ఆకాశవాణి విజయవాడ కేంద్రం డిసెంబర్ 1, 1948న ప్రారంభించబడింది. ఈ కేంద్రాన్ని ఆ నాటి ఉమ్మడి మద్రాసు రాష్ట్ర రెవెన్యూశాఖామంత్రి శ్రీకళా వెంకట్రావుగారు ప్రారంభించారు. అంతవరకు తెలుగు కార్యక్రమాలు మద్రాసు కేంద్రం నుంచి ప్రసారమయ్యేవి. దరిమిలా విజయవాడ కేంద్రం పుట్టినప్పట్నించి తెలుగులో కార్యక్రమాలు పూర్తిస్థాయిలో ప్రసారం చేసే అవకాశం కలిగింది. ఇది మొట్టమొదటి తెలుగు కేంద్రం.
ఈ 70 ఏళ్ళల్లో విజయవాడ కేంద్రం నుంచి ఎన్నో వైవిధ్య భరితమయిన కార్యక్రమాలనీ రూపొందించి ఆకట్టుకుంది.
విజయవాడ రేడియో కేంద్రంలో అడుగుపెట్టగానే ఎటు చూసినా సంగీత, నాటక, సాహిత్య కార్యక్రమాలు శ్రవణానందం కలిగిస్తాది. ఎంతోమంది సంగీత సరస్వతులు, నాటక ప్రముఖులు, సాహితీవేత్తలు ప్రసంగకర్తలు ఈ కేంద్రాన్ని సుసంపన్నం చేసారు.. సంగీత సరస్వతుల్లో ముఖ్యులైన డా. మంగళంపల్లి బాలమురళీకృష్ణ, ఓలేటి వెంకటేశ్వర్లు, నల్లావ్ చక్రవర్తులు, కృష్ణమాచార్యులు, అన్నవరపు రామస్వామి, దండమూడి రామమోహనరావు , కె.ఐ.సి.వి. జగన్నాధాచార్యులు, శ్రీరంగం గోపాలరత్నం, వింమూరి లక్ష్మి మొదలయినవారు ఈ కేంద్రానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టారు.
అలాగే బాలాంత్రపు రజనీ కాంతారావుగారు ప్రయాగ నరసింహశాస్త్రి, జరుక్ శాస్త్రి, పింగళి లక్ష్మీకాంతంగారు, జి.వి. కృష్ణారావు, ఉ షశ్రీ, ఇంద్రగంటి శ్రీకాంతశర్మ మొదలయిన సాహితీవేత్తలు శ్రోతలకు విజ్ఞానాన్ని అందించారు. శ్రవ్య నాటకం ఎంతో కష్టమైంది, క్లిష్టమయింది. ఈ ప్రక్రియలో కృషి చేసి రేడియో నాటకం మీద ఆసక్తిని కలిగించినవారు బిందా కనక లింగేశ్వరరావుగారు. కన్యాశుల్కం, గణపతి, వరవిక్రయం, సతీ సక్కుబాయితో బాటు మరెన్నో పౌరాణిక నాటకాలు రేడియోకి అనువదించి ప్రసారం చేసారు. వీరు తరువాత తరువాత నాటకాన్ని శ్రోతలకు అందించిన అగ్రగణ్యులు సత్యం శంకరముంచి, శ్రీ గోపాల్, పాండురంగ. శ్రవ్యనాటకానికి ప్రాణం పోసిన నాటక నిర్వాహకులు డా. రామమోహనరావు, నండూరు సుబ్బారావు విజయవాడ కేంద్రానికి గౌరవం తెచ్చిపెట్టారు. హాస్యానికి భాష్యం చెప్పి ఎన్నో హాస్య నాటకాలు రచించి పాత్ర పోషణ చేసి, ఈ నాటికి రేడియో శ్రోతలు మనస్సుల్లో సుస్థిర స్థానం పొందిన నటుడు నండూరు సుబ్బారావు.
రజనీకాంతారావుగారు కేంద్ర సంచాలకులుగా వున్నప్పుడు సంగీత, సాహిత్య, నాటక, రూపక కార్యక్రమాలను రూపొందించి విజయవాడ కేంద్రానికి ఎనలేని కీర్తి, గౌరవాలను తెచ్చారు. వారు రూపొందించిన “కొండనుంచి కడలిదాకా” రూపకానికి జపాన్ NHK బహుమతి పొందింది. ఈ అవార్డుతో విజయవాడకేంద్రానికి అంతర్జాతీయ ఖ్యాతి లభించింది. రజనిగారు నిర్వహణలో “ఆది కావ్యావరణం-స్వరచిత్రం ఈ కేంద్రానికి తలమానికంగా నిలిచింది. 1974లో మొట్టమొదటి సారిగా ఆకాశవాణి జాతీయస్థాయిలో “ఆకాశవాణి వార్షిక పోటీలు ప్రకటించినప్పుడు, విజయవాడ కేంద్రానికి నాటకంలోనూ, రూపకంలోనూ బహుమతులు లభించాయి. ఈ విజయాన్ని పురస్కరించుకుని దాదాపు ప్రతి సంవత్సరం విజయవాడ రేడియో కేంద్రానికి బహుమతులు వస్తూనే వున్నాయి.
ఆ నాటినుంచి ఈ నాటి వరకు విజయవాడ కేంద్రం శ్రోతల మనస్సులో చెరపరాని ముద్ర వేసుకుంది. ఈ కేంద్రంలోని కార్యక్రమ నిర్వాహకులు 70 ఏళ్ళపండగకే మురిసిపోకుండా, మరిన్ని మంచి కార్యక్రమాలు రూపొందించి రానున్న రోజుల్లో శాశ్వత కీర్తిని సాధించాలి. విజయవాడ కేంద్రం వర్ధిల్లాలి.
– పి. పాండురంగ, మాజీ కేంద్ర సంచాలకులు
ఆకాశవాణి.
Nice article, Thanq Pandu Ranga garu
Nice article