‘డ్రామా’ అనే పదం ఎక్కడిది?

“డ్రామా” అనే పదం గ్రీకు దేశం నుండి వచ్చింది. డ్రామా అంటే జరిగిన పని లేదా చేసిన విషయం. మామూలు మాటల్లో చెప్పాలంటే “వేసిన నాటకం”. అలాగే, థియేటర్ అనేది కూడా గ్రీకు పదమే.
ఇక, ఆడియన్స్ అనేది లాటిన్ భాషా పదం. ఇలా, నాటకానికి సంబంధించి మనమందరం తెలుగులో సులువుగా వాడుతున్న ఈ పదాలు అన్నీ, గ్రీకు,లాటిన్ భాషా పదాలు. ఇవి మన తెలుగుభాషా పదాలు కావంటే నమ్మలేం కూడా. మనకు అంత దగ్గర సంబంధం కలిగిన, గ్రీకు నాటకం గురించీ, కొంతైనా చెప్పుకోవడం మనకి ధర్మం కదా!

గ్రీకుల నాటకం కూడా చిత్రంగా మొదలయ్యింది. దానికీ గొప్పకథ ఉంది.
దాదాపుగా రెండువేల ఐదువందల సంవత్సరాలకు పూర్వం గ్రీకు దేశంలో ‘డయోనస్ ‘అనే దేవుడ్ని పూజించేవారు. ఆయన ప్రకృతి దేవుడు. సంవత్సరానికి రెండు సార్లు ఆ దేవుడికి పండగ చేసేవారు. అప్పుడు ప్రజలు ఒక్కచోట చేరి, మంచిపాటలతో ఆ దేవుడ్ని ప్రార్ధించేవారు. ఆ పాటల్ని డిథీరామ్స్ అని పిలిచేవారు. ఎనిమిది మంది కలిసి, ఒక్క బృందంగా ఏర్పడేవారు. అయితే ఈ పాటలన్నీ అప్పటికప్పుడు ఆశువుగా పాడేవారు. చాలా కాలం వరకూ ఇలాగే జరిగేది.

కొంతకాలానికి “ఏరియన్” కాలంలో, కవులు ముందుగా పాటలు రాయడం మొదలయ్యింది. అందులో నచ్చిన పాటల్ని అభినయిస్తూ.. బృందాలు పాడేవి. అందులో ఒకరు నాయకుడు. మిగిలిన వారు అనుచరులు అయ్యారు.కొన్నాళ్లకు ‘ధెప్సిస్’ అనే దర్శకుడు ఆలోచించి, నాయకుడు స్థానంలో నటుడ్ని ప్రవేశపెట్టాడు.ఆ నటుడు ముఖానికి మాస్కులు పెట్టుకొని ఆనేక పాత్రల్ని నటించేవాడు.

కొంతకాలం తర్వాత ఎస్కిన్లన్ అనే రచయిత రెండవ నటుడ్ని ప్రవేశపెట్టాడు. ఇంకొంత కాలానికి సొఫొక్లిస్ మూడవ నటుడ్ని ప్రవేశపెట్టి, పూర్తి నాటకాన్ని రూపొందించాడు. దాదాపుగా ఆరోజుల్లోనే..
ఆయన నూట ఇరవై నాటకాలు రాసాడు.
ఆయన రచనలో ప్రసిద్ధమైనవి..ఈడిపస్, ఆంటిగోని అనే నాటకాలు. ఆ తరువాత రోజుల్లో యూరిపిడస్ అనే రచయిత సాంఘిక నాటకాలు రచించడం. ఆరంభించాడు. యూరిపిడస్ ఇప్పటికి 2500 ఏళ్లకు పూర్వమే జీవించి గ్రీకు దేశంలో సాంఘిక నాటకాలు వ్రాసి, ప్రదర్శించాడు.
ఎంత గొప్పకథ ఇది. ఎంత పురాతన చరిత్ర ఇది.

నిజానికి..మన నాటక కళాకారులకి ఎల్లలులేవు. జాతి, మత, కుల, వర్గ, వర్ణ భేధం లేదు. మనమంతా ఒక్కటే. నాటకం ఎక్కడున్నా, ఏ దేశం కథైనా అదంతా మనదే.

ఈ వ్యాసంలో ఉన్న బొమ్మల్లో
పైన ఉన్నది “సొఫొక్లిస్” బొమ్మ.
కిందది “యూరిపిడస్” బొమ్మ.
మీ అందరికోసం ఈ వ్యాసం అందిస్తున్నాను.

నాటకం వర్ధిల్లాలి. తెలుగునాటకం ఎంతో వర్ధిల్లాలి.

ప్రేమతో…సదా మీ
వాడ్రేవు సుందర్రావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap