ప్రముఖ నటుడు, దర్శకుడు, నట శిక్షకుడు దేవదాస్ కనకాల(70) శుక్రవారం (02-08-19) న కన్నుమూసారు. కొన్నాళ్లుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల అస్వస్థతకు గురవ్వడంతో కిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతిచెందినట్టు రాజీవ్ కనకాల వెల్లడించారు. 2018లో తన భార్య లక్ష్మి మృతి ఆయనను ఎంతోగానో కలిచివేసింది. దీంతో దేవదాసు ఇంటికే పరిమితమయ్యారు. నటనలో శిక్షణ ఇవ్వడంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు ఈయన. రజనీకాంత్, చిరంజీవి, రాజేంద్ర ప్రసాద్, శుభలేఖ సుధాకర్, నాజర్, ప్రదీప్ శక్తి, భానుచందర్, అరుణోపాండ్యన్, రాంకీ, రఘువరన్, ఆహుతి ప్రసాద్, అచ్యుత్, శివాజీరాజా, రామ్చరణ్, కామేశ్వరి, అనిల్, సునీల్, కాళకేయ ప్రభాకర్, సమీర్, అల్లరి నరేష్ మంచు మనోజ్ వంటి సినీ నటులతో పాటు, టీవీలో ఉన్న నటులు చాలా మంది దేవదాస్ కనకాల వద్ద నట శిక్షణ పొందినవారే.
ఈయన 1945లో జూలై 30న జన్మించారు. దేవదాసు స్వగ్రామం యానాం శివారులోని కనకాల పేట. ఆయన తండ్రి కనకాల పాపయ్య నాయుడు యానాం ఫ్రెంచి పరిపాలనలో ఉన్నప్పుడు యానాం ఎమ్మెల్యేగా పనిచేశారు. తల్లి మహాలక్ష్మమ్మ
1971 నవంబరు 21న లక్ష్మీదేవి, దేవదాస్ కనకాల ప్రేమ వివావాం చేసుకున్నారు. ఆవిడ కూడా నటి, నట శిక్షకురాలు. వీరికి ఒక కుమారుడు రాజీవ్ కనకాల ఒక కుమార్తె శ్రీలక్ష్మి, రాజీవ్ కనకాల భార్య యాంకర్ సుమ. దేవదాసు కుమార్తె శ్రీలక్ష్మి నాటకరంగ ప్రముఖులు డా. పెద్ద రామారావును వివాహం చేసుకున్నారు. కొడుకు, కూతురివి కూడా ప్రేమ వివాహాలే. సినిమా కోసం తన ఉద్యోగానికి రాజీనామా చేసిన ఈయన ‘ఓ సీత కథ’లో ముఖ్యపాత్రను పోషించారు. చలిచీమలు’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. మదరాసులోని అడయార్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్లో ఎ.ఆర్.కృష్ణ సారథ్యంలో నడిచిన ఆంధ్రప్రదేశ్ రిపక్టరీ, మధు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్లో అధ్యాపకుడిగా పనిచేశారు. తెలుగు విశ్వవిద్యాలయం రంగస్థల కళాశాలలో అధ్యాపకునిగానూ, శాఖాధిపతిగానూ బాధ్యతలు నిర్వహించారు. నాటక రంగానికి వన్నెలద్దిన ప్రసిద్ధ నటనా శిక్షకుడు. దేవదాస్ కనకాల సౌత్ సినీ ప్రేక్షకులందరికీ పరిచితుడే.
నాటక రంగంలో ప్రారంభమైన ఈయన కెరీర్ సినిమాల్లో నటించడం, దర్శకత్వం వహించడం వరకూ సాగింది. ఆయన చివరి శ్వాస వరకూ నటీనటులను తయారు చేయడంలో నిమగ్నమయ్యే ఉన్నారు. ఆయన భార్య లక్ష్మి మరణించే వరకూ తన నటన ఇనిస్టిట్యూట్! ప్రిన్సిపాల్గా వ్యవహరించారు. ఓ సీత కథ, మాంగళ్యానికి మరో ముడి, సిరిసిరి మువ్వ, గోరింటాకు, మంచుపల్లకి, చెట్టుకింద ప్లీడర్, అమ్మో ఒకటో తారీఖు, గ్యాంగ్ లీడర్, మనసంతా నువ్వే, శ్రీరామ్, పెదబాబు, అసాధ్యుడు వంటి చిత్రాల్లో దేవదాస్ నటించారు. 2010లో ఎంతైరన్ అనే తమిళ సినిమా నటించారు. గత ఏడాది చివరగా ‘భరత్ అనే నేను’ చిత్రంలో ఆయన నటించారు.
కోలంక గ్రామంలో తొమ్మిదో తరగతి వరకు, యానాంలో పదో తరగతి, కాకినాడలో పిఠాపురం మహారాజా కాలేజీలో పీయూసీ చేశారు. విశాఖపట్నంలో బీఏ చదువుతూ ఆంధ్రా విశ్వవిద్యాలయంలో యాక్టింగ్ కోర్స్ డిప్లొమాలో డిస్టింక్షన్లో పాసయ్యారు. తర్వాత పుణె ఫిల్మ్ ఇనిస్టిట్యూట్లో యాక్టింగ్ కోర్స్ పూర్తి చేశారు. సాక్షి రంగారావు, దేవదాసు క్లాస్ మేట్స్. ముళ్లపూడి వెంకట రమణ, బాపు “బుద్ది మంతుడు’ సినిమా సన్నాహాల్లో ఉన్న సమయంలో సాక్షి రంగారావు వారికి ఆయన్ని పరిచయం చేశారు. ఆ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు స్నేహితుడి వేషం ఇచ్చారు. అదే కనకాల మొదటి చిత్రం. ‘ఓ సీత కథ’ చిత్రంలో చేసిన తాగుబోతు పాత్ర ఆయన కెరీర్ ను మలుపు తిప్పింది. నూటొక్క జిల్లాలకు అందగాడ్ని అనే డైలాగ్ నూతన ప్రసాద్ నట జీవితానికే టర్నింగ్ పాయింట్ అయ్యింది. ఆ చిత్రమే ‘చలి చీమలు’. దానికి దర్శకత్వం వహించింది ఈయనే. దానికి ముందు ‘నిజం’ తర్వాత ‘నాగమల్లి’, ‘ఓ ఇంటి భాగోతం’ వంటి చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు.