నవంబరు, ఆరో తేదీ 2018 నాడు ఉదయాన్నే నా మొబైల్ రింగ్ అయింది… లైన్లో చిలువూరు సురేష్.
ఇంత ఉదయాన్నే తన నుండి నాకు ఎప్పుడు కాల్ వచ్చిన గుర్తులేదు. సంశయంతోనే ఫోన్ ఎత్తాను.
‘కాండ్రేగుల నాగేశ్వరరావు గారికి బాలేదు, బయలుదేరి వచ్చేయండి…’ అని చెప్పాడు.
ఆత్రుతతో నేను వెళ్లేటప్పటికి వారి పార్థీవదేహం హైదరాబాదు కు తరలి వెళ్తుంది. విషయం తెలిసింది, హార్ట్ ఫెయిల్ అని.
నా గుండె జారిపోయింది. కాళ్ల కింద నేల కదిలిపోయినట్టుగా నిశ్చేస్ఠుడయినాను. మాట తడబడుతుంది. కళ్ళు బైర్లు కమ్ముతున్నట్లు ఏదో స్తబ్ధత నన్ను ఆవరించింది. మనసులో వివేకం దారులు మూసేస్తుంది. విధి ఎంత విచిత్రమైనది. కాలం ఎంత కర్కశమైనది.నా స్పృహ నాకు తెలిసేటప్పటికి, బహుశా ఒక గంట పట్టివుంటుంది.ఆ తర్వాత నేను అక్కడ నిలవలేకపోయాను. వెంటనే బస్సులో హైదరాబాద్కు పయనమయ్యాను.
మొదటి రోజు ఎంతో సజావుగా సమర్థవంతంగా ‘కళా లాస్య’ తెనాలి సృజనకర్తలు, స్మృతి రేఖలు సభా కార్యక్రమం తెనాలి రామకృష్ణ కళాక్షేత్రంలో స్థానిక ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారి నిర్వహణలో సురేష్ సహకారంతో జయప్రదంగా ముగిసింది.
ఆ మరునాడే నాగేశ్వరావు గారిని ఆఖరిగా కలవడం. తెనాలిలోఎడ్లపాటి వెంకటరావు గారిని వారి స్వగృహంలో మిసిమి మాసపత్రిక సంపాదకులు వల్లభనేని అశ్వినికుమార్ గారు, ఉప సంపాదకులు కాండ్రేగుల నాగేశ్వరరావు గారు మరియు నేను, ఎమ్మెల్యే రాజా గారి పిఏ ఆచంట శ్రీనివాసరావు గారి సాయంతో పరిచయ పూర్వకంగా వెళ్ళాం. ఆనందంగా గడిపి ఎడ్లపాటి వెంకటరావుగారి నోట దువ్వూరివారి కృషీవలుడు, జాషువా గబ్బిలం, నార్ల శతకం నుండి మరెన్నో పద్యాలు వారిచే పాడించుకుని తీపి జ్ఞాపకాలతో వారిని గెస్ట్ హవుసు లో వదిలి నేను ఇల్లు చేరుకున్నాను. బొమ్మా – బొరుసా అన్నట్లు, ఆ అనర్ధం వెనుక ఇంత విషాదం దాగి ఉంది అని నేను అనుకోలేదు.
అంతేనేమో జీవితమంటే సుఖ: – దు:ఖ్ఖాల, ఆనంద – విషాదాల, కష్ట-నష్టాల కలబోత ఏమో !
నన్ను విపరీతంగా అభిమానించే అరుదైన వ్యక్తుల్లో శ్రీ కాండ్రేగుల నాగేశ్వరరావు గారు ఒకరు. నా పరిచయం వారితో ఒక దశాబ్ద కాలం పైనే అని నాకు జ్ఞాపకం. అప్పటి నుండి వారితో నాకు ఉత్తరప్రత్యుత్తరాలు, సలహాలు సంప్రదింపులు బాగా ఉండేవి. పరిచయం పెరిగిన కొద్దీ సందర్భానుసారం వారి స్వగ్రామమైన అమలాపురం నేను పలుమార్లు వెళ్ళాను. వారు మా స్వగృహానికి వచ్చి గడిపిన రోజులు ఉన్నాయి. చాలా చోట్ల కు కలిసి ప్రయాణించాం. నాకు అలవాటు తక్కువ గాని, రాస్తే అదొక బృహత్గ్రంథం అవుతుంది.
