అద్భుత, సహజ హావభావాలు, వాక్పటిమ, సంభాషణా సంవిధానం, ఠీవి ఆయన సొంతం. సుయోధనుడిగా రాజసం ఉట్టిపడే నడక, గంభీరమైన సంభాషణలు, నిండైన రూపం ఆ పాత్రకు పెట్టిన ఆభరణాలు. వికటాట్టహాసం చేస్తూ ‘మానుటయా… మనుగడ సాగించుటయా’ అంటూ అభిమాన ధనుడైన దుర్యోధనుడు అంతర్మధనం చెందే విధానాన్ని తన నటనా వైదుష్యంతో సుస్పష్టంగా చూపించ గల ప్రతిభాశాలి. ఆయనే అపర ‘దుర్యోధనుడు’ అచంట వెంకటరత్నం నాయుడు. 78 ఏళ్ల వయసులోనూ నున్నలో శ్రీషణ్ముఖ నాట్యమండలి బాలల సాంస్కృతిక శిక్షణా కేంద్రాన్ని స్థాపించి నటనకు విశేష సేవ చేస్తున్నారు.
ఆంధ్రనాటక రంగస్థలంపై తనదైన బాణి, వాణీతో తెలుగు పద్యనాటకానికి వెలుగు బావుటగా నిలిచారు నటరత్నం అచంట వెంకటరత్నం నాయుడు. సామాన్య కుటుంబీకులైన వెంకటేశ్వర్లు నాయుడు, నరసమ్మకు 1935లో కృష్ణాజిల్లా జుజ్జవరంలో అచంట జన్మించారు. స్వస్థలం కొండపల్లి. 1945లో కొండపల్లిలో ప్లేగువ్యాధి విజృంభించటంతో స్థానికులంతా దగ్గరలోని వీటీపీఎస్ స్థలంలో తలదాచుకున్నారు. ఆ సమయంలో బాధితులకు ఆహ్లాదాన్ని పంచేందుకు వెంకటేశ్వర్లు నాయుడు రాత్రివేళల్లో నాటకాలు వేసేవారు. ఆ సమయంలోనే ‘ధవోపాఖ్యానం’ నాటకంలో సునీత, నారద పాత్రలను అచంటతో వేయించారు. అలా పదేళ్ల వయసులో ప్రారంభమైన ఆయన నటనా వ్యాసంగం ఆర్ధశతాబ్దానికి పైగా కొనసాగింది.
కళాతృష్ణ ముందు ఉద్యోగాలు బలాదూర్ :
విద్యాభ్యాసం కోసం గుంటూరు వెళ్లిన అచంట అక్కడి టౌన్ స్కూల్లో ఎస్ఎస్ఎల్ సీ చదివారు. ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా గుంటూరు కొరిటపాడులోని అన్నదాన సమాజంలో గుమస్తాగా చేరారు. విధి నిర్వహణలో ఉండగానే నాటకం రిహార్శిల్స్ వేయటంతో ఉద్యోగం ఊడింది. అయినా నిరుత్సాహపడకుండా, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ నటనను తపస్సుగా స్వీకరించారు ఆయన. సీనియర్ పాత్రికేయుడు నార్ల వెంకటేశ్వరరావు రచించిన “జీవనజ్వాల’ సాంఘిక నాటకంలో వేసిన తాత పాత్రకు ఆయనకు మొదటి బహుమతి లభించింది. ఆంధ్రనాటక కళాపరిషత్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో జరిగిన ‘అపరాధి’ నాటకం ఆయనను అత్యుత్తమ స్థాయికి తీసుకెళ్లింది. ‘బాలనాగమ్మ’, బొబ్బిలి’ తదితర నాటకాలు మంచి పేరు తెచ్చాయి.
సాంఘికం నుంచి పౌరాణికంలోకి…
1957లోనే గుంటూరులో ‘నటరాజ కళామండలిని స్థాపించిన అచంట పౌరాణిక పద్యనాటకాల ప్రదర్శనలకు ప్రయత్నాలు ప్రారంభించారు. హుళక్కి భాస్కరరావు, ఎక్కిరాల కృష్ణమాచార్యుల వద్ద శిష్యరికం చేశారు. 1970లో తణుకులో మాదాసు నరసింహారావు రూపకల్పన చేసిన ‘తులసీ జలంధర’ నాటకంలో జలంధరుడిగా పాత్రవేసి విశేష జనాదరణ పొందారు. ఆ నాటకాన్ని దేశవ్యాప్తంగా వివిధ పట్టణాల్లో ప్రదర్శించటంతో దూరదర్శన్, ఆకాశవాణి కేంద్రాలు అచంట ప్రదర్శనలను ప్రసారం చేశాయి.
