అనిల్ డ్యాని కవిత్వం, ‘ఎనిమిదో రంగు’ గురించి క్రాంతి శ్రీనివాసరావు గారు అన్నట్టు నిజంగా మనిషి లోపల పొరలు ఒలుచుకుంటూ పోతే అసలు రంగొకటి బయట పడుతుంది. అదే ఎనిమిదో రంగు. మొదటి కవిత దగ్గర నుండి ఆఖరి కవిత వరకు అన్నీ మన లోపలున్న మనిషి తడిని తట్టి లేపుతుంటాయి. కొన్ని కవితలు చదివితే మనం ఇంత బ్యాడ్ హ్యూమన్ బీయింగా అనిపిస్తుంది, కొన్ని కవితలేమో ఎక్కడో ఓ మూల మనం మనుషులుగా బతికే ఉన్నాం అని గుర్తుచేస్తాయి. కొన్ని కవితలు గ్లోబలైజేషన్ ఎఫెక్టని చెప్తే, కొన్ని కవితలు ఏలినేటెడ్ అండ్ మార్జినలైజ్ ఆగ్రహాన్ని, ధర్మావేశాన్ని చెప్తాయి. కొన్ని కవితలు బతకడాన్ని నేర్పితే, కొన్ని చావడాన్ని నేర్పుతాయి. అనిల్ గారి కవిత్వం చదువుతున్నప్పుడు ఓ సారి, ‘అర్రే ఇది నేను అనుకున్న మాట కదూ’ అనిపిస్తుంది, ఇంకోసారి ‘ఈయనికి ఈ ఆలోచన ఎలా తట్టిందబ్బా’. అనిపిస్తుంది. నివేదన అనే కవిత ఆ ఆలోచనకి ఉదాహరణ. శాంతి మాయమైపోతుంది అని చెప్పడానికి కవి ఇలా అంటారు- ‘రెక్కలు తెగిన మానవత్వపు పావురం’ అని. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం ఆ పావురం మినార్ కి, మందిరానికీ మధ్య చివరి శ్వాస విడుస్తుంది. మరణాన్ని చీకటితో పోల్చారు కవి. త్రి స్టేజెస్ ఆఫ్ చీకటి ఏవంటే
1. అంతా చీకటి, 2. వెలుతురు చొరబడలేనంత చీకటి, 3. మెల్లిగా లోకమంతా పరుచుకుపోయిన చీకటి. మృతదేహం అన్నీ వింటూనే,
మళ్ళీ చచ్చిపోవడం అనే మాటలో తెలుస్తుంది మనుషులు మృతదేహాలని కూడా చంపగలరని. రైతుని కుశలమా అని అడిగితే ఇదిగో పొలం నుంచే వస్తున్నాను అని ఒక్క మాటతో జవాబు చెప్పారు కవి. ఆ మాటలో ఆశ, ఆ మాటలోనే నిరాశ. ఆకాశం ఎండిపోయిన చెట్టులా ఒక్క వాన పువ్వునీ రాల్చడం లేదు అన్నారు కవి. అంత నిరాశని ఇంత గొప్పగా ఎలా చెప్పారు ఈయన?
బాగా నచ్చిన కవితల్లో ఒకటి ‘ఆమెతనం’.
భూమిని మొత్తం తవ్విపోసి ఆమెతనం నారుపోయాలి అన్నారు కవి.
‘ఆమె- ఇసుకరేణువులో దాగిన సముద్రం. అణచబడిన చోట మొలకెత్తే మరో వసంతం.
‘ ఆమెతనం మనసుకి దగ్గరగా తోచిన కవిత. ఎనిమిదో రంగు కవిత చదివాక ఎనిమిదో రంగు లోతు తెలిసింది. నలుపు పైన మళ్ళీ మళ్ళీ ప్రేమయింది. ఎన్ని సార్లు చదివితే అన్ని సార్లు ప్రేమవ్వగల ఎనిమిదో రంగు అది. గది నిండా మాయ వెలుతురు దేహాలనిండా పరుచుకున్న ఎనిమిదో రంగు ప్రేమ.
‘కొన్ని మాటలు’ అనే కవితలో కవి మౌనాన్ని మాటలుగా చిత్రించడం అనేది గమనించాల్సిన విషయం. ఇటుక ఇటుక మధ్యలో మౌనాన్ని నింపి నిర్మించి నాలుగు గోడల మధ్య జీవిత ఖైదు అనడంలోనే తెలుస్తుంది మాట్లాడటం మనిషికెంత అవసరమో. కవి ఇక్కడ రాళ్లు రప్పలు పోగేసికూడా మాటలనే ఆయుధాలుగా వాడితే మిగిలేది మౌనపు గాయాలేగా అంటారు. నిజమే మాట అవసరమే కానీ ఆ మాటే మౌనానికి దారి తీస్తే, ఆ మాటకీ ఆయుధానికి తేడా ఏది? ‘పిల్లలారా’ అనే కవితలో కవికి పిల్లల పైనున్న ప్రేమ తెలుస్తుంది. భూమి సూర్యుడి చుట్టూ కాదు, మీ చుట్టూ తిరిగేలా నవ్వండి అని పిల్లలతో అనటం సాక్ష్యం ఆ ప్రేమకి. నేనూ నవ్వడానికి ప్రయత్నిస్తాను ఇక.
– రమణరావు