(ఫిబ్రవరి 6 న దామెర్ల రామారావు వర్థంతి సందర్భంగా….)
ప్రకృతి కాంత చిగురుటాకు చీరకట్టి, చిరువిరులతో చామరాలు వీస్తూ వసంతకాల శోభను చల్లని గాలులతో ఇనుమడింపచేస్తుంది. ఈ మనోహర దృశ్యాలను వర్ణాలతో వర్ణించ గల కుంచే కరువయిన ఈ ఆంధ్రావనిలో ఆ లోటును తీర్చేందుకు ఏ పరలోక దివ్యాతో స్వల్ప వ్యవధికై ఇల అరుదెంచెను, దామెర్ల రామారావు రూపంలో….
1897వ సం. మార్చి 8వ తేదిన దామెర్ల రామారావు శ్రీ వెంకటరమణరావు, లక్ష్మీదేవి దంపతులకు రాజమహేంద్రవరంలో జన్మించారు.
శ్రీ గాడిచర్ల రామ్మూర్తి అందులోనూ చిత్రకాళా అధ్యాపకులు, రామారావుకి మేనమామ చేతుల మీదుగానే చిత్రకళలో ఓనమాలు దిద్దే భాగ్యం దక్కింది. ఆ తరువాత మేనమామ గారికి పదోన్నతి కలగడంతో ఆ స్థానంలోకి వచ్చిన వారు సుశిక్షుతులు కాకపోవటంతో సాధన మాత్రమే నడిచింది తప్ప నైపుణ్యాన్ని పెంపొందించలేకపోయారు. ప్రముఖ నాటకతెరల చిత్రకారుడు శ్రీరామ్ రాక రాజమండ్రికి వన్నె తెచ్చింది. ఈయన ఎందరో యువకుల్లో కళాతృష్ణ, జిజ్ఞాసను, అభినవేశాన్ని కలిగించాడు. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎందరో ఆయన వల్ల ప్రభావితులైనారు. ఇక మన బాలరాముని విషయం వేరే చెప్పనక్కరలేదు. చదువుపై శ్రద్ధ, ఆటలపై ఆసక్తి లేక ఎప్పుడు ఏవో బొమ్మలు గీస్తూ కూర్చునే రామారావును శ్రీరామ్ దగ్గరకు తీయడంతో బడి ఎగ్గొట్టి అతని చెంత చేరి ఉత్సుకతతో నిశితంగా ఆకళా సృష్టిని పరికిస్తూ తనూ అలా చిత్రరచన చేయాలని తపన పడుతూ ఉండే వాడు. అప్పటికి అతనికి 10సం.లు.
చిత్రకళకు ఆదరణ, కళాకారులకు గౌరవం కరువయిన రోజులవి. చిత్రం వెనుక చేవ్రాలు ఎవరిదో!! చెక్కిన శిల్పంపై చిందిన రక్తం ఎవరిదో? పట్టని రోజులవి.
రామారావు ఇంటా, బడిలో ఎప్పుడు చిత్రలేఖనమే. చూసిన చిత్రాన్నల్లా చిత్రించాలనే తపన. శిష్ట కుటుంబంలో పుట్టి ఈ పాడు పనులేమిటని తండ్రి, చదువులో ధ్యాసలేదని పాఠాలు చెప్పే పంతుళ్లు ఆగ్రహెూదగ్రులయ్యేవాళ్ళు. “అన్న, అక్కలు ఉన్నత విద్యను అభ్యసిస్తుంటే. నీకేం పాడు బుద్ధిరా? కొరగాని ఈ చిత్రలేఖనంతో మన వంశానికే అప్రదిష్ట తెచ్చేలా ఉన్నావు” వీరి తండ్రిగారు తిట్టి పోసేవారు.
1909న దక్షిణ భారతంలో ప్రప్రధమంగా స్థాపించిన ఏకైక విద్యాలయం గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజి. దీనికి ప్రధానాచార్యుడుగా ఆస్వాల్డ్ జెన్నింగ్స్ కూల్డో నియమితులయ్యారు.
1911 సం. కాలేజిలో చదువుతున్న దామెర్ల రామారావు అన్న వెంకటరావు-కూల్డ్రే దొరవారికి రామారావుని పరిచయం చేశారు. ప్రథమ సమాగమనంలోనే ముక్కుపచ్చలారని ఈ బాలుడు గొప్ప చిత్రకారుడై దామెర్ల వంశాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని పునీతం చేయగలడని ఊహించిన మహాద్రష్ట కూట్టే. రామారావు చిత్రకళానైపుణ్యాన్ని బిబ్బీస్జర్నల్, రాయల్ ఎకాడమీ వార్షిక సంచికల్లోని కాపీ చిత్రాలను చూసి ముగ్ధుడైపోయారు. ఏనాటి బంధమో అన్నట్లు ప్రథమ పరిచయంలోనే రామారావును శిష్యునిగా స్వీకరించి, అతని యోగక్షేమాలను తనపై వేసుకొని పథనిర్దేశకుడైనాడు. ఆనాటి నుండి వారి సంబంధం ద్రోణార్జున బంధంగా వెల్లి విరిసింది.
కాపీ చిత్రాలు కూడదని, వస్తువులను, ప్రకృతిని చూసి లేదా ఊహించి చిత్రించవలెనన్నది ఆయన ప్రథమోపదేశం. ఆ ఆదేశం మేరకే ఒకసారి గుడ్డగొడుగు, బూట్లను ఒకచోట నుంచి చూస్తూ రంగుల్లో చిత్రించి చూపగా, దొరగారు “వీటికంటే అందమైన మీ దేశపు తాటాకు గొడుగు, కిర్రుచెప్పులు ఎందుకు చిత్రించరాద”ని ప్రశ్నించారు.
ఆ ప్రశ్న ఆ లేత మర్థిస్క కవాటాలను తట్టి తెరచాయి. ప్రతీకళ దేశీయమై ఉండాలన్నది పెద్దల ఉవాచ. కూల్డ్రే సాంగత్యంతో రామారావు చదువు పూర్తిగా అటకెక్కింది. చిత్ర లేఖనా గంథసౌరభం పరిణతిని సంతరించుకొన్నది.
1916వ సం. రామారావుది నూనూగు మీసాల యవ్వనం. ఉత్తమశ్రేణి కళాకారునికి కావలసిన అన్ని లక్షణాలు సంతరించుకొని ఉన్నత శిక్షణకూ తన గురువు ఆజ్ఞపై బొంబాయి పయననమవ్వాల్సిన సమయమాసన్నమయింది.
రామారావు తండ్రిగారిని ఒప్పించేందుకు కూల్డోగారికి పెద్దపనే అయింది. బొంబాయి పంపి విద్యాభ్యాసానికి అయ్యే సమస్త వ్యయం తానే భరిస్తానని చెప్పగా – తన కొడుకుపై ఆ విదేశీయునికున్న శ్రద్దానురాగం – శ్రేయ:కాంక్షలకు తలవగ్గేలా చేశాయి. రామారావు ఆనందానికి పట్టపగ్గాలు లేవు. సహసాధకులంతా ప్రేమ మీర వీడ్కోలు చెప్పగా, కూల్జీ ఇచ్చిన సిఫార్సు లేఖ తీసుకొని బొంబాయి మహానగరం చేరాడు.
ఎందర్నో, ఉత్తమ కళాకారులుగా తీర్చిదిద్ది అంతర్జాతీయ ఖ్యాతి నొందిన సంస్థ జె.జె స్కూలు ఆఫ్ ఆర్టు- ఆ కళాశాల డీన్ సివిల్-ఎన్బ్రర్న్. కూల్డ్రే మహాశయుని ఉత్తరం సాంతం చదివి కుశలమడిగి “ఏవైనా చిత్రాలు తెచ్చావా?” అని సాధికారంగా ప్రధానాచార్యుని దర్జాలో అడిగాడు. లాంఛనంగా ఏవో రెండు, మూడు చిత్రాలు చూద్దాం అనుకొన్న అతను-ప్రథమచిత్ర వీక్షణంలోనే కూర్చున్న ఆసనం నుండి లేచి “ఛాయా చిత్రాలా?” అన్న భ్రమగొల్పేట్లు ఉన్న ఆ చిత్రాలన్నీ చూసాక రామారావుని ప్రశంసించకుండా ఉండలేకపోయారు. వెన్నుతట్టి షేక్ హేండ్ యిచ్చి “దక్షిణాన మద్రాస్ ప్రెసిడెన్సీలో మారుమూలనున్న రాజమహేంద్రవరంలోని చిన్ననాటి మిత్రుడు కూల్టే నిస్సంశయంగా నొక అనర్ఘరత్నాన్ని కనుగొన్నాడు. సెభాష్!” అని మురిసిపోయారు.
రామారావుకు సరాసరి మూడవ సం. రంలో ప్రవేశం ఇచ్చారు. అసాధారణం? ఎంట్రన్స్ పరీక్ష లేకుండా ఐదుసంరాల డిప్లోమాకోర్సులో జానయినయ్యాడు. ఈ ఘటన చాలు రామారావు ప్రతిభకు దర్పణం పట్టేందుకు. రామారావుకు సంగీత, నాటకాలన్నా అభిరుచి అధికం. మిత్రుడు హరీన్ వద్ద హార్మోని నేర్చుకొనడం జరిగింది. పాల్గొన్న ప్రతి పోటీలను ప్రతీ బహుమతి అతన్నే వదించేవి. తన పురోభివృద్ధి ఎప్పటికప్పుడు కూల్జీగారికి, తన స్నేహితుడు వరదా వెంకటరత్నానికి ఉత్తరం ద్వారా తెలియజేసి ఆనందించేవాడు.
1919 సం. మే రామారావు వివాహం అయింది. వధువు శ్రీ దిగుమర్తి శ్రీనివాసరావుగారి ద్వితీయ పుత్రిక సత్యవాణి. ఆమెకు అప్పటికి 12 సం.లు. 1920 సం. లో సర్జెజె స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో సర్వ ప్రథముడుగా ఉత్తీర్ణుడయ్యాడు. తన ప్రతిభకు సన్మానపూర్వకంగా సం. పాటు ఫెలోగా ఆ కళాశాలలో పనిచేసారు.
రామారావు చిత్రకళా జీవితంలో గుజరాత్ పర్యటన ఓ మలుపు తిప్పింది. ఆ ఆరునెలల్లో అరవై ఏళ్ల అనుభవాలను అందించింది. ‘బావిచెంత అనే పెద్ద సాముదాయక చిత్రాన్ని ‘కథియవాడి’గా గ్రామీణ స్త్రీల హెుయలు, వాతావరణానికి దర్పణం పట్టేలా హృద్యంగా చిత్రించారు. భావ్నగర్ రాజావారు వీరి ప్రజ్ఞాపాటవాలకు మురిసిన వారై ప్యాలెస్కు ఆహ్వానించగా, వారి కోరిక మేరకు చిత్రాలను చిత్రించి వారి మెప్పును, ఆశీస్సులను అందుకొన్నారు. ఆ సమయంలోనే వేసిన “కుంజవనం” చిత్రం లండన్లో ప్రదర్శింపబడి ఖండాంతర ఖ్యాతి నొందారు.
వీరి కుంచెనుండి జాలువారిన చిత్రములు గొల్లభామలు, సిద్ధార్థరాగోదయం, కృష్ణలీలలు, అజంతా విహార్, పుష్పాలంకారం, గ్రీష్మచంద్రుడు, నందిపూజ, రామవివసం, కైకేయి దురాలోచన, కార్తీకపౌర్ణమి, అమాయక, అర్జున, ఊర్వశి, ద్రోణాచార్య, అభిమన్యు పతనం మొదలుగా గలిగినవిరామారావు ప్రాభవాన్ని ప్రపంచానికి చాటినవి.
గుజరాత్ పర్యటనలో ఉన్నప్పుడు అక్కడకు విచ్చేసిన రవీంద్రుని కలవటం కాకతాళీయంగా జరిగింది. తన చిత్రశైలికి ముగ్ధుడైన రవీంద్రుడు శాంతినికేతన్ ఆహ్వానించగా రామారావు కలకత్తా వెళ్లటం జరిగింది. అక్కడ అవనీంద్రుని నాయకత్వంలో చిత్రకళ మహెూద్యమంగా సాగుతున్న రోజులవి. ఆ పర్యటన రావుగారి భావి కార్యక్రమానికి మార్గం చూపింది. తన అన్వేషణ ఫలించిందని దేశపర్యటన ముగించుకొని రాజమండ్రిచేరి ‘ఆంధ్రచిత్రకళ’ పునరుజ్జీవోద్యమానికి శంఖం పూరించారు. అదే సమయంలో లక్నో స్కూలు వైస్ ప్రిన్సిపాల్ పదవికి ఆహ్వానం రాగా నిరాకరించారు. రామారావు ప్రాక్పశ్చిమ శైలులను మేళవించి ఓ నూతన శైలిని సృష్టించి, “ఆంధ్రా స్కూల్” అని పేరు పెట్టారు. “ఆంధ్రా సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆర్టు” అనే సంస్థను స్థాపించి ప్రతి క్షణానికి ద్విగుణీకృత ఫలితాలు రాబట్టే శ్రామికుడిలా నిరంతరం శ్రమిస్తూ కాలంతో పాటీ పడ్డారు.
ఒకవైపు కళాసాధన -శిక్షణా వ్యాసంగం మరోవైపు భార్యామణితో వైవాహిక జీవన సౌరభాన్ని ఆఘ్రాణిస్తూ దాంపత్య జీవన ఫలంగా నొక పుత్రునికి జన్మనిచ్చారు. తన ఆశలన్నీ ఆ బిడ్డ తీర్చగలడన్న నమ్మకంలో ఉన్న రామారావుకి ఆదుర్విధి ఆరునెలల్లోనే దు:ఖాన్ని మిగిల్చింది. పుత్రున్ని కోల్పోయిన దు:ఖాన్ని గరళంలా మ్రింగి కళాసాధనను మరింత కఠోరపరచారు. దెబ్బతిన్న వేలికే ఎదురుదెబ్బలన్నట్లు-అదే సమయంలో ఆత్మీయులనెందర్నో పోగొట్టుకొని పెనుతుఫానులకు నిల్చారు.
1923సం. అఖిల భారత స్థాయి చిత్రలేఖన ప్రదర్శన రాజమండ్రిలో ఏర్పాటు చేయగా దేశవ్యాప్తంగా ఉన్న చిత్రకారులు తమ చిత్రాలను ఇందులో ప్రదర్శించారు. ఈ ప్రదర్శనతో రాజమహేంద్రవరం చైతన్యవంతమయింది. వీరి కృషి, ప్రతిభ క్రమంగా వికసిస్తూ వచ్చాయి. భారతపటంలో రాజమండ్రికి వొక విశిష్టమైన స్థానం లభించింది.
1924 సం.లోను అభిలభారత రెండవ చిత్రకళాప్రదర్శన నిర్విఘ్నంగా జరిగింది. రామారావుకు రోజూ చిత్రకళాసాధనలో సహకరించేందుకు ఓమోడలు ఉండేవి. అందము, అంగసౌష్టవము గల ఆ స్త్రీమూర్తి అనేక నగ్న చిత్రాలకు వివిధ భంగిమలలో ప్రేరణనిచ్చేది. వీరి శ్రీమతి వీరి కళాకృషికేమాత్రం ఆటంకం కలుగనివ్వని విధంగా సంసార జీవితంలో సహకరిస్తూ తాను కూడా చిత్రరచన నేర్చి, సాధన చేస్తూ కొన్ని చిత్రాలకు మోడలుగా సహకరించేవారు. రామారావుకు ఆమె ఆదర్శ స్త్రీ. ఆమెను అనేక భంగిమల్లో చిత్రించిన భావచింత్రాల్లో, నాయికకు ఆమె రూపాన్నే ఇచ్చేవారు.
1925సం. రామారావు తిరుపతి యాత్రలో నల్లమల కొండల శోభకు, దేవాలయ శిల్పకళకు పులకించి ఎన్నో స్కెచ్లతో పెద్ద పుస్తకాన్నే నింపేసారు. ఆలోచనా తరంగ మానసంలో నిర్దేశితమైన భావి కార్యక్రమ పరి పూర్తికై భావనా స్రవంతిలో వోలలాడుతూ తిరుగు ప్రయాణం అయ్యారు. బెజవాడ సమీపిస్తుండగా స్వల్ప జ్వరం మొదలయింది. రాజమండ్రి చేరేసరికి “మశూచి’గా పరిణమించగా రామారావు నిర్వేదంతో కృంగిపోయారు.
నియమబద్దజీవనం చేస్తున్న సౌందర్యాధకునికీ ఈ భయంకర మహమ్మారి? తనుకున్న కలలు ఫలించలేదు. తన సహచారిణికి పదహారేండ్లయినా నిండలేదు. ఫిబ్రవరి 6వ తేదిన నిండు యవ్వనంతో 28 ఏండ్లు నిండకనే అఖండమయిన చిత్రకళా పారంగధరుడయిన దామెర్ల రామారావు తుది శ్వాస విడిచారు.
ఏ దివ్య హస్తాలు అద్భుత దృశ్యాలను కళ్ళకు కట్టేలా సృష్టించాయో ఆ చేతులు కనుమరుగయ్యాయి. రాజమండ్రి పట్టణం-గోదావరీ తటతీరంలో, దామెర్ల రామారావు చిత్రకళామందిరం ఆయన జ్ఞాపకంగా మిగిలిపోయింది.
అసంఖ్యాక చిత్రాలను కళాప్రేమికులు సొంతం చేసుకోగా మరి కొందరికి బహుమతివ్వగా, కొన్ని చెదిరిపోగా మన కొరకే అన్నట్లు మిగిలిన 34 తైలవర్ణ, 129 నీటిరంగు చిత్రపట్టాను 250 పెన్సిల్ స్కెచ్లను ప్రదర్శనకు ఉంచగా, 28 స్కెచ్ బుక్లు, ట్రేసులను రాజమండ్రి-దామెర్ల రామారావు ప్రభుత్వ ఆర్ట్ గ్యాలరీలో బద్రపరచారు. గాంధీ చేతులమీదుగా ప్రారంభింపచేశారు. .
విదేశీయులు ఎల్లలు మరచి ప్రశంసించేలా -స్వదేశీయులు ఉత్తములు మరచి మురిసేలా చేసిన ఆ అపార కళాసంపదను జాతికిచ్చి, చిత్రకళోద్యమ జ్యోతిని మన చేతికిచ్చి అమరుడైనాడా కళా తపస్వి మనలందరికి ఆ కళాకృతులతో పారలౌకికానందాన్ని పంచిన యశస్వి.
– ఆత్మకూరు రామకృష్ణ
Very good article.