రవిశంకర్ గీతలు నన్నాకట్టుకున్నాయి-వర్చస్వి

నాలుగు దశాబ్దాలుగా కార్టూన్లు గీస్తున్న వర్చస్వి తెలుగు పాఠకులకు సుపరిచితులు. రచయితగా, చిత్రకారుడుగా బహుముఖరంగాల్లో రాణిస్తున్నారు. మన కార్టూనిస్టులు శీర్షికన ఈ నెల ఆయన పరిచయం వారి మాటల్లోనే  చదవండి.

“అది 1984 సంవత్సరం! పేపర్ ఆడ్ చూసి, ఇలస్ట్రేటర్ ఉద్యోగం కోసం అప్లై చేసుకున్నాక  వడ పోత తర్వాత  – ఫైనల్ గా ‘పర్సనల్ ఇంటర్వ్యూ’ అన్నారు.

ఆ సంస్థ పేరు – ఈనాడు వారి విపుల, చతుర, సితార, అన్నదాత ప్రచురిస్తున్న ‘వసుంధర పబ్లికేషన్స్’ ! ఇంటర్వ్యూ చేసిన ఆ పెద్దాయన – బహు గ్రంధ రచయితా, మార్కిస్టు మేధావి అయిన కీ.శే. చలసాని ప్రసాద రావు గారు, కంగ్రాట్స్! ఇదుగో అప్పాయింట్మెంట్ ఆర్డర్… ఈ వారంలోగా ఎప్పుడైనా చేరిపోవచ్చు’ అనగానే …..ఎగిరి గంతేయలేదు గానీ నాకిస్తానన్న మంత్లీ సాలరీ నచ్చక వెనుతిరిగాను. అప్పటికే అక్కడ కొద్ది కాలం క్రితమే చేరిన తెల్లగా, బక్కపలచగా కనిపించిన కుర్రాడిని చూశాను. ఆయనే నేటి ప్రసిద్ద కార్టూనిస్టు శ్రీధర్, అప్పటికి నాలానే 20 ఏళ్ల కుర్రాడు.”

“నా మొదటి కార్టూన్ 1980 లో మార్గదర్శి అనే ‘ఆరోగ్య’ మాస పత్రికలో వచ్చింది. డాక్టరు దగ్గరి కెళ్ళిన పేషంటుని “ఈ మందులు వాడటమే కాకుండా ‘మార్గదర్శి’ కి చందా కట్టి రెగ్యులర్ గా చదువుతూండు.. తర్వాత ఆరోగ్యం అదే బాగుపడుతుంది’ అంటాడు ఆ డాక్టర్. ఆ కార్టూన్లో, వాళ్లకి భజన చేసాను కాబట్టి ప్రచురించారు-ఇందులో వింతేముంది అనుకున్నా. తర్వాత ‘బాల’ అని రేడియో మావయ్య న్యాపతి గారి ఆధ్వర్యం లో మాస పత్రిక వచ్చేది. అందులో ఫుల్ పేజీ కార్టూన్లు పబ్లిష్ అవటంతో నాలో కార్టూనిస్టు విజ్రుమ్భించాడు. యోజన, విజయచిత్ర లాటి పత్రికల్లో చాలా కార్టూన్లు వచ్చాయి. నెమ్మదిగా స్వాతి, ఆంధ్ర ప్రభ, ఆంధ్ర భూమి వార, మాస పత్రికల్లో ఎక్కువగా నా కార్టూన్లు ప్రచురితమయ్యేవి. కవితలూ, కధలూ ఏమైనా పంపిస్తే వాటికి నేనే మరో పేజీలో బొమ్మలు వేసి పంపేవాణ్ణి. అది చూసి1982 లో అనుకుంటా-జాగృతి వార పత్రిక ఎడిటర్-ఇన్-ఛార్జ్ కీ.శే.ఆర్. ఎస్.కే.మూర్తి గారు మా పత్రిక లో కధలూ, వ్యాసాలకూ బొమ్మలేస్తారా … అనడిగితే భలే ఆనందం వేసింది. ఏది ఏమైనా 1981-84 నా డిగ్రీ బ్యాచ్ లో నేనో కవి, రచయితా, కార్టూనిస్టుగా పాప్యులర్ అయ్యాను. ఆంధ్ర ప్రభ వారపత్రిక, ఆ పత్రిక ‘జన్మదిన వేడుకలంటూ’ పెట్టిన జాతీయ కార్టూన్ పోటీల్లో రెండవ బహుమతి రావడం ( 27.08.86 నాటి ఆంధ్రప్రభ వార పత్రిక లో ప్రచురితమయ్యాయి), ప్రత్యేకంగా ఎడిటర్ శ్రీ పొత్తూరి వెంకటేశ్వర రావు గారి వద్ద నుంచి బహుమతి అందుకోడం మరిన్ని కార్టూన్లు గీయడానికి ఊతమిచ్చాయి. ఆ తర్వాత నించీ ప్రభుత్వోద్యోగం వెలగబెట్టే క్రమంలో నేను క్రమంగా కనుమరుగయ్యాను. కళారంగం ‘ముందుకూ’, ఉద్యోగ బాధ్యతలు “వెనక్కూ గుంజేసేవి.

దాదాపు ఏడేళ్ళ తర్వాత అంటే ….1993 జనవరి 25 న ‘ఆంధ్రజ్యోతి దినపత్రిక’, విజయవాడ, తిరుపతి, హైదరాబాద్, విశాఖపట్నం కేంద్రాల నుంచి ఒకేసారి జరిపిన జాతీయ కార్టూన్ కాంపిటీషన్ లో, రాజకీయ వ్యంగ్య చిత్రాల విభాగమూ, సాంఘిక వ్యంగ్య చిత్రాల విభాగామూ రెంటిలోనూ వరుసగా ద్వితీయ, తృతీయ బహుమతులు (ప్రధమ ఎవరికీ రాలేదు) గెలుపోడడం తో ‘ఆంధ్రజ్యోతి’ సీనియర్ న్యూస్ ఎడిటర్ గా పనిచేస్తున్న శ్రీ శారిబాబు గారు పొలిటికల్ కార్టూనిస్టు గా చేరిపోమ్మన్నారు. అప్పటికే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో కీలకశాఖ చూస్తున్న నేను అటుకేసి మొగ్గు చూపలేదు. తీరిక దొరికితే ఏదో కవిత్వమో, కధో రాసుకుంటూ ఉండేవాణ్ణి!

ఈ విధంగా నడిచిన ప్రయాణం 1980నుంచి 1995 వరకూ దాదాపు అన్ని ప్రముఖ వారపత్రికల్లోనూ ఓ 2000 కార్టూన్లూ, దాదాపు అన్ని ప్రముఖ వార పత్రికల్లోనూ 30-40 కవితలూ, మరో 30-40 కధలూ ప్రచురించబడ్డాయి. 1996 ప్రముఖ ఇంగ్లీషు దినపత్రిక ‘ది హిందూస్తాన్ టైమ్స్’ నిర్వహించిన క్యారికేచర్ కాంపిటీషన్ లో షారుఖ్ ఖాన్ క్యారికేచర్ వేసిపంపితే ప్రశంసా పత్రం లభించింది. దాంతో, ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీ మోహన్ గారు చెప్పినట్టు ‘నేను ‘ క్యారికేచరిస్టు అయ్యాను. 1997 ప్రాంతాల్లో ఆయన సంఘ పరివార్ అయిన… ఇప్పటి సాక్షి శంకర్ దాదా, నమస్తే తెలంగాణా మృత్యుంజయ్, ఇప్పటి టీవీ 9 ఆనిమేషన్ డైరెక్టర్ అవినాష్, ఆర్టిస్టు బ్రహ్మం, వార్త కార్టూనిస్ట్ పాండు (ఆయన చనిపోయారు), సినీ హాస్య నటుడు జూనియర్ వేణుమాధవ్ లాటి మిత్రుల గుంపులో నేనొకడినయ్యాను. ఆ క్రమంలో అరసం జాతీయ కార్యదర్శి డా. ఎస్వీ సత్యనారాయణ గారు ప్రజాశక్తి లో నా గురించి — ‘కధా, కవితా, కార్టూన్ ప్రక్రియల్లో త్రిముఖ కృషీవలుడు వర్చస్వీ’ అంటూ ‘ఈ తరం’ శీర్షికలో పరిచయం చేశారు!

నన్ను చూసి – “అసలు కార్టూన్ రంగం పై మీ కన్నెప్పుడు పడిందన్న” మీ ప్రశ్నకు నానుంచి ఇంకా సరైన సమాధానం రాలేదు కదూ…. అని మళ్ళీ వర్చస్వి గారు తానే ప్రశ్నవేసుకుని ఇలా కించిత్ గతం లోకి వెళ్ళిపోయారు.

ప్రాధమిక విద్య నుంచి హైస్కూలు వరకూ ప్రతి ఏటా నిర్వహించే చిత్రలేఖన పోటీల్లో నేనే విజేతని, తెనాలి తాలూకా హైస్కూల్లో ప్రవేశ ద్వారం వద్ద పెద్ద బ్లాక్ బోర్డు ఉండేది. మళ్ళీ మరో నోటీసు మారేదాకా, చిత్రకళా విభాగం లో విజేత’ అని నా పేరు చెరపకుండా వ్రాసి ఉండేది అక్కడ. ఆ వ్రాసేది డ్రాయింగ్ మాస్టారే అయుంటాడు కాబట్టి, రంగుల చాక్ పీసులతో, నగిషీల తో నా పేరు అక్కడ వ్రాస్తే-‘పద్మశ్రీ వచ్చినట్టు ఫీలయ్యే వాణ్ని. అకాడమిక్ సంవత్సరం చివర్లో జరిగే సరస్వతీ పూజకి ఆన్ని సెక్షన్ల వాళ్ళూ బ్రతిమాలి మరీ పిలిపించుకుని బోర్డ్ మీద సరస్వతో, గణపతో అంటూ బొమ్మ వేయిన్చుకునేవారు. స్కూల్ మగజైన్ లేదా సావనీర్ నిండా నా బొమ్మలూ, రాతలూ ఉండేవి. సరే! అదలా ఉంచితే ఆ డ్రాయింగ్ మాస్టారు పేరు-శ్రీ పడవల నారాయణ రావు గారు. మిగతా డ్రాయింగు మాస్టర్లు శ్రీ చలపతి రావు గారు (అందగాడూ,రేడియో ఆర్టిస్టు. ఈ రోజుల్లో అయితే టీవీ ఆర్టిస్టు అయిపోయేవాడు), శ్రీ వి.ఎస్.రావు గారు. (80ల్లో ‘రావ్’ పేరుతో తెలుగు వార పత్రికల్లో ఇలస్టేషన్స్ గీసేవారు.). నా ఏడవ తరగతిలో నారాయణ రావు గారు నన్నూ, మరో నా చిన్ననాటి చిత్రకారుడు రఘునాధ్ అనే సహ విద్యార్థినీ, తన ఇంటికి పట్టికెళ్ళి అసలు ‘కాన్వాసంటే ఏమిటీ అనాటమీ ఎలా స్టడీ చేయాలీ, ఆయిల్ కలర్స్ ఎలా మేళవించాలీ, పేపర్ అయితే స్కెచెస్ ఎలా వేయాలీ, వాటర్ కలర్స్ ఎలా అప్లై చెయ్యాలి, మొదలైనవన్నీ నేర్పించారు. ఆ సంవత్సరం మేం బాలురుగా వాళ్ళింట్లో కూర్చునే వందలాది స్కెచెస్ వేశామంటే నాకే నమ్మకం కలగట్లేదు. దీనికి తోడూ అనాటమీ, పాత్రల ఆహార్యం వగైరా నేర్చుకోడానికి ప్రముఖ మాసపత్రిక చందమామ శంకర్ బొమ్మల్ని గీస్తూ ప్రాక్టీస్ చేసేవాళ్ళం, అటు ఇంట్లో – ‘నీ తలకాయ్! బొమ్మలేస్తే …కూడా గుడ్డా సంపాదించలేవు. బొమ్మలు మానేసి చక్కగా చదూకో’ అని కేకలేసేవాళ్ళు. నిజమే అనుకుని నాకా భయం చాలాకాలం పీడించింది. మా నాన్న గారు కీ.శే.హృషీకేశ శర్మ గారు ( పీపుల్స్ హై స్కూలు, హిమాయత్ నగర్ లో టీచరు గా చేసి అక్కడే ప్రిన్సిపాల్ గా రిటైరయారు) అలా బొమ్మలు, పెయింటింగ్లూ వేసి నాలుగు రాళ్ళు ఏం వెనకేసుకోలేక పోయాడని చుట్టాలంతా చేరి నాకు ఏకరువు పెట్టేవాళ్ళు. ఓ రెండేళ్ళ తర్వాత 1976 లో ‘ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మ్యూజికల్ అండ్ కల్చరల్ అసోసియేషన్, తెనాలి’ వారి అఖిల ఆంధ్రప్రదేశ్ ‘పెయింటింగ్’ పోటీ లో ‘నావలు’ అని నేవేసిన పెయిటింగ్ కి ప్రతేక బహుమతి రావడం ఓ కుర్ర ఆర్టిస్ట్ గా నా పేరు తెనాలి చుట్టుపట్ల మార్మోగింది. ఆ పెయింటింగ్ ఎగ్జిబిషన్ కి బాలు రాలేదని చాలా బాధేసింది. అయితే నేనెంత అదృష్టవంతుడినంటే, 20-06-1976 న ఆనాటి సభలో, నాకు ఓ గ్రంధం, ఆయిల్ కలరస్ బాక్స్(ట్యూబ్స్), మేమేంటో బహుమతి గా అందుకుంది – విఖ్యాత తత్వవేత్తా,బహుగ్రంధ రచయితా, ప్రముఖ చిత్రకారుడూ అయిన డా. సంజీవ దేవ్ చేతుల మీదుగా ! అప్పటికి 13 ఏళ్ల వాన్నయిన నాకు ఆయన గురించి అసలు ఏమీ తెలీదు. ఇప్పుడా మహా మనీషిని తలుచుకుంటే ఎంతో థ్రిల్ ఫీలవుతుంటాను. తర్వాత 19.03.1978 లో రోటరాక్ట్ సంస్థ, తెనాలి వారు నిర్వహించిన అఖిల భారత చిత్రకళా ప్రదర్శన లో నాకు జూనియర్స్ కేటగిరీ లో మళ్ళీ ‘ప్రధమ’ బహుమతి వచ్చింది. ప్రముఖ చిత్రకారుడు శ్రీ బాలి గారి చేతుల మీదుగా అందుకున్నాను. శ్రీ బాలి గారిని చూడడం అదే ప్రధమం. మళ్ళీ ఇంతకాలం తర్వాత మొన్న హైదరాబాద్ ‘కార్టూనోత్సావ్’ లో చూడడం జరిగింది.

కాలేజీ నుంచి వచ్చిన తర్వాత ‘ఆంధ్ర పత్రిక వార పత్రిక లోని ప్రముఖ కార్టూనిస్టు ‘ఊమెన్’ బొమ్మలూ, కొన్ని ఓ బాపు బొమ్మలు ముందు పెట్టుకుని ప్రాక్టీస్ చేసేవాణ్ణి. అప్పటి నా బుర్రకి – అసలు కార్టూన్లంటే వాళ్ళవే’ అనిపించేది. పాట గాడికి సొంత గొంతు ఎలా ఉండాలో గీతగాడికి సొంత చెయ్యి ఉ ండాలని నాకనిపించి, తర్వాత వాటి జోలికి అస్సలు పోలేదు. ఈ క్రమంలో డా. జయదేవ్, శ్రీమతి రాగతి పండరి గార్ల సొంత చెయ్యి నాకప్పట్లో నచ్చేది. ఎవరివైనా బొమ్మలు “పట్టి పట్టి’ కష్ట పడి వేసేవాళ్ళంటే నాకు వ్యక్తిగతంగా నా మనస్సులోనే వారి పట్ల ఓ చిన్నచూపు ఉండేది. స్వరం లో సహజ గమకాలెంత బాగుంటాయో, సాహిత్యం లో అలవోక కవిత్వం ఎలా గిలి పెడుతుందో.. వ్యంగ్య చిత్రం లో- గీత అంత అలవోకగా వచ్చి ఒదిగిపోతే తప్ప నాకు ఎవరి కార్టూన్ అయినా నాకు ఓ పట్టాన నచ్చదు. అప్పట్లో కొత్తగా వస్తున్న ‘ఆంధ్ర భూమి వారపత్రిక’ లో ‘ఎన్. రవిశంకర్’ అని కొత్త కార్టూనిస్టు తనదైన స్టయిల్లో … అలవోక గీతల్లో అద్భుతంగా వేసే కార్టూన్లు నన్నాకట్టుకున్నాయి. చాలా కాలం తర్వాత… ముచ్చటేసి అవి ముందు పెట్టుకుని అభ్యసించాను. ఒక రకంగా నా కార్టూన్ గీతల్లో మూలాలు ‘ఎన్. రవిశంకర్’ గీతలని చెప్పుకోడానికి నిస్సిగ్గుగానూ, ఆనందంగానూ ఫీలవుతాను. ఆయన్ని నేనెప్పుడూ చూడక పోవటం అటుంచి, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆయన ఇటీవల దివంగతులైన కరుణాకర్ గారి సోదరులనే విషయం నాకు తెలియడం!

