కళాప్రపూర్ణ మిక్కిలినేని 103 వ జయంతి

స్వాతంత్ర సమరయోధునిగ,  ప్రజాకళాకారునిగ, రంగస్థలనటునిగ, సినీనటునిగ, కళా సాంస్కృతి చరిత్రల గ్రంథకర్తగా బహుపాత్రాభినయం చేసిన అసలు సిసలైన  కళాకారుడు “మిక్కిలినేని రాధాకృష్ణ”. సుమారు ఏడు దశాబ్దాల పాటు తెలుగు కళామతల్లి సేవలో తరించిన నిరాడంబరమూర్తి. నాటకరంగ ప్రతిభతో సినీరంగ ప్రవేశం చేసి దాదాపు 400 సినిమాలలో నటించిన ఆయన ఎక్కడా “సినీనటునిగా పరిచయం చేసుకోలేదు. తన మాతృక అయిన నాటకరంగ కళాకారునిగానే పరిచయం చేసుకున్న కృతజ్ఞతాశీలి మిక్కిలినేని రాధాకృష్ణ.

జులై 1,1916 గుంటూరు సమీపంలోని లింగాయపాలెంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన రాధాకృష్ణ కృష్ణాజిల్లా “కోలవెన్ను”లో పెరిగారు. 15ఏళ్ల చిన్న వయస్సులోనే నాటి స్వాతంత్ర్య సమరవేళ గాంధీజీ పిలుపునందుకుని ఉద్యమవాకిలి తొక్కిన ఆయన బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగ కాంగ్రెస్ పార్టీ సేవకునిగ విదేశీ వస్త్రాలను తగలబెట్టడం, జాతీయ గీతాలను ఆలపించడం వంటి పనులు చేశారు. అనంతరం విప్లవ వీర కిశోరాలు భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ల త్యాగాల స్పూర్తితో మితవాద కాంగ్రెస్ కార్యకలాపాలకు సలాం కొట్టి 1838లో అభ్యుదయ ఉద్యమ గడప తొక్కారు. ఆనాటి స్వాతంత్ర్య సమరంలో అనేక అజ్ఞాతవాస కార్యకలాపాలకు, పత్రిక ప్రచురణలు పంపకాలకు మిక్కిలినేని సేవలు లెక్కలేనివిగా వుండేవి.

అలా అభ్యుదయ భావాలతో తనజీవనం సాగిస్తూ 1940లో కోలవెన్నులో గ్రామపంచాయితీ గుమాస్తాగా ఐదురూపాయల నెలజీతంతో పనిచేస్తూనే ప్రజాసేవలోను, కళారంగంలోను కృషిచేశారు. ఆయన భార్య ‘సీతారత్నం’కూడా కళాకారిణి, కళాభిమాని కావడం ఈయన కళాకృషికి పసిడికి పన్నీరు పూసిన చందం అయ్యింది.. స్వాతంత్ర్యానంతరం నిజాంకు వ్యతిరేకంగా సాగిన “తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటం’కు సంఘీభావంగా తయారయిన “ప్రజానాట్యమండలి”కి వ్యవస్థాపక సభ్యునిగ మిక్కిలినేని చేరి దాని వికాసానికి ఎనలేని కృషి చేశారు.

ప్రజానాట్యమండలిచే నిర్మించబడి నాటి తెలంగాణ సమాజాన్ని ఉర్రూతలూగించి ఉద్యమస్పూర్తిని పంచిన ‘మాభూమి’ నాటకంలో మిక్కిలినేని ప్రధాన భూమిక పోషించారు. తనతో పాటు తన భార్య సీతారత్నం కూడా ఇందులో నటించడం మరో విశేషం. ఈ మా భూమి నాటకాన్ని భార్యతో కలిసి దేశమంతట ప్రదర్శనలు ఇచ్చిన ప్రజారంజక కళాకారుడు మిక్కిలినేని. రాయలసీమ -విశాఖప్రాంతాల్లో కరువు వచ్చినప్పుడు వీధుల వెంట బుర్రకథలు చెబుతూ విరాళాలు సేకరించి కరువు బాధితులకు సహాయం చేసిన వితరణశీలి. ఆయన కేవలం తనొక్కడే కాక ప్రజానాట్యమండలి సభ్యుడిగరాష్ట్రవ్యాప్తంగ 18 శిక్షణాశిబిరాలు ఏర్పాటు చేసి వందలాది ప్రజానాట్యమండలి కళాకారులను తయారుచేశారు.

ప్రజానాట్యమండలి కార్యకలాప కళారూపాలైన బుర్రకథలు, జముకుల కథలు, వీధినాటకాలు తదితరాలలో రాధాకృష్ణ అనేక కళారూపాలను పోషించి ప్రజలను చైతన్యపర్చడమే గాక నాటి దుష్టపాలకుల నుండి ప్రజలకు మనోధైర్యం అందించారు. ముందడుగు, మా భూమీ నాటకాలతో పాటు సీతారామరాజు బుర్రకథ ఆయనకు అత్యంత పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చారు. నాటక రంగ కళాకారునిగ మిక్కిలినేని చేస్తున్న కృషి ఆయన ప్రతిభను గుర్తించిన నాటి సినీరంగం 1951లో ఆయన్ను ఆహ్వానించింది. 47ఏళ్లపాటు సినీపరిశ్రమలో పనిచేసిన రాధాకృష్ణసుమారు 400పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి అందరిచేత శభాష్ అనిపించుకున్నారు. అలనాటి అగ్రనటుడు యన్టీరామారావు సరసన వంద సినిమాల్లో భీష్ముడు, ధర్మరాజు, బలరాముడు, దుశ్శాసనుడు, జనకుడు లాంటి విశిష్టమైన పాత్రలు పోషించి ఆయా పాత్రలను చిరస్మరణీయం చేశారు.

అలా సాధారణ కళాకారునిగ రంగస్థల ప్రవేశం చేసిన రాధాకృష్ణస్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగి సినీపరిశ్రమకు చేరి వయసురీత్యా తన నటనాకృషికి కాస్త విరామం ఇచ్చిన తాను ఏ ఆశయంతో ఈ రంగంలోకి అడుగుపెట్టాడో అది పూర్తిగా నెరవేర్చాలని నిశ్చయించుకున్నారు. కళారంగానికి విశేషమైన కృషిచేసి ఒక వెలుగు వెలిగి దీవికేగిన ప్రతిభామూర్తుల కృషికాలగర్భం లో వారితో పాటే కల్సిపోవడం సమంజసం కాదని వారి ఆదర్శ కళాజీవనం భావితరాలకు ఆదర్శంగా తెలియపర్చాల్సిన బాధ్యతను గుర్తుచేసుకుని తన శేష జీవితంలో ఆ దిశగా తన కృషీసాగించారు. అందులో భాగంగా నూరేళ్ల తెలుగు నాటక రంగ చరిత్రను సుమారు వెయ్యి పేజీలతో ఒక ఉద్ధండ్రంగా వ్రాశారు. కాల గర్భంలో కలిసి పోయిన తొలి తరానికి చెందిన 400మంది కళాకారుల జీవనచిత్రాలను నటరత్నాలు” పేర ప్రచురించారు. తెలుగునాట జానపద కళారూపాలకు చెందిన మరో వెయ్యి పేజీల గ్రంథం కూడా ఆయన వ్రాశారు. తన 40వ పుట్టినరోజు సందర్భంగా నటీనటులకు నా అభినయం, వెలుగులు విరజిమ్నీ నాటి-నేటి నాటక రంగం, విప్లవజ్వాలల ప్రజానాట్యమండలి, ఆంధ్రుల నృత్యకళావికాసం, అనే నాలుగు గ్రంథాలు వ్రాసి ప్రచురించారు. అంతేగాక 250 నటీనటుల ఛాయా చిత్రాలు, 200 జానపద కళారూపాల చిత్రాలు తయారుచేయించి తెలుగు విశ్వవిద్యాలయంకు సమర్పించారు. కళారంగానికి మిక్కిలినేని చేసిన సేవలకు గాను 1982లో ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ, గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఆయన రచనలకు తెలుగు భాషా సమితి, సాహిత్య అకాడమీ పురస్కారాలు సైతం అందాయి. అవిశ్రాంత కళా సైనికునిగ కీర్తిగాంచిన మిక్కిలినేని తన 65వ ఏట ఏకైక కుమారుడు డా. విజయకుమార్ వద్ద విజయవాడలో 2011 ఫిబ్రవరి 22న తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం అఖిలాంధ్ర లోకానికి తీరని లోటుగా మిగిలిన ఆయన అందించిన గ్రంథాలు, చేసిన కృషి ప్రతి కళాహృదయంలో సదానిలిచే వుంటాయి.

– అమ్మిన శ్రీనివాసరాజు

Leave a Reply

Your email address will not be published.

Share via
Copy link