గాలి అంకయ్యకు ‘చిత్రకళా రత్న అవార్డ్’

తమిళనాడు ఆర్ట్స్ – క్రాఫ్ట్స్ అసోసియేషన్, చెన్నై వారు 44వ వార్షిక చిత్రకళా ప్రదర్శన సందర్భంగా ‘చిత్రకళా రత్న అవార్డ్’ ను ఈ సంవత్సరం ముగ్గురు (ఎ. విశ్వం, జయరాజ్, గాలి అంకయ్య) చిత్రకారులకు ప్రకటించారు. వీరిలో గాలి అంకయ్య మన తెలుగు వారు. ఈ అవార్డ్ను జూలై 8 న చెన్నై లలితకళా అకాడెమిలో అందుకోనున్నారు. వారి జీవిత విశేషాలు….
నెల్లూరు నుంచి సినిమా రంగానికి…
గాలి అంకయ్య ఆయన కుంచె నుంచి జాలువారే చిత్రాలన్నీ ప్రకృతికి ప్రతిరూపాలే. కష్టించే రైతు, హోయలొలికే పల్లె పడుచు, చక్కటి జలపాతాలు, పచ్చటి బయల్లో పశువులు. ఇలా తను గీచే ప్రతి చిత్రం సహజంగా ప్రకృతి రమణీయంగా వుండాలని కోరుకుంటారు. చిత్రకారుడిగా కాకుండా, సినిమా పబ్లిసిటీ డిజైనర్ గా దక్షిణాది సినీ ప్రపంచంలో కీర్తి గడించిన చిత్రకారుడు గాలి అంకయ్య. వీరు నెల్లూరుకు సమీపంలో గల వేగూరులో వెంకటసుబ్బమ్మ-కోటయ్య దంపతులకు ఒక రైతుకుటుంబంలో 1955 జూన్ 21న జన్మించారు. చెర్లోపాలెం, కొవ్వూరులలో ప్రాధమిక విద్య, హైస్కూలు విద్య పూర్తి చేశారు. తర్వాత చిత్రకళపై మక్కువతో నెల్లూరులో ముని ఆర్టు వద్ద శిక్షణ పొంది, స్వతహాగా రూపచిత్రాలు, దేవతల చిత్రాలు గీసి కళాభిమానుల మొప్పు పొందారు. తర్వాత అన్న రామకృష్ణయ్య, అతని మిత్రుడు సుబ్బారెడ్డి ప్రోత్సాహంతో 1972తో చెన్నై చేరి ప్రముఖ చిత్రకారులు ఎ.ఎస్. మూర్తి, గంగాధర్ల వద్ద 1980 వరకు శిష్యరికం చేశారు. అదే సమయంలో సినీనిర్మాత, రచయిత మల్లెమాల కుమార్తె వివాహానికి, కళ్యాణవీణ అనే పుస్తకానికి చిత్రలేఖనం అందించి వారి సత్కారం అందు కొన్నారు. తెలుగులో ఆణిముత్యాలు అనతగ్గ దానవీరశూర కర్ణ, శంకరాభరణం, మెగాస్టార్ చిరంజీవి తొలి సినిమా ప్రాణంఖరీదు, యువరత్న బాలకృష్ణ తొలిసినిమా తాతమ్మకల, దాన వీర సూర కర్ణ లోగోలు గీసి పలువురి ప్రశంసలు అందుకొన్నారు. 1981 నుండి చిత్రకారుడు కడలి సురేష్తో కలిసి సింధూర్ ఆర్టు సంస్థను స్థాపించి అనేక చిత్రాలకు పబ్లిసిటీ, పలు పుస్తకాలకు ముఖ చిత్రాలు అందించారు. మహిళ, నీలిమ, నివేదిత, భరణిత, తదితర వార, మాస పత్రికల్లో కథలకు ఇలస్ట్రేషన్స్ చిత్రించారు. డబ్బింగ్ చిత్రాలను కలుపుకొని కుమారుడు పవన్ కుమార్ తో 500 పైగా పబ్లిసిటీ డిజైన్స్ చేశారు. 2005 నుండి ఫైన్ ఆర్టు వర్కు ప్రారంభించి పలు చిత్రకళా ప్రదర్శనల్లో పాల్గొని అనేక అవార్డుల్ని అందుకొన్నారు. పాలకొల్లు లయన్స్ క్లబ్ వీరిని లిపిశిల్పి అనే బిరుదుతో సత్కరించింది. ప్రస్తుతం వీరు చెన్నైలో సింధు గ్రాఫిక్స్ పేరుతో పబ్లిసిటీ డిజైనింగ్ సంస్థను కుమారుడు పవన్ తో కలిసి నిర్వహిస్తున్నారు.

-కళాసాగర్

1 thought on “గాలి అంకయ్యకు ‘చిత్రకళా రత్న అవార్డ్’

  1. శ్రీ గాలి వెంకయ్యగారికి శుభాకాంక్షలు.

Leave a Reply

Your email address will not be published.

Share via
Copy link