నేనూ…పుట్టిందీ.. పెరిగిందీ…రోడ్లరిగిపోయేలా బలాదూరుగా తిరిగిందీ కాకినాడలోనే. నా విద్యాభ్యాసం కాకినాడ పి.ఆర్.జే.సి.లో. మాస్కూలుకి దగ్గర్లోనే ఓ పెద్ద లైబ్రరీ వుండేది. అందులో అనేక పుస్తకాలతో బాటు ఎప్పట్నుంచో సేకరించిన వార, మాస పత్రికలు వుండేవి. వాటిలో బాపు, శంకు, బాబు, సేకరించిన సత్యమూర్తి గార్ల లాంటి ఉద్దండుల కార్టూన్లు పడుతుండేవి. వాటినన్నింటినీ క్రమం తప్పకుండా చదువుతుండేవాడిని. వారు వేసిన కార్టూన్లు ఇప్పటికీ నాకు గుర్తుండిపోయాయి. బ్రెజర్ ఐలాండ్, మాగ్జిమ్ గోర్కీ అమ్మ’ లాంటి పుస్తకాలు చాల ఇష్టంగా చదువుతుండేవాడిని – ఇంకా చందమామ పుస్తకాన్ని చూస్తే ప్రాణం లేచొచ్చేది. మా స్కూలు మొత్తం మీద డ్రాయింగులో ఏకైక ప్రయిజు విన్నర్ని నేనే. అయితే ఏం లాభం? కార్టూన్లైలా వెయ్యాలో – ఎలా పంపించాలో తెలిసేది కాదు. విశేషమేంటంటే నేను కార్టూనిస్టుని కాక పూర్వమే నా కథ పత్రికలో అచ్చయింది. అదెలా గంటే – మా మిత్ర సమూహంలో నేనే కాస్త హాస్యంగా మాట్లాడుతూ అందర్నీ నవ్వించేవాడిని. .. మా బలాదూరు రోడ్ల సంచారంలో కాకినాడలో పాడుపడిన డచ్ వారి బిల్డింగులో దూరడం తటస్థించింది. మా కందరికి అక్కడ్చుంచి బైటపడటంలో చాలా భయానికి గురైనాము. ఆ అనుభవంతో ‘భూతంలేని బంగళా’ అనే పురుతో ఓ డిటెక్టివ్ కథ రాసి అప్పట్లో వస్తున్న పత్తేదారు అనే డిటెక్టివ్ మాసపత్రిక్కి పంపిచాను. ఆశ్చర్యం చంద్రగారి బొమ్మతో ఆ కథని వేసుకొన్నారు. అప్పుడు నా వయస్సు 17 సంవత్సరాలు చందమామ పుస్తకం ఇన్స్పిరేషన్ తో ప్రతీనెల స్వీయ దస్తూరితో ఓ 40 పేజీల పుస్తకం (చందమామ లాగే ప్రతీ పేజీ కార్నర్ బొమ్మలతో) తయారుచేసి అన్ని తరగతుల విద్యార్థులకి ఒక్క పుస్తకాన్ని ఇస్తూ వుండేవాడిని, ఒకరి తర్వాత ఒకరు దాన్ని చదువుతూ వుండేవారు.
ఈ క్రమంలో విశాఖపట్నం హిందూస్థాన్ షిప్ యార్డులో ఉద్యోగం వచ్చింది (లెటర్ పెయింటింగ్ ఆర్టిస్ట్) ఉద్యోగంలో సెలక్టయి 1973లో జాయినయ్యా. హిందూస్థాన్ షిప్ యార్డుకి ఓ హౌస్ మార్జయిన్ వుండేది దాని ఎడిటర్ ఓరోజు నన్ను పిలిచి-మన పత్రికలో కార్టూన్ వెయ్యవయ్యాఅన్నారు ఎగిరి గంతేసాను. కాని ఎలా – ఆయన్నే అడిగాను. ఎలా వేసి పంపమంటారు అని. ఏం వుంది. 4×6” సైజులో ఇండియనింక్తో రాసి పంపు అన్నారు. అలాగే రాసి నాలుగు కార్టూన్లు ఇచ్చాను. వాటిని చూసి ఆయన మెచ్చుకొని ఆ నెలలో ప్రచురించాడు. అందరూ మెచ్చుకున్నారు. ఇప్పటికి తీగ దొరికింది. ఇక డొంకని కదిలించడమే తరువాయి. అదే సమయంలో నాకు వివాహమయింది 1975లో, ఆ సంవత్సరం ఆంధ్రజ్యోతి వార పత్రికలో కొత్త కార్టూనిస్టుల కార్టూన్ల పోటీ ప్రారంభించారు. నేను కార్టూన్లు వేసి పంపాను. మొదటి ప్రయత్నానికి ఫస్టు ప్రయిజు వచ్చింది. మళ్లీ రెండోవారం, అప్పడు కూడా ఫస్టు ప్రయిజు నాకే వచ్చింది. – ఇక కార్టన్ల విజృంభణ, కార్టూన్ల ప్రయోగాలు. పుల్లావుద్దీన్-బిరలాదీపం- గ్రహచారంగాడు, మాష్కోరా లాంటి కార్టూన్ సీరియల్స్ ప్రచురించబడ్డాయి. ఇప్పటివరకు వివిధ దిన వార మాస పత్రికల్లో వేలాదిగా నా కార్టూన్లు వచ్చాయి. అవార్డులు, బహుమతులూ, మెమెంటోలూ ఎన్నో వచ్చాయి, వస్తున్నాయి. నేను రాసిన కార్టూన్లకు మొదటి జడ్జి- మా ఆవిడే దాన్ని చూసిన క్షణం ఆమె ఫక్కున నవ్వితే అది ప్రింటయిట్టే!
ఆ తర్వాత మిత్రులు శంకుగారు ఆంధ్రప్రదేశ్ క్రోక్విల్ ఎకాడమీ స్థాపించడం. దాన్ని విజయవాడ వింగ్ కి శేఖరి, విశాఖ వింగ్ కి నన్ను కన్వీనర్లుగా నియమించడం జరిగింది. ప్రతీనెలా క్రోక్విల్ హాస్యప్రియ అనే పత్రికని శ్రీ శంకుగారు నడుపుతూ వుండేవారు- దాన్లో సినిమాయణం’ అనే నేను రాసిన హస్య నవలని సీరియల్గా సంవత్సరం పాటు ప్రచురించారు. అవే కాక శంకుగారు ఆ ప్రతికలో కథలు రాయమని ప్రోత్సహించేవారు. ఆ విధంగా ఎన్నో హాస్య కథలని ఆ పత్రిక కోసం రాయడం జరిగింది. విశాఖపట్నంలో – 1990 సమయంలో ఎన్నెన్నో స్టేట్ వైడ్ కార్టూన్ కాంపిటేషన్లు, ప్రదర్శనలు నిర్వహించేవాళ్లం – నా ప్రయత్నానికి కీ.శే. గుస్తా. టి.ఆర్, బాబు, రఘు. నానిబాబు, అమ్మాజీ, విజయ లాంటి మిత్రులెందరో సహకరించేవారు. కార్టూన్ ప్రదర్శన ముందు రోజున ఓ వంద పోస్టర్లు (చేతితోరాసినవి) తయారుచేసుకొని ఆ రోజు రాత్రి 9 గం.- నెత్తికి గుడ్డలు తలపాగాల్లా చుట్టేసుకుని ఓ బకెట్తో జిగురు తీసుకొని సైకిళ్లెక్కి మా కార్టూనిస్టు మిత్ర బృందంతో- ఆంధ్రా యూనివర్శిటీ నుంచి గోపాలపట్నం వరకూ కనిపించిన ప్రతీ గోడకీ పోస్టర్లు అంటించుకొంటూ-మధ్యమధ్యలో టీలు సేవిస్తూ తెల్లవార్లూ పనిచేసేవాళ్లం. ఆ ఆనందం, ఉత్సాహం వేరు. కార్టూన్ ప్రదర్శనలకి మాత్రం మంచి స్పందన లభించేది. నా మిత్రులు కీ.శే. రాగతిపండరి వారింటికెల్లి రోజు ఆమెకు మన కార్యక్రమాల గురించి చెబుతూ వుంటే ఆమె ఎంతో ఆనందపడేవారు. బాపుగారి కార్టూన్ల ప్రదర్శన నిర్వహించడం కోసం బాపుగార్ని సంప్రదించగా ఆయన చాలా కార్టూన్లు పార్శిల్ పంపారు. వరుసగా మూడురోజుల పాటు బాపు కార్టూన్ల ప్రదర్శన విశాఖలో జరిగింది. ప్రతీవారం కార్టూనిస్టుల మీటింగ్ జరిగేది. అందులో డా. తంబు, బాలి లాంటి ప్రముఖ వ్యక్తుల్ని ఆహ్వానించి- కార్టూన్ల కోసం చర్చించుకోనేవాళ్లం. ఆ వివరాలు క్రోక్విల్ హాస్యప్రియ మాసపత్రికలో ప్రచురించబడేవి.
బి. హెచ్.పి.యు. జనరల్ మేనేజరు శ్రీ టి. గోకులన్ ఓ పుస్తకం రాశారు. (మేనేజ్ మెంట్ బై టైమ్ సెన్స్) దాన్లో వారు నా చేత 200 కార్టూన్లు వేయించారు- ఆ పుస్తకం అంతర్జాతీయంగా ఎన్నో ప్రశంసలనందుకొంది. అందులో నేను వేసిన కార్టూన్లకి ఇందిరాగాంధీ పి.ఎ., స్వామి రంగనాధానంద లాంటి మహామహుల ప్రశంసలు నాకు లభించాయి. అవే గాకుండా టి.ఆర్. శేషాద్రి గారు రాసిన అనేక పుస్తకాల్లో నాతో కార్టూన్లు వేయించారు. నాకు ముగ్గురు సంతానం (ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి) అందరూ సెటిలైయ్యారు. విశేషమేంటంటే ఒక్కరికీ నా అభిరుచీ, అభినివేశం అబ్బలేదు- నా బాల్యం, యవ్వనం, వార్ధక్యం కూడా. వ్యంగ్య చిత్రకళావ్యాసంగంతో నిండిపోయి వుంది. దానికి నేను, గర్వపడుతున్నాను, ఆనంద పడుతున్నాను. నేను షిప్ యార్డు నుండి వి.ఆర్.ఎస్. తీసుకున్న తర్వాత, పిల్లల బొమ్మల మాసపత్రికలో ( శ్రీవాణి పలుకు) ఆర్టిస్టుగా అవకాశం వచ్చింది. నాటి చందమామ చిత్రకారులు, చిత్ర, శంకర్, ఎమ్.టి.యు. ఆచార్యగార్ల స్ఫూర్తిగా ఆ కథలకి బొమ్మలు వేస్తున్నాను. వాటికి మంచి ఆదరణ లభిస్తుంది. నా మిత్రుడు పుక్కళ్ళ రామక్రిష్ణ గారి సహకారంతో కంప్యూటర్లో మెలుకవలు నేర్చుకున్నాను.
Congrats to B S Raju garu
Really great…
నైస్ సర్ మీ కార్టున్ ప్రస్తానం దాన్ని మీరు వవరించిన తీరు చాలా బాగుంది .మీరు కూడా కాకినాడ వారే నని మీ అర్త్క్లే చదవడం ద్వార తెలిసింది అభినందనలు
avunu madi kakinade!
Kanyan