వినాయక చవితి సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండలో ఏర్పాటు చేసిన ఓ గణేషుడి విగ్రహం ప్రస్తుతం అందరి దృష్టినీ ఆకట్టుకుంటోంది. ఈ విగ్రహాన్ని నెమలి ఈకలతో రూపొందించడమే దీనికి కారణం. సుమారు తొమ్మిది అడుగుల ఎత్తు ఉన్న ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి నిర్వాహకులు ఏకంగా రెండు లక్షల నెమలి ఈకలను వినియోగించారు. ఇప్పటిదాకా ఇలాంటి విగ్రహం ఎక్కడా లేదట. దీనితో ఈ విగ్రహాన్ని గిన్నిస్ బుక్ లోకి ఎక్కించడానికి మండపం నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు. రొటీన్ కు భిన్నంగా.. నెమలి ఈకలతో విగ్రహానికి గణేషుడి విగ్రహ రూపాన్ని తీర్చిదిద్దడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందని చెబుతున్నారు. రెండునెలల పాటు 50 మందికి పైగా కళాకారులు కష్టపడ్డారని అన్నారు.
పాలకొండలోని కాపు వీధిలో ఈ మంటపాన్ని ఏర్పాటు చేశారు. ఏటేటా ఇదే వీధిలో వినాయకుడి విగ్రహాలను నెలకొల్పుతున్నారు స్థానికులు. ఈ సారి కాస్త భిన్నంగా ఆలోచించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్, మట్టి లేదా ఇతర వస్తువులు, పదార్థాలతో వినాయకుడి విగ్రహాన్ని తయారు చేయడం సర్వ సాధారణమేనని, వాటన్నింటికీ భిన్నంగా తాము ఆలోచించి దీనికి రూపకల్పన చేశామని వెల్లడించారు. నెమలి ఈకలతో తయారు చేయాలని నిర్ణయించుకున్న వెంటనే తాము స్థానిక కళాకారులను సంప్రదించామని, తమ ఆలోచనను వారితో పంచుకోగా.. అందుకు అంగీకరించినట్లు తెలిపారు. నెమలి ఈకలతో సేకరించడం కష్టతరమైనందని, దీనికోసం విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో విస్తృతంగా పర్యటించాల్సి వచ్చిందని చెప్పారు. తమ బంధు మిత్రులకు సమాచారం ఇచ్చి వారి నుంచి కూడా నెమలి ఈకలను సేకరించినట్లు నిర్వాహకులు వెల్లడించారు.
తమ కష్టానికి తగ్గ ఫలితం దక్కిందని మండప నిర్వాహకులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాము నెలకొల్పిన మండపాన్ని సందర్శించడానికి శ్రీకాకుళం నుంచే కాకుండా.. పొరుగు జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారని చెప్పారు. నెమలి ఈకలతో ఇంత భారీగా ఏ విగ్రహాన్ని కూడా రూపొందించిన సంఘటనలు ఎక్కడా లేవని, అందువల్లే తాము గిన్నిస్ బుక్ లోకి ఎక్కించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. దీనికోసం స్థానిక అధికార యంత్రాంగాన్ని సంప్రదించామని, వారి సహకారంతో గిన్నిస్ బుక్ ప్రతినిధులకు పూర్తి వివరాలను అందజేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. అయితే ఇంత మొత్తంలో నెమలి పింఛములను ఎలా సేకరించారని కొందరు వన్యప్రాణి ప్రేమికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
It is crime.