అవార్డ్ కి ఒక అర్హత వుండాలన్న మిల్కాసింగ్

నాడు పద్మశ్రీ ఇచ్చిన కేంద్రప్రభుత్వం ఆ తర్వాతి కాలంలో మిల్కాసింగ్ ని మరచిపోయింది. ఆ తర్వాత అతనికి అర్జున్ అవార్డ్ ప్రకటిస్తే తిరస్కరించాడు. అవార్డ్ కి ఒక అర్హత వుండాలి. అర్హులైన వారికి అవార్డు ఇవ్వాలి అన్నది మిల్కాసింగ్ మాట. ఇటీవలి కాలంలో దేవాలయంలో ప్రసాదం పంచినట్టు పంచుతున్నారు. అవార్డులు అంటూ, అర్హత లేకుండా ఏ అవార్డు ఆశించవద్దన్నాడు.

దేశవిభజన సమయానికి మిల్కాసింగ్ వయసు 18 ఏళ్ళు. వారి తల్లిదండ్రులకు మొత్తం 15 మంది సంతానం. వారిలో తల్లి, తండ్రి, ఒక సోదరుడు, ఇద్దరు చెల్లెళ్ళను మిల్కాసింగ్ కళ్ళఎదుటే ఘోరంగా నరికి చంపారు. మిగిలినవారు చెల్లాచెదురయ్యారు. ఎవరు ఎటు పరిగెడుతున్నారో తెలియని స్థితి. ఆ పరిస్థితుల్లో ప్రాణాలు అరచేత పట్టుకుని, ఎవరెవరి వెనకో పరిగెట్టి చివరికి ఎలా చేరాడో కూడా తెలియని పరిస్థితిలో ఢిల్లీ చేరాడు.

బంధువుల ఇళ్ళలో తలదాచుకున్నాడు. తన కుటుంబ జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసిన పాకిస్తాన్ అంటే కసి, కోపం. పాకిస్తాన్తో స్నేహం పెంచుకోవాలన్నది జవహర్లాల్ నెహ్రూ ప్రయత్నం.
ఆటల పోటీతో స్నేహం పెరుగుతుందని ప్రధాని భావిస్తే నేను ఆ దేశం వెళ్ళనంటే వెళ్ళనన్నాడు మిల్కాసింగ్. చాలాకాలం తర్వాతగాని మిల్కాసింగ్ అక్కడికి వెళ్ళలేదు. అక్కడ జరిగిన పరుగుపందెంలో, నాటికి పేరు పొందిన పాకిస్తాన్ రన్నర్ని ఓడించి, చూశావా నిన్ను ఓడించా అని మిల్కాసింగ్ చూసిన చూపు నాడు ప్రత్యేకంగా చెప్పుకున్నారు. వీడియో రాకముందు సంగతి ఇది.

దేశవిభజన పరిస్థితులే మిల్కాసింగ్ని భారత సైనికదళంలో చేరేలా ప్రోత్సహించింది. మొదటి మూడు ప్రయత్నాలలో తిరస్కరణకు గురయ్యాడు. టికెట్ లేకుండా రైలు ప్రయాణం చేసినందుకు అరెస్టు అయి బీహార్ జైలులో వున్నాడు.
ఒకదశలో దోపిడీ దొంగ అవ్వాలనుకున్నాడు. ఆ దశలో అప్పటికే సైనికదళంలో చేరిన తన అన్న మల్కాన్ సింగ్ ప్రోత్సాహంతో నాలుగో ప్రయత్నంలో సైనికదళంలో స్థానం సంపాదించాడు. అతని తొలి పోస్టింగ్ సికింద్రాబాద్లో. అతను ఒక పరుగుల వీరుడుగా మారటానికి పునాది పడింది అక్కడే.
కాని ఎందుకు పరిగెడుతున్నాడో తెలియదు. పరుగు పందెపు పోటీలు వుంటాయని తెలియదు. అలాంటి వాతావరణంలో పరుగుపట్ల ఆసక్తి మాత్రమే అతన్ని జీవితంలో ముందుకు తీసుకువెళ్ళింది.
1956 రోమ్ ఒలింపిక్స్లో సెకండులో పదోవంతు తేడాతో కాంశ్యం కోల్పోయాడు మిల్కాసింగ్. ఫైనల్స్ వరకు అన్ని రికార్డులు బ్రేక్ చేసుకుంటూ వచ్చిన మిల్కాసింగ్ ట్రాక్లో ఎదుర్కొన్న ఒత్తిడితో నాల్గవ స్థానంలోకి వెళ్ళిపోయాడు. ఆ బాధ డిప్రెషన్లోకి నెట్టినా, త్వరలోనే కోలుకుని ఆసియా క్రీడల్లో పాల్గొన్నాడు. పతకాలు గెలుచుకున్నాడు.
సిపాయిగా వున్న మిల్కాసింగ్ సాధించిన క్రీడా విజయాలతో అతన్ని జూనియర్ కమిషన్ ఆఫీసర్ గా ప్రమోట్ చేశారు. ఆ తర్వాత పంజాబ్ ప్రభుత్వ క్రీడాశాఖ డైరక్టర్‌గా 1998 వరకు పనిచేసి రిటైర్ అయ్యాడు. ఉద్యోగంలోనుండి రిటైర్ అయ్యాడేగాని క్రీడారంగం నుండి మాత్రం రిటైర్ కాలేదు. ఎప్పుడూ అదే చురుకుదనం. శరీర రూపంలో ఏమాత్రం తేడా లేదు. వయసు మీదబడుతున్నా చురుకుదనం ఏ మాత్రం తగ్గని వ్యక్తిత్వం మిల్కాసింగ్ ది.

మిల్కాసింగ్ 1955లో శ్రీలంక వెళ్ళాడు. అక్కడ అప్పటికే మహిళా, వాలీబాల్ జట్టు పర్యటిస్తున్నది. అందులో సభ్యురాలైన నిర్మల్ సైనీని తొలిచూపులోనే ప్రేమించాడు. కాని పెళ్ళి ఇరు కుటుంబాల అభ్యంతరాలతో వాయిదావేసి చివరికి 1962లో దంపతుల య్యారు. అస్సలు కుదురులేని మనిషి మిల్కాసింగ్. అటువంటి వాడికి స్థిరత్వం తెచ్చింది నిర్మల్. .

పూర్తిగా తన జీవితం ఆమె చేతిలోకి తెలియకుండానే వెళ్ళిపోయింది అన్నాడు మిల్కాసింగ్. వారిది ఒక ఆదర్శజంట.మిల్కాకన్నా ఆరేడేళ్ళ చిన్న ఆమె. ఇద్దరూ ఎంతో స్పోర్టివ్గా కనిపించేవారు. ఆదర్శ జంటగా గుర్తింపు పొందారు. పిల్లలను క్రీడాకారులు గానే తయారుచేశారు. వారి కొడుకు జాక్ మిల్కా సింగ్ ప్రపంచపు ప్రొఫెషనల్ గోల్పర్. చండీఘర్లో మకాం వుంటూ, తన అనుభవాలను అందరితో పంచుకుంటూ సరదాగా గడిపేవాడు. కూతురు సోనియా సహాయంతో తన ఆత్మకథను ‘ది రేస్ ఆఫ్ మై లైఫ్’ అనే పేరున పుస్తకంగా రాశాడు. ఆ పుస్తకం ఆధారంగా తీసిన ‘భాగ్ మిల్కా భాగ్ సినిమా 2013లో విడుదలైంది. అప్పటినుండి ప్రతి రోజు దాదాపుగా ఒక్కసారైనా ఆ సినిమా చూసేవాడు. వచ్చిన వారందరికి ఆ సినిమా చూపించేవాడు.

1958లో పద్మశ్రీ ఇచ్చిన కేంద్రప్రభుత్వం ఆ తర్వాతి కాలంలో మిల్కాసింగ్ని మరచిపోయింది. మళ్ళీ 2013 ప్రాంతంలో అతనికి అర్జున్ అవార్డ్ ప్రకటిస్తే తిరస్కరించాడు. అవార్డ్ కి ఒక అర్హత వుండాలి. అర్హుడైనవాడికి అవార్డు ఇవ్వాలి అన్నది మిల్కాసింగ్ మాట. ఇటీవలి కాలంలో దేవాలయంలో ప్రసాదం పంచినట్టు పంచుతున్నారు అవార్డులు అంటూ, అర్హత లేకుండా ఏ అవార్డు ఆశించవద్దు అని విద్యార్థులకు చెప్పాడు 2014లో.

తన మెడల్స్ అన్నీ జాతికి అంకితం ఇచ్చాడు. దేశం తరఫున పోటీలకు వెళ్ళటం ఆషామాషి కాదని హెచ్చరిస్తుండేవాడు. కరోనా బయటపడే నాటికి మిల్కాసింగ్ 90లోకి అడుగు పెట్టాడు. ఈ కరోనా ఏం చెయ్యదు మనల్ని అంటూ కొట్టిపారేశాడు. నిజం గానే 2021 ప్రారంభంలో రెండవ వేవ్ మొదలైంది. అప్పుడు కూడా టీకా వద్దు అన్నాడు.
కాని దురదృష్టం వెంటాడింది. మిల్కాసింగ్, అతని భార్య నిర్మల్ కి కూడా కరోనా సోకింది. ఇద్దరు ఢిల్లీలోని ఆసుపత్రిలో చేరారు. ఆ సమయంలో కూడా “జీవితాన్ని నేను పాజిటివ్గా తప్పించి నెగెటివ్ గా చూడను” అన్నాడు మిల్కాసింగ్..
“చావుపుట్టుక మన చేతిలో లేదు. ఆశాభావంతో వుండటం మన చేతిలో వుంది. కాబట్టి అలా వుందాం” అన్నాడు. ఆ ఆశాభావమే మిల్కాసింగ్ ని కరోనా నెగెటివ్తో ఇంటికి చేర్చింది. కాని కోవిడ్ తదుపరి సమస్యలు తలెత్తి తిరిగి ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. అప్పటికే భార్యకి సీరియస్గా వుంది.

ఆమె మరణించిన విషయం తెలియదు. సరిగా ఆమె మరణించిన ఐదవ రోజున మిల్కాసింగ్ కన్ను మూశాడు. భార్య ఫోటోచేతిలో పెట్టుకున్నాడు.
అదే ఫోటోతో మిల్కాసింగ్ చితిమీదికి చేరాడు. ఆదర్శదంపతులు, క్రీడాస్పూర్తి కలిగినటువంటి ఆ జంట ఒక వారం కూడా ఒకరినొకరు విడిచి వుండ లేదు మరణంలో కూడా.
-దుగ్గరాజు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap