టీటీడీ ఛైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి

తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి అధ్యక్షునిగా వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బా రెడ్డి జూన్ 22 , శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనను టీటీడీ ఛైర్మన్ గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పుట్టా సుధాకర్ యాదవ్ టీటీడీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేసిన నేపధ్యంలో ఆయన శనివారం టీటీడీ 50 వ ఛైర్మన్ గా ప్రమాణస్వీకారం చేశారు.

ఈ కార్యక్రమానికి డిప్యుటీ సీఎం నారాయణ స్వామి, మండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి తదితరులు హాజరయ్యారు. ఇదిలా ఉండగా.. వైవీ సుబ్బారెడ్డి కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. ఉదయమే స్వామి దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాతే ప్రమాణస్వీకారం చేపట్టారు.

ఈ కార్యక్రమానికి ముందు వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. శ్రీవారి భక్తులకు సేవ చేసుకునే భాగ్యం కల్పించిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలను తెలియజేశారు. హిందూ సంప్రదాయాలను కాపాడుతూ.. భక్తుల సౌకర్యాలకు అధిక ప్రాధాన్యతన ఇవ్వాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు.

మరో వారం రోజుల్లో పూర్తి స్థాయిలో పాలకమండలి ఏర్పాటు జరుగుతుందని పేర్కొన్నారు. గత ఐదేళ్లుగా పాలకమండలి తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలపై సమీక్షలు చేపడతామన్నారు. బంగారం వివాదాన్ని నిగ్గుతేల్చుతామని స్పష్టం చేశారు. ప్రధాన అర్చకుల తొలగింపు నిర్ణయాన్ని పునః సమీక్షిస్తామని వెల్లడించారు. టీటీడీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
వై.వి.సుబ్బారెడ్డి పూర్తి పేరు యెర్రం వెంకట సుబ్బారెడ్డి, ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గం నుంచి  16వ లోక్‌సభ సభ్యునిగా 2014 లో ఎన్నుకైనాడు. సుబ్బారెడ్డి సొంతూరు ప్రకాశం జిల్లా మేదరమెట్ల. ఈయన మాజీ ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖరరెడ్డికి తోడల్లుడు. ఎం.బి.ఏ. చదువుకున్నారు.

తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డికి హెరిటేజ్ నెయ్యితో తులాభారం వేశారు. టీటీడీ బోర్డు చైర్మన్‌గా ఇవాళ ఆయన ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం శ్రీనివాసుని సన్నిధిలో ఉన్న త్రాసులో తులాభారం వేశారు. శ్రీవారికి మొక్కుకునే భక్తులు ఇలా తులాభారం వేసి.. తమకు సరిపడా బరువైన బెల్లం, బియ్యం వంటి వాటిని స్వామివారికి సమర్పిస్తారు. అలాగే, వైవీ సుబ్బారెడ్డికి కూడా తులాభారం వేశారు. అయితే, ఆయనకు నెయ్యితో తులాభారం వేయించారు. అక్కడ హెరిటేజ్ నెయ్యితో తులాభారం వేయించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారింది.

Leave a Reply

Your email address will not be published.

Share via
Copy link
Powered by Social Snap