సామాజిక జీవితంలోని మౌనరోదనకు, గొంతుకను, దాని చలవ స్వరాన్ని జత చేయాలనుకున్నాడు. వర్తమాన కాలమేదో, ప్రజల హృదయాలలోకి చొచ్చుకురావడంలేదని, కాలం కాదు ప్రజలు గాయపడ్డారని గ్రహించి, ఆ సమసమాజాన్ని సరిచేయాలనే ఆలోచనతో బయలుదేరినవాడు. జీవితం ఫలవంతం, సుఖవంతం కావాలని ప్రతి మనిషి కోరుకుంటాడు. మానవజీవన చలనంలో అత్యంత సహజమైన ఆశ. భారతీయ సమాజపు చలనం దాన్ని నడిపే రాజ్యయంత్రం సజావుగా లేదన్నది అత్యంత విలువైన, అవసరమైన అభియోగం మాత్రమే కాదు. వాస్తవం కూడా.
సాయిబాబా కోనసీమ ప్రాంతంలో తొలి ఊపిరి పీల్చుకున్నవాడు. అయిదేళ్ళకే అంగవైకల్య బాధితుడు. అయినా జీవితాన్ని అత్యంత తెలివిడితో, చైతన్యపూర్వకంగా మలుచుకున్నవాడు. చదువులో రాణించడమే కాదు. జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (ఢిల్లీ) వరకు సాగిన యానం. అతని అడుగులు అత్యంత క్షోభకు గురి అవుతున్న పీడితుల వైపు. అతని వాక్కు ఈదేశ ప్రజాస్వామ్యం పై వేలాడిన ప్రశ్న. బహుశా విశ్వాసాలు కలిగి వుండటమే కాదు. ఆ రాజకీయ విశ్వాసాల పట్ల ఆచరణను కలిగివున్నవాడు. మాట్లాడినా, రాసిన తన హృదయపు ప్రతి కదలికలను ఈ దేశ పీడిత ప్రజల ఉద్వేగాల పరంపరలో భాగమయినవాడు. తన రాజకీయ విశ్వాసం కారణంగా జైలు జీవితం అనుభవిస్తున్నా ఎక్కడా రాజీపడని మేధో సృజనకారుడు. ఈ దేశ ప్రత్యామ్నాయం నక్సల్బరి అదొక శ్వాస. అన్ని పరికరాలు విఫలం చెందాక, మాతృ ప్రజాస్వామిక ధారతో భారతీయ చిత్రపటం పై ప్రవహించింది. యాభైఏళ్ళ ప్రస్థానం దానియొక్క కాల పరిణామం కాదు. దానివిలువ అదివేసిన మౌలికమైన ప్రశ్నలు, అమరత్వం, సకల మేధోరంగాల పై దానికున్న విలుల భారతీయ ప్రజాస్వామిక చలనం నక్సలబరి లేకుంటే, ఈపాటి స్వేచ్ఛకు, సమానతకు అవకాశముండేది కాదు. సాహిత్య, కళారంగాలలో అది నిర్వహించిన భూమిక ప్రజలకోసం త్యాగాలకు, సిద్ధపడే ధీరత్వం ఈ దేశ యవనికపై వేసింది.
నక్సలబరి ప్రేమలో సాయిబాబా పడిపోయాడు. శరీరం సహకరించకున్నా హదయం అతనికి సహకరించింది ఆ హృదయ స్థానంలో ఈ దేశపు చిట్టచివరి మనిషి ఉన్నాడు. అతను, నిర్వాసితుడు, ఆదివాసి, ముస్లిం, దళితుడు, స్త్రీ కావొచ్చు. కేవలం ఈ ఆపేక్ష యావజ్జీవ కారాగారశిక్ష వరకు ఈ దేశ పాలకవర్గం తీసుకెళ్ళగలిగింది. సాయిబాబాకి ఆయుధ భాష తెలియదు. హింస అతని అభిమతం కాదు. లోలోపల రగులుతున్న ఆశయాల ఘర్షణేదో నక్సల్బరీ రాజకీయాలవైపు నడిపి ఉండవచ్చు. అంతమాత్రాన, రాజకీయ విశ్వాసం కలిగి ఉన్నంత మాత్రాన, నేరస్తుడిగా చిత్రించింది. భారతీయ ప్రజాస్వామ్యం.
సాయిబాబా స్వతహాగా కవికాదు. వ్యాసకర్త. ఉపన్యాసకుడు. బహుశా కవిగా ఎలా రూపాంతరం చెందాడు. స్వేచ్చను బంధించిన జైలు గోడలు లేదా జైలు వెలుపలి ప్రపంచం పట్ల కరుణ ఈ రెండు అంశాలు సాయిని కవిని చేసాయా! లేదా ఏదయినా అంతర్మధనముందా? కవిత్వం మానవునికి అందని సాహిత్యరూపం కాదు. హృదయ కంపనకు అక్షరాన్ని జతచేస్తే కవిత్వమవుతుందా! ఇక్కడ కవి కావడం అదనపు విలువ ఏమికాదు. చాలామంది మాట్లాడుతున్న క్రమంలో ఫలానా సృజనశీలికి ఈ అర్హత లేదని అలవోకగా అంటారు. సాయిబాబా గురించి మాట్లాడే క్రమంలో అతని శారీరక అంగవైకల్యం చర్చ అవుతుంది. స్టీఫెన్ హాకింగ్ భౌతిక పరిశోధకుడు భవిష్యత్ తరం తన పరిశోధనల గురించి కాక తాను కూర్చున్న వీల్ చైర్ గురించి మాట్లాడుకుంటారేమోనని సందేహం కలుగుతుందని అంటాడు. బహుశా సాయిబాబా గురించి కూడా ఈ వాదన నిజం కావచ్చు. తన శారీరక స్థితి, అత్యంత బాధాకరమైనది కావొచ్చు. తట్టుకోలేని క్లేశం నుంచి కొన్నిసార్లు తన స్థితిని వ్యతిరేకించవచ్చు. అంతిమంగా సాయిలో బేలతనం లేదు. కవిత్వంలో కూడా పూర్వస్థితిలేదు. సాయిబాబా నాగపూర్ జైలులో శిక్షను అనుభవిస్తున్నాడు. జైలులోపల రాజ్యక్రూరత్వంలో, తనను భౌతికంగా రాజ్యం నిర్మూలిస్తుందనే ఆందోళన ఉన్నది. అదే సమయంలో బయట ప్రపంచంతో మానసికమైన దగ్గరితనంతో ఉన్నాడు. “నేను చావును నిరాకరిస్తున్నా” సాయి తొలికవితా సంపుటి, భవిష్యత్తులో మరింత కవిత్వాన్ని ఆశించవచ్చు. బహుభాషలలో ప్రవేశమున్నది. తను నాలుగ్గోడలమద్య బందీగా ఉంచినా, అతను వెలుపలి ప్రపంచంతో, మానసికమైన స్వేచ్ఛను అనుభవిస్తున్నాడు. ఇక్కడ వెలుపలి ప్రపంచమంటే రాజకీయ ఖైదీకి లేదా ఏ ఖైదీకయినా గతముంటుంది. వర్తమానముంటుంది. భవిష్యత్ కారాగారంలో బందీగా ఉంటుంది. ఖైదీ మానసిక ప్రపంచం గోడల వెలుపల వున్న భౌతిక ప్రపంచంతో అనుసంధానమయి వుంటుంది. ఇది అందరి ఖైదీలకు వర్తిస్తుంది. చిన్నతేడా ఖైదీ ఆలోచనాపరుడయితే, రచయితైతే ఈ మానసిక ప్రపంచం విస్తరిస్తుంది. తేడా స్వల్పమే కాని చాలా విశాలమయినది. సాయిబాబా తనలోని అంత:క్లేశానికి కవిత్వరూపమివ్వడం వెనుక కవిత్వం హృదయపు తండ్లాట, ఘర్షణ దీని వ్యక్తీకరణకు బలమైన సాహితీరూపం కవిత్వమని విశ్వసించాడు.
సాయిబాబా కవితా నిర్మాణ పద్దతులు తెలిసినవాడు కాదు. కవిత్వ అభ్యాసం చేసినవాడు కాదు. విస్తృతంగా కవిత్వం చదివినవాడు. కేవలం కవిత్వపఠనం కవిని తయారుచేయదు. అయినా సాయిలోని అంతర్మధనం ఒక బలమయిన కవిగా మన ముందు నిలబెట్టింది. ఒక తాజా మాటల పరిమళం ఏదో కవిత్వ పాఠకున్ని ఆవరిస్తుంది. ఇది జైలు కవిత్వం అని కొట్టిపారేయవచ్చు. జైలు అనుభవం, నిర్బంధం నుండి కవి మొలకెత్తాడనే సంశయంతో బయలుదేరవచ్చు. ఖచ్చితంగా జైలు కవిత్వమే మరో కోణం నుండి చూస్తే ఇది జైలు కవిత్వం కాదు. కవి జైలులో ఉన్న జైలు వెలుపలి ప్రపంచపు దు:ఖ క్రీడ ఆవగాహన యొక్క వ్యక్తీకరణ జైలు హరించిన స్వేచ్ఛగురించి వుండవచ్చు. తల్లి, సహచరి, కుమార్తె అనేక ఉద్యమ మిత్రుల సాహచర్యనికి దూరమయి, వారి గురించిన తలపోతల ఉండవచ్చు. అంతులేని నిరీక్షణ కవిసమయంగా మారవచ్చు. జైలు మానవీయ సంబంధాలను, ఎలా ధ్వంసం చేస్తుందో కలతపడవచ్చు. అంతిమ సారాంశం మిగిలే వుంటుంది. ఒంటరి ఖైదు కవి బయటప్రపంచంతో మాట్లాడటానికి ఓ సంభాషణ ప్రారంభించాడు.
నా ఒంటరి జైలుగది ఇనుప చువ్వల వెనుక
పగలు రాత్రే నేనొక
తరగతి గదిని కలగంటాను.
ఈ కవిత సాయిబాబా జీవితానికి సంబంధించిన మ్యానిఫెస్టో వంటి కవిత ఉపాధ్యాయునిగా ఈ అసమ సమాజాన్ని సరిచేయాలనే కలగన్నాడు. తనలోని అంతర్మధనాన్ని వ్యక్తీకరిస్తూనే నాచైతన్యయుత జీవితమంతా, ప్రేమ, జ్ఞానం, స్వేచ్ఛల అన్వేషణలో నేర్చుకుంటూ నేర్పుతూ గడిపాను. అప్పుడే కొద్దిమంది స్వేచ్ఛ అందరి స్వేచ్ఛకాదని తెలుసుకున్నాను. తనకి అందివచ్చిన జ్ఞానం, చైతన్యం, స్వేచ్చ ఇది అందరిదీ కావాలి. భారతదేశ సామాజిక, ఆర్థిక నిర్మాణమే అసమానతలను పెంచి పోషించేది. దాని ప్రజాస్వామిక చలనంలోనే అసమానత ఉన్నది. బహుశా దాన్ని సరిచేయాలనే సంకల్పం నూతన ప్రజాస్వామిక ఆలోచనా పరులకు ఉన్నది. దీనిమధ్య ఉన్నది ఘర్షణ. కేవలం ఇది భావజాల ఘర్షణ ఇక్కడ ఆయుధం ప్రసక్తే లేదు. కాని చెరశాలలు, నోర్లు తెరుచుకుంటున్నాయి. గొంతు విప్పితే, నిర్బంధం అమలు చేయడానికి పాలకవర్గాలు సిద్దంగా ఉంటున్నాయి. సరిచేయాల్సిన వాటిని సరిచేయకపోగా, ఇదేమిటి ? అని ప్రశ్నించేవారి గొంతునొక్కుతున్నాయి.
జైలంటే, ఎత్తయిన గోడలు కాదు
ఒంటరి గదికాదు తాళాల సవ్వడులు కాదు
నిఘా చప్పుళ్ళు కాదు అది ఒంటరితనంలో అనుభవించే బాధో
మృత్యు భయమో కాదు మిత్రమా అది ఎత్తైన న్యాయపీఠాల పైన
పరుచుకున్న అబద్దాల సమూహం.
జైలు ఆవరణను, కవిత్వం చేస్తూనే భౌతికపరమైన, జైలు నిర్మితాన్ని చెబుతూనే అది. న్యాయస్థానాల పైన పరుచుకున్న అబద్దాల సమూహం అని తేల్చేస్తాడు.
భూమ్మీద ప్రతిప్రాణి మరణాన్ని తిరస్కరిస్తుంది వ్యాపారం మృత్యువును, చేరుకుంది దేశమంటే, మరేమికాదు / మృత్యువ్యాపారమే
భూమికూడా ఏదో ఒకరోజు
వెలుగుతున్న సూర్యునితో పాటే మరణిస్తుంది.
ఈ కవిత వెనుక సాయిబాబాలో జైలుజీవితంలోని, ఒంటరితనం అది కలిగించే మానసిక వేదనే కాదు. భారత పాలకవర్గం తనని భౌతికంగా అంతం చేస్తుందనే ఆందోళన వున్నది. అయిదేళ్ళ కాలంలో తనపట్ల రాజ్యం వ్యవహరించిన తీరు తనని మృత్యువుకి దగ్గర చేయడంలో రాజ్యయంత్రం చూపిస్తున్న చొరవ, తనని తాను సజీవంగా ఉంచుకోవడానికి చేస్తున్న ధిక్కారం. అందుకే కవి భూమ్మీద ప్రతిప్రాణి మరణాన్ని తిరస్కరిస్తుంది అని అనగలిగారు. హృదయాంతర కాలంలో తనకి కలిగిన మృత్యుభావోద్వేగం ఈ కవితా చరణాలకి ఉద్దీపన.
దాదాపు అయిదేళ్ళ సాయిబాబా జైలు జీవితం, జైలుని ప్రేమించే దశకు తీసుకెళ్ళగలిగింది. జైలుమీద ప్రేమ కలిగేటట్లు చేయగలిగింది.
అదేమిటోగాని నాకిప్పుడు జైలుతో అనుబంధ మేర్పడింది.
అక్కడ ప్రేమించే మనుషులున్నారు
ఇతరుల స్వేచ్ఛకోసం తమ చేతులుకు,
సంకెళ్ళ నాహ్వానించే యోధులున్నారు.
ఈమాట అనడానికి ఎవరికి సాధ్యపడుతుంది. సుదీర్ఘకాలం కుటుంబానికి, బంధువులుకు, స్నేహితులుకి తరగతి గదికి సంచరించే స్వేచ్ఛకు, దూరంగా వున్న స్వాప్నికుడు. జైలు కేవలం మట్టిగోడల దెబ్బకాదు. ఇతరుల స్వేచ్ఛకోసం సంకెళ్లను ఆహ్వానించేవారున్నారు అనే భరోసాను కలిగి ఉండటమేకాదు, తనకి భరోసా నిచ్చినవారందరికి ఒక స్వాంతనను కలుగజేస్తున్నాడు.
ఇది తన మొదటి కవితా సంపుటి. కవిత్వం రాయాలనే తపన మాత్రమే సరిపోదు. దానికి కావల్సిన పరికరాలు సాయి దగ్గర ఉన్నాయి. విస్తారంగా అల్లుకున్న తన జీవితం, ఆ జీవితాన్ని ప్రజల కళ్ళల్లోని వెలుగుతో, సరిచూచుకున్నాడు. నిజానికి సాయిబాబా నూతన మానవుడు. ఆ నూతన మానవుడు వేసే ప్రతి అడుగులో కవిత్వముంటుంది. అంతిమంగా నోరుండి మాట్లాడలేని ప్రజలుంటారు. వారు ఆదివాసులు, దళితులు, ముస్లింలు, అంతిమంగా స్త్రీలు కావొచ్చు. ఈ నేపధ్యంనుండి నేను చావును నిరాకరిస్తున్నాను. చూడాలి ప్రత్యామ్నాయ ప్రజాస్వామ్యపు వెలుగు ప్రసరించేదాకా, సాయిబాబా వుంటారు అతని కంఠస్వరం ద్వారా మనం విన్న కవిత్వముంటుంది.
– అరసవిల్లి కృష్ణ (9247253884)
Saibaba poetry super.