విజయవంతంగా తెలుగు కార్టూన్ ప్రదర్శన

తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతికశాఖ, తెలంగాణ కార్టూనిస్టుల సంక్షేమ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో అయిదు రోజులపాటు ( ఏప్రిల్ 24 నుండి 28 వరకు ) రవీంద్రభారతి ప్రాంగణం కళాభవన్లోని ఐసిసి ఆర్ ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటుచేసిన ఉభయ తెలుగురాష్ట్రాల 144 మంది కార్టూనిస్టుల కార్టూన్లతోకూడిన ప్రదర్శన విజయవంతంగా ముగిసింది. కార్టూనిస్టుల వృత్తి కత్తిమీద సాము లాంటిదని, కానీ వారి వరిస్థితి గత రెండున్నర దశాబ్దాల క్రితం ఎలావుందో ఇప్పటికీ అలాగే ఉందన్న, వారి జీవితాల్లో మార్పురాలేదన్న విషయం నాకు తెలుసని, ప్రభుత్వం జర్నలిస్టులకు అందిస్తున్న సదుపాయాలను కార్టూనిస్టుల కు కూడా వర్తింపజేసేందుకు ముఖ్యమంత్రికి విన్నవించి సఫలీకృతమయ్యేందుకు తనవంతు కృషిచేస్తానని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు చైర్మన్ డా. కె.వి.రమణాచారి తెలిపారు. తెలంగాణ భాషా సాంస్కృతికశాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ సభాధ్యక్షతన జరిగిన ముగింపు సభలో డా. కె.వి.రమణా చారి ముఖ్య అతిథిగా, ప్రఖ్యాత కీళ్ళ శస్త్రచికిత్స నిపుణుడు డా. ఎ. వి.గురువారెడ్డి విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డా. కె.వి. రమణాచారి తదితర అతిథులతో కలసి  కార్టూనిస్టులకు ఆత్మీయ సత్కారం చేశారు. అనంతరం రమణాచారి మాట్లాడుతూ తెలుగు కార్టూనిస్టులు ఈ ప్రదర్శనను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటుచేసే మరింత ఎక్కువమంది స్ఫూర్తిని పొందే అవకాశముందని, అందుకు భాషా సాంస్కృతికశాఖ తగిన సహకారమందించేలా చూస్తామని తెలిపారు. ఈ సంక్షేమ సంఘానికి తనవంతు సహకారంగా 25 వేల రూపాయలు తన వ్యక్తిగత పెన్షన్ నుండి ఇస్తున్నట్లు రమణాచారి ప్రకటించారు.

మామిడి హరికృష్ణ అధ్యక్షోపన్యాసంలో తెలంగాణ ప్రభుత్వం కార్టూనిస్టులకు అన్ని విధాలా సహకరిస్తుందని, ప్రపంచ తెలుగు మహాసభల్లో కార్టూనిస్టులకు ఒక అరుదైన ముద్రకనిపించాలని, తమదైన గీతలు, రాతలు కనిపించాలన్న లక్ష్యంతో ప్రదర్శనలు ఏర్పాటు చేయడం జరిగిందని, అంతే కాకుండా అనేక సందర్బాల్లో వివిధ కార్టూనిస్టుల ప్రదర్శనలకు పూర్తి సహకారం అందించడం జరిగిందని, ఇకముందు కొనసాగిస్తామని భరోసానిచ్చారు. డా. ఎ.వి. గురువారెడ్డి మాట్లాడుతూ కార్టూన్లంటే తనకు చాలా ఇష్టం, అమితాశక్తి అని, కానీ ఆ కళ తనకి  అబ్బలేదని, బాపూ కార్టూన్లు ఎప్పటికీ గుర్తుకువస్తూనే ఎంతో ఆనందాన్ని, సందేశాలను పొందేవాడినని అన్నారు. కార్టూనిచ్చినంత పదునుగా, చతురతగా మరేదీ అందించదన్నారు. ఇవి విశ్వవాప్తంగా ఎంతో అవసరమని, ప్రతీఒక్కరూ ముందుగా చూసేది  కార్టూన్లేనని, పత్రికలకు గుర్తింపు తెచ్చినవీ కార్టూన్లే అన్నారు. కార్టూన్లు బతకాలి, కార్టూనిస్టులూ బతకాలని, నాకు ప్రభుత్వాలు అందించే సదుపాయాలు, ఆరోగ్యశ్రీలు తెలియవు నాకు ఆస్పత్రి ఉంది, కార్టూనిస్టుగా సంమంలో రిజిస్టరైన కార్టూనిస్టుల పేర్లు వ్రాసిస్తే వారికి ప్రివిలేజ్, సేఫ్-ఎమర్జెన్సీ కార్డులు ఉచితంగా ఇస్తానని, మీ ఏకారణం చేతనైనా ఆస్పత్రిలో అడ్మిట్ అయితే ప్రివిలేజ్, పర్సనల్ ట్రీటిమెంట్ ఇచ్చే బాధ్యత నాదని, సహకారంగా సంఘానికి  25 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ కార్టూనిస్టుల సంక్షేమ సంఘం తరపున ఈ ప్రదర్శన మూడు ఉత్తమ కార్తూన్లను ఎంపిక చేసి ఒక్కోక్కరికి 1500 రుపాయలు చప్పున కార్టూనిస్ట్ అట్లూరి, మోహన్ కుమార్, శివ లకు బహూకరించగా, డా. ఎ.వి. గురువారెడ్డి గారు 10 మంది కార్టూనిస్టులకు ఒక్కోక్కరికి 2000 రుపాయలు అందించి ప్రోత్సాహించారు.

1 thought on “విజయవంతంగా తెలుగు కార్టూన్ ప్రదర్శన

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు.

twenty − 3 =