‘నవ్వకపోవడం ఒక రోగం’ అన్న జంధ్యాల

నవరసాల్లో అందరూ అధికంగా మెచ్చేది… ఆస్వాదించేది ‘హాస్యం’. నిజానికి తెలుగు చలనచిత్రసీమలో వున్నంతమంది హాస్యనటులు మరేచిత్రసీమలోనూ లేరంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా జంధ్యాల దర్శక పగ్గాలు చేపట్టాక హాస్యం మూడు పాత్రలు ఆరు రీళ్లుగా పురోగమించింది. సినీ రచనలో ఒక భావుకుడిగా, హాస్య స్రష్టగా ప్రేక్షక హృదయాల్లో సముచిత స్థానం సంపాదించాడు జంధ్యాల. చార్టర్డ్‌ అకౌంటెంట్‌గా స్థిరపడదామని అనుకున్న జంధ్యాలను తెలుగు సినీరంగం ఆహ్లాదకరమైన హాస్యాన్ని అందించమని ఆహ్వానించింది. ఇంటిపేరుతోనే ప్రసిద్ధుడైన ఈ వీర వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి 50 ఏళ్ళ వయసులోనే మరణించడం దురదృష్టం. జనవరి 14న జంధ్యాల 68వ జయంతి. ఆయన మిత్రులు ప్రతి సంవత్సరం విజయవాడ లో జంధ్యాల వర్ధంతిని జరుపుకుంటారు.

నాటకాల నుంచి సినిమాల్లోకి   …
జంధ్యాల పుట్టింది మకర సంక్రాంతి పర్వదినమైన జనవరి 14, 1951న పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో. తండ్రి నారాయణమూర్తి ఆంధ్రరాష్ట్రానికి ‘బుష్‌’రేడియోలకు పంపిణీదారుడుగా వుండేవారు. జంధ్యాల తల్లి సూర్యకాంతమ్మ. తల్లిదండ్రులకు జంధ్యాల ఒక్కడే సంతానం. చదువుసంధ్యలు విజయవాడ మాంటిస్సొరి హైస్కూలులో, ఆపైన ఎస్‌.ఆర్‌.ఆర్‌. ప్రభుత్వ కళాశాలలో పూర్తయ్యాయి. తండ్రి నుంచే జంధ్యాలకు కళ, సాంస్కృతిక రంగాలపట్ల అనురక్తి కలిగింది. స్కూలులోను, కాలేజీలోను నాటకాల్లో ప్రదర్శనకు ఉత్తమ నటుడిగా చాలా బహుమానాలు అందుకున్నాడు. అంతర్‌ కళాశాల నాటకపోటీలలో ప్రదర్శించిన ‘ప్రేమాయణం’ నాటికలో ప్రదర్శనకు ఉత్తమ నటుడిగా బహుమతి లభించింది. పరిషత్తు ప్రదర్శనల్లో బహుమతులు కొల్లగొట్టాయి. గుమ్మడి వెంకటేశ్వరరావు జంధ్యాల రచించి ప్రదర్శించిన ‘సంధ్యారాగంలో శంఖారావం’ నాటక ప్రదర్శన చూసి ప్రశంసిస్తూ, మద్రాసు కళాసాగర్‌ సంస్థ తరఫున ‘కలైవానర్‌ అరంగం’లో ప్రదర్శించే అవకాశాన్నికల్పించారు. ఆ నాటకానికి హాజరైన ప్రముఖ దర్శకనిర్మాత బి.ఎన్‌.రెడ్డి తను తీయబోయే సినిమా రచనకు ఆహ్వానించారు. అయితే దురదృష్టం కొద్దీ బి.ఎన్‌.రెడ్డి చనిపోవడంతో నిరుత్సాహపడుతున్న జంధ్యాలను దర్శకుడు కె.విశ్వనాథ్‌ భుజంతట్టి నైతిక మద్దతు ప్రకటించారు. అలా 1976లో లక్ష్మి ఫిలిం ఆర్ట్స్‌ సంస్థ అధిపతి హనుమాన్‌ ప్రసాద్‌ నిర్మించిన ‘దేవుడు చేసిన బొమ్మలు’ చిత్రానికి మాటలు సమకూర్చారు. రెండవ సినిమా ‘పెళ్లి కాని పెళ్లి’. నాటకాలు రాసిన అనుభవం, కేవలం ఐదేళ్లలోనే దాదాపు ఎనభై సినిమాలకు సంభాషణలు రాసి రికార్డు సృష్టించాడు జంధ్యాల. 1976లో చింతా రామకృష్ణారెడ్డి గీతాకృష్ణా కంబైన్స్‌ పతాకంమీద ‘సిరిసిరిమువ్వ’ చిత్రాన్ని నిర్మించినప్పుడు, దర్శకుడు కె.విశ్వనాథ్‌ జంధ్యాలకు సంభాషణలు రాసే అవకాశాన్ని ఇచ్చారు. ఆ సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌ కావడంతో రచయితగా జంధ్యాల స్థిరపడ్డారు. వేటూరి పాటలు, జంధ్యాల మాటలు కలబోసిన చిత్రాలు బాక్సాఫీసు హిట్లను ఎన్నింటినో తెలుగు ప్రేక్షకులకు పంచాయి. వాటిలో ముందు చెప్పుకోవలసిన సినిమా 1977 ఎన్టీఆర్‌ సూపర్‌ డూపర్‌ హిట్‌ చిత్రం ‘అడవిరాముడు’. ఆ చిత్రానికి జంధ్యాల సంభాషణలు రాసి తిరుగులేని రచయితగా పేరుతెచ్చుకున్నాడు. ఆ చిత్రం 32 కేంద్రాల్లో శతదినోత్సవం, నాలుగు కేంద్రాల్లో 365 రోజులు ఆడి నాలుగు కోట్ల వసూళ్లు రాబట్టింది. 1978లో కృష్ణ సినిమా ‘బుర్రిపాలెం బుల్లోడు’కి, 1979లో ‘తాయారమ్మ బంగారయ్య’ హిట్‌ సినిమాలకు జంధ్యాల సంభాషణలు సమకూర్చారు.

దిశ మార్చిన శంకరాభరణం…
కె. విశ్వనాథ్‌ దర్శకత్వంలో ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన ‘శంకరాభరణం’ (1979) చిత్రానికి జంధ్యాల రాసిన సంభాషణలు అద్భుతంగా అమరాయి. అలతి పదాలతో అనంతార్ధాలు పంచిన సంభాషణలు ఆ సినిమాలో కోకొల్లలు. విశ్వనాథ్‌ దర్శకత్వంలో నిర్మించిన ‘సప్తపది’ చిత్రానికి కూడా జంధ్యాల పదునైన సంభాషణలు రాశారు. తరువాత రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘వేటగాడు’, ‘డ్రైవర్‌ రాముడు’, ‘రౌడీరాముడు-కొంటెకృష్ణుడు’, ‘అమరదీపం’, ‘భలేకృష్ణుడు’, ‘ఆఖరిపోరాటం’ ‘జగదేకవీరుడు-అతిలోక సుందరి’ విశ్వనాథ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘శుభోదయం’, ‘సీతామాలక్ష్మి’, ‘సాగరసంగమం’ ‘ఆపద్బాంధవుడు’, వంటి విజయవంతమైన చిత్రాలకు మాటలు సమకూర్చారు. సినీ రచయితగా 1977-86 మధ్యకాలంలో జంధ్యాల అలా క్లాస్‌ని, మాస్‌ని అలరిస్తూ సుమారు రెండు వందల సినిమాలకు పైగా పనిచేశారు.

ముద్దమందారంతో దర్శకుడుగా మారి…
నిర్మాత కానూరి రంజిత్‌ కుమార్‌ 1981లో నటనాలయ సంస్థ పేరుతో నిర్మించ తలపెట్టిన ‘ముద్దమందారం’ సినిమా కోసం జంధ్యాలకు దర్శకత్వం చేసే అవకాశాన్ని కలిపించారు. ఆ టీనేజి లవ్‌ స్టోరీకి జంధ్యాల తొలిసారి రచన, దర్శకత్వ బాధ్యలు నిర్వహించారు. అయితే దర్శకత్వం మీద మమకారం వున్న జంధ్యాల ముందుకు సాగేందుకే నిర్ణయించుకున్నారు. కొత్తవాళ్ళతో ప్రయోగానికి సిద్ధపడ్డారు. ప్రదీప్‌ కుమార్‌ని, పూర్ణిమను ఎంపిక చేశారు. రమేష్‌ నాయుడు సంగీతం అద్భుతంగా అమరిన ఈ చిత్రం 11 సెప్టెంబరున విడుదలై 25 కేంద్రాల్లో విజయవంతంగా ఆడి శతదినోత్సవం చేసుకుంది. అలా తొలి ప్రయత్నంలోనే జంధ్యాల దర్శకునిగా జయకేతనం ఎగురవేశాడు.

నాలుగు స్తంభాలాటతో కమర్షియల్ విజయం…
‘మల్లెపందిరి’ వచ్చిన నెల రోజుల గ్యాప్‌తో విడుదలైన జంధ్యాల చిత్రం ‘నాలుగు స్తంబాలాట’ సూపర్‌ హిట్‌గా నిలిచింది. నవతా కృష్ణంరాజు నిర్మించిన ఈ చిత్రంలో రెండు జంటలుగా నరేష్‌-పూర్ణిమ, ప్రదీప్‌-తులసి నటించారు. నరేష్‌కి హీరోగా ఇదే తొలి చిత్రం. ఇందులో వీరభద్రరావు, వేలు చేత ‘సుత్తి’ అనే పదప్రయోగం చేయించి వారిని ‘సుత్తిజంట’గా పాపులర్‌ చేసిన ఘనత జంధ్యాలది. సినిమాలో వీరి కామెడీ ట్రాక్‌ని రికార్డుగా విడుదల చేశారు. నరేష్‌కు బాలు డబ్బింగ్‌ చెప్పారు. ఇ.వి.వి.సత్యనారాయణ ఈ చిత్రంతోనే జంధ్యాలవద్ద దర్శకత్వ శాఖలో చేరారు. ఈ సినిమా ఎనిమిది కేంద్రాల్లో వందరోజులు ఆడింది. వరసగా మూడు ప్రేమకథా చిత్రాలను విజయవంతం చేసిన జంధ్యాల, నాలుగో ప్రయత్నంలో తన ట్రాక్‌ మార్చి ‘మతంకన్నా మానవత్వం మిన్న’ అనే సందేశమిచ్చే ‘నెలవంక’ (1983) చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఈ చిత్రం ద్వారా రాజేష్, కిరణ్‌ అనే ఇద్దరు నటులను జంధ్యాల వెండితెరకు పరిచయం చేశారు. ముళ్లపూడి రమణ సృష్టించిన ‘రెండుజెళ్ళ సీత’ (1983) పేరుతో శ్రీభ్రమరాంబికా ఫిలిమ్స్‌ వారికి జంధ్యాల ఒక చిత్రం చేసిపెట్టారు. ఇందులో నరేష్, ప్రదీప్, రాజేష్, శుభాకర్‌ నలుగు కుర్రాళ్లు ప్రధాన పాత్రలు పోషించారు. ఈనాడు పత్రికాధినేత రామోజీరావు జంధ్యాల దర్శకత్వంలో ‘శ్రీవారికి ప్రేమలేఖ’ చిత్రాన్ని నిర్మించారు. వారి సంస్థ వెలువరించే ‘చతుర’లో వచ్చిన పొత్తూరి విజయలక్ష్మి నవల ‘ప్రేమలేఖ’ ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో నరేష్‌-పూర్ణిమ జంటగా నటించారు. 1984లో జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ‘ఆనందభైరవి’ చిత్రాన్ని మరో ‘శంకరాభరణం’గా భావించవచ్చు. పరకాయప్రవేశ నేపథ్యంలో రూపుదిద్దుకున్న మరో జంధ్యాల సినిమా ‘రావూగోపాల్రావూ. 1985లో నరేష్‌-పూర్ణిమ జంటగా జంధ్యాల ‘పుత్తడిబొమ్మ’ నిర్మించారు. కార్టూనిస్టు జయదేవ్‌ సీరీస్‌ ‘బాబాయ్‌-అబ్బాయ్‌’ ఆధారంగా సుత్తి వీరభద్రరావు-బాలకృష్ణలతో జంధ్యాల మరో చిత్రాన్ని సృష్టించారు. మరో జంధ్యాల చిత్రం ‘శ్రీవారి శోభనం’లో నరేష్‌కు జంటగా అనితారెడ్డి నటించింది. ఆ తరువాత భానుప్రియ-నరేష్‌ జంటగా జంధ్యాల దర్శకత్వం నిర్వహించిన చిత్రం ‘ మొగుడూ-పెళ్ళాలూ. ‘బామ్మగారి మనవరాలు’ చిత్రంతో భానుమతిని బామ్మపాత్రలో నటింపజేసిన జంధ్యాల విజయవంతమయ్యారు. ఇక రాజేంద్రప్రసాద్, చంద్రమోహన్‌లతో నిర్మించిన ఓ తమాషా ప్రేమకథ ‘రెండురెళ్ళు ఆరు’చిత్రం బాగా ఆడి శతదినోత్సవం జరుపుకుంది. యువచిత్ర నిర్మాత మురారి జంధ్యాల దర్శకత్వంలో ‘సీతారామకల్యాణం’ (1988) చిత్రాన్ని బాలకృష్ణ హీరోగా నిర్మించారు. ఈ చిత్రం 14కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. యాక్షన్‌ హీరోగా ముద్రపడిన చిరంజీవిని విభిన్న కోణంలో చూపిస్తూ ఆయనచేత చార్లీ చాప్లిన్‌ను పోలిన హాస్యపాత్రను పోషింపజేసిన సినిమా ‘చంటబ్బాయ్‌.

ప్రవాసాంధ్రుల కోసం …
అమెరికా ప్రవాసాంధ్రుల కోరిక మేరకు వారితో ఒక సినిమా తీసేందుకు జంధ్యాల ప్లాన్‌ చేశారు. అదే ‘పడమటి సంధ్యారాగం’. తెలుగు తెరమీద హాస్యానికి మహారాజయోగం పట్టించిన రామానాయుడు-జంధ్యాలల సినిమా ‘అహ నా పెళ్ళంట’. రాజేంద్రప్రసాద్‌ హీరోగా అద్భుత హాస్యాన్ని అందించాడు. జంధ్యాల తరువాతి కాలంలో నిర్మించిన ‘చిన్నికృష్ణుడు’ చిత్రానికి బాలీవుడ్‌ ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్‌.డి.బర్మన్‌ సంగీతం సమకూర్చడం విశేషం. రాజేంద్రప్రసాద్‌తో నిర్మించిన ‘వివాహ భోజనంబు’లో బాలు పోలీసు ఇనస్పెక్టర్‌గా ప్రత్యేక పాత్రలో కనిపిస్తారు. ‘నీకు నాకు పెళ్ళంట’, ‘చూపులు కలిసిన శుభవేళ’, ‘హై హై నాయకా’, ’జయమ్ము నిశ్చయమ్మురా’, ‘లేడీస్‌ స్పెషల్‌’, ‘బావా బావా పన్నీరు’, ‘బాబాయ్‌ హోటల్‌’, ‘ప్రేమా జిందాబాద్‌’ వంటి జంధ్యాల సినిమాలు బాగానే ఆడాయి. మొత్తంమీద జంధ్యాల 350 సినిమాలకు రచన చేసి 44 సినిమాలకు దర్శకత్వం వహించారు.

జంధ్యాల వారసులెవరు?
హాస్య సంభాషణలతో వెరైటీ డైలాగులతో అద్భుతమైన దర్శకత్వ ప్రతిభతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన హాస్యబ్రహ్మ జంధ్యాల తరువాత ఆయన వారసులెవరూ అంటే ఎవరూ కనబడడం లేదు. శ్రీవారికి ప్రేమలేఖ, నాలుగుస్తంభాలాట, రెండు జళ్ల సీత, రెండు రెళ్లు ఆరు, మూడుముళ్లు, అహనా పెళ్లంట, వివాహ భోజనంబు, హైహై నాయికా, చూపులు కలిసిన శుభవేళ లాంటి అద్భుతమైన చిత్రాలు ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. సుత్తి జంటను పరిచయం చేసి, నవ్వులు పూయించారు. శ్రీలక్ష్మితో అమాయకంగా డైలాగులు చెప్పించి కడుపుబ్బ నవ్వించారు. గుడిమెట్ల మీద ఎండు చేపలు అమ్ముకునే మొహం నువ్వు వంటి వైవిధ్యమైన తిట్ల ప్రయోగాలతో ఆ బిరుదు సార్థకం చేసుకున్నారు. అద్భుతమైన కథాకథనాలతో సున్నితమైన హాస్యంతో తీసిన ఎన్నో చిత్రాలు ప్రేక్షకుల గుండెల్లో పదిలంగా ఉన్నాయి. ఆయన లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. మంచి హాస్య నటులు ఉన్నా సరైన కథలు రాసుకోలేక కామెడీ పండించలేక అవస్థలు పడుతున్న దర్శకులు కిచిడీ చిత్రాలు తీసి, ఇదే హాస్యం చిత్రాలు అంటున్నారు. జంధ్యాల వారసత్వాన్ని నిలబెట్టేవారు ప్రస్తుతం తెలుగు సినిమాకు అవసరం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap