
“కళావిద‌్య” ఒక విభిన‌్నమైన విద‌్యాభోదన. సైన‌్సు, మ‌్యాథ‌్సు లాంటి కొరకరాని సబ‌్జెక‌్టులతో విద‌్యార‌్థి మెదడు కొయ‌్యబారిపోయి, బాల‌్యదశ నుండే ఇంజనీరింగ్, మెడిసిన్, IIT, అని బలవంతపు బాధ‌్యతలను మోస‌్తున‌్న ఎన‌్నో పసి హృదయాల జీవితాలలో స‌్థభ‌్థత ఏర‌్పడకుండా, వాళ్ళ మనోఫలకం మీద నూతన వికాసాన్ని, వాళ్ళ నిర‌్మలమైన మనసు లో సృజనాత్మకతను తట‌్టిలేపడానికి దోహదపడుతుంది “కళా విద‌్య”. అలాంటి కళావిద‌్య కు నేడు సంబంధించిన దుస‌్థితి “రోకలి పోటు మీద పాము కాటు” లాంటిదే. అసలే కళావిద‌్య కు ఆదరణ అంతంత మాత్రమే, అందునా ప‌్రభుత‌్వ పాఠశాలల‌్లో కళా విద‌్య పరిస్థితి “మరణ శయ్యపైన ముదుసలి ప‌్రాణానికి తులసి తీర్ధపు” సేవనాన‌్ని తలపిస‌్తుంది.
ఎందరో విద్యార్థులు “కళ” నే తమ జీవితపు పంథాగ ఎంచుకుని ఇంజనీరింగ్, మెడిసిన్ అనే సాంప్రదాయ కోర‌్సులకు భిన‌్నంగ తమ జీవితపు అత‌్యంత విలువైన సమయాన్ని, ధనాన‌్ని కేటాయించి ఎంతో వ‌్యాయప‌్రాయాసలకోర‌్చి, నాలుగు సంవత్సరాల “ఫైన్ ఆర్ట్స్” విద‌్యను అభ‌్యసిస‌్తున‌్నారు. కొన్ని వందల మంది విద్యార్థులు ప‌్రతి సంవత్సరం ఉమ‌్మడి తెలుగు రాష‌్ర‌్టాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లోని JNAFU, HCU, SV FINE ARTS COLLEGE, పొట‌్టి శ‌్రీరాములు తెలుగు విశ‌్వవిద‌్యాలయం, ఆంధ్ర విశ్వవిద్యాలయం, యోగి వేమన విశ్వవిద్యాలయాల నుండి శిక‌్చణ పొంది “చిత‌్రకారులుగ” పట‌్టభద‌్రులై వస‌్తున‌్నారు. అలాంటి వారికి రాష్ట్ర ప్రభుత్వ పరం గా ఏమైనా ఉద‌్యోగాలు ఉన‌్నాయ? అంటే ఫలితం “శూన‌్యం”. సరే ఒక ప‌్రొఫెషనల్ చిత‌్రకారునిగి స‌్థిరపడిపొదాం అని అంటే ” కళామతల్లి సొగసు లు చూసి ఆనందించేవాళ‌్ళే కాని పట‌్టెడు మెతుకులు పెట‌్టేవారు లేరు”.
తాను చిత‌్రించిన చిత‌్రాల కోసం “ఫ‌్రేములు” కొన‌్న చిత్రకారునికి ఆ ఫ‌్రేములే మిగిలాయి, వాటిని అమ‌్మిన వారికి బంగ‌్లాలు మిగిలాయి. రంగులు, బ‌్రెష్ లు, క‌్యానవస్ లు కొన‌్న చిత‌్రకారునికి అదే క‌్యానవసు చిత్రాలను దాల‌్చి తన ఇంటి అటక మీద చేరితే, ఆ క‌్యానవసు, రంగులు అమ‌్మిన వారి ఇంటి మీద ఇంకో ఇల‌్లు వచ‌్చి చేరింది. ప‌్రపంచపు నాగరికతలలో కళాకారుల చేతుల్లో నిర‌్మితమైన నాగరికత మనది, ఏ ఊరి లో గుడి చూసిన, కోట చూసిన అవి కళాకారుల ఉలి దెబ‌్బల నుండి జారి పడినవే. అలాంటి ఉత‌్కృష‌్ఠ స‌్థితి నుండి, ప‌్రైవేటు పాఠశాలల‌్లో ఘోరమైన శ‌్రమ దోపిడికి గురి ఐయే దీనస‌్థితికి దిగజారిపోయింది
నేటి చిత‌్రకారుల పరిస‌్థితి. చివరికి తాను నమ‌్ముకున‌్న “కళ”, తనకు కూడు పెట‌్టలేని స‌్థితికి కళావిహీనమై కూర‌్చుంది, అంతిమంగా ధగాపడ‌్డది, వంఛనకు గురి ఐనది జీవం లేని బొమ్మలు గీస‌్తున‌్న “చిత‌్రకారుడే” ఇది కాదనలేని “సత్యం”
1)రాష్ట్ర ప‌్రభుత‌్వం ఈ DSC లో ఎందుకు కళా విద‌్య మీద “సవతి తల‌్లి” ప‌్రేమ చూపిస్తుంది ?
2)అసలు ఎందుకు కళను అభ‌్యసించిన విద్యార్థులకు ఒక ఉపాధిని కల‌్పించడం లేదు ?
3) అసలు ప‌్రభుత‌్వానికి “ఆర‌్టు & క‌్రాఫ‌్టు” పోస‌్టులను ప‌్రభుత‌్వ ఉపాధ‌్యాయ పోస‌్టులుగా భర‌్తి చేసే ఆలోచన ఉందా? లేదా ?
4)పెద‌్ద పెద‌్ద విద‌్యా హక‌్కు చట‌్టాలుఘోషిస‌్తున‌్న కళా విద‌్య ప‌్రాముఖ‌్యతను ఎందుకని రాష్ట్ర ప్రభుత్వం నిర‌్లక‌్చం చేస‌్తుంది ?
5)ఈ DSC లో MUSIC & DANCE కి ఇచ‌్చిన ప‌్రాధాన‌్యత ఎందుకనీ ART & CRAFT కిఇవ‌్వట‌్లేదు ?
6) అసలు MUSIC & DANCE పోస‌్టులు ఇవ‌్వడంలో ఉద‌్ధేశం ఏమిటి ? ART & CRAFT పోస‌్టులు ఇవ‌్వకపోవడంలో ఉధ‌్దేశం ఏమిటి ?
7)న‌్యాయంగా ART & CRAFT కి కేటాయించిన పోస‌్టులను ఎందుకు SGT లకు హేతుబద‌్ధీకరించారు ? ఒక వేళ SGT పోస్టుల ను ఇతరులకు కేటాయిస‌్తే వాళ్ళు చేతులు కట‌్టుకొని మౌనంగా ఉంటారా ? రాష్ట్రాన్ని రావణ కాష‌్టం చయ‌్యరూ ?
8) గత 30 సంవత్సరాలు గా కళా విద‌్య రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో ఎలాంటి ఆధరణకు నోచుకోవడం లేదు. ఎందరో FINE ARTS విద్యార్థుల జీవితాలను నిష‌్కారణంగ నాశనం చేస‌్తున‌్నారు, కళ ను వాళ్ళ జీవిత విధానం గా ఎంచుకోవడమేనా వాళ్ళు చేసిన “నేరం”? అలాంటప‌్పుడు ఎందుకనీ విశ‌్వవిద‌్యాలయాల‌్లో FINE ARTS కోర‌్సులను నడుపుతున‌్నారు? ఏం ప‌్రయోజనం ఉంది అని? ఉమ‌్మడి తెలుగు రాష‌్ర‌్టాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లలో ఉన‌్న మొత్తం FINE ARTS డిపార్ట్మెంటులను “శాశ్వతంగా” మూయించండి. అప‌్పుడు ఏకంగా కళ కు, కళా విద‌్య కు “శాశ్వతంగా తిలోదకాలిచ్చి”న వాళ్ళవుతారు.
FINE ARTS చేసిన ఎందరో నిరుపేద, మధ‌్య తరగతి విద్యార్థుల జీవితాలకు ఒక “ఆధారం” ఉండాలంటే ఈ DSC లో ఆర‌్టు టీచర్ పోస్టులను పోరాడి సాధించుకోవలసిన బాధ‌్యత ప‌్రతి కళాకారుని మీద, కళా ఉపాధ్యాయుల మీద తప‌్పక ఉంది. లేదా “కళ మనిషి ఆత‌్మకు పట‌్టిన బూజును ధులపడానికి గొప్పగ ఉపకరిస్తుంది” అని అంటారు ప‌్రఖ‌్యాత చిత‌్రకారడు “పికాసో”, అదే “కళ” చిత‌్రకారులు తాము చిత‌్రించిన చిత‌్రాలకు పట‌్టిన బూజును ధులపడానికి మాత్రమే “పనికివస్తుంది”.
-శ‌్రీరామ్, 9704135487
Good article.