పౌరాణిక నట జీవిత స్వర్ణోత్సవం :
1995లో అచంట అభిమానులు హైదరాబాద్లో ‘అచంట పౌరాణిక నటజీవిత స్వర్ణోత్సవం’ జరిపారు. వారంరోజులు జరిగిన ఆ ఉత్సవాల్లో విభన్నమైన పాత్రలు ధరించి, తన నటనా విశ్వరూపాన్ని ప్రదర్శించారాయన. ఏడుభిన్నమై పాత్రలు పోషించి ప్రేక్షక స్పందనలు, ప్రముఖుల గౌరవ పురస్కారాలు అందుకున్నారు. ఈ నాటకాలను ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం దూరదర్శన్ 21 ఎపిసోడ్లుగా ప్రసారం చేశాయి.
కీర్తి కిరీటాలు :
1972లో భీమవరంలో “నటసార్వభౌమ’, 1976లో కోరుకొండలో ‘రంగస్థల రారాజు’, అనంతపురంలో నట విద్యా విశారద’, 1986లో కర్ణాటకలో 2 నటచైతన్య, 1988లో స్వగ్రామంలో నటబ్రహ్మ’ బిరుదులు, లెక్కకు మించిన సన్మానాలు, సత్కారాలు పొందారు అచంట. 1990లో మారిషస్లో జరిగిన తెలుగు మహాసభల్లో ఆయన అభినయానికి ముగ్గుడైన సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు అచంటను ఆలింగనం చేసుకొని సత్కరించారు. 1992లో తానా సభలకు హాజరై, వాషింగ్టన్, న్యూజెర్సీ, ఫిలడెల్ఫియాలలో ప్రదర్శనలిచ్చారు. ఆయన కళాసేవను గుర్తించిన రాష్ట్రప్రభుత్వం ‘హంస’ అవార్డుతో సత్కరించింది. భూమికోసం, కొల్టేటి కాపురం, శ్రీకృష్ణార్జున విజయం, పండంటి జీవితం, శ్రీదత్త దర్శనం, బతుకే ఒక పండుక వంటి సినిమాల్లోనూ అచంట నటించారు. దుర్యోధన మయసభ’, ‘తులసీ జలంధర ఏకపాత్రాభినయాలను ఎల్డీ రికార్డ్, క్యాసెట్గా ఏవీఎం విడుదల చేసింది.
నటదిగ్గజాలు కలిసిన వేళ :
నాటకరంగంలో లబ్దప్రతిష్టుడైన అచంట, విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు జీవనశైలిలో సారూప్యత ఉంది. ఇద్దరూ మే 28వ తేదీనే (సంవత్సరం వేరు) కృష్ణాజిల్లాలో జన్మించారు. ఎన్టీఆర్ది నిమ్మకూరు అయితే, అచంటది ఆ పక్కనే ఉన్న జుజ్జవరం. నాటకరంగంలో దుర్యోధనుడి పాత్రకు ఆయన ప్రాణ ప్రతిష్ఠ చేయగా, సినీరంగంలో ఎన్టీఆర్ జీవించారు. హైదరాబాద్లో జరిగిన నటజీవిత స్వర్ణోత్సవ సభలో పాల్గొన్న ఎన్టీఆర్ ‘అచంట వారిని చూస్తే ఎప్పుడో నేను ధరించిన నా పాత్రలు, ఆ మీసాలు, ఆ కిరీటాలు… ఈ గొడవంతా ఏమోగానీ వారిని చూసి నేను నేర్చుకున్నానా? నన్ను చూసి వారు నేర్చుకున్నారా అనిపిస్తోంది’ అని వ్యాఖ్యానించారు. 1983లో విజయవాడలో జరిగిన మహానాడులో అచంట ప్రదర్శించిన దుర్యోధన ఏకపాత్రను తిలకించిన ఎన్టీఆర్ ఆయనతో కరచాలనం చేసి అభినందించారు.
He was a great actor…..
మహా పౌరాణిక నటుడు నాకు మా నాన్న గారికి ఇష్టమయిన నటుడు
Thanks PV Ramarao garu
Abhinava Duryodana Achanta