మనసున మల్లెలమాలలూగితే రేయంతా హాయి నిండుతుందా? మావిచిగురు తింటే కోయిల యెలా పాడుతుంది? అచ్చంగావచ్చే వసంతరాత్రిలో శృంగార గరిమ యెలాగుంటుంది? గగనసీమలో స్వేచ్చగా విహరించే మేఘం ప్రేమ సందేశాన్ని యెలామోసుకొస్తుంది? ప్రియుని జాడ యెలా తెలుసుకుంటుంది? మనసు తెలిసిన ఆ మేఘమాలది జాలిగుండె కాదా? సఖియ రాకుంటే వసంతమాసం ఆగుతుందా? మోయలేని హాయిని ఒక్క క్షణం మోయలేదా? ఆకాశపందిరిలో పెళ్లిజరిగితే దేవతలు పురోహితులుగా, అప్సరసలు పేరంటాళ్ళకు రావడం సాధ్యమా?… వీటన్నిటికీ సమాధానాలు దేవులపల్లి కృష్ణశాస్త్రి భావకవితలే. మీగడ తరకల్లాంటి జుబ్బా, పంచెకట్టు, ఉత్తరీయం, బంగారు రంగు శరీరం, వెండి గిరజాల జుట్టుతో భావకవితా ప్రపంచానికి చక్రవర్తిలా, తన కవిత్వంలాగే అందంగా భాసిల్లిన పదనిర్దేశకుడతడు. వర్షం వచ్చేముందు వీచే చల్లనిగాలి తెమ్మెర తనువును తాకితే ఎంతగా పులకరిస్తామో, కృష్ణశాస్త్రి కవిత వింటుంటే అదే పులకరింత వీనులకు విందుగా వీస్తుంది. భావకవిత్వానికి సినిమాపాటలద్వారా ఒక శాశ్వత స్థానాన్ని యేర్పాటుచేసి, దిశానిర్దేశం చేసిన అతి కొద్దిమంది కవులలో కృష్ణశాస్త్రి ముందుంటారు. సినిమాలకు ప్రత్యేకించి అయన రాసిన పాటలు తేనెలూరే తెలుగుదనంతో పరిమళాలు వెదజల్లుతాయి. శ్రీశ్రీ రచించిన మహాప్రస్థానం కవితా సంపుటికి చలం యోగ్యతాపత్రం రాస్తూ “కృష్ణశాస్త్రి తన బాధని అందరిలో పలికిస్తే శ్రీశ్రీ అందరి బాధనూ తనలో పలికిస్తాడు. కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ…ప్రపంచపు బాధంతా శ్రీశ్రీ బాధ” అని రాశాడు. అయితే శ్రీశ్రీ మాత్రం తను కృష్ణశాస్త్రి కవితా శైలినే అనుకరించేవాడిని అని చెప్పుకున్నాడు. “తెలుగు దేశపు నిలువుటద్దం బద్దలైంది. షెల్లీ మళ్ళీ మరణించాడు” అంటూ కృష్ణశాస్త్రి చనిపోయిన రోజున శ్రీశ్రీ రోదించాడు. కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ స్పందిస్తూ “ఒక్క షెల్లీ యే కాదు, కీట్స్, వర్డ్స్ వర్త్ వంటి మహాశయుల సంయుక్త స్వరూపం కృష్ణశాస్త్రి” అన్నారు. అటువంటి కవిపుంగవుడు దివికేగి 42 యేళ్ళకుపైనే అయినా దేవులపల్లి కవితలు, సినిమా పాటలు నేటికీ నిత్యనూతనంగా వినిపిస్తూనే, కనిపిస్తూనే వున్నాయి కృష్ణశాస్త్రి వర్ధంతి సందర్భంగా వారి జ్ఞాపకాలను కొన్ని గుర్తుచేస్తాను…

వికసించిన సాహిత్యాభిలాష …

తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంకు దగ్గరలో వుండే చంద్రపాలెంలో నవంబరు 1, 1897 న కృష్ణశాస్త్రి జన్మించారు. ఆరోజుల్లో దేవులపల్లి సోదరకవులు (సుబ్బారాయ శాస్త్రి, వేంకటకృష్ణశాస్త్రి) పిఠాపుర సంస్థానంలో విద్వత్కవులుగా వుండేవారు. వారిలో ‘తమ్మనశాస్త్రి’ గా వాసికెక్కిన వేంకటకృష్ణశాస్త్రి దేవులపల్లి తండ్రిగారు. ‘యతిరాజవిజయం’ అనే గ్రంధాన్ని కృష్ణశాస్త్రి గారి తండ్రి రచించారు. కృష్ణశాస్త్రి పూర్వీకులంతా కళాసంస్కారంతో సాహిత్యసేవ చేసినవారే. వీరి ఇంటిలో నిరంతరం సాహిత్య గోష్టి జరుగుతూ వుండేది. ఆ వాతావరణంలో పెరిగిన కృష్ణశాస్త్రి తండ్రివద్ద ప్రాచీన సాహిత్యంలోని పదసంస్కృతిని వంటపట్టించుకున్నారు. పదవ యేటనే ‘నందనందన ఇందిరానాథ వరదా’ అనే పద్యం రాశారు. సాహిత్యకృషి సల్పుతూ తన పదహారవయేటనే అష్టావధానం నిర్వహించి ‘ఓహో’ అనిపించుకున్నారు. పాఠశాల విద్యాభ్యాసం పిఠాపురంలో పూర్తిచేసి 1919లో కాకినాడ పిఠాపురంరాజా కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యను, బి.ఎ డిగ్రీని విజయనగరం మహారాజా కళాశాలలో చదివారు. విద్యార్థి దశలోనే గిడుగు రామమూర్తి పంతులు గారి వ్యావహారిక భాషావాదం, బ్రహ్మసమాజ ఉద్యమ ప్రభావం కృష్ణశాస్త్రి మీద ప్రబలంగా ఉండేవి. పెద్దాపురం మిషనరీ పాఠశాలలోను, కాకినాడ పి.ఆర్. హైస్కూలులోను వారు ఉపాధ్యాయునిగా పనిచేశారు. అలాగే తెలుగు ట్యూటర్ గా పి.ఆర్. కళాశాలలో కూడా పనిచేశారు. “జయము జ్ఞాన ప్రభాకరా జయము క్రాంతి సుధాకరా” అనే ప్రార్థనా గీతాన్ని రాజారామమోహనరాయలు స్థాపించిన బ్రహ్మసమాజంకోసం రచించారు. అప్పుడే సాహితీ వ్యాసంగం కొనసాగిస్తూ “జయజయ ప్రియభారత జనయిత్రీ దివ్యధాత్రి, జయజయజయ శతసహస్ర నరనారీ హృదయనేత్రి” అనే దేశభక్తి గీతాన్ని పాఠశాల ప్రార్థనాగీతంగా సంస్కృత పదప్రయోగంతో విద్యార్థులకోసం రాశారు. వాసిలో విశ్వకవి రవీంద్రుని “జనగణమన అధినాయక జయహే” అనే మన జాతీయగీతంకన్నా యేమాత్రం తక్కువగా అంచనావేయజాలని అద్భుత దేశభక్తి ప్రార్థనాగీతమిది. “జయజయ సశ్యామల సుస్యామల చల చేలాంచల…జయ వసంత కుసుమలతా చరిత లలిత చూర్ణ కుంతల…జయ మదీయ హృదయాశయ లక్షారుణ పదయుగళా…జయ దిశాంత గత శకుంత దివ్యగాన పరితోషణ జయగాయక వైతాళిక గళ విశాలపథ విహరణ… జయ మదీయ మధురగేయ చుంబిత సుందర చరణ” అంటూ భారతమాత దేవభూమికి జయం పలుకుతూ సాగే ఈ ప్రార్థనాగీతానికి స్వాతంత్ర్యోద్యమ సమయంలో కృష్ణశాస్త్రి మేనకోడలు వింజమూరి అనసూయాదేవి బాణీ కట్టింది. 1920లో వైద్యం కోసం బళ్ళారి వెళ్ళినప్పుడు ఆ ప్రకృతి శోభను ఆస్వాదిస్తూ కృష్ణశాస్త్రి ‘కృష్ణపక్షం’ ఖండకావ్యాన్ని రచించారు. 1922 లో సహధర్మచారిణి కాలంచెయ్యడం కృష్ణశాస్త్రిని బాధించింది. అప్పుడే కరుణాత్మకమైన కవితలు రాశారు. వాటిలో ‘కన్నీరు’ అనే ఖండకావ్యాన్ని ఉదహరించాలి. తరవాత పునర్వివాహం చేసుకొని భావకవితోద్యమానికి సారధ్యం వహిస్తూ దేశమంతటా తిరిగారు. పిఠాపురంలో హరిజనోద్ధరణ కార్యక్రమాలలోనూ, కళావంతుల వివాహోద్యమంలోను పాల్గొంటూ వుండడంతో బంధువర్గంతోబాటు బ్రాహ్మణులు కూడా కృష్ణశాస్త్రిని బహిష్కరించారు. అయితే బ్రహ్మసమాజం కృష్ణశాస్త్రిని కవిగా తీర్చిదిద్దింది. 1923లో సాహితీ సమితి నవ్యకవిత్వాన్ని ఒక ఉద్యమంగా చేస్తూ ‘సాహితి’ పత్రికద్వారా ఆంగ్ల విద్యా సంస్కారంగల తెలుగు యువతారాన్ని ఆకర్శింపజేసింది. కృష్ణశాస్త్రి భావకవిని చేసింది కూడా ఈ సాహితీ ఉద్యమమే. 1929లో ‘ఊర్వశి’, ‘ఆత్మాశ్రయత్వం’, ‘ఊహాప్రేయసి’, ‘ప్రవాసము’ వంటి కవితలతో పుస్తకాలు ప్రచురించారు. అదే సంవత్సరం విశ్వకవి రవీంద్రునితో పరిచయమైంది. 1932 నుంచి 1941 వరకు కృష్ణశాస్త్రి కాకినాడ పిఠాపురం రాజావారి కళాశాలలో తెలుగుశాఖోపాధ్యాయునిగా పనిచేశారు. ‘అమృతవీణ’ వంటి గేయ మాలికలు, ‘అమూల్యాభిప్రాయాలు’ వంటి వ్యాసావళి, ‘బహుకాలదర్శనం’, ‘ధనుర్దాసు’ వంటి నాటికలు, ‘మంగళకాహళి’ వంటి దేశభక్తి గీతాలు, సంగీత రూపకాలు రచించారు. ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో సాహిత్య ప్రయోక్తగా పనిచ్చేశారు. రేడియోకి ఎన్నో సంగీత రూపకాలు రచించారు. బుచ్చిబాబు, మునిమాణిక్యం నరసింహారావుతో కలిసి రేడియోకి సాహిత్య పరిమళాలు అందించారు. హరీంద్రనాథ్ చటోపాధ్యాయ వంటి ఆంగ్లకవితో కృష్ణశాస్త్రికి పరిచయం ఏర్పడింది. హరీంద్రుని కావ్య పఠనం కృష్ణశాస్త్రికి బాగా నచ్చింది. ఈయన కూడా నవకవుల పద్యాలు ఒక పద్ధతిలో కూర్చి సరికొత్త కావ్య పఠనానికి రూపం సిద్ధం చేశారు. ‘సంధ్యారాగం’ లోని ‘ఆగుమాగుమా తెరువరీ’ అన్న స్వాగతంతో ఆరంభించి, పింగళి-కాటూరి ‘తొలకరి’ లోని ‘కవితాసామగ్రి’ చదివి, ఎంకి పాటలు పాడేవారు. ఊరూరా వాడవాడలా సభలూ సమావేశాలతో కవితా వసంతోత్సవాలు జరుపుతూ భావకవిత్వాన్ని ఒక ఉద్యమమై నిలవడానికి కృష్ణశాస్త్రిగారి కృషిచేశారు. కృష్ణశాస్త్రికి బెజవాడ గోపాలరెడ్డి అత్మీయమిత్రులు కావడంతో ఆయన కృష్ణశాస్త్రిని వాహినీ పిక్చర్స్ అధినేత బి.ఎన్. రెడ్డికి పరిచయం చేశారు. చలనచిత్ర రచన చేయమని బి. ఎన్. రెడ్డి కృష్ణశాస్త్రిని పలుమార్లు కోరినా ఆయన అంతగా ఆసక్తి చూపలేదు. చివరికి బి.ఎన్. రెడ్డి కృష్ణశాస్త్రిని 1948లో మద్రాసుకు మకాం మార్చేలా చేశారు.

చలనచిత్ర రంగప్రవేశం…

‘వందే మాతరం’ షూటింగుకోసం బి.ఎన్. రెడ్డి హంపికి వెళ్ళారు. శ్రీకృష్ణదేవరాయలు మీద వున్న ఆరాధనాభావంతో బి.ఎన్.రెడ్డి కృష్ణదేవరాయల నేపథ్యంలో సినిమా నిర్మించాలని ఆంధ్ర, ఆంగ్ల సాహిత్యాలను విస్తృతంగా అధ్యయనం చేశారు. రచయిత బుచ్చిబాబు రాసిన ‘రాయల కరుణకృత్యం’ నాటిక, ఇల్లస్త్రేటెడ్ వీక్లీలో వచ్చిన కథను సమన్వయం చేస్తూ ఒక కథ అల్లారు. ఆ కథను కృష్ణశాస్త్రి అభివృద్దిచేసి, స్క్రిప్టు తయారు చేశారు. మల్లీశ్వరి నాగరాజు ముందు ప్రదర్శించిన నృత్యగానాలను మారువేషంలో ఉన్న రాయలు, అల్లసాని పెద్దన చూసినప్పుడు అల్లసాని మల్లీశ్వరిని ఆశువుగా ఓ పద్యంలో మెచ్చుకునే సన్నివేశం వుంది. ‘అల్లసానివారి అల్లిక జిగిబిగి’ అనే నానుడి వుండడంతో, అదే ధోరణిలో పద్యం రావాలని చెప్పి బి.ఎన్. రెడ్డి కృష్ణశాస్త్రి చేత వంద పద్యాలు రాయించి అందులోంచి “భళిరా ఎన్నడు జారె నీభువికి రంభా రాగిణీ రత్నమేఖలయో నిర్జర వల్లభ ప్రియవధూ కంఠస్రవథ్ధామమో…” అనే పద్యాన్ని కరారు చేశారు. చిత్రీకరణ విషయంలో బి.ఎన్. రెడ్డి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. దేవులపల్లి మాటలతోబాటు, ఇందులో రాసిన పాటలన్నీ విశేషంగా జనాదరణ పొందాయి. పాటలన్నీ కథా సంబంధంగా రాసినవి కావడం విశేషం. ఈ సినిమాలో కథాంశాలైన ప్రణయం, అనురాగం, విజయనగర వైభవం, వేదన వంటి కోణాల్లో పాటలు రాశారు కృష్ణశాస్త్రి. డిసెంబర్ 20, 1951 న విడుదలైన ఈ చిత్రం గొప్ప క్లాసిక్ గా సంచలనం సృష్టించడంతో, కృష్ణశాస్త్రి ఉత్తమ శ్రేణి సినీకవిగా గుర్తింపు పొందారు. తొలుత సినిమారంగం మీద పెద్దగా ఆసక్తి లేకున్నా కొన్ని సినిమాలకు అద్భుతమైన పాటలు రాశారు. ‘నాయిల్లు’ (1953) చిత్రంలో “అదిగదిగో గగన సీమ’’, “అందమైన చందమామ అదిగో”; ‘బంగారుపాప’ (1954)లో “యవ్వన మధువనిలో వన్నెల పూవుల ఉయ్యాలా”; ‘భాగ్యరేఖ’ (1957)లో “నీవుండేదా కొండపై నాస్వామి నేనుండేదీ నేలపై”; ‘రాజమకుటం’ (1959) లో “సడిసేయకో గాలి సడిసేయబోకే” వంటి అద్భుతమైన పాటలు రాశారు. అలా సినిమాలకు పాటలు రాస్తూనే, ఆకాశావాణికి రేడియో రూపకాలు రాసేవారు. దాంతో హైదరాబాదు ఆకాశవాణి కేంద్రంలో ‘ప్రయోక్త’ గా చేరమని ఆహ్వానం అందింది. జెమినీ వాసన్, బి.ఎన్. రెడ్డి వంటి వారు ఒత్తిడిచేసి మద్రాసులోనే కొనసాగే ప్రయత్నం చేసినా కృష్ణశాస్త్రి ఆకాశవాణిలో చేరేందుకే మొగ్గుచూపారు. హైదరాబాదుకు వచ్చిన రోజుల్లోనే 1958 లో కూతురు సీత మశూచి సోకి మరణించడంతో కృష్ణశాస్త్రి మరలా మద్రాసుకు మకాం మార్చారు. ఆకాశవాణిలో వుండగా ‘విప్రనారాయణ’, ‘క్షీరసాగర మథనం’ వంటి యక్షగానాలు అద్భుతంగా రాసి ప్రదర్శింపజేశారు.

విధి వక్రించి … గొంతు మూగవోయి…

1964లో తిరుపతిలో అన్నమయ్య జయంతి ఉత్సవంలో కృష్ణశాస్త్రి పాల్గొన్నారు. అతని వెంట బాలాంత్రపు రజనీకాంతరావు కూడా వెళ్ళారు. ఉపన్యాసం చదివేందుకు ఉద్యుక్తుడైన కృష్ణశాస్త్రి గొంతు బొంగురు పోయింది. దాంతో తన ఉపన్యాసాన్ని రజనీకాంతరావు చేత చదివించారు. వైద్య పరీక్షల్లో అది గొంతు క్యాన్సర్ అని నిర్ధారణ అయింది. మద్రాసులో కృష్ణశాస్త్రి స్వరపేటికను తొలగించారు. స్వరపేటిక తొలగించిన తరవాత కృష్ణశాస్త్రి దాదాపు పదహారేళ్ళు బ్రతికినా, మూగవోయిన కంఠంతోనే అనేక సినిమాలకు పాటలు, ఆకాశవాణికి లలిత గీతాలు రాశారు. ఎవరితోనైనా మాట్లాడాలన్నా, చెప్పాలన్నా కాగితం మీద రాసి చూపేవారు. కృష్ణశాస్త్రి పాటలు మనసు లోతుల్లోంచి వచ్చేవి. భావోద్వేగాలకు పెద్దపీట వేసేవారు. మల్లీశ్వరి తరవాత కృష్ణశాస్త్రి ‘రాజీ నాప్రాణం’, ‘నాయిల్లు’, ‘రాజగురువు’ వంటి కొన్ని చిత్రాలకు పాటలతోబాటు మాటలు కూడా రాశారు. తరవాత పాటలకు మాత్రమే పరిమితమయ్యారు. కృష్ణశాస్త్రి రాసిన కొన్ని లలిత గీతాలు సినిమా పాటలుగా రూపొందాయి. వాటిలో… ‘బంగారు పంజరం’ చిత్రంలో “పదములె చాలు రామా”, “గట్టుకాడ ఎవరో, చెట్టు నీడ ఎవరో”, ‘భక్తశబరి’ లో “ఏమి రామకథ శబరీ శబరీ ఏదీ మరియొకసారి”, ‘రాక్షసుడు’ చిత్రంలో “జయజయజయ ప్రియభారత జనయిత్రీ దివ్య ధాత్రి”, ‘ఆనంద భైరవి’ చిత్రంలో “కొలువైతివా రంగశాయి” పాటలు కొన్ని మాత్రమే. కృష్ణశాస్త్రి 24 ఫిబ్రవరి 1980 న మరణించిన విషయం తెలిసిందే. 1983 లో ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణరావు ‘మేఘసందేశం’ సినిమా నిర్మించి అందులో కృష్ణశాస్త్రి రాసిన మూడు లలిత గీతాలను ఉపయోగించుకున్నారు. ఆ పాటలు బాగా పాపులర్ అయ్యాయి. అంతేకాకుండా దాసరి ‘మేఘసందేశం’ చిత్రాన్ని కృష్ణశాస్త్రికి అంకితమివ్వడంతో చిత్రసీమలోని పలువురు సినీపండితులు హర్షించారు. “ఆకులో ఆకునై పూవులో పూవునై”, “ముందు తెలిసేనా ప్రభూ ఈ మందిరమిటులుంచేనా”, “సిగలో అవి విరులో అగరు పొగలో అత్తరులో” అనేవి ‘మేఘసందేశం’ చిత్రంలో వినియోగించిన కృష్ణశాస్త్రి లలిత గీతాలు.

అలరించిన కృష్ణశాస్త్రి పాటలు…

మల్లీశ్వరి చిత్రంలో పాటలు ప్రకృతి శోభను ప్రతిబింబించాయి. ముఖ్యంగా “పరుగులు తీయాలి గిత్తలు ఉరకలు వేయాలి”, “మనసున మల్లెలు మాలలూగెనే”, “ఎందుకే నీకింత తొందరా”, “నా ఇల్లు’ చిత్రంలో “అదిగదిగో గగనసీమ అందమైన చందమామ”, “వచ్చేనమ్మా సంక్రాంతి పచ్చని వాకిట చేమంతి” వంటి పాటలు ఈ కోవలోకి వస్తాయి. కృష్ణశాస్త్రి రాసిన విరహగీతాలు అద్భుతాలే. మల్లీశ్వరిలో “ఎడతానున్నాడొ బావ జాడ తెలిసిన పోయిరావా అందాల ఓ మేఘమాలా”, ‘ఉండమ్మా బొట్టుపెడతా’ లో “ఎందుకీ సందెగాలి సందెగాలి తేలి మురళి”, ‘కలసిన మనసులు’ చిత్రంలో “ఒక్క క్షణం ఒక్క క్షణం నన్ను పలకరించకు నావైపిటు చూడకు” పాటలు చెప్పుకోవచ్చు. కృష్ణశాస్త్రి ఎన్నో ప్రణయ గీతాలు, భక్తి గీతాలు, విషాద గీతాలు కూడా రాశారు. వాటిలో కొన్ని పాటలు చెప్పాల్సివస్తే… పిలచిన బిగువటరా ఔరౌర (మల్లీశ్వరి), నీవుండేదాకొండపై నేనుండేదీ నేలపై (భాగ్యర్వేఖ), రావమ్మా మహాలక్ష్మి రావమ్మా (ఉండమ్మా బొట్టుపెడతా), చుక్కలుపాడే శుభమంత్రం (కళ్యాణ మండపం), గోరింట పూచింది కొమ్మ లేకుండా (గోరింటాకు), ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం (కార్తీకదీపం), పాడనా తెనుగు పాటా (అమెరికా అమ్మాయి), కుశలమా నీకు కుశలమేనా (బలిపీఠం), ప్రతిరాత్రి వసంతరాత్రి ప్రతిగాలి పైరగాలి (ఏకవీర), ఘనా ఘన సుందరా కరుణారస మందిరా (భక్త తుకారాం), ఎగిరే పావురమా దిగులెరుగని పావురమా (జగత్ కిలాడీలు), ఊరకే కొలను నీరు ఉలికి ఉలికి పడుతుంది (సంపూర్ణ రామాయణం), ఇది మల్లెల వేళయని ఇది వెన్నెల మాసమని (సుఖదుఃఖాలు), ఎవరు నేర్పేరమ్మ ఈకొమ్మకు (ఈనాటి బంధం ఏనాటిదో), మావిచిగురు తినగానే కోయిల పలికేనా (సీతామాలక్ష్మి), ఈ గంగకెంత దిగులుఈ గాలికెంత గుబులు (శ్రీరామ పట్టాభిషేకం), చీకటి వెలుగుల కౌగిటిలో చిందే కుంకుమ వన్నెలు (చీకటి వెలుగులు), పగలైతే దొరవేరా రాతిరి నా రాజువురా (బంగారు పంజరం), అడుగడుగున గుడి వుంది అందరిలో గుడివుంది (ఉండమ్మా బొట్టుపెడతా). ఇవి కొన్ని మాత్రమే!

కృష్ణశాస్త్రికి అనేక సన్మానాలు, ప్రశంసలు లభించాయి. 1976 లో భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘పద్మభూషణ్’ అవార్డునిచ్చి గౌరవించింది. 1978 లో సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. 1975 లో ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదునిచ్చి సత్కరించింది. ప్రఖ్యాత వ్యంగ్యచిత్రకారుడు, సాహితీవేత్త ‘బుజ్జాయి’ (సుబ్బరాయశాస్త్రి) కృష్ణశాస్త్రి కొడుకే. చందమామలోని చల్లదనాన్ని, మందారపువ్వులోని మకరందాన్ని, గుండెలోని ఆర్ద్రతని రంగరించి రాస్తే అది కృష్ణశాస్త్రి పాటవుతుంది. పట్టుపరికిణిలో ఒదిగిన సింగారం కృష్ణశాస్త్రి పాట. ఆయన తెలుగు పదం అమ్మమ్మ చేతిలో నేతి నైవేద్యం.

ఆచారం షణ్ముఖాచారి
(9492954256)