దర్శకరత్న డా. దాసరి నారాయణరావుగారి ఆశయాలకు కొనసాగింపుగా ఏర్పాటైన ‘దాసరి టాలెంట్ అకాడమీ’ 2019 సంవత్సరానికిగాను షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్‌ను ప్రకటించింది. ఈ వివరాలను తెలియజేయడానికి ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో..
దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ – ”దాసరిగారు మనల్ని వదలి అప్పుడే రెండు ఏళ్ళు అయ్యిందంటే నమ్మలేకపోతున్నాం. ఆయన వెనక ఉండటం తప్ప ముందుకు రావడం నాకు తెలీదు. మొదటిసారిగా ఆయన లేకుండా ఆయన పేరు మీద చేసే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సూర్యనారాయణని అభినందిస్తున్నాను. కొత్త టాలెంటెడ్ డైరెక్టర్లు, ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్స్‌తోనే పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది అని గట్టిగా నమ్మిన వ్యక్తి దాసరిగారు. ఈ కార్యక్రమం విజయవంతం చేసి వచ్చే ఏడాది నుంచి ‘దాసరి టాలెంట్ అకాడమీ’లో సినిమాలు కూడా నిర్మిస్తామని తెలియజేసుకుంటున్నాను” అన్నారు.
సీనియర్ దర్శకులు ధవళ సత్యం మాట్లాడుతూ – ”దాసరి నారాయణరావుగారి పుట్టినరోజున ఈ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్‌ను నిర్వహిస్తున్న సూర్యనారాయణగారికి అభినందనలు. దాసరి నారాయణరావుగారి ఆశలు, ఆశయాలు, మానవతా విలువలు. అలాగే కుటుంబ అనుబంధాలు, కుటుంబ వ్యవస్థల కోసం నిరంతరం పాటుపడి వాటిపై ఎన్నో ప్రయోగాలను చేసిన నిత్యకృషీవలుడు దాసరిగారు. ఈ కాంటెస్ట్ ఔత్సాహికులు భారీ ఎత్తున పాల్గొని తక్కువ నిడివిలో ఎక్కువ అర్థం వచ్చేటట్లు షార్ట్ ఫిలింస్ తీసి ‘దాసరి టాలెంట్ అకాడమీ’కి పంపవలసిందిగా కోరుకుంటున్నాం. మెయిన్‌గా ఆయన గురించే ఎందుకు ప్రస్తావిస్తున్నామంటే.. ఆయన ప్రతి ఒక్కర్నీ ఆప్యాయంగా చూసుకున్నారు. ఆయన ఆశీస్సులు మాకెప్పుడూ ఉంటాయని భావిస్తున్నాం” అన్నారు.
దర్శకుడు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ – ”కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయడంలో దాసరిగారు ఎప్పుడూ ముందుండేవారు. ఆయన దర్శకత్వం వహించిన చిత్రాల్లో 90 పర్సెంట్ మానవతా విలువల పైనే తీసి వాటి ప్రాముఖ్యతను సమాజానికి తెలియజేసిన గొప్ప వ్యక్తి దాసరిగారు. అంతటి మహోన్నత వ్యక్తి స్ఫూర్తితో మరిన్ని సృజనాత్మక కార్యక్రమాలు జరపాలని కోరుకుంటున్నా” అన్నారు.
రైటర్ రాజేంద్రకుమార్ పైడిపాటి మాట్లాడుతూ – ”గురువుగారిపై ఉన్న స్ఫూర్తితో ఏవైనా మంచి కార్యక్రమాలు చేద్దామని ‘దాసరి టాలెంట్ అకాడమీ’ని స్థాపించడం జరిగింది. మే 4 దాసరిగారి పుట్టినరోజు ఘనంగా జరుపుకొని మే 5న ఫలితాలు వెల్లడిస్తాం” అన్నారు.
దర్శకుడు రాజా వన్నెంరెడ్డి మాట్లాడుతూ – ”సినీ పరిశ్రమ అభ్యున్నతి కోసం నిరంతరం ఎంతగానో పాటుపడిన మహనీయుడు దాసరిగారు. ప్రతి సంవత్సరం ఎన్నో మంచి కార్యక్రమాలు జరపాలని, మిత్రుడు సూర్యనారాయణగారికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా” అన్నారు.
దాసరి టాలెంట్ అకాడమీ ఛైర్మన్ సూర్యనారాయణ మాట్లాడుతూ – ”ఈ కార్యక్రమానికి మే 5 2018న ఆయన స్వగృహం నందు శ్రీకారం చుట్టాము. ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేయడానికి విచ్చేసిన అతిరథ మహాశయులు, మీడియావారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీ అందరి ఆశీస్సులతో ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుకుంటున్నా” అన్నారు.
నిర్మాత టి. రామసత్యనారాయణ మాట్లాడుతూ – ”ప్రియతమ గురువు, ప్రీతిపాత్రుడైన దాసరి నారాయణరావుగారి పేరుమీదుగా ఈ అకాడమీని ప్రారంభించి మానవతా విలువలపై షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ నిర్వహిస్తున్న మిత్రుడు, ఆప్తుడు సూర్యనారాయణ గారికి అభినందనలు తెలియజేస్తున్నా” అన్నారు.
ప్రతిభకు పట్టాభిషేకం!!
మానవ సంబంధాలు, మానవీయ విలువల నేపథ్యంలో 15 నిమిషాల నిడివితో షార్ట్ ఫిల్మ్ రూపొందించే వారికి అందించనున్న బహుమతుల వివరాలు.
మొదటి బహుమతి – రూ. 1 లక్ష
ద్వితీయ బహుమతి – రూ. 50 వేలు
తృతీయ బహుమతి – రూ. 25 వేలు.
మొదటి జ్యూరి – రూ. 25 వేలు
రెండవ జ్యూరి – రూ. 15 వేలు
ఉత్తమ దర్శకుడు – రూ. 20 వేలు
ఉత్తమ కథా రచయిత – రూ. 10 వేలు
ఉత్తమ నటుడు – రూ. 10 వేలు
ఉత్తమ నటి – రూ. 10 వేలు
పూర్తి వివరాలకు ‘www.dasaritalentacademy.org సైట్లో చూడగలరు.