నవనాట్య తరంగిణి – లేఖ్యాభరణి

నేటి ఆధునిక ప్రపంచంలో, ఒకే ఇంట్లో వుండే తల్లి, తండ్రి, ఇద్దరంటే ఇద్దరు పిల్లలు వారి వారి ఇష్టాలకు, అభీష్టాలకు భిన్నంగా ఆ నలుగురూ తలోదారిలో నడుస్తూ తల్లడిల్లుతున్న ఈ రోజుల్లో తమ తాతలు, తండ్రులు చూపినదారిలోనే పయనిస్తూ, నర్తిస్తూ, కూచిపూడి. కథక్ వంటి భారతీయ నృత్య రీతుల్లో తననుతాను తీర్చిదిద్దుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేకతను కనబరుస్తూ, శాస్త్రీయ నృత్య చరిత్రలో ఓ నూతన’ అధ్యాయాన్ని లిఖిస్తున్న భారతీయ యువనృత్యకళాకారిణి లేఖ్యాభరణి.

బుజ్జికాలికి సిరిగజ్జెలు :
కేవలం మూడంటే మూడేళ్ల చిరుప్రాయంలోనే తన బుజ్జికాళ్లకు సిరిగజ్జెలు కట్టించుకుని బుడిబుడి నడకలలో పడుతూ లేస్తూనే నృత్యపథంలో వడివడిగా అడుగులేస్తూ నృత్యసాధన సహజంగా, అప్రయత్నంగా చేస్తూ నేడు మనముందు ఓ ఉత్తమ కళాకారిణిగా నిలబడి మన్ననలందుకొంటున్న లేఖ్యాభరణి 12 ఏళ్లకే తొలి ప్రదర్శననిచ్చింది.

ఆదర్శ(క) కుటుంబం :
“కళ ఓ సింధువు – కళాకారుడు ఓ బిందువు” అనే ఆర్యోక్తికి అనుగుణంగా నిత్యం నృత్య కళా పారావారంలో ఓలలాడే లేఖ్య తల్లిదండ్రుల పరివారంలో ఈమె తాత (పితామహులు) పరమానంద పిళై ఓ కేంద్రబిందువుగా భాసిల్లిన శాస్త్రీయ నృత్య దర్శకులు కావటం వలన వారి నుండి ఈ నృత్యకళ తనకు వారసత్వంగా లభించినట్లు భావిస్తున్న భరణి తన తల్లిదండ్రులే ఈ రంగంలో తనకు ఆది. గురువులు కావటం తనకు ఓ ‘వరం’గా అభివర్ణిస్తుంది.  తమ పిల్లల సంపాదనల కోసం తాపత్రయం మానేసి మన సాంప్రదాయాన్ని, సంస్కృతిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్న లేఖ్య తల్లిదండ్రులు నృత్యదర్శకులైన పద్మశ్రీ – హేమంత్ లు ఆదర్శ అమ్మానాన్నలుగా నిలుస్తారు. కంప్యూటర్స్, గ్రాఫిక్స్లలో కళ తప్పుతున్న భారతీయ నృత్య రీతులలో తల్లిదండ్రుల యిచ్చే తర్ఫీదుతో, అంకితభావంతో, అభినయం, ఆంగికాలతో, అణకువ, మెళకువలతో అభివృద్ధి సాధిస్తున్న లేఖ్య ఓ ఆదర్శ అమ్మాయిగా అభినందనీయురాలు.

ఆశయము – యశము :
తన నృత్య ప్రదర్శనల ద్వారా తనకు లభించే యశమును తన తల్లిదండ్రులకు కట్టబెట్టాలన్న ఉన్నతాశయము కలిగిన లేఖ్యను కన్న తల్లిదండ్రులు ధన్యులు.

బాల్యం – భరతనాట్యం:
అక్షరాభ్యాసానికై చేతులతో పలక, బలపం పట్టకముందే నృత్య కళాభ్యాసం వైపు కాళ్లు కదిలినందు వలననే భరతనాట్యంలో రెండు దశాబ్దాల సాధన సంపత్తిని సొంతం చేసుకున్న ‘భరతనాట్య భాగ్యశాలిని’ లేఖ్యాభరణి ఏ ఇతివృత్తమైనా అలవోకగా నర్తించి, ప్రదర్శించి ప్రేక్షక ప్రశంసలందుకుంటుంది.

దీప్తి :
ప్రేక్షకులను రోమాంచితం చేసే శాస్త్రీయ నృత్య ప్రదర్శనలో పళ్లెరముల మేళవింపు లేఖ్యాభరణి ప్రదర్శనకు అదనపు అందంగా నిలుస్తుంది. డిగ్రీతో పాటు భరతనాట్యం నృత్యంలో డిప్లొమా పూర్తిచేసిన లేఖ్యాభరణి దూరదృన్లో బి-గ్రేడ్ ఆర్టిస్టుగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం డా. వేదాంతం రామలింగశాస్త్రిగారి ఆధ్వర్యంలో ఎం.ఏ. కూచిపూడి కోర్సుకు శిక్షణ పొందుతున్నారు. నృత్యంలో పి. హెచ్డి. చేయాలన్నది ఈమె ఆకాంక్ష.

ఆసక్తి :
భారతీయ లలితకళా వైభవానికి ప్రతీకలై నిలిచే భారతీయ నృత్యరీతుల లోతులలోకెళ్లి పరిశోధించి, తాను సాధించిన ఫలాలతో సనాతన, అధునాతన పద్దతులను మేళవించి మన నృత్య కళా వైభవాన్ని కొంగొత్తగా ప్రపంచానికి అందించటమే తన లక్ష్యంగా నిర్ణయించుకున్న ఈ జిజ్ఞాసువు తానెంత ఎదిగినా తన ఇంకా ఈ రంగంలో శిశువుగానే ఉన్నానని నిరాడంబరంగా చెప్పటం తనకు తల్లిదండ్రుల నుండి అబ్బిన సుసంస్కారానికి అద్దం పడుతుంది.

ఉత్పత్తి : నృత్యదర్శకులు హేమంత్ కుమార్, పద్మశ్రీ దంపతులకు 1995 విజయవాడలో జననం.

సాధనాసంపత్తి :
1) 2016-రిపబ్లిక్ డే సందర్భంగా ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోడి సమక్షంలో నృత్య ప్రదర్శనలు.

2) 2014-ఆటా ఆధ్వర్యంలో అమెరికాలో బృందనృత్య ప్రదర్శన.

3) 2014-మెగాస్టార్ చిరంజీవి సమక్షంలో నృత్య ప్రదర్శన.

4) 2011- నాగపూర్ దక్షిణప్రాంత సాంస్కృతిక కేద్రంలో నృత్య ప్రదర్శన.

5) 2016- ఏలూరు అభినవ నృత్యభారతి సంస్థవారిచే “నృత్యకౌముది’, గుంటూరు సాయిమంజీరా కూచిపూడి ఆర్ట్స్ అకాడెమీ వారిచే ‘యువకళారత్న పురస్కారాలు అందుకుంది.

సూక్తి :
“ఫైన్ ఆర్ట్స్ రంగంలో రిటైర్మెంట్ లేని పర్సన్ ఓన్లీ ఆర్టిస్ట్”గా భావించే లేఖ్యాభరణి యువత మంచి “జీతం’ కోసం ఎంచి, ఎంచి చదివే చదువులతోపాటే వారికి నచ్చిన ఏదో ఓ లలితకళనీ సాధన చేసినట్లయితే… “జీవితం’లో అడుగడుగునా ఎదురయ్యే అనేక సమస్యల్ని అతిగా ఆందోళనకు, ఒత్తిడికి గురికాకుండా వాటిని ధైర్యంగా ఎదిరించే మానసిక, శారీరిక బలం చేకూరుతుందని, ఇంతే కాకుండా దీనివల్ల మనకు దొరికే అమూల్యమైన సమయ సద్వినియోగం జరుగుతుందని వివిధ రుగ్మతలు, రాగద్వేషాలు, దుర్వ్యసనాలు మన దరి చేరవని, సామాజిక, వైయక్తిక బాధ్యత, సభ్యత, సఖ్యత, సంస్కారం వంటి మేలిగుణాలు అలవడటం వలన మన చుట్టూవున్న సమాజంలో పెరిగే గౌరవ ప్రతిష్ఠలతోపాటు నిష్ఠగా కళారాధన, సాధనల ద్వారా కూడా అందరూ అచిరకాలంలోనే అంతర్జాతీయ ఖ్యాతినందుకునే ఆస్కారం కూడా వుంటుందంటూ మనతోపాటు మరో నలుగుర్నీ అలరించగల అరుదైన శక్తి లలితకళల ప్రత్యేకతగా పేర్కొంటూ ఇదే తాను తన యువజగతికిచ్చే ఓ సూచనగా తెలియచేసింది.

నివాసాంధ్రులను, ప్రవాసాంధ్రులను, స్వదేశీయుల్ని, విదేశీయుల్ని విస్మయపరుస్తున్న ఆంధ్ర అమ్మాయి లేఖ్యాభరణి తన నృత్య విలాసంతో అమరావతి అమరఖ్యాతికి కారకం కావాలని 64కళలు.కామ్ ఆకాంక్షిస్తూ…. శుభాకాంక్షలు తెలియచేస్తున్నది.

– బి.యం.పి.సింగ్

3 thoughts on “నవనాట్య తరంగిణి – లేఖ్యాభరణి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap