కొండవీటి వేంకటకవి జన్మించి నూరు సంవత్సరాలు పూర్తయ్యాయి. శ్రీ త్రిపురనేని రామస్వామి చౌదరి ప్రారంభించిన సామాజిక విప్లవ కర్తవ్యాన్ని అందిపుచ్చుకొని ఆ దిశలో కృషి చేపట్టిన మహామనిషి వేంకటకవి. త్రిపురనేని దార్శనికతను పదింతలు ఇనుమడింపజేసి హేతువాద దృక్పధానికి పట్టం కట్టిన వేంకటకవి సాహితీ కృషి తెలుగు ప్రజానీకం మన్ననలను అందుకున్నది.
శ్రీ వేంకటకవి చిరుప్రాయంలో ఆశు కవిగా తదుపరి అవధానిగా, వక్తగా, ఉపాధ్యాయునిగా, కవిగా, భాష్యకర్తగా, సినీరచయితగా, పత్రికా వ్యాసకర్తగా సంఘ సంస్కరణాభిలాషను కడదాకా ప్రచారం చేశారు. ఆయన కవితకు జీవధాతువులు సామ్యవాదం, మతమౌఢ్య నిరసన, హేతువాదం, మానవతావాదం. వారి కవితా వస్తువులు పేదలు, సామాజికంగా వెలివేతకు గురైన బడుగులు, చిన్న రైతులు, కూలీలు, పీడితులు.
శ్రీ వేంకటకవి రైతు పక్షపాతిగా వారి కష్టాలను సాహితీకరించారు. స్వయంగా రైతు ఉద్యమ నాయకుడిగా, స్వాతంత్ర్య సమరయోధునిగా, గాంధేయవాదిగా సుప్రసిద్ధులు. ‘కర్షక’, ‘దివ్యస్కృతులు’, ‘త్రిశతి’, ‘నెహ్రూచరిత్ర’, ‘రాజర్షి, ‘మేలుకొలుపు’, ‘సూరిశతకము’ వంటి పద్య-గద్య కావ్యాల సృజన వీరి సొంతం. పరవస్తు చిన్నయసూరి శబ్దలక్షణ సంగ్రహము, దార్ల సుందరమ్మ భావలింగ శతకం, తురగా వేంకటకవి కీర్తిమాలినీ పరిణయము వంటి పురాతన గ్రంధాలను వెలుగులోకి తెచ్చిన కార్యశూరులు.
శ్రీ వేంకటకవి సామాజిక దృక్పథానికి, భాషా చతురతకు అద్దంపట్టిన “దానవీరశూరకర్ణ’, ‘శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహేంద్రస్వామి చరిత్ర’, ‘తాండ్ర పాపారాయుడు’ వంటి చలన చిత్రాలు చరిత్ర సృష్టించాయి. పత్రికా రచయితగా సమాజాన్ని తట్టిలేపి ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు.
శ్రీ వేంకటకవి పుట్టి పెరిగి, సాహిత్య కృషికి భూమికగా నిలిచిన గుంటూరులో ఆయన శతజయంతిని ఏప్రిల్ 3,2019 న నిర్వహించనున్నారు. ఈ సభలో సాహితీవేత్తలు, రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొని కవిగారి సాహిత్య సంకలనాలను ఆవిష్కరిస్తారు. ఈ సభలో కొండవీటి చిన్నయసూరి, మండలి బుద్దప్రసాద్, కత్తి పద్మారావు, పాపినేని శివశంకర్, కొత్తపల్లి రవిబాబు, రావెల సాంబశివరావు తదితరులు పాల్గొంటారు. ఇందులో సాహితి ప్రియులందరు భాగస్వాములు కావాలని కోరుకుంటున్నారు.
వివరాలకు కవిరాజు శతజయంతి సభ కన్వీనర్ – నెం. 9490098906.