జీవిత కాలం సరిపోదేమో – ఎం. ఎం. మురళీ

ఎం. ఎం. మురళీ గత రెండు దశాబ్దాలుగా అభిరుచి తో కార్టూన్లు గీస్తూ, కార్టూన్-కవిత్వం-కథారచన వంటి విభిన్న రంగాలలో రాణిస్తున్నారు. మన కార్టూనిస్టులు శీర్షికలో ఈ నెల పరిచయం వారి మాటల్లో చదవండి…

ఎం. ఎం. మురళీ పేరుతో కార్టూన్లు గీస్తున్న నా పూర్తి పేరు మల్లారెడ్డి మురళీ మోహన్. మా సొంత ఊరు శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట దగ్గర కంచిలి. అమ్మ శ్రీమతి చంద్రకళ, నాన్న శ్రీ ఆనందరావు గారు. నాన్న ఉద్యోగ రీత్యా అమ్మా, నాన్న కలకత్తా లో ఉండేవారు. నేను మా తాతగారింట్లో మేనమామ శ్రీ కృష్ణారావు గారి దగ్గర పెరిగాను.  కళలు, సాహిత్యం పట్ల అభిరుచి మా అమ్మ ద్వారా నాకు అబ్బింది.  

చిన్నప్పుడు ‘ఆంధ్రభూమి’ వీక్లీ లో మల్లిక్ గారి కార్టూన్లు, ఉత్తం గారు, సుభాని గార్ల బొమ్మలు చూసి ప్రభావితమై కార్టూన్లు గీయడం మొదలుపెట్టాను. మొదటి కార్టూన్ ‘మయూరి’ వారపత్రిక (31 డిశెంబర్ 1993)లో అచ్చయ్యింది. కానీ 1994 లో IAF లో  జాయినవ్వడంతో కార్టూన్లు గీయనేలేదు. ఎయిర్ ఫోర్స్ లో లక్నోలో ఉన్నపుడు నాకు పరిచయమైన ఒక సీనియర్, కర్ణాటక కు చెందిన శ్రీ ప్రభాకర్ గారు మంచి పెయింటర్. ఆయన పరిచయం ద్వారా ఆర్ట్, ఆర్టిస్టుల పైనా ఒక అవగాహన కలిగింది. లక్నోలో  మా ఎయిర్ బేస్ నుండి 20 కి.మీ. దూరాన ఉన్న లలిత కళా అకాడెమీ కి డ్యూటీ ఆఫ్ రోజుల్లో వెళ్ళి అక్కడ లైబ్రరీలో రోజంతా ఏక ధాటిన ఆర్ట్ రిలేటెడ్ పుస్తకాలు, మేగజైన్స్ చదువుతూ గడిపేవాళ్ళం.

బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో గ్రాడ్యుయేషన్ చేసాక నారాయణగుడలో ఉన్న ‘రచన జర్నలిజం కాలేజీ’ లో PGDCJ చేశాను. ఆ బ్యాచ్ కి టాపర్ ని.  కోటి లో Bhavan’s  కాలేజీ లో PGDMA (Advertising) చేసి గోల్డ్ మెడల్ పొందాను. తర్వాత హెచ్.ఆర్. లో ఎంబీయే చేసాను. లక్నోలో ఉన్నపుడు ఎరీనా ఇన్స్టిట్యూట్ ద్వారా ఏనిమేషన్ లో డిప్లొమా చేసాను.

మళ్ళీ 2002 లో హైదరాబాద్ బదిలీ మీద రావడంతో యాక్టివ్ గా 2004 నుండీ శ్రీ ‘రచన’ శాయి గారి   ప్రోత్సాహంతో కార్టూన్లు గీయడం మొదలుపెట్టాను. తొలి రోజుల్లో శాయి గారి  ప్రోత్సాహం మరువలేనిది. ఆయన ద్వార నా కార్టూన్లు కొన్ని ‘తానా’ వారి వార్షిక సావనీర్లలో అచ్చయినవి.

ఆ క్రమంలో పరిచయమైన శ్రీ ‘కిరణ్ ప్రభ’ (అప్పటి సుజన రంజని ఎడిటర్) గారి  ప్రోత్సాహంతో  ‘తానా’ వారి ‘సుజన రంజని’ అనే వెబ్ మేగజైన్ కి రెండేళ్ళు కార్టూన్లు గీసాను. తర్వాత శ్రీ మల్లాది క్రిష్ణ మూర్తి గారి గౌరవ సంపాదకత్వంలో వచ్చిన ‘శృంగారం.కాం’ అనే వెబ్ మేగజైన్ కి కొద్ది రోజులు సబ్జెక్టివ్  కార్టూన్లు వేశాను. అప్పట్లో శృంగారం.కాం ని శ్రీ సత్య నరేష్ గారు, శ్రీ సిరాశ్రీ గారు పర్యవేక్షించేవారు. నా కార్టూన్లు చూసి నచ్చిన సిరాశ్రీ గారు, ఒక  ప్రింట్ పత్రిక కి కార్టూనిస్ట్ కావాలనీ, చేస్తారా అనీ నన్నడిగారు. కానీ చేస్తున్న ఉద్యోగ పరిమితుల వల్ల ఆ అవకాశం వదులుకోవలసి వచ్చింది.

అప్పట్లో ప్రతీ కాంపిటిషన్లో చాలా ఉత్సాహంగా పాల్గొనటం, ఏదో ఒక బహుమతి పొందడం జరుగుతుండేది. శ్రీ కళా సాగర్ గారి కృషి ఫలితంగా వెలువడిన ‘ఆంధ్ర కళాదర్శిని’ లో నాకూ చోటు కల్పించడం వల్ల ఎందరో కార్టూనిస్టుల పరిచయ భాగ్యం కలిగింది.

అదే సమయంలో అంతర్జాతీయ పోటీలకు అడపా దడపా కార్టూన్లు పంపేవాణ్ణి. అలా  3rd LENG MU INTERNATIONAL CARTOON CONTEST-2004 (చైనా) వారి పోటీలో  PRIZE FOR EXCELLENCE పొందడం, www.sadurski.com అనే పోలండ్ వారి వెబ్ సైట్లోనూ, www.karikaturevi.com అనే టర్కీ వారి వెబ్సైట్లోనూ నా కార్టూన్ పేజీ ఎగ్జిబిట్ కావడం మరచిపోలేని ఒక మధురానుభూతి.  

ఇటు తెలుగు పత్రికల్లో కార్టూన్లు గీస్తూనే ఎయిర్ ఫోర్స్ సంస్థాగత పత్రికల్లోనూ, సైన్స్ రిపోర్టర్ (Science Reporter) అనే ఆంగ్ల పత్రికలోనూ, అలహాబాద్ నుండి వచ్చె ‘క్యూర్’ (CURE) అనె ఆంగ్ల జర్నల్ లోనూ సైన్స్, పర్యావరణంపై సబ్జెక్టివ్ కార్టూన్లు గీసాను.

ఇంతలో మళ్ళీ 2007లో ట్రాన్స్ ఫరై హర్యానా వెళ్ళిపోవడం, వ్యక్తిగత కారణాల వల్లా కార్టూనింగ్ కి తాత్కాలింగా దూరమయ్యాను. అదే సమయంలో కథా రచనపై మనసు మళ్లింది. కార్టూనిస్టుగా నన్ను ప్రోత్సహించిన శ్రీ ‘రచన ‘శాయి గారే నా మొదటి కథ ‘మృగ తృష్ణ’ ని ‘రచన’ లో ప్రచురించడమే గాక ‘కథా పీఠం’ బహుమతి నీ ఇచ్చారు. ఆ కథ ‘చంద్ర’ గారి ఇలస్టేషన్ తో తొలుత ‘రచన’ లో, తర్వాత శ్రీ బాలి గారు, శ్రీ ఏవీఎం గారి బొమ్మలతో రెండు కథా సంకలనాల్లో చోటు సంపాదించుకుంది. సమయాభావం వల్ల రాయలేకపోతున్నా. అందుకే కేవలం డజను కి పై కధలు మాత్రమే రాయగలిగాను. 

ఆ తర్వాత ‘చందమామ’ పత్రిక ద్వారా బాలసాహిత్యంలో నా ప్రస్థానం మొదలైంది. ఆ క్రమంలో అప్పటి చందమామ అసోసియేట్ ఎడిటర్ శ్రీ రాజశేఖర రాజు గారు ఎంతో అభిమానంతో నన్ను ఎంతగానో ప్రోత్సాహించారు. ఇప్పటికి ఓ 40 వరకూ బాలల కధలు వివిధ  పత్రికల్లో అచ్చయినవి. ఈ వ్యాపకాలతో బాటు మొదటి నుండీ కవిత్వంలో కూడా కొద్దిగా ప్రవేశం ఉండడంతో కవితలు కూడా పత్రికల్లో వస్తూండేవి. మూడుసార్లు ‘ఎక్స్ రే’ ఉత్తమ కవితా పురస్కారం, ‘భిలాయి వాణి’ బహుమతి…ఇతరత్రా గుర్తింపు కవిత్వం ద్వారా లభించింది. సుమారు 70 కి పైగా కవితలు వివిధ పత్రికల్లో అచ్చయినవి.

కార్టూనింగ్, కవిత్వం, కధలు, బాల సాహిత్యం, గ్రాఫిక్ డిజైనింగ్…  ఇలా ఏది చేసినా ఇష్టంగా చేశాను, చేస్తున్నాను. ఒక వ్యాసంగం బోర్ కొట్టినప్పుడు మరో వ్యాసంగానికి షిఫ్ట్ అవుతూ రాశి కన్నా వాసి పైనె దృష్టి పెడుతున్నాను. అందుకే ఇప్పటికి సుమారు 1200 పైగా కార్టూన్లు మాత్రమే గీసాను.

2014 లో ఎయిర్ ఫోర్స్ నుండి పదవీ విరమణ తర్వాత  National Insurance Co. Ltd లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా జాయినై బెంగుళూరు లో ఉద్యోగ రీత్యా ఉంటున్నాను. 2017 లో  బెంగుళూరు లో ఐ.ఐ.సీ. గ్యాలరీ లో తెలుగు కార్టూనిస్టులందరినీ కలుసుకునే సదవకాశం కలగడం, మళ్లీ కార్టూన్ల వైపు దృష్టి మళ్లింది. నేను గీసిన కార్టూను ఒకటి చూసి శ్రీ రామ కృష్ణ గారు ఫోన్ చేసి మరీ అభినందించడం, శ్రీ బాచి గారు, హాస్యానందం రాము గారు వెన్ను తట్టడంతో మళ్లీ కార్టూన్లు గీస్తున్నాను. బెంగళూరు వచ్చాక ‘సుధ’, ‘కర్మవీర’ కన్నడ పత్రికల్లో నా కార్టూన్లు అచ్చయినవి.

ఇలా అన్ని రకాల కళలనీ ఎంతగానో ఇష్టపడే నాకు దేవుడిచ్చిన ఈ ఒక్క జీవిత కాలం సరిపోదేమో అనిపిస్తుంది. నా ఈ ప్రయాణంలో నా సహధర్మచారిణి శ్రీమతి ఆనంద సహకారం మరువలేనిది. మాకిద్దరు అబ్బాయిలు. పెద్దవాడు మానస్, చిన్నవాడు చంద్రహాస్. 

ఇలా అడుగడుగునా వెన్ను తట్టి ప్రోత్సాహించిన పెద్దలందరినీ తలచుకుని కృతఙ్ఞ్ తలు తెలుపుకునే అవకాశమిచ్చిన శ్రీ కళాసాగర్ గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు.

అవార్డులు -‘రచన’ పత్రిక- శ్రీ  గోపి బూరుగు గారు నిర్వహించిన తారణ ఉగాది కార్టూన్ల పోటీ లో 5 బహుమతులు -PCRA-యోజన పత్రిక నిర్వహించిన కార్టూన్ల పోటీలో 3వ బహుమతి.

     – హాస్యానందం నిర్వహించిన కార్టూనిస్టు 2004 పోటీ లో బహుమతి

     – “భద్రాచలం ఫైన్ ఆర్ట్స్ అకాడెమీ” వారి ‘శివ కుమార్ మెమోరియల్ అవార్డ్ (2005)

     – హాస్యానందం నిర్వహించిన ‘మళ్ళ జగన్నాధం స్మారక కార్టూన్ల పోటీ’ లో ప్రధమ బహుమతి (2004)

     – ఇటీవల శ్రీ బాచి గారు వారి తల్లి గారి పేరిట నిర్వహించిన శ్రీమతి అన్నం భాగ్యవతి స్మారక కార్టూన్ల పోటీ లో జ్యూరీ అవార్డు

34 thoughts on “జీవిత కాలం సరిపోదేమో – ఎం. ఎం. మురళీ

 1. శ్రీ మల్లారెడ్డి మురళీమోహన్ గారికి అభినందనలు.. 64కళలు.కాం శ్రీ కళాసాగర్ గారికి ధన్యవాదాలు..
  లాల్..కార్టూనిస్ట్..వైజాగ్..2-1-19

 2. 64 కళల లో కధలు, కవితలు, చిత్రకళ(కార్టూనింగ్), సాహిత్యం, జర్నలిజం, సాఫ్ట్వేర్ నైపుణ్యం …ఇంకా ఎన్నో తనలో నిక్షిప్తం చేసుకున్న, సౌమ్య శీలి, స్నేహశీలి, మృదుభాషి అయిన మురళి గారి పరిచయం స్ఫూర్తి దాయకం గా ఉంది. అభినందనలు మురళి గారు.

 3. మురళి,
  నేను నీ చిన్ననాటి స్నేహితుడు అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను.
  కృతజ్ఞతతో,
  నీ
  శ్రీనివాస్ మాడుగుల.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు.

1 × 4 =