పాతికేళ్ల ప్రస్థానం – పన్నెండు సినిమాలు

అతడు తన తొలి సినిమాతోనే అదరగొట్టినా అందులోని కథ ఏమీ కొత్త కాదు! అప్పటికే బోలెడన్ని తెలుగు, తమిళ సినిమాల్లో అరగదీసిన ఒక రాబిన్‌హుడ్ కథ! అదే కథనే అంతకు కిందటి ఏడాదిలో కూడా వేరే దర్శకులూ చెప్పారు. అయితే పాతకథనే తన స్టైల్లో చెప్పాడు! తొలి సినిమా(‘జెంటిల్మన్’)తోనే ‘వావ్..’ అనిపించాడు! కొత్త చరిత్రను ప్రారంభించాడు. అలా పాతికేళ్ల ప్రస్థానం పూర్తి అయ్యింది. ఈ పాతికేళ్లలో దర్శకుడిగా అతడు సృజించిన సినిమాలు పన్నెండే! ఈ పన్నెండు సినిమాలతోనే భారతీయ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్నాడు. అతడే ఎస్.శంకర్. షణ్ముగం శంకర్. కమర్షియల్ సినిమాతో మెప్పిస్తూనే, తమకంటూ ప్రత్యేకతను కలిగిన అతితక్కువ మంది భారతీయ దర్శకుల్లో శంకర్ ప్రముఖ స్థానంలో నిలుస్తారు!
శంకర్ సినిమా అంటే.. దాని గురించి చెప్పుకోవడానికి ఎన్నో ఉంటాయి. భారీతనం, సామాజిక అంశాలను టచ్ చేసే కథాంశం, డిఫరెంట్ టేకింగ్, స్టైలిష్ మేకింగ్, ఎంతో ఇన్నోవేటివ్‌గా.. ఇలా ఆయన ఏ సినిమా చేసినా ఈ అంశాలన్నింటి మీద భారీ అంచనాలు ఏర్పడిపోతాయి. ఇలా ఏదో కొన్ని సినిమాలతో ఆ టెంపోను, అంచనాలను కొనసాగించడం పెద్దకథ ఏమీకాదు కానీ, పాతికేళ్ల పాటు అలాగే ప్రస్థానాన్ని సాగించడం అంటే మాటలు కాదు! బహుశా శంకర్‌కే అది సాధ్యం అవుతోంది. ఈ పాతికేళ్లలో శంకర్లాగే ప్రత్యేకతను చూపించిన దర్శకులు మరికొందరు కూడా ఉన్నారు. వారితో పోలిస్తే సక్సెస్ రేటు విషయంలో అయినా, ప్రేక్షకులను ఆకట్టుకునే విషయంలో అయినా శంకర్ ముందుంటారు. ఈ విషయంలో బాలీవుడ్ డైరెక్టర్లు కూడా శంకర్‌కు పోటీ ఇచ్చే స్థితిలో లేరు!
ఎస్ఏ చంద్రశేఖర్ దగ్గర అసిస్టెంట్‌గా..
తమిళ స్టార్ హీరో విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ తమిళంలో ప్రముఖ దర్శకుడు. ఆయన దగ్గర అసిస్టెంట్‌గా చేయడం ద్వారా శంకర్ సినీ ప్రస్థానం మొదలైంది. చంద్రశేఖర్ దగ్గర రెండు మూడు సినిమాలకు శంకర్ పనిచేశాడు. మరో దర్శకుడు పవిత్రన్ వద్ద ఒకటీ అర సినిమాలకు పనిచేసి.. ఆ వెంటనే దర్శకుడిగా మారిపోయాడు!
తొలి సినిమానే అత్యంత భారీ బడ్జెట్‌తో..
తన తొలి సినిమా కోసం దక్షిణాదిన అప్పటి ప్రముఖ హీరోలందరినీ సంప్రదించాడు శంకర్. ‘జెంటిల్మన్’ సినిమా కథను పట్టుకుని తెలుగు, తమిళ హీరోల చుట్టూ తిరిగాడు. చివరకు అది అర్జున్‌తో ఓకే అయ్యింది. అర్జున్ ఆ సినిమాకు ఓకే చెప్పడం పెద్ద విషయం కాదు కానీ, తొలి సినిమాను రూపొందిస్తున్న దర్శకుడితో ఆ కాలానికి అత్యంత భారీ బడ్జెట్ పెట్టిన ఆ నిర్మాత ధైర్యాన్ని ఒప్పుకోవచ్చు. ఆ నాటికి ‘జెంటిల్మన్’ అత్యంత భారీ బడ్జెట్‌తో వచ్చిన తమిళ సినిమా. జెంటిల్మన్ సినిమా కథ గొప్పదేమీ కాదు. ఆ తరహా కథలతో చాలా సినిమాలు వచ్చాయి.
జెంటిల్మన్ తమిళంలో రావడానికి ఐదారేళ్ల ముందే తెలుగు బాలకృష్ణ హీరోగా ‘భలేదొంగ’ వంటి సినిమా వచ్చింది. ఈ రెండు సినిమాలనూ చూస్తే కథ దాదాపు ఒకటే అనిపిస్తుంది. అయితే తేడా ఎక్కడ ఉంటుందో ‘జెంటిల్మన్’ సినిమా నెరేషన్‌ను చూస్తే అర్థం అవుతుంది. అలా తన ప్రత్యేకతను నిరూపించుకున్న శంకర్ తన తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్‌కొట్టారు. తన కెరీర్‌ను చాలా గ్రాండ్‌గా ఆరంభించారు!
ప్రభుదేవాను హీరోగా పెట్టి!
తొలి సినిమాతోనే ‘విద్యా వ్యాపారం’ నశించాలనే సోషల్ థీమ్‌తో ఆకట్టుకునే సినిమాను రూపొందించిన శంకర్ తన రెండో సినిమాతో తమిళ రాజకీయాన్ని టచ్ చేసే కథను తయారు చేసుకున్నాడు. నాటి తమిళనాడు రాజకీయం ప్రస్తావనతో ‘కాదలన్’ సినిమా సాగుతుంది. తమిళనాడు గవర్నర్‌గా మర్రి చెన్నారెడ్డి పనిచేసిన కాలాన్ని ప్రస్తావిస్తూ, చెన్నారెడ్డిని ఆల్మోస్ట్ విలన్‌గా చూపుతూ రూపొందించిన సినిమా ‘కాదలన్’. తెలుగులో ప్రేమికుడుగా విడుదల అయిన ఆ సినిమా తమిళ వెర్షన్‌ను చూస్తే.. అంతులో గిరీష్ కర్నాడ్ పాత్ర తెలుగులో మాట్లాడుతుంది. తమిళనాడు గవర్నర్‌గా పనిచేసిన ఒక తెలుగు వాడి పాత్రగా దాన్ని రూపొందించారు. తమిళ వెర్షన్లో హీరో ఏపీకి వస్తాడు. అల్లు రామలింగయ్య, నిర్మలమ్మ పాత్రలు… తెలుగు నేపథ్యం కోసమే వారిని తీసుకున్నాడు శంకర్. చెప్పాలనుకున్న పాయింట్ ఏదైనా డేరింగ్ అటెంప్ట్ చేశాడు.
కమల్‌తో ఇగో క్లాసెష్!
మూడో సినిమాతో మరో భారీ ప్రయోగం. కథాంశం పరంగా అది రెండంచుల కత్తి. ఒకటి స్వతంత్ర పోరాటం నాటి పరిస్థితులు, ఆ తర్వాత ‘లంచం’ అంశం. ఈ కథాంశంలో లాజిక్ విషయంలో కమల్‌హాసన్ కొన్ని సందేహాలు వ్యక్తం చేసినా.. వాటికి శంకర్ తలొగ్గలేదని అంటారు. అప్పటికే కమల్ సూపర్‌స్టార్. అలాంటి స్టార్ ఒత్తిడి చేసినా తను అనుకున్న కథలో మార్పు చేర్పులకు శంకర్ ససేమేరా అని తనుచెప్పిన కథనే తెరకెక్కించి సూపర్ హిట్ కొట్టి తనసత్తా ఏమిటో చూపించాడు!
ఎడాపెడా సినిమాలు తీయలేదు!
పాతికేళ్ల కెరీర్లో పన్నెండు సినిమాలు. అంటే సగటున రెండేళ్లకు ఒక సినిమా. సినిమాల మేకింగ్ విషయంలో శంకర్ ఎగబడింది లేదు. స్లో అండ్ స్టడీ అన్నట్టుగా.. ప్రతి సినిమాకూ స్క్రిప్ట్ వర్క్ కోసం భారీ సమయాన్నే వెచ్చించి పక్కా ప్లానింగ్‌తో రూపొందించి సంచలన విజయాలను అందుకున్నాడు.
భారతీయుడు వచ్చిన రెండు సంవత్సరాల తర్వాత ‘జీన్స్’ సినిమా వచ్చింది. స్టైలిష్ మూవీ మేకింగ్‌లో తమిళ సినిమా స్థాయిని అది పెంచింది. తమిళ సినిమాల డబ్బింగులకే మరింత ఊపును ఇచ్చింది. శంకర్ స్ఫూర్తితో అనేకమంది లాంటి లావిషింగ్ ఫిల్మ్‌మేకింగ్ మీద దృష్టిపెట్టారు. తమిళనాడు నుంచినే అలాంటి వారు వచ్చారు. వారంతా ఒకటీ రెండు సినిమాలతో ఆగిపోయారు. శంకర్ మాత్రం కొనసాగుతూ వస్తున్నారు అదీ తేడా.
ఆరు సినిమాలు తీసిన తర్వాత ఏడో సినిమాతో తొలి ఫ్లాప్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు శంకర్. ‘బాయ్స్’ రూపంలో ప్రయోగం వికటించింది. శంకర్ అతి విశ్వాసానికే పోయాడో లేక రాంగ్ ఎస్టిమేషన్ వేశాడో కానీ ఆ సినిమాతో తొలి ఫ్లాప్‌ను అందుకున్నాడు. ‘అపరిచితుడు’తో మళ్లీ గాడిలో పడ్డాడు.
ఇక రెండు రీమేక్‌లు చేస్తే అవి కూడా అంత ఆకట్టుకోలేదు.’ఒకేఒక్కడు’ హిందీ రీమేక్ అంతంత మాత్రంగానే ఆడింది. హిందీలో హిట్టైన ‘త్రీ ఇడియట్స్’ సౌత్‌లో రీమేక్ చేసి శంకర్ తన స్థాయిని తగ్గించుకున్నాడు. ‘రోబో’ వంటి సంచలన విజయం తర్వాత ‘త్రీ ఇడియట్స్’ రీమేక్ చేసి తప్పుచేసిన శంకర్, ఆ తర్వాత ‘ఐ’తో చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. ఇక ఇటీవలే 2.0తో మిశ్రమ ఫలితాన్ని పొందాడు. ఇక ‘భారతీయుడు’కు సీక్వెల్ పనిలో ఉన్నాడు ఈ దర్శకుడు.
తను రూపొందించే జోనర్ సినిమాలకే పరిమితం కాకుండా.. నిర్మాతగా మారి మరిన్ని ఆసక్తిదాయకమైన ప్రయత్నాలు చేశాడు శంకర్. దర్శకుడిగా తను చేయలేని కథాంశాలను నిర్మాతగా డీల్ చేశాడు. ‘కాదల్’ వంటి సంచలన విజయం అందుకున్న సినిమాను రూపొందించాడు.’పులకేశి’ ‘గది నంబర్ రెండువందల ఐదులో దేవుడు’ ‘వెయిల్’ వంటి విభిన్నమైన ప్రయత్నాలను చేసి ఆకట్టుకున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap