్టత. సృజనాత్మకంగా జీవించే వెంకన్నని వరించిన అవార్డులు అనేకం. ‘హంస’ పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య పురస్కారం, అధికార భాషా సంఘం పురస్కారం, విశాలాంద్ర పురస్కారం, ‘తెర’ సంస్థ వారి జీవిత సాఫల్య పురస్కారాలు… ఇంకా ఎన్నో వెంకన్న అందుకున్నారు. ప్రకృతి, పల్లె, వ్యధార్ధుడయిన మనిషి అతని ప్రధాన ఇతివృత్తాలు.
People’s singer….