చిత్రకళపై ఆశక్తితో చిన్ననాడే ఇళ్లు వదిలి వెళ్లిన ఆ బాలుడు…నేడు దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన కళంకారీ కళాకారుడిగా గుర్తింపు పొందారు. కలంకారీలో మన రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపును తెచ్చారు. రామాయణం, భాగవతం ఘట్టాలతో కూడిన మాస్టర్ కలంకారీ వస్త్రాన్ని రూపొందించి లిమ్కాబుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించిన కాశిరెడ్డి శివప్రసాద్ రెడ్డి గురించి … తెలుసుకుందాం…
ఆంధ్రరాష్ట్రంలో చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి, కృష్ణాజిల్లాలోని పెడన కలంకారీ కళకు ప్రసిద్ది. ఇక్కడ తప్ప మరెక్కడా “కలంకారీ’ కళ కనపడదు. అలాంటి కలంకారీ చిత్రకళను నేర్చుకొని అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిగడించిన వ్యక్తి బనగానపల్లె మండలం, టంగుటూరు గ్రామానికి చెందిన కాశిరెడ్డి శివప్రసాద్ రెడ్డి, కళల్లో రాణించాలంటే కృషి, పట్టుదల, ఆత్మవిశ్వాసం అవసరం. రైతుకుటుంబంలో పుట్టిన శివప్రసాద్ రెడ్డి చిన్నతనంలో ఇంటినుండి పారిపోయి శ్రీకాళహస్తిలోని కలంకారీ శిక్షణ కేంద్రంలో చేరి, నేడు దేశం గర్వించదగ్గ కళాకారుడిగా ఎదిగారు. 1980సం. నుండి కలంకారీ చిత్రాలను గీయడం ప్రారంభించిన వీరు రామాయణం, భాగవతం, భారతం, ప్రకృతి సౌందర్యాలను వారి చిత్రాలకు నేపధ్యంగా తీసుకొని, ప్రకృతిలో లభించే సహజ వర్గాలతో అపురూప కళాఖండాలను చిత్రీకరిస్తున్నారు. ఇప్పటి వరకూ వెయ్యికి పైగా చిత్రాలను చిత్రీకరించిన వీరు 1995లో ఎన్టీరామారావు గారిచే, 1996లో కేంద్రమంత్రి చిదంబరంలచే సత్కారం అందుకున్నారు.
వీరి చిత్రాలతో ఢిల్లీ, ముంబయి, కలకత్తా, బెంగుళూరు, హైద్రాబాద్, మైసూరు, మద్రాసు వంటి నగరాలలో ప్రదర్శించి “కలంకారీ’ కళా విశిష్టతను దేశం నలుమూలలా చాటి చెప్పారు.
లిమ్కారికార్డ్: ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే పరిమితమైన ఈ కలంకారీ’ సాంప్రదాయ కళను సురక్షితంగా కాపాడేందుకు, భావితరాలు గుర్తుంచుకునే విధంగా ఒక భారీ కలంకారీ చిత్రాన్ని రూపొందించాలనే నిశ్చయంతో, తన 30 సం.రాల అనుభవాన్ని క్రోడీకరించి 2004 సం. లో 47 అడుగుల పొడవు 11 అడుగుల వెడల్పు కలిగిన నూలువస్త్రంపై రెండేళ్ళు పాటు కష్టపడి రామాయణం, భాగవతం, ఇతిహాసాలు ఘట్టాలుగా విభజించి చేసిన పెయింటింగ్ లో బార్డరు నందు సంపూర్ణ రామాయణం మధ్య భాగంలో భాగవత కళలు చిత్రీకరించారు. ఇందులో మొత్తం రెండువేల బొమ్మలు ఇమిడిల్ న్నాయి. ఈ చిత్రానికి ఉపయోగించిన రంగులన్నీ సహజ వనరుల నుండి లభించినవే కావడం మరో గొప్ప విషయం. ఇన్ని ప్రత్యేకతలు కల్గిన ఈ చిత్రాన్ని 2006సం. లో పూర్తిచేసి, చరిత్రలో అత్యంత భారీ కలంకారీ చిత్రాన్ని రూపొందించిన చిత్రకారుడిగా లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్ స్థానం సంపాదించుకున్నారు శివప్రసాద్ రెడ్డి.