తమిళులు ఏది చేసినా అతిగా ఉంటుందని అంటారు. కానీ కొన్ని విషయాల్లో మన తెలుగువాళ్లూ అందుకు తీసిపోరనిపిస్తుంది. ఒకరు ఓ పంథాలో వెళ్లి విజయాన్ని అందుకుంటే…. ఇక అందరూ అదే బాట పడతారు. అది కొంతకాలానికి రొటీన్ అయిపోతుందనే ఆలోచన కొన్ని ఎదురుదెబ్బలు తగిలిన తర్వాత కానీ గ్రహింపుకు రాదు. ఇంతలో జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. సినిమా రంగంలో ఇదే పోకడ ఎక్కువగా కనిపిస్తుంది. ట్రెండ్ సృష్టించేవారు ఒకరుంటారు. దానినే ఆ తర్వాత నాలుగైదేళ్లు ఫాలో అయిపోతుంటారు. దానిని బ్రేక్ చేసే ఆలోచనే చాలామంది చేయరు. ‘రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ పాన్ ఇండియా మూవీగా గుర్తింపు తెచ్చుకుని వందల కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది, మనం కూడా అదే దారిలో సాగిపోదాం, కోట్లు గడించేద్దాం’ అనే భావన మన దర్శక నిర్మాతల్లో పాతుకుపోయింది. పర్యవసానంగా ఇప్పుడు టాలీవుడ్ లో ఏకంగా పది, పదిహేను పాన్ ఇండియా చిత్రాలు రూపుదిద్దుకుంటున్నాయి.
ప్రభాస్ చిత్రాలన్నీ అదే కోవలో….
‘బాహుబలి‘ చిత్రంతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ఆ తర్వాత అతను చేసే సినిమాలన్నీ ఆ స్థాయిలోనే ఉండాలనేది ఫిక్స్ అయిపోయింది.
అలా వచ్చిన ‘సాహో’ కమర్షియల్ గా సౌత్ లో క్లిక్ కాకపోయినా, ఉత్తరాదిన బాగానే కలెక్ట్ చేసింది. దాంతో ప్రభాస్ ‘ రాధేశ్యామ్‘ సినిమానూ పాన్ ఇండియా స్థాయిలోనే తీస్తున్నారు. అతి త్వరలోనే ఇది విడుదల కానుంది. ఇక ప్రస్తుతం ప్రభాస్ తో హిందీ చిత్రాల దర్శకుడు ఓంరౌత్ తీస్తున్న ‘ఆదిపురుష్‘ త్రీడీ చిత్రం, కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ చేస్తున్న ‘సలార్’ పాన్ ఇండియా సినిమాలే.
తెలుగు దర్శకుడు నాగ అశ్విన్… ప్రభాస్ తో తెరకెక్కించబోతున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ కూడా ఆ కోవకు చెందిందే. ఇందులో నాయికగా దీపికా పదుకొనె నటిస్తుంటే, అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్ర చేయబోతున్నారు. మిగిలిన టాలీవుడ్ హీరోలు పాన్ ఇండియా సినిమాలు చేస్తూ, తమని తాము ప్రూవ్ చేసుకునే పరిస్థితిలో ఉండగా, ప్రభాస్ మాత్రం ఇప్పటికే పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకోవడం విశేషం.
‘బాహుబలి’ మనవాళ్లపై వేసిన మరో ముద్ర ఏమంటే… సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయడం! గతంలో కొన్ని చిత్రాలు సీరిగా వస్తుండేవి, ఇప్పుడూ వస్తున్నాయి. కానీ పెరిగిన బడ్జెట్ ను, మూవీపై క్రియేట్ అయిన హైపను దృష్టిలో పెట్టుకుని మూడు, నాలుగు గంటల నిడివిలో సినిమాను తీసేసి, దానిని రెండు భాగాలుగా విడుదల చేయడం అనేది ఈ మధ్య కాలంలో ‘బాహుబలి’తోనే జరిగింది. అయితే తొలి భాగానికి వచ్చిన స్పందనను అనుసరించి, రెండో భాగంలో కొద్ది పాటి మార్పులు చేర్పులు, రీషూట్ మనవాళ్లు చేస్తున్నారు. అలా తెరకెక్కిన మరో దక్షిణాది చిత్రం ‘కేజీఎఫ్’. దీనికి సంబంధించిన రెండో భాగం విడుదల కావాల్సి ఉ ంది. ఇక ఇదే బాటలో వస్తున్న మరో పాన్ ఇండియా మూవీ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప‘. దీనిని కూడా రెండు భాగాలుగా రిలీజ్ చేస్తామని అంటున్నారు. అలానే సెట్స్ పై ఉన్న ‘సలార్‘ను రెండు భాగాలుగా రూపొందిస్తారనే వార్తలు వస్తున్నాయి.
దేశవ్యాప్తంగా సూపర్ క్రేజ్ సంపాదించుకున్న మరో సినిమా ‘ట్రిపుల్ ఆర్’. దీనికి ట్యాగ్ లైన్ గా రాజమౌళి ‘రౌద్రం రణం రుధిరం‘ అని పెట్టినా అవేమంత పాపులర్ కాలేదు. ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా చేస్తున్న ఈ సినిమాలో ఉత్తరాదికి చెందిన అజయ్ దేవగన్, అలియాభట్ నటిస్తున్నారు. ఇది ఐదు భాషల్లో విడుదలకు సిద్ధమౌతోంది. విజయ్ దేవరకొండ, పూరి కాంబినేషన్లో తెలుగు, హిందీ భాషల్లో రూపుదిద్దుకుంటున్న ‘టైగర్’ కూడా దేశవ్యాప్తంగా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇదిలా ఉ ంటే… మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితగాథ ఆధారంగా అడివి శేష్ పాన్ ఇండియా మూవీ ‘మేజర్‘లో నటిస్తున్నాడు. సమంత టైటిల్ రోల్ లో గుణశేఖర్ ‘శాకుంతలం‘ను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నాడు. మలయాళ నటుడు దేవ్ మోహన్ ఇందులో దృష్యంతుడిగా నటిస్తున్నాడు. ఇదే కోవలో రామ్చరణ్ – శంకర్; ఎన్టీయార్ – ప్రశాంత్ నీల్; ఎన్టీయార్-కొరటాల శివ; ధనుష్ – శేఖర్ కమ్ముల, శ్రియా ‘గమనం‘, కీర్తి సురేశ్ ‘గుడ్ లక్ సఖీ‘, రానా-ఆచంట గోపీనాథ్ చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కి విడుదల కాబోతున్నాయి.
ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా పదికి పైగా సినిమాలు అలా తయారవుతున్నాయంటే…. మనవాళ్ల లక్ష్యం భారీగా ఉందనేది అర్థమౌతోంది. అయితే ఈ చిత్రాలను ఆయా ప్రాంతాలలో సరైన రీతిలో ప్రమోషన్ చేసుకుని, విడుదల చేయాల్సి ఉంటుంది. ‘బాహుబలి’ విషయంలో అలా జరిగింది. కానీ తూతూ మంత్రంగా ఐదు భాషల్లో విడుదల చేశామని చెప్పుకుంటే, ఉపయోగం ఉండకపోగా, ఆ తర్వాత విడుదలయ్యే చిత్రాల క్రేజ్ ను కిల్ చేసినట్టూ అవుతుంది. కాబట్టి పాన్ ఇండియా మూవీస్ తీస్తున్న నిర్మాతలు, దర్శకులు అచితూచి అడుగు వేయడం ఎంతో అవసరం. అప్పుడే ఈ ట్రెండ్ మరి కొన్నేళ్ల పాటు విజయవంతంగా సాగి తెలుగు సినిమా రంగానికి జాతీయస్థాయిలో గుర్తింపును తీసుకొస్తుంది.
-జాగృతి