శ్రీ ముకుంద రామారావు గారి సాహిత్య కృషి విలక్షణమైంది. నోబెల్ గ్రహీతల అనువాదాలతో తెలుగు వారికి ప్రపంచ సాహిత్యాన్ని పరిచయం చేశారు. అందుకు తెలుగుజాతి ఋణపడి ఉందని భావిస్తాను.
ఈ సంకలనం ద్వారా పరిచయం చేస్తున్న ‘చర్యాపదాలు’ మనకి ఒకింత కొత్తవనే చెప్పాలి. బౌద్దులు చేసిన రహస్యపూజలో పాడే పాటలను చర్యాపదాలంటారని ఆయనే చెప్పారు. అలాగే చర్యా పదాల్ని పరిచయం చేస్తూ వ్రాసిన దాంట్లో, బౌద్ధ సైద్ధాంతిక, ఆధ్యాత్మిక, తాత్విక విషయాల్లో చాలా లోతులకు దిగి వాటిని పూర్తిగా అవగాహన చేసుకొని మనం అర్ధం చేసుకునేందుకు అవసరమైన ప్రాతిపదికను ఏర్పరచారు. వివిధ కాలాల్లో అవి వెలుగులోనికి వచ్చిన విధానాన్ని, చర్యాపదాల రచనా పద్ధతుల్ని, పరిశోధకుల దృక్పథాల్ని వివరించారు. ఈ క్రమంలో పండిత్ హరప్రసాదశాస్త్రి, రాహుల్ సాంకృత్యాయన్, డేనియల్ రైట్, సెసిల్ బెండల్ వంటి వారి కృషి మన కళ్ళ ముందు నిలిపారు. గ్రంథం చివర చర్యాపదాల రచయితలైన 24 మంది సిద్ధాచార్యుల వివరాలు, చర్యాగీతాలు ఆలపించిన రాగాలు, ఆయా కాలాల్లో వచ్చిన పారిభాషిక పదాలు పొందుపరిచారు.
ఈ గ్రంథం తెలుగుజాతికి ముకుందరామారావుగారు అందిస్తున్న గొప్ప బహుమానం. ఈ చర్యాపదాలను తెలుగువారికి పరిచయం చేయాలనే దృఢసంకల్పంతో శ్రీ ముకుంద రామారావు గారు పడిన శ్రమ వర్ణించడానికి వీలుకాదు. మిత్రులు శ్రీ ముకుంద రామారావు గారికి, వీరికి సహకరించిన శ్రీ ఉణుదుర్తి సుధాకర్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. పాఠకులు తప్పక ఆదరిస్తారని ఆశిస్తూ…
డా. డి. విజయభాస్కర్
good book.