గిడుగు రామమూర్తి (1863-1940) పేరు చెప్పగానే 20వ శతాబ్ది ప్రథమ పాదంలో వ్యావహారిక భాషావాదానికి ఉద్యమరూపం కల్పించి గ్రాంధిక భాషావాదుల పై విజయం సాధించిన ఒక భాషాయోధునిగా ఆయన్ని అందరూ పరిగణిస్తారు. దీనికి మించి ఆయన గొప్ప భాషా శాస్త్రవేత్త, పరిశోధకుడు, గ్రంథ పరిష్కర్త, శాసన పరిష్కర్త, పాఠ్యగ్రంథ రచయిత. సవర భాషకు వ్యాకరణం రచించి, సవరల జీవితచరిత్రను గ్రంథస్థం చేసినవాడు. సవరల అభివృద్ధికి కృషి చేసిన సంఘ సేవకుడు. ప్రజాస్వామికవాది, మానవతావాది.
జీవితకాలం తెలుగు భాషాభివృద్ధికి కృషి చేసిన గిడుగు రామమూర్తి పేరు మీద ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి రూ. 50,000ల నగదుతో కూడిన పురస్కారాన్ని అందజేయాలని తానా నిర్ణయించింది. తెలుగు భాషా వికాసానికి, అభ్యున్నతికి విశేషంగా కృషి సల్పిన ప్రముఖులను ఈ పురస్కారంతో గౌరవించాలని తానా ఆశయం. ఈ పురస్కారాలు 2002 డిసెంబర్ నుంచి ప్రకటిస్తోంది తానా. గతంలో ఈ పురస్కారాలను ప్రొ చేకూరి రామారావు (2002), ప్రొ. భద్రిరాజు కృష్ణమూర్తి (2004), సి. ధర్మారావు (2006), ఎబికె ప్రసాద్ (2008), స.వెం. రమేశ్ (2010), ప్రొ. పి.ఎస్. సుబ్రహ్మణ్యం (2012), ప్రొ. రవ్వా శ్రీహరి (2014), డా. సామల రమేష్ బాబు (2016) లకు అందజేసింది.
వాషింగ్టన్ డి.సి.లో 2019 జులై 4, 5, 6 తేదీలలో 22వ తానా మహాసభలు జరుగుతున్న సందర్భంగా ఈ పురస్కారాన్ని 2019 సంవత్సరానికి ప్రొ. గారపాటి ఉమామహేశ్వరరావుగారికి అందజేయాలని తానా ప్రకటించింది.
1952 నవంబర్ 30న జన్మించిన ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావుగారు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుంచి బయాలజీలో ఎమ్మెస్సీ చేసి, అనంతరం భాషాశాస్త్రం వైపు మళ్లారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి భాషాశాస్త్రంలో డిగ్రీని, అనువర్తిత భాషాశాస్త్రం (ఆప్ప్లిఎద్ ళింగుఇస్తిచ్స్) లో ఎం.ఎ. డిగ్రీని న్యూయార్క్లో ని స్టోనీ బ్రూక్ యూనివర్శిటీ నుంచి పూర్తిచేశారు. ఉస్మానియా యూనివర్శిటీ నుంచే చారిత్రక భాషాశాస్త్రంలో పిహెచ్.డి. పొందారు. ప్రముఖ భాషాశాస్త్రవేత్తలు ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి, ఆచార్య చేకూరి రామారావుల వద్ద భాషాశాస్త్రంలో శిష్యరికం చేశారు. మంగోలియన్, టర్కిక్ భాషాకుటుంబాలకు మూలమైన ఉమ్మడి వనరును జన్యు సంబంధమైన ప్రక్రియ ద్వారా పునర్నిర్మాణం చేయటంలో రెండు దశాబ్దాలు కృషి చేశారు. దాని ద్వారా తెలుగుభాష మూలాల పరిశోధనకి స్వీకారం చుట్టారు. భాషకు మానవీయ శాస్త్రాన్ని జోడించి, భాషాశాస్త్రానికి కొత్త కోణాన్ని అందించారు. అంతేకాక, తెలుగుభాషకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించటంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. కంప్యూటర్ సైన్స్, చారిత్రక భాషాశాస్త్రం వంటి రంగాలలో కొత్త ఆవిష్కరణలకు తెర తీశారు. హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయంలో పనిచేస్తూ, అనువర్తిత భాషాశాస్త్రం, అనువాద అధ్యయనాల కేంద్రానికి నిర్దేశకులుగా ఉన్నారు. తెలుగుభాషను కంప్యూటరీకరించటంలో వీరి పాత్ర ప్రముఖమైనది. తెలుగుభాష వికాసానికి ఉపయోగపడే సాఫ్ట్ వేర్ ను అభివృద్ధి చేశారు. ద్రావిడ మంగోల్ భాషల జన్యుసంబంధం, తెలుగు రాష్ట్రాలలో భాషాసంక్షోభం వంటి పుస్తకాలు రాయటం ద్వారా తెలుగుభాష నేడు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలకు పరిష్కారం చూపించటంలో అవిరామ కృషి చేస్తున్నారు. తెలుగు భాషా వికాసానికి కృషి చేస్తూ, తెలుగుభాషకు సాంకేతికతను జోడించే ప్రయత్నం చేస్తున్న శ్రీ గారపాటి ఉమా మహేశ్వరరావు గారికి శుభాకాంక్షలు.