2007 సంవత్సరంలో హైదరాబాద్ కళాకృతి ఆర్ట్ గ్యాలరీలో నా మినియేచర్ చిత్రాలను ప్రదర్శించినప్పుడు నాకు మొదటిసారిగా కాండ్రేగుల నాగేశ్వరావు గారు పరిచయమైన గుర్తు. మరలా వెంటనే 2008 కళాహిత ఆర్ట్ గ్యాలరీలో సెరిగ్రాఫ్ లు ప్రదర్శించినప్పుడు, అదే సంవత్సరం అదే గ్యాలరీలో వృషభ -1 అనే పేరుతో ఒంగోలు జాతి ఎడ్ల పై ఒక పెద్ద చిత్ర ప్రదర్శన జరిగినప్పుడు మేము రెండు మూడు గంటల సమయం చాలా విషయాల గురించి ముచ్చటించు కునేవాళ్ళం. ఆనాడు వారు నాకు ఒక మంచి పుస్తకం ఇచ్చారు. దాని పేరు ‘యుగాంతం’ మరాఠీ రచయిత్రి ఇరావతి కార్వే రాసిన విశిష్ట రచన ఆధారంగా తీసుకుని మహాభారతంలోని కొన్ని పాత్రలను సుమారు 500 చిత్రాలుగా ప్లాన్ చేసి వాటిలో కొన్నిటిని చిత్రించాను వేరువేరు మాధ్యమాల్లో. ఆ తర్వాత కాలంలో మిసిమి పత్రికతో పరిచయం ఏర్పడింది. తర్వాత జరిగిన ప్రదర్శనకు ముందే నా వర్క్స్ లోని మంచి చెడులను తరచి మాట్లాడుకునే వాళ్ళం, ముచ్చటించే వాళ్ళం. చాలా సాత్వికమైన సద్విమర్శ చేసేవారు.
మనిషి చూడడానికి ఎత్తు లేకపోయినా, వారి లోని వ్యక్తి ఒక త్రివిక్రమ రూపాన్ని పోల్చుకున్నట్లుండేది. అది వారిలో ఉన్న జ్ఞానం యొక్క ఔన్నత్యం. ముఖంలో నుదుటి భాగం ముందుకు కనిపిస్తూ ఉండేది. మాటల సందర్భంగా మా నాన్నగారు అనేవారు అది ఏకసంధా గ్రాహులకు, జ్ఞానులకు ఉండే లక్షణాలని.
వారు మృదుభాషి ఎవరైనా నొప్పించని మనస్తత్వం. హేతుబద్ధమైన ఆలోచన. ఏదైనా ప్రతిఘటించాల్సిన విషయం వస్తే ఆ నిర్ణయంపై గట్టిగా నిలబడే వారు. అంతటి ప్రతిష్ట మైన వ్యక్తిత్వం వారిది. విమర్శకునిగా ఏ డిగ్రీలు చేయకపోయినా, జన్మత వారికి వచ్చిన ఏకాగ్రత, చదివిన చదువు, పెంచుకున్న విజ్ఞానం, హేతుబద్దమైన ఆలోచన, అన్నీ కలిసి వారిని సద్విమర్శ కుని స్థానంలో కూర్చోబెట్టాయి. విపరీతంగా కళా గ్రంథాలు చదివేవారు. వారు రాసిన 333 పేజీల ‘సప్త పర్ణి‘ అనే గ్రంథం కళా, సాహిత్య విమర్శనాత్మక వ్యాసాల పుస్తకం మొదటి సంపుటిగా పాఠకుల అభిమానము చూరగొన్నది. కళాకారులకు, సాహితివేత్తలకు ఈ పుస్తకాన్ని ఒక దిక్చూచిగా చెప్పుకోవచ్చు.
నా దురదృష్టం ఏమిటంటే చిత్రకారుడు బాపు మరియు నాకు సంబంధించిన విమర్శనాత్మక మరియు తులనాత్మక వ్యాసం వారి రెండవ సంపుటిలో పొందుపరిచినట్లు నాతో చెప్పేవారు. అది అసంపూర్ణంగానే వదిలి వారు సుదూర తీరాలకు పయనమగుట విచారకరం.
వారితో కలసి ఎన్నో ప్రాంతాలను తిరిగి, సురేష్ గారికి తోడుగా ఉండి, ఎన్నో వీడియో డాక్యుమెంటరీలు, ఇంటర్వ్యూలు చేశాం. వాటిల్లో ముఖ్యంగా చిత్రకారులు శ్రీ రాజయ్య సిద్దిపేట, శ్రీ కొండపల్లి శేషగిరిరావు గారు పద్మశ్రీ జగదీష్ మిట్టల్, శ్రీ బాలయ్య గారు, కుమారి కోకా విజయ లక్ష్మి (కూచిపూడి నాట్యం) హైదరాబాద్ లోనూ, శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ శ్రీ బాపు – రమణ శ్రీ వి. కే. రంగారావు గారు, శ్రీమతి సరోజా శ్రీ శ్రీ గారి ఇంటర్వ్యూలు చెన్నై లోనూ, శ్రీ కాళీపట్నం రామారావు, శ్రీ యగళ్ళ రామ కృష్ణ గార్లను, ఉత్తరాంధ్రలోనూ కాండ్రేగుల వారితో కలిసి ఇంటర్వ్యూ చేసాం. వారు మిత భొక్త , మృదుభాషి. ఇక కలిసి ఇటు అమలాపురం, యానం ప్రాంతం అంతా ఒక చుట్టు తిప్పి పరిచయం చేశారు ఆయన. బెంగళూరు, లేపాక్షి వంటి ప్రాంతాలు కలిసి ప్రయాణించాం.
ఇక చలనచిత్రరంగం గురించిన కబుర్లు సమాచారం, విమర్శ ఒకటేమిటి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఏ సినిమా గురించి అయినా సాధికారికంగా, విస్తృతంగా మాట్లాడగలరు. ఇక చిత్రకళ అంటే వారికి ప్రత్యేక అభిమానం. వృత్తిరీత్యా సి. టి. ఓ. కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ అయినా ప్రవృత్తి రీత్యా ఒక గొప్ప విమర్శకుడు, కళాప్రియుడు. వీరు లేని లోటు మిసిమి పత్రికలకు చాల ఉందనిపిస్తుంది. జంట కవుల్లా, ఎక్కడకు వెళ్ళినా, ఏ పని చేసినా కలిసి చర్చించుకునే అశ్విని కుమార్ గారి కార్యోన్ముఖతకు తీరని లోటని నా భావన.
నా దురదృష్టం ఏమోగానీ నా జీవితంలో చాలా అద్భుతమైన విషయాలు జరిగినట్లు జరిగి నాకు దూరమౌతుంటాయి. అది నా జన్మ ప్రారబ్దంగా నా కనిపిస్తుంది. నాకు ఇష్టమైన తమ్ముడు, వదిన, తండ్రిగారు దూరమైనారు. నా తండ్రిని కోల్పోయి నా, వారి స్నేహ సాన్నిహిత్యంలో నా మనసు సేద తీరింది.
నాకు ఆత్మీయుడు, నా శ్రేయోభిలాషి, నా జీవితంలో కొన్ని ముఖ్యమైన సందర్భంలలో ఆసరాగా నిలిచిన వాడు. నన్ను విపరీతంగా ఇష్టపడే సద్విమర్శకుడు ఇక లేరు అని జ్ఞప్తికి రాగానే మనసు కలచివేస్తుంది. హైదరాబాద్ మహానగరంలో నాకు తమ ఇంట్లో ఆశ్రయమిచ్చి తమ గుండెల్లో చోటిచ్చిన వారు ఇద్దరు. ఒకరు సదాశివ రావు గారు, రెండు కాండ్రేగుల నాగేశ్వరరావు గారు. నాకేదయినా సమస్య వస్తే తన సమస్యగా పరిగణించి, పరిష్కరించి ఓదార్చిన వారు వీరు. ఇన్ని అండదండలు గలవాడు నాకు దూరమైతే నాది దురదృష్టం కాక ఇంకేమవుతుంది..
‘వామన మూర్తి కాదు, అతడు అపర త్రివిక్రమ మూర్తి’.
ఆ ప్రకృతి వారి ఆత్మకు శాంతి నొసగుగాక. ప్రకృతి తను ధర్మం చేస్తుంది. పుట్టిన జీవి గిట్టక తప్పదు. వారు పెద్ద హేతుబద్ధమైన, వివేకము గల తత్వవేత్త. అందుకు నిదర్శనం వారి పార్థివదేహాన్ని వైద్య కళాశాలకు విద్యార్థుల అధ్యయన యోగ్యంగా దానం చేయడమే.
ఎంత గొప్ప త్యాగం. తత్వమే కాదు వారి జీవితం ఆచరణ మార్గం కూడా.
– రాయన గిరిధర్ గౌడ్, చిత్రకారుడు
చీకటి ని చెరిపేస్తూ కళా కాంతి రేఖ పొడుచుకు వస్తుంది …..నిత్యం…..ఇక ఆ రేఖ అదృశ్యం అయిపోయింది ఇప్పుడు…….కళా జగతి నిలువునా నివ్వెర పోయింది 💐💐💐💐 🙏స్వర్గీయ కాండృేగుల నాగేశ్వరరావు గారికి శ్రద్ధాంజలి 💐💐💐💐💐💐💐💐💐🙏🙏🙏vempataapu
Thanks Vempataapu garu
Great personality.
Thanks Aswini Kumar garu
తెలుగు చిత్ర కళా సాహితీ రంగంలో కృషి చేస్తూన్న అతి కొద్దీ మందిలో ఒకరైన కాండ్రేగుల గారి అకాల మరణం మన చిత్ర కళావిమర్శనా రంగానికి తీరని లోటు. మంచి రస హృదయం ,మంచి కళా ప్రజ్ఞ .సహృదయం కల వారు నేడు మనముందు లేకపోవడం చాలా దురదృష్టకరం .వారిపవిత్ర ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ణి వేడుకుంటున్నాను
వారి పరిచయ భాగ్యం కలగకపోయినా వారి ఖ్యాతి విన్నాను. చింతిస్తున్నాను.