మనకున్న అతి కొద్ది మహిళా కార్టూనిస్టులలో సోదరి శ్రీమతి వాగ్దేవి ఒకరు. కుటుంబ, ఉద్యోగ బాధ్యతల కారణంగా తక్కువ కార్టూన్లు గీసినప్పటికీ మంచి కార్టూన్లు ఎన్నో అనేక పత్రికలలో గీసారు. వారితో నా పరిచయం 2003 సం. లో జరిగింది… అప్పటి నుండి ఇటీవల వారి అమ్మాయి లాస్య ప్రియ వివాహం విజయవాడ అబ్బాయితో జరగడం, తర్వాత విజయవాడ లో జరిగిన పరిచయ కార్యక్రామానికి కార్టూనిస్టు లందరం వెళ్ళడం, మాతో ఎంతో అప్యాయంగా వారు గడపడం జరిగింది. ఇంతలోనే ఈరోజు (26-112018)వారు కన్నుమూసారు అని తెలిసి షాక్ కు గురయ్యాను. చివరిగా గత నెల నాతో మాట్లాడుతు పాపకు మంచి సంభందం దొరికిందని సంతోషం వ్యక్తం చేసారు. వారి అకాల మరణానికి (59 యేళ్ళ వయసులో) సంతాపం తెలుపుతూ, వారు గతం లో రాసుకున్న స్వపరిచయం మరోకసారి వారి మాటల్లో చదువుకుందాం.
మా స్వస్థలం గుంటూరు జిల్లా, బాపట్ల. నా పూర్తి పేరు వాగ్దేవి కృష్ణ కుమారి. పది సంవత్సరాల వయస్సులో శ్రీరామకృష్ణ మిషన్ కు మా అక్క నేను వెళ్తుండేవాళ్ళం. అక్కడ వివేకానందుని జీవిత చరిత్ర చిత్రాలతో ఉన్న పుస్తకం ఇచ్చి, ఆ సంవత్సరం ప్రచురించబోయే సావనీర్ కోసం రంగులతో బొమ్మలు వేయమన్నారు.
అక్క చిల్లర భవానీదేవి(రచయిత్రి), నేను వాటర్ కలర్స్తో ఆయన జీవిత విశేషాలను పెయింటింగ్లా వేయడం, ప్రశంసలందుకోవడం జరిగింది. తదుపరి రామకృష్ణ మిషన్ కి సంబంధించిన బొమ్మలు తరుచూ గీస్తుండడం వలన నేనూ బొమ్మలు వేయగలను – అన్న నమ్మకం కలిగింది. అప్పట్లో అగ్రికల్చర్ కాలేజీలో ఆర్టిస్టుగా పనిచేస్తున్న కీ.శే. ఉల్చిగారి దగ్గరకెళ్ళి పెయింటింగ్లో కొన్ని మెళకువలను నేర్చుకొని, వాటర్ కలర్స్, ఆయిల్ కలర్స్తో బొమ్మలు ప్రాక్టీస్ చేసేదాన్ని, అలా వేసిన పెయింటింగ్స్ ఇప్పుడు నా దగ్గర ఒకటి కూడా లేదు. ఎందుకంటే ఎవరైనా బాగుందంటే ఇచ్చేసేదాన్ని..
1982లో ఆంధ్రభూమి వార పత్రికలో శ్రీ సత్యమూర్తిగారి శీర్షిక ‘కార్టూన్స్ వేయటం ఎలా?” చూసి కార్టూన్లు గీయడం ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాను.
“ఆంధ్రభూమి’ వార పత్రికలో (1982) మొట్టమొదటి కార్టూన్ పబ్లిష్ అయ్యింది అలా గీస్తుండగానే 1984లో క్రోప్రిల్ హాస్యప్రియ’ పత్రిక వారు నిర్వహించిన కార్టూన్ పోటీలో కొత్త కార్టూనిస్టుల విభాగంలో నాకు ప్రథమ బహుమతి రావటం, ఆ విషయాన్ని నేటి, మేటి కార్టూనిస్టు అయిన శ్రీ బాచి, మరియు శ్రీ అన్నంరాజులు మా ఇయింటికి వచ్చి చెప్పడం, నేను హైదరబాదు వెళ్లి శ్రీ శంకరశాస్త్రి గారి చేతులమీదుగా బహుమతి అందుకోవడం చాలా ఉత్సాహాన్నిచ్చింది. అప్పటినుండి వీలున్నప్పుడల్లా కార్టూన్లు గీస్తున్నాను. హైదరాబాద్ వచ్చినపుడు శ్రీయితులు శంకు, యం.ఎస్.రామకృష్ణ, సత్యమూర్తి, రాజు గారి లాంటి కార్టూనిస్టులను చూడడం, వారితో మాట్లాడడం జరిగింది. తరువాత వరుసగా “కోనసీమ చిరంజీవి యూనిట్ వారు నిర్వహించిన పోటీల్లో 2వ బహుమతిగా సిల్వర్ మెడల్ గెలుపొందడం, దానిని నేడు ‘ఈనాడు’ దినపత్రికలో పనిచేస్తున్న సోదరులు శ్రీవల్లిగారు అమలాపురం నుండి ఆ సిల్వర్ మెడల్ను తెచ్చి, నా పెళ్లికి గిఫ్ట్ గా ఇచ్చారు. ఇవే కాక రోటరీ క్లబ్-విశాఖ, వెంకట్ కార్టూన్స్ పోటీలు అనేకానేక వివిధ పత్రికలు నిర్వహించిన పోటీలలో పాల్గొని అనేక బహుమతులు అందుకున్నాను.
నా అనారోగ్య కారణంగా కొంతకాలం కార్టూన్లు గీయలేకపోయాను. ఉద్యోగరీత్యా 2005లో హైదరాబాద్ కి వచ్చిన తర్వాత ‘పర్యావరణం’ మీద నిర్వహించిన కార్టూన్ పోటీల్లో పాల్గొని ద్వితీయ బహుమతి (రూ.3000) పొందడంతో తిరిగి ఉత్సాహంతో కార్టూన్లు గీయడం కొనసాగిస్తున్నాను. .
“గ్లాట్ టూ మీట్ యు” సభలో శ్రీజయదేవ్ గారు వారి సతీమణి గార్లతో పరిచయమైంది. జయదేవ్ గారు కూడా బాపట్లలో కొద్దిరోజులు చదువుకున్నారట. జయదేవ్ గారు చదువుకున్న స్కూల్లోనే నేనూ చదివానని మాటల సందర్భంలో తెలిసింది. హైదరాబాద్ లో శ్రీయుతులు ముళ్ళపూడి రమణగారిని బాపుగారిని స్వర్ణకంకణం తొడిగి సన్మానించారు. సన్మానం తదుపరి బాపుగారితో మాట్లాడే అదృష్టం కలిగింది. కొద్ది సేపు ముచ్చటించాక “నీ కార్టూన్స్ చూస్తున్నాను, బాగున్నాయి వేస్తూ ఉండు” అన్నారు. ఈ మాటే ఎన్నో అవార్డులతో సమానం.
2014లో అనకాపల్లి నుండి కారనిస్టు భువన్గారు నిర్వహించిన అవార్డు కార్యక్రమంలో శ్రీబాలి, ఆకుండి సాయిరాం గారితో పాటు నాకు అవార్డు ప్రదానం చేస్తూ పూలవర్షంతో మమ్మల్ని సన్మానించారు. ఇది మరచిపోలేనటువంటి సన్మానం మా కార్టూనిస్టులకు. అనకాపల్లి వరకూ వచ్చాం కదా అని కుమారి రాగతి పండరిగారికి ఫోను చేసి విశాఖ వెళ్ళాం. ఆమెను కలిసిన ఆనందంతో ఇద్దరం ఉక్కిరిబిక్కిరయ్యాం . పదేళ్ళుగా ఫోన్లో మాట్లాడుకోవడమే గాని కలిసింది అదే మొదటిసారి. చిన్న పిల్లలాగా ఒక పెన్ను పట్టుకొని నా కెప్పుడిద్దామా అన్నట్లు ఎదురుచూస్తున్నారు. నేనేమో ఆ బంగారు చేతులకు రాళ్ళ గాజులు బహుకరించాను. వాళ్ళ అక్క రాగతి రమగారు తర్వాత ఫోనులో చెప్పారు “ఆ గాజులు చూసుకొని ఎంతగానో మురిసిపోతుందని! నేను ఊహించలేదు అదే ఆమె చివరి కలయిక అవుతుందని, ఇద్దరం ఫొటోలు దిగాం. ఆ ఫొటోలు ఎప్పటికీ చెరగని జ్ఞాపకం.
“రాసికన్నా వాసి” ముఖ్యం అని నా ఉద్దేశ్యం. ఇంతవరకూ ఐదారొందల కార్టూన్స్ గీస్తుంటాను. ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రసచిత్ర వారపత్రిక, వనితాజ్యోతి, జ్యోతిచిత్ర, భావతరంగిణి, క్రోక్విల్ హాస్యప్రియ, 64కళలుడాట్ కాం, హాస్యానందం, నది, తెలుగుతేజం మొదలగు పత్రికలలో నా కార్టూన్లు పబ్లిష్ అయ్యా యి..
తెలుగు కార్టూనిస్టులందరూ ఐక్యంగా ఉంటూ అంతర్జాతీయంగా పేరు తెచ్చుకోవాలి, సామాజికంగా ఆలోచిస్తూ…. చక్కటి విమర్శనాత్మకంగా పదుగురు చదివి ఆనందించేలా కార్టూన్స్ గీయాలని నా కోరిక. అందరికీ వందనాలు.
– వాగ్దేవి తుర్లపాటి
Good Human being. RIP
May her soul rest in peace. Telugu people lost a good woman cartoonist.
RIP