చిరకాలం దాచుకోదగిన ‘ఒక భార్గవి ‘

పెద్దగా బాదరబందీలేవీ బాధించని జీవితక్షణాల్లో, చిరుజల్లులు కురిసే ఓ సాయంకాలం, కమ్మటి కాఫీ తాగుతూ, మనకి అత్యంత ఇష్టమైన మిత్రుడితో మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది..!! ఎన్నో కబుర్లూ, ఎన్నో అంశాలూ.. ఆహ్లాదం కలిగించేవీ, ఆలోచింపచేసేవీ, ‘ఔరా!’ అనిపించేవీ, ఇచ్చిపుచ్చుకునేవీ, సినిమాల గురించి, పుస్తకాల గురించి, కథల గురించి, వ్యక్తులగురించి.. ఎంత బావుంటుందో కదా!

సరిగ్గా అలాంటి అనుభూతిని కలిగించే పుస్తకం ఇదీ! ఈ పుస్తకాన్ని ఎప్పుడు చదివినా, ఎక్కడ నుంచి చదివినా, ఏ అంశం చదివినా – సరిగ్గా అలాంటి అనుభూతే కలుగుతుంది. ఇలాంటి కబుర్లు దాదాపు వందవరకూ ఉన్నాయి ఈ 270 పేజీల ‘ఒక భార్గవి ‘ పుస్తకంలో. ఇందులో అన్నీ ఆకర్షణలే, ముఖ్యంగా ఎంపిక చేసుకున్న అంశాలూ, వాటిని అత్యంత సరళంగా, ఆత్మీయంగా వ్రాసిన శైలీ, అత్యద్భుతమైన గిరిధర్ గౌడ్ పెయింటింగ్స్, అరుదైన చిత్రాలూ.. ఒక్కటేమిటి.. ప్రతి అంశమూ, ప్రతి పేజీ నవ్యాతినవ్యమే. గురుదత్, గీతాదత్, మీనాకుమారి, రోషన్ లాల్, మల్లాదివారు, సావిత్రి, కృష్ణకుమారి.. లాంటి అలనాటి అందరి అభిమానవ్యక్తులు గురించి, సమకాలీన ప్రముఖులగురించి, మిత్రుల గురించి, కుటుంబసభ్యుల గురించి, ఇప్పుడు వస్తున్న కథల గురించి, తాను చదివిన పుస్తకాల గురించి.. ఇలా అనాకానేక అంశాలను అత్యంత ఆసక్తికరంగా మనకందించారు రచయిత్రి డా. భార్గవిగారు. ఈ పుస్తకం చివరలో పేర్కొన్నట్లే “వృత్తి వైద్యం; ప్రవృత్తి సంగీత సాహిత్యాల లోతులు తరచే ప్రయత్నం. సినిమాలూ, పుస్తకాలూ, ప్రముఖ వ్యక్తుల గురించి వ్రాసిన వ్యాసాల సంకలనం”. వీటిని వ్యాసాలు అనే కంటే ఆత్మీయులు చెప్పిన కబుర్లు అంటేనే బావుటుంది. కేవలం ఊసుపోని కబుర్లలా కాక విజ్ఞానం, వికాసం కలిగించే విశేషాలు ప్రతి అంశంలోనూ ఉన్నాయి. చాలాచోట్ల డా.భార్గవిగారు చేసిన పరిశోధనలు, తద్వారా వారు అందించిన అరుదైన సంగతులూ కూడా ఈ పుస్తకం ప్రత్యేకతలే. అత్యంత నాణ్యమైన ముద్రణ, చిరకాలం దాచుకోదగిన వర్ణచిత్రాలూ.. అన్నీ కలిసి ఈ పుస్తకాన్ని మన నిత్యజీవితంలో ఒక భాగాన్ని చేస్తాయి, దాచుకుని, దాచుకుని చదవాలనిపించేలా చేస్తాయి. ఇలాంటి మరో వాల్యూమ్ డా.భార్గవిగారి నుంచి వస్తే ఎంత బావుటుందీ.!! మంచి పుస్తకాన్ని ప్రచురించిన భార్గవి గారు అభినందనీయులు.
రమ్య శ్రీ
ప్రతులకు:
డా. భార్గవి (rbhargavi17@gmail.com )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap