
ఎక్ష్ రే ‘ నెలనెలా వెన్నెల’ కవిసమ్మేళన వేదికపై అశోక్ కుమార్ ప్రతి నెలా ఒక అమర కవి లేదా రచయిత యొక్క పరిచయాన్ని చేయడం, అలాగే ఆ ఆహ్వాన కరపత్రం వెనుక ఒక పుటగా ప్రచురించడం చూసి వీటితో ఒక పుస్తకం తెస్తే బాగుంటుందని మొదట్లోనే ఆయనకి సలహా ఇవ్వడం జరిగింది. దానికి ఆయన ఆ ఆలోచన ఉన్నదని అప్పట్లో చెప్పారు. ఇప్పుడది కార్యరూపం దాల్చింది- ఇలా 50 మంది నాటి నుంచి ఇటీవల మరణించిన సాహిత్యకారుల జీవిత చరిత్రల ‘అశోక నివాళి’ పేరుతో రెండు సంకలనాలుగా రావడం ద్వారా. రెండు సంకలనాలు ముఖ చిత్రాల నుండి చివరి అట్ట వరకూ ఆయా రచయితలు, కవుల చిత్రాలతో చూడముచ్చటగా, అపురూపంగా ఉన్నాయి. లోపలి పుటల్లో ఒకొక్కరి పరిచయం సంక్షిప్తంగా పుట్టిన తేది నుండి మరణించిన సంఘటలన వరకూ, కేవలం రెండు పుటల్లో ఏమాత్రం విసుగు కలగని రీతిలో అందివ్వడం చాలా బాగుంది. ఆయా కవి/రచయితల గురించి వ్యాసం మొదల్లోనే నాలుగు పంక్తుల చిరు కవితగా తన కవితా సృజనతో వారి గొప్పతనాన్ని పట్టి చూపించడం అశోక్ కుమార్ లోని ప్రత్యేక లక్షణంగా చెప్పవచ్చు. ముఖ్యంగా సాహిత్యసభల్లో పాల్గొనేవారికి, ప్రఖ్యాత రచయిత/ కవుల జయంతులు, వర్థంతుల సభల్లో ప్రసంగించాలనుకునే వారికి, తెలుగు పాఠ్యాంశ విద్యార్థులైన వివిధ పోటీలలో పాల్గొనేవారికి ఈ రెండు పుస్తకాలు ఎంతో ఉపయుక్తం. భవిష్యత్ తరాల వారికి మన తెలుగు సాహితీకారుల చరిత్ర గురించి తెలియజెప్పే గొప్ప కానుక ఈ రెండు ‘అశోక్ నివాళి’ సంకలనాలు, దివంగత తెలుగు సాహితీకారులకు అశోక్ కుమార్ అందజేసిన నిజమైన అక్షర నివాళి గీతాలు. చివరగా చిన్న సూచన. ఈ రెండు పుస్తకాలు ఒకేసారి ప్రచురించారు కనుక పరిశోధకుల సౌలభ్యం కొరకు మొత్తం ఒక పుస్తకంగా ప్రచురిస్తే బాగుండేది. ఎందుకంటే, గతంలో ఒక వెలకట్టలేని అపురూపమైన పుస్తకం పాత పుస్తకాల షాపులో దొరికిందిగాని దాని తరువాతి రెండవ ఎడిషన్ దొరకక పోవడం వల్ల అసంతృప్తికి లోను కావలసివచ్చింది. ఈ ప్రచురణ ఇంతటితో ఆగదు కనుక భవిష్యత్లో మరింతమంది సాహితీకారుల చరిత్రను చేరుస్తారు కనుక ఇలా పుస్తక ప్రేమికులకు ఇబ్బంది కలిగించని రీతిలో, తరువాత ప్రచురించే సంకలనాన్ని ఇలా విడివిడి పుస్తకాలుగా ప్రచురించకుండా ఒకే పుస్తకంగా గుత్తిగా అందిస్తే బాగుంటుందన్నది ఓ చిన్న సూచన.
ఈ పుస్తకాలు కొన్నవారికి నూరు అమర సాహితివేత్తల కలర్ ఫోష్టర్ల ఆల్బం కానుకగా మెయిల్ ద్వారా అందివ్వడం మంచి ఆలోచన.
– చలపాక ప్రకాష్
“అశోక నివాళి” (తెలుగు సాహితీకారుల సంక్షిప్త జీవిత చరిత్రలు) రెండు భాగాలు
రచన: సింగంపల్లి అశోక్ కుమార్, ఒకొక్కటి వెల: రూ.100/-, పుటలు: ఒకొక్కటి 120; ప్రతులకు: ఆలోచన, 305, ప్రగతి టవర్స్, వీరయ్య వీధి, మారుతీనగర్, విజయవాడ – 520004
Useful books, congrats Ashok kumar garu
Great effort Ashok garu