అమర కళాకారునికి అక్షర నీరాజనం– “దామెర్ల కళావారసత్వం ”

రాజమండ్రి చిత్రకళా నికేతన్ రజతోత్సవాలముగింపు సందర్భంగా దామెర్ల రామారావు విగ్రహావిష్కరణకు పూనుకుంటున్న నేపధ్యంలో ప్రముఖ కవి రచయిత చిత్రకారుడు మరియు కళావిమర్శకుడు అయిన మాకినీడి సూర్యభాస్కర్ గారి కలం నుండి 70వ రచనగా వెలువడిన గ్రంధం “దామెర్ల కళా వారసత్వం”
తన 55వ ఏడాదికే చిన్న పెద్ద అన్ని కలిపి 70 గ్రంధాలను రచించారు అంటేనే తెలుస్తుంది రచనా రంగంలో మాకినీడి గారి స్థానమేమిటో

ఆధునిక ఆంధ్రచిత్రకళకు ఆధ్యుడైన స్వర్గీయ దామెర్ల రామారావు జీవితం గురించి అప్పుడప్పుడు పత్రికలలో వొచ్చిన కొన్ని వ్యాసాలకు తోడు అదనంగా మాదేటి రాజాజీ, సుంకరచలపతి రావు లాంటి వారు వెలువరించిన రెండు మూడు గ్రంధాలు తప్ప పరిమితమైన అతని జీవితంలోనే అపరిమితంగా అతడు చేసిన కృషికి తగిన స్థాయిలో రచనలు రాలేదనే చెప్పవచ్చు,అయితే ఎన్ని వొచ్చినా ఒక గొప్ప వ్యక్తి యొక్క జీవితాన్ని ఆవిష్కరించేటప్పుడు కేవలం సంఘటనలను యదాతదంగా వెలువరించడం ఒక ఎత్తైతే ఆ సంఘటనల వెనుక గల మూలాలను, చారిత్రక నేపధ్యాన్ని కుడా ఆవిష్కరించడం మరో ఎత్తు.మొదటి విదానం లో కేవలం కథ మాత్రమే వుంటే రెండవదానిలో ఆ కథ కి గల కారణాలు కూడా వుంటాయి అందుకే మొదటి విదానంకంటే రెండవ పద్ధతి గొప్పది. అయితే ఈ విధానం లో రచన చేయాలంటే ఎంచుకున్న విషయం పట్ల ముందు రచయితకు గొప్ప తపన, ఆసక్తులు కావాలి అప్పుడే ఈ కోణంలో గ్రంధ ఆవిష్కరణ సాగుతుంది. మాకినీడి గారికి ఇవన్ని వున్నాయి గనుకనే ఈ గ్రంధము గతంలో వొచ్చిన వాటికంటే కాస్త భిన్నంగా అంటే కేవలం దామెర్ల రామారావు జీవితం- కళావిశేషాలే గాకుండా అప్పటి కళా సాంస్కృతిక సామాజిక రాజకీయ నేపధ్యాన్ని చారిత్రక కోణంలో చేసిన విశ్లేషణను అదనంగా మనము ఈ రచనలో చూడ గలుగుతాము.రామారావు జీవితము కళ పరిణామ విషయాలను (16)అధ్యాయాలుగా విభజించి రాసిన ప్రతి అంశములోను ఈ విదమైన కోణాన్నిఆవిష్కరించడానికి రచయిత చేసే ప్రయత్నం ఈ గ్రంధంలో మనకు కనిపిస్తుంది.

దామెర్ల రామారావు చిత్రకళా రంగ నేపధ్యం గురించి వివరిస్తూ మధ్యయుగాలవరకు రేఖాయమానంగా సాగిన చిత్రకళ ,పారిశ్రామిక యుగంలో కలిగిన పునరుజ్జీవనం పలితంగా పాశ్చాత్య కళల్లో పెరిగిన వర్ణ సౌందర్యం చిత్రకళను వాస్తవికతకు దగ్గరయ్యేలా చేసింది గాని ప్రాచ్య చిత్రకళనందు వుండే అపూర్వ వ్వ్యంజనకు దూరమై పూర్తిగా కృతకంగా మారిందని చక్కటి విశ్లేషణ చేస్తారు.

ఒకపక్క బొంబాయి నందు బ్రటిష్ వారు స్థాపించిన జేజే స్కూల్ అఫ్ ఆర్ట్ పాశ్చాత్య విధానాన్నికొనసాగిస్తున్న తరుణంలో స్వాతంత్రపోరాటము ముమ్మరమైన 19వ శతాబ్దపు తొలి దశాబ్దాలలో దేశంలో అన్నింటా స్వదేశీ పై మమకారాన్ని రేకెత్తించడంలో బాగంగా ఉత్తరాదిన బెంగాల్ నందు అవనీంద్రటాగూర్ , గగనేంద్ర టాగూర్లు భారతీయమైన అజంతా చిత్రకళ ఆధారంగా స్వదేశీ రీతి చిత్రకళను రవీంద్రుని శాంతినికేతన్ లోను దక్షిణాదిన బందర్లో స్థాపించిన జాతీయ కళాశాల నందు వ్యాప్తి చేసే ప్రయత్నాలు జరుగుతుంటే తమిళనాట మద్రాస్ లో ఇటు ప్రాచ్య అటు పాశ్చాత్య రీతుల సమన్వయంతో సాగిన విద్య చిత్రకళను ఒక మలుపు తిప్పినట్లుగా పేర్కొంటారు .పై మూడు స్కూళ్ళ ప్రభావంతో ఆధునిక ఆంద్ర చిత్రకళా వ్యాప్తి లో బాగంగా రాజమండ్రిలో ప్రారంబించబడిన చిత్ర కళాశాల స్తాపనకు ఆధారభూతంగా నిలిచిన దామెర్ల జీవితం నందలి చక్కటి చారిత్రక కోణాన్నిమరెంతో చక్కగా ఆవిష్కరిస్తారు ఈ గ్రంధంలో రచయిత మాకినీడి.

ఇక దామెర్లవంశం మూలాలు, జీవిత విషయాలు వల్లించడంలోను, అతనికి చిత్రకళ మీద తొలుత ఆసక్తి కలిగించిన విషయాలు తధనంతర పరిణామాల్లోనూ కుడా కేవలం కధలా విషయాలను వల్లించడం గాకుండా వాటికి గల నేపధ్యాన్ని,కార్యాకారణాలతో విమర్శనాత్మక దృష్టితోతెలియజేస్తారు, అస్పష్టమైన ఆధారాల విషయాలలో వివేచనతో కూడిన తర్కంతో కూడిన వివరణలతో దామెర్ల జీవితము కళా విషయాలు వర్నించిన తీరు నిజంగా అద్భుతమని చెప్పవచ్చు. అందుకు ఉదాహరణగా దామెర్ల వంశీయుల అసలు ప్రాంతానికి సంభందించి వివిధ సంఘటనలను ఉటంకిస్తూ చక్కటి హేతుబద్దమైన విశ్లేషనను చేస్తారు. అంతే గాకుండా గతంలో వెలువడిన గ్రంధాలలో కనపడని దామెర్లవంశానికి చెందిన కొందరి మూలపురుషుల చిత్రాలను సందర్భానుసారం గ్రంధంలో ఉండేలా చేయడం మరొక ప్రత్యేకత

రామారావు ని తొలుత చిత్రకళలో ప్రభావితం చేసినవ్యక్తి తన మేనమామ డ్రాయింగ్ టీచర్ గాడిచర్ల సత్యనారాయణ తో పాటు నాడు హిందూ తియోట్రీకాల్ డ్రామా కంపనీ వారు ప్రదర్శించే నాటక తెరల రూపకల్పనకు బెంగుళూరు నుండి తీసుకువచ్చిన నెల్లూరుకు చెందిన తెలుగు వాడయిన ఏ.యస్. రాం ఆనాడు రామారావు తో పాటు రాజమండ్రి ఏరియా లో గల నాటి యువతను తన కళా విశేషంతో ఎంతలా ప్రభావితం చేసాడో చెప్పడమే గాక నాడు ఫోటో రియలిజంలో అతడు వేస్తున్న చిత్రాలవల్ల అతనిచే ప్రభావితమైన నాటి యువతను ఫోటోలకు నకల్లు తీయడం లాంటిదే చిత్రకళ అనే బ్రాంతికి గురి చేసి వారిలో సృజనాత్మకత లోపించేలా చేసినాడనే నాటి కవికొండలరావు లాంటి కొందరి మేధావుల విమర్శనా వ్యాఖ్యలను కుడా ఉటంకించడం ద్వారా నాటి అసలు సిసలైన వాస్తవికతను మనకు తెలియజేస్తా.
సరిగ్గా ఇదే సమయంలో 1909 లో రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ గా సంగీత, సాహిత్య, చిత్ర లేఖనాది కళల్లో గొప్ప ప్రావీన్యుడైన మానవతావాది ఆస్వాల్డ్ జేన్నింగ్స్ కూల్డ్రే రావడంతో రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చిత్రకళాసక్తులైన యువతలో కలిగిన గొప్ప మార్పును ఎంతో చక్కగా వివరిస్తారు రచయిత మాకినీడి ఈ గ్రంధంలో.
భారతీయ కళల పట్ల అపరిమిత అభిమానంతో వాటిని అధ్యయనం చేసిన కూల్డ్రే భారతీయ కళల్లో తమదే అయిన గొప్ప సృజనాత్మకత కళా కౌశలాలు మెండుగా వున్నాయని ఇక్కడి చిత్ర శిల్ప కళలు సృజన శీలకంగాను సంవిదానపరంగాను ఎంతో గొప్పవని చెబుతూ ప్రాచీన భారతీయ శిల్పులు అత్యుత్తమ కళాకారులని ప్రశంశించేవారు అయినప్పటికీ నేటి 19,20 శతాభ్దాల కళాకారుడు ప్రపంచకళతో పోటీ పడాలంటే ఇంకా ఎంతో మార్పు రావల్సివుందని చెబుతూ తన అభిప్రాయానికి తగ్గట్టు నాడు చిత్రకళాసక్తులైన యువతలో పాశ్చాత్య కళామౌలిక అంశాల పట్ల అవగాహన కూర్చి వారిని త్రిమితీయ ప్రకృతి చిత్రణ రీతిలోకి మార్చారు అని చెప్తారు.

కూల్డ్రే తన శిష్య బృందంలో ముఖ్యులైన రామారావు ను ఒక్కోసారి రాం,రాము.రామం అని, అడవి బాపిరాజు “బాపి “అని కవికొండల వెంకటరావును” కవి,కవికొండల, అని ఇలా రక రకాల పేర్లతో ముద్దుగా పిలుస్తూ తాను యురోపీయుడైనప్పటికి తన శిష్యులలో భారతీయ ఆత్మకోల్పోకుండా వుండేవిదంగా ఆధునిక కళా రీతులను వల్లించిన రీతి పుస్తకంలో ఎన్నో ఉదాహరణలతో మనకు చూపిస్తారు రచయిత. ఒకనాడు రామారావు గుడ్డగొడుగును జత బూట్లతో పోలుస్తూ చిత్రించిన స్టిల్ లైఫ్ చిత్రాన్నివేసి కూల్డ్రే కి చూపించగా బూట్లకు బదులు దేశవాళీ కిర్రుచెప్పులను తాటాకు గొడుగును చిత్రించవలసిందిగా కూల్డ్రే సూచిస్తారు.ఈ విదమైన విమర్శే రామారావులో చిత్రకళలో దేశవాళి దృష్టిని ఏర్పడేలా చేసిందని చక్కటి విశ్లేషణ చేస్తారు రచయిత

ఆ తరువాత రామారావు తల్లిదండ్రులను వొప్పించి మరీ కూల్డ్రే రామారావు ను బొంబాయి నందలి జేజే స్కూల్ అఫ్ ఆర్ట్స్ కు పంపించడము అక్కడ రామారావు ప్రతిభకి ఆశ్చర్యచకితుడైన జేజే స్కూల్ డీన్ సిసిల్ బర్న్ ఎటువంటి పరీక్ష లేకుండానే సరాసరి మూడవ సంవత్సరం లో ప్రవేశం కల్పించడం, జేజే స్కూల్ నందలి విద్యాభ్యాసం ,అక్కడ రావాల్,బతేకా, హరివంశరాయ్ బచన్ మిత్రుల సావాసం భావనగర్ సంస్తానాదీషుల చిత్ర పటాలు గీయడం రవీంద్ర టాగూర్ ని కలిసి అక్కడికక్కడే వారి రూప చిత్రాన్ని గీసి ఈయడం ,1919లో సత్యవాణితో పరిణయము ,బార్య రూపాన్నే మోడల్ గా ఎన్నో చిత్రాలు సృజించడం 1920లో జేజే స్కూల్లో సర్వ ప్రధముడిగా ఉత్తీర్ణుడు కావడం ఆపై అదే కళాశాలలోను మరియు లక్నో స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్ లో వైస్ ప్రిన్సిపాల్ గా అవకాసం వొచ్చినప్పటికి మాతృభూమిలో చిత్రకళాభి వృద్దికి తోడ్పడాలనే ఉద్దేశ్యంతో దేశంనందలి పలు ప్రాంతాలు సందర్శించి వివిధ చిత్రకళా రీతులను పరిశీలించి చివరికి తను అధ్యయనం చేసిన పాశ్చాత్య శైలి నందలి వాస్తవికతను మన దేశీయ శైలి నందలి లావణ్యాన్ని మేళవించి ఒక నూతన శైలి ని సృష్టించి మన దేశీయ గ్రామీణ సామాజిక ఇతి వృత్తాలను వరుసగా చిత్రిస్తూ జాతీయ అంతర్జాతీయంగా రామారావు సాదించిన విజయాలు,1923లో తన తొలి గురువులైన కూల్డ్రే, ఏ యస్ రాంలు అధ్యక్ష ఉపాధ్యక్షులుగా తన జే జే స్కూల్ మిత్రులతో కలిసి ఆంధ్ర సొసైటీ ఫర్ ఇండియన్ ఆర్ట్ అనే సంస్థను స్థాపించి రాజమండ్రి లో తాను సృష్టించిన ఆధునిక ఆంద్ర చిత్రకళా వ్వ్యాప్తికి ఎంతలా కృషి చేసారో వివరిస్తారు.దామెర్ల బొంబాయి వదిలి రాజమండ్రి వచ్చి చివరి మూడేళ్ళలో సృష్టించిన అజరామరమైన తన కళాఖండాలలో ఒక్కొక్క దాని ప్రత్యేకతను వివరిస్తారు మరొక అధ్యాయంలో.

ఏ విషయాన్నైనా కేవలం సానుకూల ద్రుక్పదంతోమాత్రమే వివరిస్తే అందులో పరిపూర్ణత్వం కనబడదు.దానిలో వ్యతిరేఖ కోణాన్ని కూడా ఆవిష్కరించినప్పుడే దానికి నిండుదనమనేది వస్తుంది,అందుచేతనే దామెర్ల రామారావు జీవితానికి సంభందించి ఆ కాలంలోను,తర్వాత కూడా వచ్చిన ఎన్నో ప్రశంసలతో పాటు ఎదురైన కొన్ని విమర్శలకు సంభందించిన విషయాలను కూడా ఈ గ్రంధంలోని ధన్యుడు –మార్ధన్యుడు దామెర్ల అన్న చాప్టర్ లో పేర్కొన్నారు ,ఇందుకు ఉదాహరణగా తనకు ఎంతో గొప్ప ప్రియ శిష్యుడైనప్పటికి తైల వర్ణ రూప చిత్ర రచనల విషయమై చామకూర్ల భాష్యంకార్లతో పోలుస్తూ ఒకానొక సందర్భంలో కూల్ద్రే దామేర్లపై చేసిన విమర్శతో పాటు నాడు వొచ్చిన మరికొన్ని విమర్శలకు రాజాజీ గారు తన సిద్ధహస్తుడు దామెర్ల అన్న గ్రంధంలో దీటుగా చెప్పిన వివరణలను కూడా రచయిత ఈ గ్రంధంలో పేర్కొనడంద్వారా చక్కటి సమతుల్యతను సమగ్రతను తీసుకువచ్చినట్లయింది .

ఇంకా దామెర్ల గురించి సమగ్రంగా వివరించే నిమిత్తం ఆనాడు అతని గొప్పతనము గురించి వివిధ కవులు రాసిన పద్యాలు పాటలను “సిరా చిత్రాలు “అన్నఅధ్యాయంలోను, రామారావు పేరున వెలసిన చిత్రకళాశాల ద్వారా వొచ్చిన చిత్రకారుల వివరాలను” దామెర్ల ఆర్ట్ స్కూల్–విద్యార్ధులు” అనే పేరా లోను చివరగా అతని జీవిత విశేషాల వివరాలను “టైం లైన్” అన్న ఒక పేరాలో వరుసక్రమంలో వివరించడంతో గ్రంధం ముగిస్తుంది .

28ఏండ్లు కూడా పూర్తిగా జీవించకుండానే అజరామరమైన తన కృషి ద్వారా ఆధునిక ఆంధ్ర చిత్రకళకు ఆద్యుడైన దామెర్ల రామారావు మరికొంత కాలమైనా జీవించివుంటే మన ఆంద్ర చిత్ర కళ మరెంత గొప్ప స్థాయిలో ఉండేదో,కాని ఆయన అకాల మరణం పొందడం మన దురద్రుష్టం ,కాదు కాదు జాతి చేసుకున్న దురద్రుష్టం .అందుకే తన గురువైన కుల్ద్రే చెప్పినట్లు రామారావు అకాల మరణంతో భారతీయ చిత్రకళ చాలా కోల్పోయింది. ఇంతటి మహనీయుని జీవన చిత్రాన్నితన రచన ద్వార ఎంతో గొప్పగా ఆవిష్కరించిన మాకినీడి గారి కృషి నిజంగా ఎంతో గొప్పది.పుస్తకంలో ముద్రించిన దామెర్ల చిత్రాల్లో కొన్నైనా రంగుల్లో ముద్రించి వుంటే ఇంకా బాగుండేది.ఏది ఏమైనప్పటికీ రాజమండ్రి చిత్ర కళా నికేతన్ వారు తమ రజతోత్సవ ముగింపు వేడుకల సందర్భాన దామెర్ల విగ్రహఆవిష్కరణతో పాటు ఆయన కళా విశేషాలను గుర్చిన ఒక మంచి గ్రంధం తీసుకురావడం గొప్ప విశేషం. 136 పేజీలు, 150 రూపాయల వెల గల ఈ గ్రంధంలో ప్రతి విషయం చిత్రకారులు, చిత్రకళాభిలాషులు తెలుసుకోదగినవే. విలువైన ఈ గ్రంధం కావాల్సిన వారు ఈక్రింది చిరునామా వారిని సంప్రదించవచ్చు.
— వెంటపల్లి సత్యనారాయణ

గ్రంధం పేరు – దామెర్ల కళ –వారసత్వం
రచయిత – మాకినీడి సూర్య భాస్కర్
చిరునామా – రాజమండ్రిచిత్రకళా నికేతన్,టౌన్ హాల్,రాజమండ్రి
సెల్ నంబర్ -9490877211

1 thought on “అమర కళాకారునికి అక్షర నీరాజనం– “దామెర్ల కళావారసత్వం ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap