జానపద చిత్రకళా వైతాళికుడు

(నవంబర్ 13, 14 తేదీలలో విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పైడిరాజు గారి శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న సంధర్భంగా ప్రత్యేక వ్యాసం)

తెలుగు చిత్రకళను విశ్వవ్యాప్తం చేసిన కళాప్రపూర్ణుడు అంట్యాకుల పైడిరాజు, తెలుగునాట దామెర్ల రామారావు తర్వాత ఆ వైతాళికుని కృషిని కొనసాగించిన మహాకళాకారుడు ఆయన. పైడిరాజు చిత్రకారుడు, శీలే కాదు, కవి, కథకుడు, గాయకుడు, నటుడు కూడా! తెలుగువారి సాంస్కృతిక రాయబారి. పైడిరాజు కళాకృషిని స్మరించుకోవడం మన సంస్కృతిని మనం సింహావలోకనం చేసుకోవడమే అవుతుంది.

బొబ్బిలిలో నరసమ్మ, రాజయ్య దాసులకు పుట్టిన పైడిరాజు ఖర్గపూర్లో పెదతండ్రి శ్రీరా ములు వద్ద వుండి ప్రాథమిక విద్యను, విజయనగరంలో పాఠశాల విద్యను పూర్తిచేశారు. చిన్ననాటి నుండి లలిత కళలో నిరంతరం స్వయం కృషితో సాధన చేసేవారు. స్థానిక జమీం దారు పూసపాటి లక్ష్మీనరసింహరాజు ఆర్థిక సహాయంతో మద్రాసు వెళ్లి ‘స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ లో చేరి ఆరేళ్ల కోర్సును నాలుగు సంవత్సరాల్లో పూర్తి చేశారు. అదీ నాటి కళాశాల ప్రిన్సి పాల్ దేవీప్రసాద్ రాయ్ చౌదరి వద్ద. అనంతరం కలకత్తా వెళ్లి ఆ ప్రముఖ చిత్రకారులు జామినీరాయ్, నందలాల్బోస్, అతుల్ బోస్, రాంకీకర్ నుండి చిత్రకళా పద్దతుల్ని, ఆధునిక చిత్రకళారీతుల్ని అవగాహన చేసుకొన్నారు.
1945లో శ్రీకాకుళం పరిసర గ్రామాల్లో నెలకొన్న కరువు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి అక్కడ అన్నార్తుల్ని, రోగగ్రస్తుల్ని, ఆకలిచావులకు సంబంధించిన వాస్తవ పరిస్థితుల్ని ప్రతిబింబించేలా, పలు రేఖాచిత్రాలు గీసి, నాటి ‘ప్రజాశక్తి పత్రికలో ప్రకటింప చేశారు. తర్వాత ఆ చిత్రాలన్నీ గ్రంథ రూపంలో వచ్చాయి. ‘నేను నలువైపుల వెళ్ళి పరిసరాల్ని, మనుష్యుల్ని, కాలప్రభావాన్ని అర్థం చేసుకోవడం నా కళా సేవకు ఎంతో దోహదపడిందని’ పైడిరాజు చెప్పుకొన్నారు.
1945లో విజయనగరంలో ‘ఆర్డు స్కూల్ స్థాపించి, పావుశతాబ్దం పాటు నిరాటంకంగా నిర్వహించి వందలాది విద్యార్థులకు డ్రాయింగ్, లోయర్ హయ్యర్ పరీక్షలకు శిక్షణ ఇచ్చి, వారిని మంచి చిత్రకళోపాధ్యా యులుగా తీర్చిదిద్దారు. ఆయన శిక్షణ పొందిన వారిలో కేతినేడి భాస్కరరావు, కళ్యాణ ప్రసాద్ శర్మ, ఇప్పిలి జోగి సన్యాసి రావు, ద్వివేదుల సోమనాధ శాస్త్రి రోహిణీ కుమార్, నేమాని కృష్ణమూర్తి, మహేశ్వర దాసు, రాజేశ్వరరావు, పల్లా రాజారావు తది తరులు వున్నారు. చిత్ర, శిల్ప కళాకారులకు ఆదరణలేని రోజుల్లో ఆ రంగాన్ని జీవనోపా ధిగా ఎంచుకొన్నసాహసి, ధీశాలి పైడిరాజు, ఆయన అజంతా, ఎల్లోరా, లేపాక్షి, రాజస్తానీ చిత్రాలతో ప్రభావితమై, అదే శైలిలో ఉత్తరాంధ్రకు చెందిన పండుగలు, వేడుకలు, వృత్తులు, జీవనం, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు తన భావాలుగా ప్రతిబింబిం చేవారు. ఆంధ్రత్వాన్ని తన చిత్రాల్లో నిండుగా చూపించేవారు. అదే మన జానపద చిత్ర కళగా విశ్వవ్యాప్తం అయ్యింది.
పైడిరాజు నూనెరంగుల చిత్రాలు గీయ డానికే ఇష్టపడేవారు, అదీ పెద్ద సైజులో, అందువల్ల అవి చూపరుల్ని ఇట్టే ఆకర్షించేవి. ఆయన చిత్రాల్లో ఒక్క మిల్లీమీటరు కూడా ఖాళీ లేకుండా రంగులు అద్దేవారు. ఆయన చిత్రాల్లో అలంకరణ భాగం ఎక్కువ. రేఖలు స్పష్టంగా, చక్కని లయ విన్యాసం కలిగి వుంటాయి. హృదయాంతరాళంలో మెదలిన నవ్యత్వానికి భవ్యత్వాన్ని జోడించి, జీవితా నికి చిత్రకళకు వుండవలసిన అనుబంధాన్ని గీసి చూపేవారు. ఆయన ఎక్కువగా ప్రాథమిక రంగులే ఉపయోగించేవారు. మరీ ముఖ్యంగా, పసుపు, ఆకుపచ్చ అంటే ఎక్కువ ఇష్టపడేవారు. ఆయన దాదాపు తన జీవితకాలంలో ఐదు వేలకు పైగా వర్ణ చిత్రాలు గీచారు. ఆయన చిత్రాలు- ‘సంతకు’, ‘కూలి’ మొదలైనవి రష్యాలోను, ‘సోది’ చిత్రం మలేషియాలోను, ‘గృహోన్ముఖులు’ లండన్లోనూ ఇంకా లాటిన్ అమెరికా, కెనడా, జర్మనీ, అఫ్గానిస్తాన్ తదితర దేశాల్లోను; ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, తమిళనాడు, కేరళ గవర్నర్ కార్యాలయాల్లో, పలువురు కళాభిమానుల ఇళ్లలోనూ అలంకరించబడ్డాయి. పైడిరాజు జానపద శైలిలో చిత్రించిన ‘తల్లీపిల్ల, తిలకం, చెమ్మ చెక్క తెగినవీణ, నీటి కోసం, పేరంటానికి’ మొదలైన చిత్రాలు అత్యధికంగా అమ్ముడుపోయాయి.

పైడిరాజు అయిష్టంగానే ఆధునిక చిత్రకళా విధానాల్లో సృజించిన ‘గుడ్లగూబ’, ‘స్నానా నంతరం’ తదితర చిత్రాలు కూడా కళాభిమానుల ఆదరణ పొందాయి. ఆయన ఇంకా ఎందరో ప్రముఖులకు సంబంధించిన రూపచిత్రాలు జీవకళ వుట్టిపడేలా వేశారు. ఆయన చిత్రకళకే పరిమితం కాలేదు. మహాకవి గురజాడ, కోడిరామమూర్తి, గాంధీజీ, రుద్రమదేవి, అల్లూరి సీతారామరాజు, రమణ మహర్షి, విజయనగరం, బొబ్బిలి రాజులకు సంబంధించిన కంచు శిల్పాలెన్నో తయారుచేసి, తనకు తానే సాటి అని నిరూపించుకొన్నారు.

పైడిరాజు చిత్రించిన చిత్రాలు ప్రచురించని పత్రికలు నాడు లేవంటే అతిశయోక్తి కాదు. భారతి, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, విశాలాంధ్ర, గృహలక్ష్మి, శిల్పి, నవభారతి, అభ్యుదయ, వాణి తదితర పత్రికల్లో ఆయన చిత్రాలు లెక్కకు మించివచ్చాయి. అప్పట్లో ఆయన్ని గురించి ‘ది స్టూడియో’ (లండన్), ఇలస్టేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా, ధర్మయుగ్ వంటి పత్రికల్లో పరిచయ వ్యాసాలు వచ్చాయి. ఆంధ్రవిశ్వవిద్యాలయంలో ఫైన్ ఆర్ట్స్ విభాగం పైడిరాజు కృషి వల్లనే ఏర్పాటయింది. నాటి ఉప కులపతి ఎమ్.ఆర్ అప్పారావును ఆయన తరచు కలసి ఈ విషయమై వినతి పత్రాలు ఇచ్చి, వత్తిడి చేసేవారు. 1977లో ఆ విభాగం ఏర్పడ్డాక ఆయన దాదాపు ఒక దశాబద్దం పాటు లెక్చరర్గా పని చేశారు. కళారంగానికి ఆయన అందించిన సేవల్ని గుర్తిం చిన ఆంధ్ర విశ్వకళాపరిషత్ 1977లో ‘కళాప్రపూర్ణతో గౌరవించింది.

పిల్లల్లో పెద్దల్లో కళాభిరుచిని పెంపొందించడానికి ఆయన ప్రముఖ చిత్రకారుడు వి.ఆర్. చిత్ర, ప్రముఖ న్యాయవాది వి. అనంతరావు పంతులు తదితరులతో కలసి 1962లో చిత్ర కళాపరిషత్తు ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ద్వారా ఏటా పిల్లలకు, పెద్దలకు చిత్రకళాపోటీలు, ప్రదర్శనలు నిర్వహించి ప్రతిభ చూపినవారిని ఎంతగానో ప్రోత్సహించేవారు. జాతీయ స్థాయి చిత్రకారుల ప్రదర్శనలు విశాఖలో ఏర్పాటు చేసేవారు.
పైడిరాజు ప్రతిభ ఇంతటితో ఆగలేదు. చిత్ర, శిల్పకళా రంగాల్లో రాణిస్తూనే, తీరిక సమయాల్లో కవితలు, గేయాలు, కథలు, వ్యాసాలు విరివిరిగా రాసేవారు. ‘రంగుల టెక్నిక్ తో చిత్రాల ద్వారా నా ఊహలు ప్రదర్శించడమే కాదు. నాకు కావల్సింది మాటలు టెక్నిక్ తో కూడా నా ఊహలు తెలుపడం నా అభిమతం’ అంటుండేవారు. తన రచనల్ని గురించి అస్తవ్యస్తమైన సమాజంలో జరిగిన పోరాటంలోని సంఘర్షణానుభవాల ఆధారంగా అభ్యుదయ కవిత్వం ప్రేరకంగా ‘అక్షర శిల్పాలు’ అనే కవితలను శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆర్థిక సహకారంతో 1987లో ముద్రించారు. ఈ సంపుటిలో ‘ఆ గడియకు గెడవిడింది’ వంటి విలువైన కవితలతో పాటు ఉల్లిపాయ, మిరపకాయ వంటి జానపద బాణీలు ఉన్నాయి. పువ్వు పెట్టి, కాలుకి కడియాలు నెట్టి వంటి జానపదాలతో, గ్రామీణ జీవితంలోని సౌందర్యానికి అద్దంపట్టే చిలుకలు ఇందులో వున్నాయి. ‘చిత్తంలోంచి తీసిన ఎంగిలి పొత్తర్లు నాకవితలు, స్కాప్ లోంచి షేప్ చేసిన పిచ్చి వ్రాతలు’ అని ఆయన తన కవితల్ని గురించి కవితాత్మకంగా చెప్పుకొన్నారు. రంగుల హరివిల్లుతో ఆగక సామాజిక చైతన్యంతో వ్రాసిన కవితలు, కొన్ని యధార్థ దృశ్యాలతో మలచిన కథలు పైడిరాజు ప్రతిభకు తార్కాణంగా నిలుస్తాయి.

పసిడివర్గంలో ఐదు అడుగుల ఎత్తులో వుండి, చూడగానే ఒక కళాకారునిగా పైజమా, లాలితో ఎల్లప్పుడూ ఉత్సాహంగా, ఉల్లాసంగా కనిపించే పైడిరాజు తన చిత్రాల్లోని రూపా లను మాత్రం అందంగా, బలిష్టంగా సహజంగా చూపించేవారు. ఈ మహాకళాకారుడు 1998 డిశంబర్ 26న విశాఖలో కన్నుమూశారు. తెలుగు జానపద సంస్కృతికి ప్రతీకలైన ఆయన చిత్రాలు సేకరించి, భద్రపర్చాల్సిన బాధ్యత మన ప్రభుత్వం పై వుంది. ఈ శత జయంతి సంవత్సరంలోనైనా అది జరుగుతుందని ఆశిద్దాం!

-సుంకర చలపతిరావు

7 thoughts on “జానపద చిత్రకళా వైతాళికుడు

  1. >> …. తెలుగు జానపద సంస్కృతికి ప్రతీకలైన ఆయన చిత్రాలు సేకరించి, భద్రపర్చాల్సిన బాధ్యత మన ప్రభుత్వం పై వుంది. ఈ శత జయంతి సంవత్సరంలోనైనా అది జరుగుతుందని ఆశిద్దాం! ……

    ప్రభుత్వాలేవో ఒరిగిస్తాయని నమ్మరాదండీ. అవి ప్రజలకోసం కళలకోసం దేశంకోసం భవిష్యత్తుకోసం అంటూ అమాయకంగా ఏమీ చేయవు. అలాంటి పనులు ఎన్నికల్లో వోట్లురాల్చేందుకు ఉపకరించవు కదా అని తూష్ణీంభావం వహిస్తాయి. అమాయకచక్రవర్తు లెవరన్నా పోయి ప్రభుత్వాలను కదలించే ప్రయత్నం చేస్తే మొగమాటానికి “అలాగే తప్పకుండా చేదాం” అంటూ ఉత్తుత్తి వాగ్దానాలు చేస్తారు. అవి నమ్ముకొని కూర్చుంటే ఎప్పటికీ ఏమీ‌ జరుగదు. ఎవరన్నా కళాభిమానులు తమబోటి వారినీ, ప్రజలనూ చైతన్యపరచి ఏమన్నా చేయగలిగితే అది గొప్పవిషయం. వట్టినే అశించుతూ కూర్చోవటం వలన కాలం గడవటం పెద్దలు స్మృతులు కనుమరుగవటం మించి జరిగేది ఏమీ ఉండదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap