చేను చెక్కిన శిల్పాలు అన్న ఈ శీర్షికే మాట్లాడుతుంది రైతుబిడ్డయిన సోమేపల్లి వెంకట సుబ్బయ్యగారికి మట్టిపై ఉన్న మనసు గురించీ, చేను పై ఉన్న మమకారం గురించీ.! నానీల సృష్టికర్త డా.ఎన్.గోపి గారి ముందుమాటతో వెలువడిన వీరి నానీల నాలుగవ సంపుటి. వీరు డిప్యూటీ కలెక్టర్ హెూదాలో ఉండి క్షణం తీరికలేకున్నా సమాజ సమస్యల పట్ల స్పందనుంటే కలం కదపటం కల్లకాబోదని నిరూపిస్తుంది. నానీల ప్రక్రియ ప్రత్యేకతేమిటంటే ‘నానీలు’ నాలుగు మాటలయినప్పటికీ,…ఎంతో భావాన్ని పొదువుకుని ఉంటాయి. తీసుకున్నవారికి తీసుకున్నంత’ అనిపించేలా ఈ ‘చేను చెక్కిన శిల్పాలు’ నానీల సంపుటిలో ప్రస్తుతాంశాలైన ప్రపంచీకరణాధారిత అనివార్య మార్పులూ, కాలుష్యం, కక్షలూ, అపార్ట్మెంట్ కల్చర్, పల్లె వలసలూ, ఫేస్బుక్ అతివాడకం, బాల్యాలను మింగే సెల్ ఫోనులూ, బోరుబావులూ, రైతు బాధా, రైతు ఔన్నత్యం… ఒకటేమిటి? అన్ని సామాజికాంశాలనూ వెంకట సుబ్బయ్యగారు తన శైలిలో అభివ్యక్తీకరించడంలో కృతకృత్యులయారు.
“నోరు తెరిచిన బోరుబావి.
వాడవాడంతా విషాదపు దీవి !’
అంటూ బలైపోతున్న పసోళ్ళ గురించీ,
‘పల్లె మూడు కాళ్ళతో కుంటుతుంది
వృద్ధాశ్రమంగా మారుతుందేమో!’
అంటూ పల్లె వలసలను తలచీ బాధను వ్యక్తం చేస్తారు.
దూరంగా జరిగిపోయిన మనుషులను
అపుడపుడైనా కలిపేది అపార్ట్మెంట్ లిప్టు
అడుగు జాడ అమ్మనాన్నదే కానీ, ఇపుడేది వారి ఆనవాలు’
అంటూ రెక్కలొచ్చి ఎగిరిపోయిన పిల్లలను అని ప్రశ్నిస్తారు.
ఎండనక వాననకా బతికాడు
చచ్చాకనే కాసేపు ఏ.సి బాక్స్ లో…
అంటూ కఠోర జీవిత సత్యాన్ని విప్పి చెబుతారు.
అనునిత్యం ఆన్ లైన్.
పెళ్ళాం పిల్లలు ఆఫ్ లైన్..
నల్లడబ్బు ఒళ్ళు విరుచుకు ఓట్లను తింటుందేమో’.. లాంటి హృద్యమైన భావవ్యక్తీకరణలు మనల్ని ఆకట్టుకుంటాయి.
అంకితమేమో అహింసామూర్తికి..
వెండితెరంతా హింసా, రక్తపాతం…
అంటూ వ్యంగాస్త్రం విసురుతారు.
గుంటూరు జిల్లా రచయితల సంఘం స్థాపించి సాహితీసేవ చేస్తున్న సోమేపల్లివారు
‘నాకొక చెవినివ్వండి
నేను మీకు గొంతుకనిస్తాను”
అన్న చందాన అన్ని రకాల సమకాలీన సమస్యలనూ నానీల రూపంలో ప్రశ్నిస్తూ తనవంతు సమాజ బాధ్యతను వహిస్తున్నారు. అప్రతిహతంగా కొనసాగుతున్న ఈ నానీల ప్రక్రియకు తమ వంతు కృషి చేస్తున్న సోమేపల్లి వెంకట సుబ్బయ్య సదా అభినందనీయులు.
ఈ పుస్తకములో అన్ని నానీలకు చిత్రకారుడు పాణి గారు వేసిన చిత్రాలు ప్రత్యేక ఆకర్షణ. అందంగా అచ్చొత్తిన క్రిసెంట్ పబ్లికేషన్స్ వారు అభినందనీయులు.
-మనోజ నంబూరి