మూడున్నర దశాబ్దాల క్రితం కలం పట్టిన కార్టూనిస్ట్ గాలిశెట్టి. వీరి పూర్తి పేరు గాలిశెట్టి వేణుగోపాల్. పుట్టి పెరిగింది ఖమ్మం. తహశీల్దార్ గా పదవీవిరమణ చేసారు. ప్రస్తుతం పలు అంతర్జాతీయ కార్టూన్ పోటీల్లో గుర్తింపుపొందారు. ఈ నెల వీరి గురించి తెలుసుకొందాం.
నేను 8వ క్లాస్ చదువుతున్న సమయంలో మా ఖమ్మంలోని ఖమ్మం కళాపరిషత్ వారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి తెలుగు కార్టూనిస్టుల మహాసభ నిర్వహించడం జరిగింది. ఆ సందర్భంగా ఏర్పాటు చేయబడిన కార్టూన్ల ప్రదర్శన నన్నెతో ఆకట్టుకుంది. అది నేనూ ఓ కార్టూనిస్టుగా ఎదగాలనే తపనకు నాంది పలికింది. కాకపోతే, అందరు కార్టూనిస్టుల్లానే మొదట కార్టూన్లు ఏసైజులో వేయాలి, ఎలావేయాలి అనే విషయంలో అవగాహన లేకపోవడం. నాకు తోచిన రీతిన గీసి పంపిన కార్టూన్లు ఆయా పత్రికల నుండి తిరుగు టపాలో వెంటనే తిరిగి రావడం వంటివి చవిచూశాను.
కొంత కాలం తరువాత ప్రముఖ చిత్రకారుడు, కార్టూనిస్టు, సినిమా కళా దర్శకుడు ఐనటువంటి ‘చంద్ర’ గారు ఓ సినిమా షూటింగ్ కోసం ఖమ్మం రావడం, కాకతాళీయంగా ఆయనను కలవడం జరిగింది. కార్టూన్లు గీసే విషయంలో నాలో గల తపనను ఆయనకు వెళ్ళడించగా కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చారు. ఆ తరువాత ఆయన చెప్పిన ప్రకారం కార్టూను బొమ్మలు వేయడం ప్రాక్టీస్ చేశాను. ప్రాక్టీస్ అనంతరం మొదటగా 1982వ సం. లో వెంకట్ అవార్డు కార్టూన్ల పోటీలో పాల్గొనడం నా కార్టూనుకు మెరిట్ సర్టిఫికెట్ రావడం జరిగింది. తదుపరి కొన్విల్ హాస్యప్రియ పత్రిక ద్వారా వర్థమాన కార్టూనిస్టులకు ప్రముఖ కార్టూనిస్టు ఐనటువంటి జయదేవ్ గారు అందించిన సలహాలు సూచనలు నాకు బాగా ఉపకరించాయి. నేనూ ఓ కార్టునిస్టుగా గుర్తింపు పొందాను. ఆ విధంగా మొదలైన నా కార్టూనింగ్ మొదటి ప్రస్తానం 1994 వరకూ కొనసాగింది. అప్పట్లో ‘గోపాల్’ అనే పేరుతో నేను గీసిన కార్టూను వివిధ పత్రికల్లో చోటు చేసుకున్నాయి.
1982 సం.లో స్నేహ సాహితీసమాఖ్య, డోర్నకల్ వారు నిర్ణయించిన రాష్ట్రస్థాయి కార్టూన్ల పోటీలో నా కార్టూను తృతీయ బహుమతి సాధించింది. వివిధ పోటీలలో మెరిట్ సర్టిఫికెట్లు వచ్చాయి. అప్పట్లో గోపాల్ అనే కలం పేరుతో వివిధ పత్రికల్లో నా కార్టూన్లు ప్రచురించబడ్డాయి. 1994వ సం. తరువాత ఉద్యోరీత్యా పని వత్తిడి కారణంగా సుదీర్ఘకాలం నా కార్టూనింగ్ ప్రక్రియకు ఫుల్ స్టాప్ పెట్టక తప్పలేదు. ఉద్యోగ విరమణ అనంతరం గత జనవరి నుండి నా కార్టూనింగ్ ప్రక్రియ రెండవ ప్రస్థానం మా ఇంటి పేరైన ‘గాలిశెట్టి’ అనే కలం పేరుతో మొదలైంది.
రెండవ ప్రస్థానంలో ‘గోతెలుగు.కామ్, కౌముది.కామ్ మరియు తెలుగుతల్లి కెనడా పత్రిక అనే అంతర్జాల పత్రిక మరియు హాస్యానందం పత్రికలలో నా కార్టూన్లు ప్రచురించబడుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో బ్రెజిల్ కార్టూన్.కామ్ మరియు యానిమల్ కార్టూన్. ఇయూ లలో నా కార్టూన్లు స్థానం సాధించాయి. మరియు ఇంటర్ నేషనల్ కార్టూన్ ఎగ్జిబిషన్-2018 ఇండోనేషియా, 10వ ఆస్కార్ ఫెస్ట్ ఇంటర్ నేషనల్ కార్టూన్ ఎగ్జిబిషన్-2018, క్రొషియాలో నా కార్టూన్లు ప్రదర్శించబడ్డాయి.
– గాలిశెట్టి
నైస్ ఆర్టికల్ గాలిశెట్టి గారు అభినందనలు
అభినందనలు గాలిశెట్టి గారూ!
Congratulations