నవరసభరితం నాటకం

ప్రపంచ రంగస్థల దినోత్సవం – సందర్భంగా ప్రత్యేక వ్యాసం
నాటకం జీవకళ, జీవితాన్ని ప్రతిబింబించే కళ మాత్రమే కాదు. సజీవంగా ప్రేక్షకుల ముందు ఆవిష్కరించే కళ. అందుకే ఎన్ని సార్లు ఆడిన నాటకమయినా, ఎంతటి గొప్ప సంస్థ కళాకారుడికైనా, ఎంతటి ప్రయోక్తకైనా, ప్రతి ప్రదర్శన ఓ అగ్ని పరీక్షే, రంగస్థలానికి ముందు వుండే కళాకారులకి, వెనక వుండే సాంకేతిక నిపుణులకి సమన్యయంతో ఆవిష్కరించే నిత్య సజీవకళ నాటకం. అందుకే జీవితానికి దర్పణం నాటకం సమాజంలోని సమస్యలను ప్రతిబింబిస్తూ వారిలో చైతన్యాన్ని కలిగించే ప్రచార సాధనం. రచయిత, దర్శకుడు, నటుడు, ప్రేక్షకుడు వీరు నాటకానికి నాలుగు స్థంభాలు.
సాహిత్య ప్రక్రియలలో నాటకరచన కష్టమైంది, క్లిష్టమయింది. రచయిత స్రష్ట అయితే నటుడు ఆ భావాన్ని వ్యక్తపరిచే వ్యాఖ్యాత అవుతాడు. నాటకం సర్వజనామోదకరమైనప్పుడు, అది రసానంద జనకమవుతుంది. నాటక ఇతివృత్తం సాంఘికమయినా, పౌరాణికమయినా, చారిత్రాత్మకమయినా, దాని అంతిమలక్ష్యం సమాజశ్రేయస్సేనని చెప్పకతప్పదు.

అందుకే, రంగస్థల అభివృద్ధికోసం, కళాకారుల సంక్షేమం కోసం ప్రతిసంవత్సరం మార్చి 27వ తారీఖునాడు ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ రంగస్థల” దినోత్సవాన్ని జరుపుకుంటారు. పారిస్ లోని “ఇంటర్నేషనల్ థియేటర్ ఇనిస్టిట్యూట్” వారు మార్చి నెల 27వ తారీఖు “ప్రపంచ రంగస్థల దినోత్సవంగా”నిర్దేశించారు. ఈ రంగస్థల దినోత్సవాన్ని మొట్టమొదటి సారిగా యునెస్కో ఆధ్వర్యంలో 1962 లో జరిపారు. రంగస్థల కళాకారులు, నాటక రచయితలు, ప్రయోక్తలు, సాంకేతిక నిపుణులు మొదలయినవారు భక్తిశ్రద్ధలతో ఈ రంగస్థల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచంలోని వివిధ దేశాల సంస్కృతుల్ని, అలవాట్లని, సమస్యలని అందరికి అర్ధయమ్యే రీతిలో నాటక రచన ద్వారా, ప్రదర్శన ద్వారా ప్రజలకు చేరువయ్యే విధంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.

2019 సం.లో క్యూబాకు చెందిన నాటక రచయిత, నటుడు, దర్శకుడు – కార్లోస్ కెల్డ్రన్ తన సందేశంలో ఏమన్నారంటే…
“నాటకం గురించి నేను నా గురువుల ద్వారా తెలుసుకున్నది ఏమిటంటే, కళాకారులు అందరు ఓకే చోట చేరి ‘నాటకం’ అనే చీకట్లో కేవలం ఒకరితో ఒకరు తమ సంజ్ఞలతో పోటీ పడుతూ తమ భావాలూ
ప్రేక్షకులకు తెలియజేస్తారు. ఎక్కడో ప్రపంచంలోని మారుమూల ప్రాంతాల నుండి వచ్చిన ప్రేక్షకులతో కిక్కిరిసిన థియేటర్ నేండి పారదర్శకత అనే అద్దంలో సమాజాన్ని ప్రతిబింబిస్తారు. నేను ఈ నిజాన్ని అర్థం చేసుకోవడానికి మరల పునర్జన్మ పొందాలని భావిస్తున్నాను.”
ఈ సందేశాలు మన రంగస్థల కళాకారులికి స్పూర్తినివ్వాలి. దాని ఆధారంగా మనం మంచి సందేశంతో కూడిన నాటకాలు ప్రదర్శించాలి. అందుకే ఈ రోజు రంగస్థల కళాకారులందరూ ఒక చోట సమావేశమై, రంగస్థలానికి సంబంధించిన సమస్యల గురించి చర్చించుకోవాలి. నిత్యజీవితంలో మనం ఎదుర్కొంటున్న సమస్యల్ని నాటకాలుగా రచించి ప్రదర్శిస్తే, ప్రేక్షకులు చైతన్యవంతులౌతారు. మనసులో దాగివున్న మనోభావాలను వ్యక్తపరిచే సాధనం రంగస్థలం. నాటకం అనేక సమస్యలకి శక్తివంతమయిన ప్రక్రియ. సుశిక్షితులైన నటీనటులు, రంగస్థలాలు, రంగస్థల సామాగ్రి, వేషభాషలు, విద్యుద్దీపనం లాంటి సమస్యలని అధిగమిస్తూ ఈ ప్రక్రియ ద్వారా నాటక కళారూపానికి జీవంపోస్తున్న కళాకారులందరూ ధన్యులు.

మన వైతాళికులు కందుకూరి (వ్యవహార ధర్మబోధిని) గురజాడ (కన్యాశుల్కం) నాటకాన్ని ఓ అస్త్రంగా సంధించి, సమాజంలో కుళ్ళును కడిగేందుకు రాచబాట వేసారు. సాంఘిక నాటక ఆవిర్భావమే అలా సంస్కరణలతో ప్రారంభమయింది. సమాజ పరిణామంలో ఇదో పెద్ద మలుపు. అటువటి నాటకాలు చూడటం. ఆడటం, ఆడించడం, ఉత్తమ సంస్కారంగా సమాజంలో చలామణి అయింది. స్వాతంత్ర్యానికి ముందు, ఆ తర్వాత సాంఘిక నాటకం ప్రగతిశీల భావాలతో అలా పరవళ్ళు తొక్కింది.

నాటకానికి సాహిత్యమే పునాది. నాటక రచన క్లిష్టమైనది. కష్టమైనది. ‘నాటకాంతం హి సాహిత్యమ్” అన్నారు కదా పెద్దలు. గాఢమైన జీవితానుభవము, లోకానుభవము, ప్రాపంచిక జ్ఞానము. కవితాత్మ లేనిదే నాటక రచన చిక్కపడదు.

రచయిత నాటకం ద్వారా తాను చెప్పదలుచుకున్న విషయంపై విశ్వాసం, పాత్రలు, సంఘటనలు, సన్నివేశాలపై సహేతుక విశ్లేషణ, ప్రదర్శన, గమనం, గమ్యంపై స్పష్టమైన అవగాహన, ప్రదర్శనాంతరం ప్రేక్షకులపై పడే ప్రభావం ముందుగానే రచయిత గురైరగాలి.సదా ప్రేక్షకులకు జవాబుదారి వహించాలి. అంటే నాటక రచనను సామాజిక బాధ్యతగానే పరిగణించాలి.

బళ్ళారి రాఘవ నాటక రంగంలో నూతన విప్లవాన్ని తీసుకువచ్చారు. పాత పద్దతులకి స్వస్తి చెప్పి నాటకరంగంలో కొత్త పోకడల్ని ప్రవేశపెట్టారు. స్త్రీపాత్రలు స్త్రీలే ధరించాలన్న విప్లవాత్మకమైన మార్పున్ని ప్రవేశపెట్టారు.

నాటకానికి కావల్సింది క్రమశిక్షణ, ఏకాగ్రత, శ్రద్ధ ఇవన్నీ లేనినాడు నాటక ప్రదర్శన రక్తి కట్టే అవకాశం లేదు. మరి ఆనాటి నటీనటులందరూ ఈ గుణాలన్నీ పుణికి పుచ్చుకున్నారు కనుకనే, ఆనాటి నాటకాలు ఇప్పటికీ శాశ్వతంగా నిలిచివున్నాయి.

ఒక నాటకం రక్తి కట్టాలంటే, నటీనటులు, మొత్తం నాటకాన్ని ఆమూలాగ్రంగా చదివి కృషి చెయ్యాలి. త్యాగం, అకుంఠిత కృషి, చిత్తశుద్ది వుండాలి. అదుకే తన పాత్రకి తగ్గట్టుగా డైలాగ్ అభ్యాసం చెయ్యాలి. డైలాగులు పలకవలసిన రీతిలో పలకలేకపోతే, నాటకం అభాసు పాలయ్యే అవకాశముంది. అందుకే ఎక్కువసార్లు రిహార్సల్స్ చెయ్యాలి. గతంలో రెండు, మూడు నెలలు రిహార్సల్స్ చేసేవారు. అందుకే అప్పటి నాటకాలు బాగా రక్తి కట్టేవి.

రచయిత, దర్శకుడు, నటుడు, ప్రేక్షకుడు నాటకానికి నాలుగు స్థంభాలు ఎటువంటి నాటకానికైనా ఈ నాలుగు స్థంభాలు చాలా ముఖ్యమైనవి. గత కాలంలో నాటకాన్ని తపస్సుగా భావించి దీక్షతో, క్రమశిక్షణతో తయారుచేసేవారు. ఆ నాటకాన్ని వీలైనన్నిసార్లు ప్రదర్శించేవారు. నాటకాన్ని కొన్ని నెలల తరబడి రిహార్సల్స్ చేసి పకడ్బందీగా తయారుచేసేవారు. నాటకం పట్ల వారికున్న అవగాహన, ఏకాగ్రత, శ్రద్ధతో మన నాటకరంగాన్ని నమ్ముకున్న నటీనటులు సినీ రంగంలో కూడా ప్రముఖులుగా ఉన్నారు.
అయితే, ఈనాటి నాటక రంగం గతకాలం వైభవంలా లేదు. ఈనాటి ఔత్సాహిక నాటకరంగాన్ని పరిషత్తులు పోషిస్తున్నాయి. ప్రేక్షకసంఘాలు కొన్నేళ్ళుపాటు నాటకానికి వెన్నుముకగా ఉండేవి. ఒక నాటకం తయారుచేస్తే. అన్ని ప్రేక్షక సంఘాలు ఆ నాటకాన్ని ప్రదర్శింపచేయడానికి ఆరాటపడేవి. కానీ, ఇప్పుడు ప్రేక్షక సంఘాలు తక్కువయ్యాయి. నాటకాలను ఆదరించే వారూ తక్కువయ్యారు.

పరిషత్తుల్లో పోటీ మంచిదేగాని, అది ఆరోగ్యవంతంగా ఉండాలి. ప్రస్తుతం ఈ పరిషత్తులు వాడవాడలా వెలిశాయి. పట్టణాలలో కన్నా, పల్లెల్లో ఈ పరిషత్తులు విజయవంతంగా నడుస్తున్నాయి. పరిషత్తుల పుణ్యమా అని నూతన రచనలు ఉద్భవిస్తున్నాయి. వర్తమాన సమస్యలను తన కలం ద్వారా చిత్రీకరిస్తున్నారు. కొత్త కొత్త సమాజాలు పుట్టుకొస్తున్నాయి. ఇటీవల పరిస్థితులు మారి, పరిషత్తుల్లో బహుమతుల కన్నా, వారిచ్చే పారితోషికం మీద సమాజాలు ఆకర్షితులు అవుతున్నాయి. ఒక సమాజం, తమ నాటకాన్ని అనేక చోట్ల ప్రదర్శించే అవకాశం ఈ పరిషత్తులు కల్పిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నాటక రంగానికి ప్రోత్సహించే నిమిత్తం నంది అవార్డులను ప్రవేశపెట్టడం రంగస్థల నటులకు కొండంత బలమిచ్చింది. అయితే ఏటేటా పరిషత్తులు నిర్వహించే సంస్థలు మంచి నాటకాల్ని తప్పక ఎంపిక చేయాలి. ప్రాథమిక పరిశీలకులకి నాటకాల మీద పూర్తి అవగాహన ఉండాలి.
అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పరచిన నాటక అకాడమీ ద్వారా తెలుగు నాటకం నూతన ఒరవడిలకు నిలయమైంది. ఈ అకాడెమి కళాకారుల పాలిట కల్పతరువు.
మన నాటక రంగం ఇంకా మరింత ముందుకు పోవాలంటే?

గుర్తింపు పొందిన నాటక సమాజాలకు కర్టైన్సు, మేకప్ సామాగ్రి కొనుక్కోడానికి ఆర్ధిక సహాయం ప్రభుత్వం అందించాలి.
నట శిక్షణాలయాలు రాష్ట్రంలో ముఖ్యమైన ప్రదేశాల్లో నెలకొల్పాలి. నాటక రంగానికి యువతని పరిచయం చెయ్యాలి.
ప్రేక్షక సంఘాలను పునరుద్ధరించాలి.
నాటకాలను ప్రదర్శించే వీలుగా / రంగస్థలాల్ని నిర్మించాలి. నాటక సమాజాలకు రిహార్సల్స్ రూమ్ ప్రతి నగర పాలక సంస్థ ఉచితంగా ఏర్పాటు చెయ్యాలి.
నంది నాటకోత్సవాల సందర్భంగా ఎన్.టి.ఆర్ స్మారక పురస్కారాన్ని ప్రతి సంవత్సరం ఒకే కళాకారుడి కి కాకుండా, ఇద్దరు కళాకారుల్ని పౌరాణిక, సాంఘిక నాటకాల్ని నుండి ఎంపిక చేసి గౌరవించాలి.
ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా మనం పేర్కొన్న విషయాలు అమలుపరిస్తే, మన నాటక రంగం అగ్రగామియై నిలుస్తుంది అనడంలో సందేహం లేదు.

-పాండురంగ
మాజీ సంచాలకులు, ఆకాశవాణి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap