తెలుగు సినిమా యవనికపై కొత్త చరిత్ర

తెలుగు చిత్రసీమ చరిత్రలో ఈ ఏడాది అక్టోబర్ కు ఒక ప్రత్యేక స్థానం ఉండబోతోంది. దానికి కారణం చెప్పడం చాలా సులభం. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా.. నరసింహారెడ్డి’ చిత్రం అక్టోబర్ 2న విడుదలవుతోంది. ఇది స్వాతంత్ర్య సమరంలో ఒక విసుత యోధునిగా మిగిలిపోయిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్. నిజానికి రేనాడుకు చెందిన నరసింహారెడ్డి తొలి స్వాతంత్ర్య సమర సేనాని. అయినా జాతీయంగా ఆయన పేరును విస్మరించారు. బ్రిటిషర్ల ఆధిపత్యాన్నీ, పెత్తనాన్నీ సహించలేక వాళ్లపై తిరుగుబాటు చేసి అసమాన శౌర్యపరాక్రమాలు ప్రదర్శించి, వాళ్లను గడగడలాడించిన ఆ మహావీరుడి గాథను సెల్యులాయిడ్ పై ఆవిష్కరించి, మొత్తం దేశానికీ, ఈ ప్రపంచానికీ చూపాలనే లక్ష్యంతో చిరంజీవి చేస్తున్న బృహత్ యత్నం ‘సైరా’..
ఆయన కలను నెరవేర్చడానికి ఆయన కుమారుడు రామ్చరణ్ స్వయంగా రంగంలో దిగారు. ‘సైరా’ నిర్మాణ బాధ్యతల్నీ తీసుకున్నారు. రామ్చరణ్ను ‘ధృవ’గా చూపించి, మెప్పించిన సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి పరుచూరి బ్రదర్స్, సాయిమాధవ్ బుర్రా సంయుక్తంగా రచన చేశారు. తెలుగులో రూపొందించిన ఈ చిత్రాన్ని తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అనువదించారు. ‘సైరా’లో తెలుగుతో పాటు దక్షిణ భారతంలోని మిగతా భాషా చిత్రసీమలకు చెందిన పేరుపొందిన తారలతో పాటు బాలీవుడ్ తారలూ నటించారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఇందులో నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్నగా ప్రత్యేక పాత్రలో నటించడం విశేషం. నరసింహారెడ్డి ధర్మపత్ని సిద్దమ్మగా నయనతార, అవుకు రాజు పాత్రలో కిచ్చా సుదీప్, రాజా పాండిగా విజయ్ సేతుపతి, వీరారెడ్డిగా జగపతిబాబు, లక్ష్మి అనే కీలక పాత్రలో తమన్నా, మరో ప్రధాన పాత్రలో భోజ్ పురి స్టార్ రవి కిషన్ నటించారు. ఝాన్సీ లక్ష్మీబాయిగా అనుష్క మెరుపులా మెరవనున్నారు. అలాగే నాగబాబు కుమార్తె నిహారిక సైతం ఒక చిన్న పాత్రను చేశారు. ఒక్క ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రను మినహా మిగతా పాత్రల్ని ఇప్పటికే విడుదల చేసిన మేకింగ్ వీడియోలో, టీజర్లో పరిచయం చేశారు. టీజర్ ఆరంభంలో “చరిత్ర స్మరించుకుంటుంది. ఝాన్సీ లక్ష్మీబాయ్, చంద్రశేఖ ఆజాద్, భగత్ సింగ్ వంటి ఎందరో మహనీయులు ప్రాణత్యాగాల్ని. కానీ ఆ చరిత్ర పుటల్లో కనుమరుగయ్యాడు ఒక వీరుడు. ఆంగ్లేయుల పై తొలిసారి యుద్ధభేరి మోగించిన రేనాటి సూర్యుడు” అంటూ పవన్ కల్యాణ్ ఇచ్చిన వాయిస్ ఓవర్ ని బట్టి నరసింహారెడ్డి కథ ఎలా ఉండబోతోందో, ఆయన శూరత్వం ఏ రీతిలో
ఉండనుందో అర్థమవుతోంది. సినిమాలోని ప్రతి సన్నివేశం రోమాలు నిక్కబొడుచుకొనే రీతిలో ఉంటుందని చిత్ర బృందం ఉద్వేగంగా చెబుతోంది. గుర్రంపై స్వారీ చేస్తూ చిరంజీవి వస్తుంటే ఆయన రేనాటి సూర్యుడిలానే కనిపిస్తున్నారు. ఆయనను ఉద్దేశించి “సింహం లాంటోడు దొరా.. అతడే వాళ్ల ధైర్యం దొరా” అంటూ కింది ఆఫీసర్ బ్రిటీష్ దొరకు చెప్పే మాటలు నరసింహారెడ్డి క్యారెక్టరైజేషన్ను పట్టిస్తున్నాయి. బ్రిటిషర్లతో చేసిన పోరులో అరివీర పరాక్రమంతో శత్రు సైనికుల్ని చీల్చి చెండాడిన, వారి ఫిరంగి గుండ్లు దూసుకువస్తున్నా లెక్కచెయ్యకుండా కత్తులతో కుత్తుకలు తెగనరికిన నరసింహారెడ్డిగా మెగాస్టార్ ను చూడ్డానికి రెండు కళ్లూ చాలవనిపిస్తుంది. మహావీరుడిలా రణరంగంలో ఆయన కదులుతున్న, శత్రువుల్ని దునుమాడుతున్న తీరు చూస్తుంటే, ‘ఖైదీ’ నాటి చిరంజీవి గుర్తుకు వస్తున్నారని ఆయన అభిమానులే కాదు, సాధారణ ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నారు. ఆరు పదులు దాటిన వయసులో పాతికేళ్ల నవ యువకునిలోని శక్తిని ప్రదర్శిస్తున్నట్లున్నారని కొనియాడుతున్నారు.
మేకింగ్ వీడియో, టీజర్లను పరిశీలిస్తే విజువల్గా ‘సైరా’ ఎంత గొప్ప స్థాయిలో ఉండనున్నదో కూడా తెలుస్తోంది. ఒకటిన్నర నిమిషాల లోపు నిడివి ఉన్న ఆ వీడియోలలోని విజువల్స్ చూస్తుంటేనే ఒళ్లు జలదరించిపోతోందంటే, ఇక సినిమా మొత్తంగా ఎలా ఉంటుందో ఊహించుకోవాల్సిందే. ఆ విజువల్స్ వెనుక పేరుపొందిన ఛాయాగ్రాహకుడు ఆర్. రత్నవేలు ఉన్నారు. ఇక సన్నివేశాలు భావోద్వేగభరితంగా రావడంలో బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ జూలియస్ పఖియమ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పాత్ర ఉంది. పాటలకు మరో బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్, నేషనల్ అవార్డ్ విన్నర్ అమిత్ త్రివేది స్వరాలు అందించారు.
ఇవాళ తెలుగు సినిమా ఎల్లలు చెరిపేసుకుంటూ, ఆకాశమే హద్దుగా పైపైకి ఎగబాకుతోంది. ఆ ఎల్లల్ని ‘సైరా’ మరింత విస్తృతం చేయనుండటానికి మనం ప్రత్యక్ష సాక్షులం కానున్నాం. తెలుగు సినిమా యవనికపై కొత్త చరిత్ర ఎలా లిఖింపబడుతుందో చూడాల్సిందే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap