‘ఇల వైకుంఠం’లో విహరించిన ప్రేక్షకులు

విజయవాడ ముమ్మనేని సుబ్బారావు సిద్ధార్థ కళాపీఠం ఆధ్వర్యంలో నెల వారి కార్యక్రమాలలో భాగంగా శనివారం(03-08-19) మొగల్రాజపురంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో నిర్వహించిన ‘ఇల వైకుంఠం’ నృత్యరూపక ప్రదర్శన ఆక ట్టుకుంది. నృత్య రత్న, విఖ్యాత నృత్యకళాకారిణి, ‘హంస’ పురస్కార గ్రహీత డాక్టర్ మద్దాళి ఉషాగాయత్రి తన శిష్యబృందంతో కలిసి చక్కనైన ఆంగిక వాచికాభినయాలతో చేసిన ప్రదర్శన ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది.

భృగుమహర్షి కారణంతో లక్ష్మీదేవి వైకుంఠాన్ని విడిచి భూలోకాన్ని చేరుకోవటంతో విష్ణుమూర్తి కూడా వైకుంరాన్ని విడిచి భూలోకాన్ని చేరుకుంటాడు. ఈ క్రమంలో తిరుమల ప్రాంతం చేరుకుని, వకుళమాత ఆశ్రయం పొందుతాడు. వేటకు వెళ్లిన సందర్భంలో ఆకాశరాజు కుమార్తె పద్మావతీదేవిని చూసి మోహిస్తాడు. తదనంతర పరిణామాల నేపథ్యంలో పద్మావతీ శ్రీనివాసుల పరిణయం జరుగుతుంది. ఈవిధంగా అల వైకుంఠం నుంచి ఇల వైకుంఠానికి (తిరుపతి) శ్రీమహావిష్ణువు చేరుకునే క్రమాన్ని వివరిస్తూ నృత్యరూపకం సాగింది. తాళ్లపాక అన్నమాచార్యులు రచించిన సంకీర్తనల ఆధారంగా చేసుకుని రూపకాన్ని కూచిపూడి నృత్య పద్దతిలో తీర్చిదిద్దారు. మద్దాళి ఉషాగాయత్రి తన బృందం యశస్విని, హర్షిత, తీర్ధ, సుప్రియ, రసజ్ఞ, శ్రద్ద, అనసూయ, తన్మయిలతో కలిసి నృత్యరూపకాన్ని నయనమనోహరంగా ప్రదర్శించారు. సుసర్ల శర్మ నట్టు వాంగానికి వెంపటి శ్రీవల్లి గాత్ర సహకారం అందించారు. శ్రీధరాచార్య (మృదంగం), కుమార్ (వేణువు), ఆంజనేయులు (వాయులీనం) వాద్యసహకారం అందించారు. శ్రీనివాస్ బృందం అందించిన ఆహార్యం పాత్రోచితంగా సాగింది. పొట్లూరి జనార్ధనరావు, ఎస్. విష్ణువర్ధనరావు, కళాపీఠం అధ్యక్షుడు పి. లక్ష్మణరావు పాల్గొని, కళాకారులను సత్కరించారు. ‘కళాపీఠం’ సమన్వయకర్త ఖండాపు మన్నథరావు కార్యక్రమాన్ని నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published.

Share via
Copy link