“అయితే కార్టూనింగ్ లో ఎన్.రవిశంకర్ మీకు ప్రేరణ అంటారు…” అని నేనన్నప్పుడు ఆయన

“మొదట్లో అయితే నిస్సందేహంగా అంతే! అయితే అప్పటి ‘విజయ’ మాసపత్రికలో ప్రచురించబడ్డ నా జోకులు అద్భుతం అంటూ ప్రసంశలు కురిపిస్తూ శ్రీ జయదేవ్ గారు మొట్ట మొదటగా నాకు వ్రాసిన ఓ కార్డు ముక్కలో… నువ్వింకా విరివిగా కార్టూన్లు కూడా గీయాలి అని వ్రాయటం తో… ఆ ఉత్తరం చూసినప్పుడల్లా ఛాతీ ఉబ్బేది.  అయ్యేయస్సాఫీసరూ, కార్టూనిస్తూ అయిన బీ.పీ.ఆచార్య లాంటి పెద్దలు పాల్గొన్న ఒకానొక కార్టూన్ ఎగ్జిబిషన్ లో…ఆయన ఎక్కడో మద్రాసు నుంచొచ్చి హైదరాబాద్ ‘లోకల్’ కార్టూనిస్టులకి-బచ్చా కార్టూనిస్టు నైన నన్ను – ‘మీకు తెలుసా… మన వర్చస్వి’ అంటూ పరిచయం చేయడం, వాళ్ళు ‘ఐ సీ’ అనడం నన్ను కదిలించేది. దిన పత్రికల్లో కార్టూనిస్టు అవకాశాలు వస్తే తిరస్కరించడం నాదే తప్పు … వాళ్ళదేముంది అనుకునే వాణ్ని. ఇప్పుడు ఆ బాధ లేదనుకోండి.. ప్రవృత్తికి భిన్నంగా అయితేనేమి… కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ లో సీనియర్ ఇన్స్పెక్టర్ గా హైదరాబాద్ లో గౌరవమైన, అత్యంత బాధ్యతాయుతమైన, ఉద్యోగం చేసుకుంటున్నాను.

మరి మీ కార్టూన్ పుస్తకాలెందుకు అచ్చేసుకోలేదన్న ప్రశ్నకి జవాబు చెబుతూ.. “నిజమే! ప్రెస్ కార్టూనిస్టులు రోజూ పత్రికల్లో కనిపిస్తారు కాబట్టి వేరే పుస్తకమనేది అవసరం లేదు. ఫ్రీలాంసర్లకి, హాబీ గా ఉన్నవాళ్ళకీ- పుస్తక రూపం లోకొస్తే గానీ ‘కార్టూనిస్టు’గా గుర్తించని అవస్థ ఉంది మనకి. నావి ప్రచురితమైన కార్టూన్లన్నీ భద్ర పరచలేక పోయాను. ఈ మధ్యే ఎందుకో మిత్రులు రాంపా గారు ‘ఏం ఫర్లేదు. గుర్తున్నన్ని ‘రీ డ్రా’ చేసి బుక్కు వెయ్యండి’ అన్నారు. అందుకే గత సంవత్సరం కార్టూన్ పుస్తకం ప్రచురించాను. ఈ దిశలో-సరైన టాలెంట్ ని ప్రోత్సహిస్తూ 64 కళలు ఎడిటర్ కళాసాగర్ చేస్తున్న ప్రయత్నమ్ ఎంతో ప్రశంశనీయం!” అన్నారు వర్చస్వి.

4 thoughts on “రవిశంకర్ గీతలు నన్నాకట్టుకున్నాయి-వర్చస్వి

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు.

seven − 5 =