ఏప్రిల్ 1, చొక్కాపు వెంకటరమణ గారి 70 వ జన్మదిన సందర్భంగా స్పెషల్ స్టోరీ…
చొక్కాపు.. అంటే పిల్లలు చొక్కా గుండీలు విప్పి మరీ.. ఆయన గురించి అంతో ఇంతో గొప్పగా చెప్పుకుంటారు.ఈతరం పిల్లల్నే కాదు, గత రెండు మూడు తరాలకు చెందిన పిల్లల్నీ చొక్కాపు వేలుపట్టి లాలించారు.. ఆడించారు. తనకు తెలిసిన విద్యతో వాళ్ళను ప్రభావితం చేశారు. పరోక్షంగానో, ప్రత్యక్షంగానో వాళ్ళను తీర్చిదిద్దారు, ప్రయోజకుల్నీ చేశారు. అందుకే చొక్కాపు వెంకటరమణ అంటే.. పిల్లలకు, పిల్లల దశ నుంచి ఎదిగిన యువతకు, ఆ దశ దాటిన పెద్దవాళ్ళకూ ఎంతో అభిమానం. ఆయన అడుగుజాడల్లో నడిచి, ఆయన చెప్పిన వికాసపు కథలు విని.. జీవితంలో పలు విజయాలు సాధించినవాళ్లూ ఉన్నారు. కళాకారులుగా మారి, గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కినవారూ ఉన్నారు. రకరకాల ఉద్యోగాల్లో స్థిరపడి.. చొక్కాపు అంకుల్ వల్లనే మేమీ స్థితిలో ఉన్నామని గర్వంగా చెప్పేవారూ ఉన్నారు. ఇలా నాలుగైదు దశాబ్దాలుగా ఏ పనిచేసినా.. పిల్లల బాగోగుల కోసమే కృషి చేసిన, చేస్తున్న డెబ్బై ఏళ్ళ ఈ పిల్లవాడి కథ.. తెలుసుకుందాం పదండి!
చొక్కాపు గురించి నాలుగు మాటల్లో చెప్పవయ్యా? అంటే… చెప్పడం చాలా కష్టం. వ్యక్తిగా తనో ఆర్టిస్ట్. ఇంద్రజాల కళలో మంచి నైపుణ్యం ఉంది. చక్కటి ఒడుపైన గీతల్ని గీయగల కార్టూనిస్ట్ కూడా. తర్వాత కాలంలో జర్నలిస్ట్గా మారారు. ఈనాడు అనుబంధ సంస్థలతోపాటు పలు వార, మాస పత్రికల్లో ఉప సంపాదకుడిగా పనిచేసిన అనుభవమూ ఉంది. ఇవన్నీ ఒక ఎత్తయితే, చొక్కాపు మంచి కథారచయిత. ఎక్కువగా పిల్లలకోసమే కథలు, నవలలు, వ్యాసాలు రాశారు. ఇలా బహుముఖీనమైన ప్రతిభగల చొక్కాపు తన జీవిత ప్రయాణంలో.. తనకు వచ్చిన, నచ్చిన, మెచ్చిన ప్రతిభతో అనేక భూమికల్లో పాదరసంలా ఇట్టే ఒదిగిపోయాడు. ఒక్కో పాత్ర ఒక్కో ప్రయోజనాన్ని చాటిచెబుతూ.. అది చొక్కాపు వ్యక్తిత్వాన్ని, జీవితాన్ని, వృత్తిని, ప్రవృత్తిని భిన్నంగా నిలుపుతూ వచ్చింది.
