ఉప్పల లక్ష్మణరావు

బతుకు ఉద్యమ సాహిత్య యాత్ర

“సామాజిక సంబంధాలలోనూ,ముఖ్యంగా స్త్రీ పురుష సంబంధాల గురించీ నాలో తీవ్రమైన భావాలు స్పష్టమైన రూపంలో స్థిరపడ్డాయి.

ఈ నా సామాజిక భావాలకీ, సోషలిస్టు విప్లవ సామాజికభావాలకీ నా ద్రుష్టిలో అవినాభావ సంబంధం ఉంది. అంతే కాకుండా, కమ్యూనిస్టు సమాజస్థాపన విజయవంతంగా స్థిరపడాలంటే, సామాన్య ప్రజలలోనైతేనేమి, మధ్యతరగతి ప్రజలలో ఐతేనేమి, మేధావులలో అయితే యేమి, ఈ స్త్రీ స్వాతంత్ర్యంలో, స్త్రీ పురుష ఆర్థిక, సామాజిక,వైవాహిక సంబంధాలలో విప్లవాత్మకమై మార్పులు వస్తేనే గాని అట్టి విప్లవాత్మక సమాజం మనలేదు” అని చెప్పిన ఉప్పల లక్ష్మణరావు కవి, కథకుడు, నవలా కారుడు, మాస్కో ప్రగతి ప్రచురణాలయం
వెలువరించిన అనేక గ్రంథాలకు అనువాదకుడు బరంపురంలో ప్రాథమిక విద్యను, జబల్పూరు, చెన్నై, కోల్కత్తాలలో ఉన్నత విద్యను పూర్తి చేసి, ఇంగ్లాండు వెళ్లి ఎడింబరోలో వృక్షశాస్త్రంలో పరిశోధనలు చేశారు.జగద్విఖ్యాత వృక్షశాస్త్రవేత్త జగదీశ్ చంద్ర బోస్ వద్ద పరిశోధన చేశారు. జూరిచ్లో తన పరిశోధన పునః ప్రారంభించి పి. హెచ్డి సాధించారు.

కొంతకాలం కాకినాడ, కోల్కత్తా, ఆలీఘర్లలో వృక్షశాస్త్ర ఉపన్యాసకులుగా పనిచేశారు. 1954 నుండీ ప్రపంచంలోని అనేక దేశాలు పర్యటించారు. వివిధ విదేశ విశ్వవిద్యాలయాల్లో విజిటింగ్ ప్రొఫెసర్ గా పనిచేశారు. ఆంధ్రదేశంలోని పలు ఇంజనీరింగ్ పరిశ్రమల్లో వివిధ బాధ్యతలు నిర్వహించారు.

లక్ష్మణరావు జీవితంలో స్విట్జర్లాండ్ మహిళ మెల్లీ షోలింగర్ తో పరిచయం ఒక మేలుమలుపు. నిస్వార్థ స్నేహంతో, కొంతకాలం నిష్కల్మష సహజీవనానం తరం-వారు భూతల స్వర్గంగా భావించిన నాటి సామ్రాజ్యవాద వ్యతిరేక పీడిత ప్రజావిప్లవ కేంద్రం సోవియట్ యూనియన్ లో వారి దేశాంతర వివాహం ..ఓ గొప్ప ఆదర్శం. సంతానం వద్దనుకుని సామాజిక సాహిత్య సేవతో సమష్టిజీవనం ఓ గొప్ప ఆశయం.

జాతీయభావాలుగల మెల్లీ అత్యంత చైతన్య రాశి. మహిళల హక్కులకోసం గాంధీతోనే తగాదా పడిన సబల. సబర్మతి ఆశ్రమంలోనే సత్యాగ్రహం చేసిన అతివవాది. భారత స్వాతంత్ర్య సమరంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించిన యోధురాలు. | ‘మూల సూత్రాలు తెలుసుకోకుండా నినాదాల వల్ల పొందిన ఉత్సాహంతోనో,ప్రదర్శనలవల్ల కలిగిన ఉద్రేకంతోనో కమ్యూనిస్టుపార్టీలో చేరటం పొరపాట’ని చెప్తూ-తమకు 1940ల నుండి పార్టీతో సన్నిహిత సంబంధాలున్నా1957లో మాత్రమే కమ్యూనిస్టు పార్టీలో సభ్యులై సభ్యులుగా పార్టీ నిర్వహించిన అన్నిటి ద్యమాలలో పాల్గొన్న ప్రగతివాదులు.

1956లోశాంతిసంఘం ప్రతినిధిగా సోవియట్ యూనియన్ సందర్శించారు.మాస్కో ప్రగతి ప్రచురణాలయంలో తెలుగువిభాగసంపాదకునిగా 1958-1970వరకూ సుమారు 40 గ్రంథాలను అనువదించారు. తెలుగు-రష్యన్ నిఘంటువు సంపాదకునిగా మహత్తర కృషి చేశారు. | ఉప్పల లక్ష్మణరావు సాహిత్య సృజనలో ఎన్నో కవితలు, నిద్రలేనిరాత్రి, గెరిల్లా లాంటి ఉత్తమకథలు, విలువైన సాహిత్యవ్యాసాలు, అమూల్య అనువాద సాహిత్యం ఎన్ని ఉన్నా “అతడు ఆమె (నవల),బతుకు పుస్తకం ఆత్మకథ) రచనలు ఆయన కీర్తి పతాకలు.

ఉప్పల లక్ష్మణరావు రచన ‘అతడు-ఆమె’ నవల ఒక పెను సంచలనం. తెలుగు నవలా సాహిత్యంలో ఓ కొత్త ప్రక్రియా వైవిధ్యం. దినచర్య కథన శిల్పంతో ఉప్పల చేసిన మహాసృష్టి. భారత స్వాతంత్ర్యోద్యమ లోతు పాతుల విశ్లేషణ నేపథ్యంగా స్త్రీ పురుష సంబం ధాల చర్చ అత్యంత రణనీయంగాను, రమణీయంగానూ సాగించిన ఉత్తమ నవల.

లక్ష్మణరావు చివరిదశలో రాసిన ఆయన ఆత్మకథ “బతుకుపుస్తకం’ గొప్ప ఆత్మకథగా గెలిచింది. గొప్ప నిజాయితీ కథగా నిలిచింది. ‘అనుభవాలూ జ్ఞాపకాలూనూ’గా గుండె తలుపులు తడుతుంది. ‘అనంత’ నిప్పుల ఉప్పెనగా మనల్ని ముంచెత్తుంది.
1970నుండీ బరంపురంలో ఉండి వికాసం సంస్థను నిర్వహిస్తూ కథలు,కవితలు, వ్యాసాలు రాశారు. ఎందరిచేతో రాయించారు. పోటీలు పెట్టి బహుమతులతో ప్రోత్సహించారు.

పులుపులశివయ్య స్మారక బహుమానం గ్రహించారు. ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షవర్గ సభ్యులుగా ఉంటూ తుదిశ్వాస వరకు అభ్యుదయ సాహిత్య సృజనచేశారు.

“ఒక్క ముక్కలో చెప్పాలంటే భారత జాతీయ స్వాతంత్ర్యసమరాన్ని సీరియస్గా, సంభాషణా చాతుర్యంతోనూ,హాస్యభరితంగానూ పలుదృక్కోణాలనుంచి వర్ణించి చూపిన నవలఅది. తెలుగులో వేళ్లమీద లెక్కించదగిన బహుకొద్ది నవలలలో ఉప్పలవారి “అతడుఆమె’ రచన ఒకటి” అంటూ ప్రముఖ తెలుగుదినపత్రికల సంపాదకుడు ఏ.బి.కెప్రసాద్ ప్రశంసలందుకున్న లక్ష్మణ రావు, 1898 ఆగష్టు 11న బరంపురంలో జన్మించారు. 1985 ఫిబ్రవరి 22న మరణించారు.

– సింగంపల్లి అశోక్ కుమార్

1 thought on “ఉప్పల లక్ష్మణరావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap