ఆయన మండుటెండల్లో మంచుపర్వతాలను సృష్టిస్తాడు. స్వర్గలోకాన్ని దివినుంచి భువికి దింపుతాడు. ముంబాయ్ వీధులను చెన్నై స్టూడియోలోకి తీసుకొస్తాడు పగలే వెన్నెలను కురిపిస్తాడు. సృష్టికి ప్రతి సృష్టి చేయడంలో ‘రీల్‘ విశ్వామిత్రుడిగా పేరొందిన ఆయనే సుప్రసిద్ద కళాదర్శకుడు ‘పద్మశ్రీ తోటతరణి. సినిమా అంటే హీరోహీరోయిన్లు, దర్శకుడి గురించి మాత్రమే మాట్లాడుకునే సగటు ప్రేక్షకుడు సైతం తోటతరణి పేరు చూసి సినిమాకు వెళ్లే స్థాయికి కళాదర్శకత్వాన్ని తీసుకెళ్లిన ఘనుడాయన. 220కు పైగా సినిమాలకు తన సహజసిద్ధమైన సెట్లతో జీవం పోసిన తరణి ‘పద్మశ్రీ’ పొందిన తొలి కళాదర్శకుడు. ఆయన కళాప్రస్తానం గురించి వారి మాటల్లో తెలుసుకుందాం…
నా గురించి చెప్పాలంటే ముందుగా మా నాన్నగారినే తలుచుకోవాల్సి వుంటుంది. ఎందుకంటే కళాదర్శకుడిగా ఆయన వారసత్వాన్నే నేను అందిపుచ్చుకున్నాను. మాది బందరు. మా నాన్నగారైన తోట వెంకటేశ్వరరావుగారు ఎన్టీఆర్ సినిమాలకు కళాదర్శకత్వం చేశారు. నిజానికి మా నాన్నగారు సినిమాల్లో నటించాలనే కోరికతో మద్రాసకు వెళ్లారట. కానీ అనుకోకుండా తన పెయింటింగ్ చదువు ఆయనను కళాదర్శకుణ్ణి చేసింది. ‘మల్లీశ్వరి‘ సినిమాకు ఎ.కె. శేఖర్ గారి దగ్గర అసిస్టెంట్ గా స్కెచ్లు వేసి ఆ తర్వాత పాండురంగ మహత్మ్యం, ‘జయసింహ‘ లాంటి సినిమాలతో కళాదర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. గోఖలే, కళాధర్, శాంతారామ్లు ఆయన సమకాలీనులు. మా కుటుంబం విషయానికొస్తే మాది పెద్ద ఫ్యామిలీ. ఎనిమిదిమంది సంతానం. అక్క తర్వాత నేను రెండో వాణ్ణి. మా నాన్నగారు స్కెచ్లు వేసేందుకు, సెట్ డిజైనింగ్ చేసేదుకు స్టూడియోలకు వెళ్తూ తోడుగా నన్ను తీసుకెళ్లేవారు. అప్పుడు నాకు సరిగ్గా నాలుగేళ్లు. నాన్న పనిచేస్తుంటే నేను చుట్టూ చూస్తూండేవాణ్ణి. నాకు డ్రాయింగ్ పై ఆసక్తి కలగడానికి బహుశా ఈ వాతావరణమే కారణమేమో. ఆరేడేళ్ల వయసప్పుడు ఎప్పట్లానే ఓ స్టూడియోకు వెళ్లాను. మాన నాన్నగారు షరా మామూలుగా పనిలో పడ్డారు. నా దృష్టి అక్కడే షోకేష్లో వున్న బుద్ధుడి బొమ్మపై పడింది. చూడగానే ఆ బొమ్మ నన్ను ఆకట్టుకుంది. నా జేబులు తడిమిచూసుకుంటే అణాబిళ్ల దొరికింది. దాన్ని తీసుకుని స్టూడియో బయట వున్న ఓ షాపులో ఇస్తే రెండు చాక్షీసులు వచ్చాయి. చాలా బొమ్మలు వేసుకోవచ్చు కదా అనుకున్నాను. వాటితో బుద్ధుడి బొమ్మను నేలపైనే పెద్దగా గీశాను. ఇంతలో మా న్నాగారు వచ్చి నేను వేసిన బొమ్మనే చూసి నన్ను అభినందించారు. మరుసటి రోజు మెహతా డ్రాయింగ్ బుక్స్ తీసుకొచ్చి ఇచ్చారు. సాధారణంగా ఆ డ్రాయింగ్ బుక్ లోని బొమ్మలను నెలరోజుల పాటు నేర్చుకోవాలి. కానీ నాకు పట్టుదల కాస్త ఎక్కువగా వుండేది. సాయంత్రం అయ్యేసరికి అన్ని బుక్స్ ఫినిష్ చేశాను. కళ పట్ల నాకు ఆసక్తి కలగడానికి ఇది తొలిమలుపుగా చెప్పుకోవచ్చు.
ఆ తర్వాత సెట్ డిజైనింగ్లో మానాన్న గారికి సాయం చేస్తూనే చదువు కొనసాగించాను. రాత్రంతా సెట్లో పనిచేస్తూ పొద్దున్నే కాలేజీకి వెళ్లేవాణ్ణి. అప్పట్లో ఎస్.డి.లాల్, ఎస్. ఎస్. లాల్ వంటి దర్శకులు పెద్ద పెద్ద క్లబ్ సెట్స్ వేయించేవారు. నేను కుర్రాణ్ణి కాబట్టి వాటిని రూపొందించడంలో చురుగ్గా పాల్గొనేవాణ్ణి. నాన్నగారు ఆదేశాలకు అనుగుణంగా 100 అడుగుల సెట్లను వేసేవాళ్లం. డూండీ, సుందర్ లాల్ నెహతాల సినిమాలకు కూడా సెట్లు అద్భుతంగా వేసేవాణ్ణి. అయితే సినిమా సెట్ల విషయంలో నా కన్నా తమ్ముడు తోట హేమచందర్ ఎక్కువ అనుభవం సంపాదించుకున్నాడు. అదే సమయంలో మద్రాస్లోని గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ కాలేజీలో నా ఫైన్ ఆర్ట్స్ కోర్సు అయిపోయింది.
అప్పట్లో అడ్వర్టయిజింగ్ ఏజెన్సీలకు బాగా డిమాండ్ వుండేది. అందుకే బొంబాయికి వెళ్లి బాబీ శిష్టా కంపెనీలో చేరాను. ఓ వైపు అడ్వర్టయిజ్మెంట్లకు పనిచేస్తూనే మరోవైపు బాలీవుడ్ కళాదర్శకుడు సురేంద్రగారి సినిమాలకు అసిస్టెంట్గా వెళ్లేవాణ్ణి. అయితే నా పెయింటింగ్లు అద్భుతంగా వున్నాయని, అందులోనే కృషి చేయమని ఆయన నన్ను తిరిగి మద్రాసకు పంపించారు. ఆర్ట్ పై వున్న మమకారంతో అందులో మరిన్ని మెలకువలు నేర్చుకునేందుకు పారిస్ కు వెళ్లాను. అక్కడే ప్రింట్మేకింగ్, గ్రాఫిక్స్ ఆర్ట్లో శిక్షణ పొందాను. తిరిగి మద్రాసకు చేరుకున్న తర్వాత ఎప్పటిలాగే నాన్నగారికి అసిస్టెంట్గా సెట్ డిజైనింగ్ చేస్తూనే పెయింటింగ్స్ వేయడం మొదలెట్టాను.
సంగీతం శ్రీనివాసరావుగారు తాళ్లూరి రామేశ్వరితో ఓ సినిమా తీస్తూ సెట్ కోసం పిలిచారు. ఆ సమయానికి నాన్నగారు, తమ్ముడు అందుబాటులో లేకపోవడంతో నేను వెళ్ళాను. నన్ను చూసిన ఆయన ‘నువ్వొచ్చావేమిటయ్యా…. మీ నాన్నను గానీ, తమ్ముణ్ణిగానీ పంపించు” అంటూ నన్ను వెనక్కి పంపించేశారు. ఏం చేయను? కొంతకాలం తర్వాత నాగభూషణంగారు నటించిన ‘నాటకాలరాయుడు‘కు ఆర్ట్ డైరెక్షన్ చేయాల్సిందిగా ఆఫర్ వచ్చింది. కానీ చివరి నిమిషంలో మళ్లీ మా నాన్నగారినే తీసుకున్నారు. దీంతో మరోసారి అసిస్టెంట్గానే సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. నేను స్వంతంగా తొలి సారి ఆర్ట్ డైరెక్షన్ చేసిన సినిమా దేవదాసు కనకాల గారి “నాగమళ్లి‘. అయితే నా కెరీర్ ను మలుపు తిప్పింది మాత్రం రెండో సినిమా ‘అమావాస్య చంద్రుడు‘. కమలహాసన్ హీరోగా నటించిన ఈ సినిమాకు ఆర్ట్ డైరెక్టర్ గా నాకు చక్కని పేరు వచ్చింది. తోట వెంకటేశ్వరరావు కొడుకుగా కాకుండా తోటతరణిగా నా పేరు మారుమ్రోగింది. ఇక అక్కడి నుంచి నా కెరీర్ వేగం పుంజుకుంది. చాలా సినిమాలు చేశాను.
ఈ క్రమంలో మణిరత్నం తన తొలిచిత్రం ‘మౌనరాగం‘కు నన్ను ఆర్ట్ డైరెక్షన్ చేయాల్సిందిగా కోరారు. ఆ సినిమాతో కెమెరామన్ పి.సి. శ్రీరామ్కు, దర్శకుడు మణిరత్నంకు, నాకు బ్రాండ్ ఇమేజ్ వచ్చింది. ఇప్పటికీ అందులోని ఎద్దులబండి పాట గొప్పదనం నీదేరా‘ అంటాడు పి.సి.శ్రీరామ్. మణిరత్నం ఆగమనంతో ఆర్ట్ డైరెక్టర్గా నా జీవితం అద్భుతమైన మలుపు తిరిగింది. ఘర్షణ, అంజలి, నాయకుడు, బొంబాయి, దొంగ దొంగ సినిమాల్లో నేను వేసిన సెట్లకు ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఈ సందర్భంగా ఓ విషయాన్ని గుర్తుచేసుకోవాలి. ‘అంజలి‘లో కాలనీ సెట్ ను వందమంది పనివాళ్లతో కేవలం ఐదు లక్షలతో ఐదురోజుల్లో పూర్తిచేశాను. అప్పుడే ఓ లారీ డ్రైవర్ అటుగా వచ్చి “మద్రాస్ లో అపార్ట్ మెంట్ల గోల ఎక్కువైంది. ఎక్కడపడితే అక్కడ కట్టేస్తున్నారు‘ అని తిట్టుకుంటూ లారీని రివర్స్ చేసుకుని వెళ్లాడు. సెట్కు అవతలి వైపు వున్న మేము నవ్వుకున్నాం. నేను వేసే సెట్లు అంత సహజంగా వుంటాయి కాబట్టే చాలామంది దర్శకులు తమ తొలిచిత్రానికి నన్నే కళాదర్శకుడిగా పెట్టుకునేవారు. మణిరత్నం, శంకర్, ప్రియదర్శన్, రామ్ గోపాల్ వర్మ, ప్రవీణ్ గాంధీ వంటి ఎంతోమంది దర్శకులు నాతోనే దర్శకులుగా తమ ఇన్నింగ్స్ మొదలెట్టారు.
ఒకప్పుడు “మీ నాన్నను పంపించు” అంటూ నన్ను వెనక్కి పంపేసిన సంగీతం శ్రీనివాసరావుగారు “పుష్పకవిమానం‘ సినిమాకు పనిచేయాల్సిందిగా కమలహసన్తో నాకు కబురు పంపారు. ఒకప్పుడు వద్దన్నారుగా, ఇప్పుడెందుకు రమ్మంటున్నారు అన్నాను. కాని కమల్ మీరే చేయాలని పట్టుపట్టడంతో “పుష్పకవిమానం‘ చేశాను. ఆ సినిమా కూడా నాకు అనూహ్యమైన పేరు ప్రఖ్యాతులను తీసుకొచ్చింది. కాకపోతే నెలకు పదివేలు జీతం ఇస్తూ ఆ సినిమా షూటింగ్ ను రెండు సంవత్సరాలు లాగారు.
రామ్ గోపాల్ వర్మ ‘శివ‘ కోసం నేను వేసిన క్యాంటీన్ సెట్ అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. కథ ప్రకారం కాలేజీ పక్కనే క్యాంటీన్ వుండాలి. ఓ కాలేజీని ఎంపికచేసి దాని పక్కనే క్యాంటీన్ సెట్ వేశాను. రామ్ గోపాల్ వర్మ అక్కడికి వచ్చి కాలేజీ పక్క నిజంగానే క్యాంటీన్ వుందేమో అనుకున్నారు. లోపలికి వచ్చి చూసేదాకా ఆయనకు నమ్మకం కలగలేదు. ఇలాంటి సంఘటనలు నా కెరీర్లో లెక్కలేనన్ని జరిగాయి. అదేంటోగానీ ‘అమావాస్య చంద్రుడు‘ తర్వాత నేను వేసిన ప్రతీ అడుగు నా కెరీరకు మైలురాయిగానే నిలిచిపోయింది. కమలహాసన్ తో అనేక సినిమాలకు పనిచేశాను. ‘భారతీయుడు‘, ‘నాయకుడు‘ సినిమాలకు నాకు రెండుసార్లు జాతీయ అవార్డులు కూడా లభించాయి. 2001లో ‘పద్మశ్రీ’ రావడం నా జీవితానికి గొప్ప మలుపు. ఇప్పటిదాకా 220కు పైగా సినిమాలకు ఆర్ట్ డైరెక్షన్ చేశాను. పనిలో పడిపోయి చాలా ఆలస్యంగా పెళ్లి చేసుకున్నాను. పదిహేనేళ్ల క్రితం నా పెళ్లైంది. నాకొక అమ్మాయి పేరు రోహిణి. తను కూడా నాలాగే పెయింటింగ్స్ వేస్తుంది.
సినిమాల్లో ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నా పెయింటర్ గానే నేను ఎక్కువ తృప్తిని పొందుతాను. సినిమాలకు కళాదర్శకత్వం చేస్తూ ఎంత బిజీగా వున్నా గత 33 ఏళ్లుగా క్రమం తప్పకుండా ఏదో ఒక చోట నా పెయింటింగ్ ఎగ్జిబిషన్ పెడుతూనే ఉన్నాను. ఇప్పుడు కళాదర్శకత్వం పూర్తిగా మారిపోయింది. ఇంటర్నెట్లో డౌన్లోడ్ చేసుకుని పని కానిస్తున్నారు. అయినప్పటికీ ‘శివాజీ‘, ‘దశావతారం‘, ‘కుచేలుడు‘, రుద్రమదేవి వంటి సినిమాలకు నాకే అవకాశం ఇవ్వడానికి కారణం నా స్కెచ్లలో ఆత్మ వుంటుందని భావించడమే. పైగా అతి తక్కువ ఖర్చుతో సెట్లు వేస్తాననే నమ్మకాన్ని కూడా నేను ఆయా దర్శకుల నుంచి పొందగలిగాను. అందుకే ఇంకా ఈ రంగంలో ఉండగలిగాను.
-సురేష్ కె.వి.
Nice artical… Raju battula.m.f.a. 9701810059
Very good article about Thota Tarani garu. Thanks to editor of 64kalalu.com
Thanks
Thanks