బాల్యం దాటని జీవితం…
బాల్యం.. అలా వచ్చి.. ఇలా వెళ్ళిపోయే ఓ అపురూప జ్ఞాపకం. బాల్యాన్ని తలచుకోవడమే తప్ప.. అది మళ్ళీ వెనక్కిరాదు. కానీ, చొక్కాపు మాటల్లో అయితే.. ‘బాల్యం.. అనేది తరిగిపోనిది. తరతరాలు వెంటవచ్చేది..’ అంటారాయన. అదేంటి సార్! అని అడిగితే? ‘మనం ఎప్పుడైతే బాల్య దశలోంచి బయటపడి పోయాం.. అని భావిస్తామో.. అప్పుడే.. మనలో గల సున్నితమైన మనసు, కల్మషంలేని తత్వాన్నీ కోల్పోయినట్టే..! అందుకే, నెత్తిన జుట్టు, గెడ్డాలు మెరిసినా.. అడ్డాల్లోని పిల్లల్లానే కేరింతలు కొట్టాలి.. అందులోనే అసలు సిసలైన ప్రపంచ వికాసం’ అంటారాయన. ఈ మాటలు కొంచెం కొత్తగా అనిపించినా.. చొక్కాపు నమ్మిన సిద్ధాంతం ఇదే. అందుకే ఆయన ఏడు పదుల వయసులోనూ.. ఏడేళ్ళ చంటిపిల్లాడిలా.. కనిపిస్తాడు. తనలాంటి పిల్లల కోసమే నిత్యం పరితపిస్తాడు.
తన జీవితమే ఓ కథ …
‘పిల్లల్లారా.. కథ చెబుతా.. ఊ కొడతారా?’ అని.. అనగానే.. ఊ కొట్టేయడానికి.. పిల్లలు మనం అనుకునేంత అమాయకులు కాదు.. అవతలి వాళ్ళలో అంతో ఇంతో సరుకుంటేగానీ.. చెప్పేదంతా వింటూ.. ఊ కొట్టే సాహసం చేయరు. చొక్కాపు వెంకటరమణ జీవితాన్ని ఏ కోణంలోంచి చూసినా.. ప్రతి విషయమూ పిల్లల్ని ఉత్తేజితుల్ని చేసే అంశాలే. ఎన్ని కష్టాలు దాటి, ఎన్ని త్యాగాలు చేస్తే.. చొక్కాపు ఇంతటి వాడయ్యాడు. ఇంతటివాడు.. అనడంలోనే పెద్ద జవాబు ఉంది. ఇంతటి వాడంటే.. పెద్ద రాజకీయ నాయకుడనో, కోట్లకు పడగలెత్తే.. ధనవంతుడనో, లేదా పేద్ద సినిమాస్టారనో కాదు. కానీ, పిల్లల మనో, సాంస్కృతిక, కళావికాసానికి కావాల్సినంత ఆస్తులు సంపాదించాడు. మళ్ళీ ఇక్కడ ఆస్తులు అనే మాటకు అర్థం.. కోట్ల రూపాయల ధనం, ఆకాశాన్ని తాకేంత ఎత్తుగల ఖరీదైన బంగ్లాలు కాదు. ఇంకా ఏవేవో సంపాదించాడాయన. బాల్యాన్ని సైతం పక్కనపెట్టి.. మరింకేదో విలువైన సంపద పోగుచేసుకున్నాడు ఆయన. అందుకే.. ఆయన మాటలంటే పిల్లలకూ ఎంతో ఇష్టం. ఆ మాటకొస్తే.. పిల్లలకే కాదు.. పెద్దలకూ ఆయన మాట తట్టిలేపే ఓ చైతన్యం.
పుట్టి, పెరిగింది …
చొక్కాపుది సొంతూరు కృష్ణా జిల్లా, విజయవాడ. పుట్టింది 1948 ఏప్రిల్ 1న. తండ్రి చొక్కాపు దాలయ్యది హోటల్ వ్యాపారం. తల్లి సావిత్రమ్మ గృహిణి. చొక్కాపుతో కలిపి కుటుంబంలో నలుగురు సంతానం (ఒక అక్క, చెల్లి, తమ్ముడు). బంధువుల పిల్లల్నీ తండ్రే చూసుకునేవారు. అంతా బాగానే ఉందనుకునే సమయంలోనే చొక్కాపు తండ్రి మరణించడం, ఆయన మరణించే నాటికే హోటల్ బిజినెస్ దెబ్బతిని, బడ్డీకొట్టు పెట్టుకునేలా కుటుంబ ఆర్థిక పరిస్థితి మారిపోయింది. దీంతో ఆరేడు తరగతుల్లో ఉండేనాటికే కుటుంబ భారమంతా చొక్కాపుపైన పడింది. కొన్నాళ్ళు తండ్రి వదిలి వెళ్ళిన బడ్డీకొట్టు నిర్వహణ, అది చాలక కూలీనాలీ చేయడం.. ఇలా చొక్కాపు బాల్యమంతా కాయకష్టంపై ఆధారపడేలా అయిపోయింది. మట్టిపనులు, రైల్వేగ్యాంగ్ పనులు, ఉదయాన్నే పేపర్ వేయడం ఇలా.. ఇదీ అదీ అని కాకుండా.. కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు చొక్కాపు చేయని పనిలేదు.
సోదరి నుంచి సాహిత్యం …
చొక్కాపు అంటే సాహిత్యరంగంలో ఇప్పుడెంతో పేరు. అలాంటి పేరు రావడానికీ చిన్నప్పుడే.. బీజం ఏర్పడింది. ఇంట్లో తనకంటే పెద్దదైన అక్క నుంచి పుస్తకాలు చదవడం అలవాటు చేసుకుని.. స్నేహితుల్లా తనూ కథలు రాయాలనే ప్రయత్నంతో చిన్నపిల్లల కథల పుస్తకాలకు కథ రాసి పంపితే.. అచ్చయ్యింది. ‘నేను ఏడవ తరగతిలో ఉండగా.. ‘మోసం మొదటికి నాశనం’ అనే పేరుతో తొలిసారిగా కథ రాశాను. సరదాగా రాసిన కథ నా పేరుతో అచ్చయ్యేసరికి.. నాకు మాటలు రాలేదు. ఇక అక్కడ నుంచి.. కథలు రాయడమే కాదు, స్కూల్లో తీరిక, సమయం దొరికిన ప్రతిసారీ స్నేహితులు, మాష్టార్లు ఏదో ఒక కథ చెప్పరా..! అని అడిగేవారు. నేనూ అంతే ఆసక్తిగా చెప్పేవాడ్ని. ఇలా స్కూల్ దశలో ఉండగానే కథలు రాయడమే కాదు, ఆ కథల్ని ఆసక్తిగా చెప్పడం అనే కళా అలవడింది’ అంటూ బాల్యపు కథా సంగతుల్ని గుర్తు చేసుకున్నారు చొక్కాపు.
అమ్మ.. తొలిగురువు …
చొక్కాపు ఇంద్రజాల కళలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రదర్శనలూ చేయడం మనకు తెలిసిందే. అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ విషయమేమంటే.. తను చేసే ఇంద్రజాల ప్రదర్శనకు, మూకాభినయం కళనూ జోడించి.. పిల్లల్ని, పెద్దల్ని తనవైపు తిప్పుకునేలా విచిత్రమైన హావభావాలు, సైగలతో ప్రదర్శించే చొక్కాపు మేజిక్ ప్రదర్శన ఎప్పుడూ భిన్నమైందే. ‘మా అమ్మకు వినికిడిలోపం ఉంది. చిన్నప్పటి నుంచీ తనకు ఏదైనా చెప్పాలంటే.. హావభావాలు, సైగలతో చెప్పడం నాకు అలవాటు. నాన్న చనిపోయాక, అమ్మ మనోవేదనతో మతిస్థిమితం కోల్పోయింది. అప్పుడైతే.. అమ్మకు ఏదైనా వివరించాలంటే మరింత కష్టమయ్యేది. ఎలాగోలా తంటాలుపడి.. అమ్మకు సైగలతోనే విషయం చెప్పేవాడ్ని. ఇలా అమ్మ కారణంగానే కాస్తంత మిమిక్రీ, మూఖాభినయం వంటి కళలు అనుకోకుండా అలవడ్డాయి. ఒకరకంగా కళాకారుడిగా రాణించడానికి ఇంట్లో అమ్మ వల్ల కలిగిన అనుభవాలే కారణం’ అంటూ గుండెను పిండేంత విషాదభరితమైన జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ.. కంటిలో చేరే చెమ్మను ఏమాత్రం కనపడనీయ కుండా తనదైన శైలిలో నవ్వుతూ చెప్తారు చొక్కాపు.
బాలల సాహిత్య వికాసం …
ఎప్పుడు ఎవరు పలకరించినా.. పిల్లలే నా ప్రపంచం అంటుండే చొక్కాపు వెంకటరమణ అందుకు తగ్గట్టుగానే బాలలసాహితీ వికాసానికి, బాలల సాంస్కృతిక, ప్రతిభా ప్రోత్సాహానికి ఎంతో కృషి చేశారు. బాలసాహితీ రచయితగా బాలల పత్రిక సంపాదకులుగా, ఇంద్రజాలికుడిగా, వ్యక్తిత్వవికాస నిపుణుడిగా, బాలసాహితీ రచనా శిక్షణా శిబిరాల డైరెక్టర్గా, సేవాకార్యక్రమాల నిర్వాహకుడిగా, స్టోరీ టెల్లర్గా చొక్కాపు అనుభవం అపారమైంది. విపుల, చతుర మాసపత్రికలలో సహాయ సంపాదకుడిగా (1978-79) రెండేళ్ళు పనిచేసిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖ ఆధ్వర్యంలోని రాష్ట్రప్రభుత్వ సంస్థ ఆంధప్రదేశ్ బాలల అకాడమీ (జవహర్ బాలభవన్) నడిపిన బాలచంద్రిక పిల్లల మాసపత్రికకు సంపాదకుడిగా, పిల్లల పుస్తకాల ప్రచురణ విభాగానికి ప్రొడక్షన్ ఎడిటర్గా పద్దెనిమిది సంవత్సరాలు పనిచేశారు.
పిల్లల కోసం దిన, వార, మాసపత్రికలకు ఏళ్ళతరబడి బాలల శీర్షికలు నిర్వహించారు. ఇవన్నీ వృత్తిపరంగా చేసిన సేవలే అయినా.. అందులో నూటికి నూరుశాతం పిల్లల వికాసం కోసం అవసరమయ్యే సాహిత్య విస్తరణ పనులు కోసమే చొక్కాపు కృషి చేయడం చెప్పుకోదగ్గ విశేషం. ఇంత చేస్తున్నాగానీ.. ఏదో వెలితి. ఉద్యోగం వదిలేస్తేగానీ, పిల్లల కోసం ఇంకేదైనా చేయవచ్చనే ఓ ఆశ. దాంతో.. ఎంతో సర్వీసు ఉండగానే స్వచ్ఛంద పదవీవిరమణ చేశారు చొక్కాపు. ఆ క్రమంలో సొంతంగా మేజిక్ స్కూల్ స్థాపించి, ఇప్పటిదాకా ఐదు వేల మందికిపైగా చిన్నారులకు మేజిక్లో శిక్షణ అందించారు. బాలసాహిత్య పరిషత్ అధ్యక్షుడిగా ఉండి, దాసరి వెంకటరమణతో కలిసి పిల్లల కోసం కథారచన, గేయరచన, కథలు చెప్పడం అంశాలపై ఉచిత కార్యశాలలు నడిపారు. పిల్లల కోసం 1998లో తెలుగులో తొలి వ్యక్తిత్వ వికాస మాసప్రతిక ‘ఊయల’ ప్రారంభించి, తన అభిరుచికి తగ్గట్టుగా ఆ పత్రికను ఎంతో ప్రత్యేక శీర్షికలతో నడిపారు. ఇలా చొక్కాపు విరామం ఎరుగని మనిషి. ఏపని చేసినా.. నాకేంటి? అని కాకుండా.. మా పిల్లలు, మన పిల్లలకు ఏంటి? ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది? అని తర్కంగా ఆలోచిస్తేగానీ.. రెండు అడుగులు ముందుకు వెయ్యరు. అందుకే చొక్కాపు అంటే.. పిల్లలు.. అనే పర్యాయపదంగా అభివర్ణిస్తారు చాలామంది.
చొక్కాపు తన జీవిత కాలంలో బాలల కోసం చేసిన సేవలకు కేంద్రసాహిత్య అకాడమీలాంటి సంస్థలు అవార్డు ఇచ్చి సముచితంగా గౌరవించాయి. అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన రామినీడు పౌండేషన్ లాంటి సంస్థలూ సగౌరవంగా సత్కరించుకున్నాయి. ఇలా చొక్కాపు బాలల సాహితీ సేవలకు చంద్రునికో నూలుపోగు అన్నట్టుగా.. సత్కారాలు, గౌరవాలు, పురస్కారాలకు లెక్కేలేదు. ముందే అన్నట్టుగా చొక్కాపు అవార్డుల మనిషి కాదు, పిల్లలు ఎక్కడ ఉంటే అక్కడ వాలిపోయే.. నిస్వార్థజీవి… బాలల చొక్కాపు.
– గంగాధర్ వీర్ల