తానా నవలల పోటీ ఫలితాలు
తెలుగు నవలా సాహిత్యానికి పునర్వైభవం తీసుకురావాలన్న ఆకాంక్షతో 1997 లో లాస్ ఏంజెల్స్ నగరంలో జరిగిన తానా మహాసభల సందర్భంగా, ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మొదటిసారిగా నవలల పోటీ నిర్వహించింది. ఆ మొదటి పోటీలో చంద్రలత రచించిన రేగడి విత్తులు నవల 1,30,000 రూపాయల ఏకైక బహుమతిని గెల్చుకొంది. అప్పటినుంచి 2007 వరకు తానా నవలల, కథల పోటీని నిర్వహించింది. తిరిగి 2017లో నిర్వహించిన పోటీలో బహుమతులు పంచుకున్న మూడు నవలలు- శప్తభూమి, నీల, ఒంటరీ- పాఠకుల అభిమానాన్ని ఎంతగానో చూరగొన్నాయి. 2019 జులై 4, 5, 6 తేదీలలో వాషింగ్టన్ డి.సి. నగరంలో 22వ మహాసభలు జరుపుకొంటున్న సందర్భంగా తానా రెండు లక్షల రూపాయలు బహుమతి మొత్తంగా నవలల పోటీని ప్రకటించింది. కథాసాహితి సహకారంతో నిర్వహించిన ఈ పోటీకి దేశంలోని అనేక ప్రాంతాల నుంచి, అమెరికా నుంచి 58 నవలలు పోటీకి వచ్చాయి. ప్రాధమిక వడపోత అనంతరం మిగిలిన నవలలను ప్రముఖ రచయితలు అంపశయ్య నవీన్, కాత్యాయనీ విద్మహే న్యాయనిర్ణేతలుగా పరిశీలించారు. వారి ఏకగ్రీవ నిర్ణయం మేరకు నాలుగు నవలలను అంతిమ పరిశీలనకు అమెరికాలోని తానా ప్రచురణల కమిటీకి పంపడం జరిగింది. తానా పూర్వ అధ్యక్షులు, ఈ పోటీ నిర్వాహకులు డా. జంపాల చౌదరి, తానా ప్రచురణల కమిటీ ఛైర్ పర్సన్ చంద్ర కన్నెగంటి, రచయితలు తాడికొండ శివకుమారశర్మ, అనిల్ ఎస్. రాయల్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ మొత్తం పోటీ నిర్వహణలో న్యాయనిర్ణేతలకు రచయితల పేర్లు తెలియజేయకుండా కేవలం కోడ్ నెంబర్ల ద్వారా మాత్రమే నవలలను అందజేయడం జరిగింది. ఈ తానా నవలల పోటీలో ‘కొండపొలం’ – సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి నవల రెండు లక్షల రూపాయల బహుమతి పొందింది. తెలుగు నవలకు ఇంతవరకూ ఇంత పెద్ద మొత్తాన్ని బహుమతిగా ఎవరూ ఇవ్వలేదు. బహుమతి మొత్తాన్ని రచయితకు తానా త్వరలో అందజేయడంతో పాటు నవలను ప్రచురించనుంది.
సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి సాహిత్య విశేషాలు…
1963 ఫిబ్రవరి 16న కడప జిల్లా, బాలరాజుపల్లెలో పుట్టిన సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి జీవితమంతా ఆ పల్లెతోనే ముడిపడింది. ఒకవైపు ఉపాధ్యాయవృత్తిలో పిల్లలకు పాఠాలు చెబుతూనే, బాలరాజుపల్లె నుండి నిరంతర సాహితీ వ్యవసాయం కొనసాగిస్తున్నారు. ఎనిమిది నవలలు, మూడు కధాసంపుటాలు, ఒక కవితాసంపుటితో తన సాహితీసంపదను సృష్టించుకున్నారు. 2017లో తానా నిర్వహించిన నవలల పోటీలో వీరి నవల ‘ఒంటరి’కి బహుమతి లభించి, బహుళ ప్రజాదరణ పొందింది. మొదటి నవల ‘కాడి’ (1998)కి, ‘తోలుబొమ్మలాట’ (2007)కి ఆటా పురస్కారాలు లభించాయి. 2007లోనే రాసిన మరో నవల ‘చినుకుల సవ్వడి’కి చతుర పత్రిక నిర్వహించిన నవలల పోటీలో ప్రథమ బహుమతి లభించింది. “పాలెగత్తె’, ‘పాండవబీడు’ నవలలు స్వాతి పత్రికల బహుమతులు, ‘ఒక్క వాన చాలు’ నవల నవ్య వారపత్రిక బహుమతి గెల్చుకున్నాయి. ‘కొత్త దుప్పటి’, ‘బతుకు సేద్యం’, ‘సన్నపురెడ్డి కథలు’ వీరి కథల సంపుటాలు. 75 పైగా కథలు రాశారు. వివిధ ప్రతిష్టాకర కథల సంకలనాలలో వీరి కథలు చోటు చేసుకున్నాయి. అనేక కథలు ఇతర భాషలలోకి అనువాదమయ్యాయి. ‘పంపకాలు’ కథ నాటికగా రూపొంది అనేక ప్రదర్శనలు పొందింది, బహుమతులు పొందింది.
బహుమతి గెలుచుకొన్న రచయితకు మా అభినందనలు.