(హైదరాబాద్ లో డిసెంబర్ 15 నుండి 25 వరకు పుస్తకప్రదర్శన జరుగుతున్న సందర్బంగా ప్రత్యేక వ్యాసం)
మనిషికి తెలిసింది చాలా స్వల్పం. తెలుసుకోవాల్సింది అత్యధికం. తల్లి సుద్దులు చెబుతుంది. తండ్రి మార్గం చూపిస్తాడు. గురువు ఇంగితం నేర్పిస్తాడు. ఏకకాలంలో ఈ మూడు ధర్మాలను స్నేహనిష్ఠతో నిర్వర్తించేది మాత్రం ఈ లోకంలో పుస్తకాలే” అన్నారు మన సర్వేపల్లి రాధాకృష్ణన్. ”పుస్తకాల నేస్తుడికి ఒంటరితనం అనే అంటు సోకదు. అక్షర చెలిమిని మించిన కలిమి సృష్టిలో మరేదీలేద”నేది అక్బర్ పాదూషా భావన. స్వయంగా చదువుకున్నవాడు కాకపోయినా విద్వాంసులతో నిత్య సంపర్కమే ఆ పాదూషాలోని సంస్కారానికి సుగంధాలు అద్దింది. ”రాజుకు స్వదేశంలో గుర్తింపైతే విద్వాంసుడికి సర్వే సర్వత్రా సమ్మానమే” అన్నారు ధూర్జటి కవి. జ్ఞానాన్ని సుగంధంతో పోల్చిన కాళిదాసు పుస్తకాన్ని ”ప్రసూనం” అన్నాడు. పువ్వులాగే పుస్తకం స్వలాభాపేక్ష లేకుండా నలుదిక్కులా పరిమళాలు వెదజల్లే సద్గుణం కలిగినది. అటువంటి పుస్తకాన్ని ఒక ఆస్తిగా, వారసత్వంగా మనవారికి ఇవ్వాలి. అప్పుడే వారు ప్రపంచమానవులవుతారు.
ఓ మంచి పుస్తకం చదవడంలో వున్న ఆనందం అనుభూతి అనుభవించిన వాళ్లకే తెలుస్తుంది. పుస్తకం చదవడం మనం ఆస్వాదించగలిగితే అది ఎంతో తృప్తినిస్తుంది. పుస్తకం అమ్మలా లాలిస్తుంది. నాన్నలా ఆదరిస్తుంది. గురువులా హితబోధ చేస్తుంది. ఒంటరితనంలో మంచి స్నేహితుడిలా అక్కున చేర్చుకుంటుంది. బాధపడేవారికి పరిష్కారం చూపి ఓదారుస్తుంది. అలసిన మనసులను సేద తీరుస్తుంది. అందుకే పుస్తకం మన మస్తకాలకు పదునుపెట్టే ఆయుధం అయింది, మంచి నేస్తం అయింది. తనను ఆదరించి బుర్రన చేర్చుకున్న వారికి సమస్తం అయింది.
మానవుని జీవితం పాట, కథతోనే ప్రారంభమవుతుంది. నాల్గు దశాబ్దాల క్రితం వరకు దాదాపు ప్రతి ఇంట్లో అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతయ్యలు వాళ్ళ ఇళ్ళలోని పిల్లల్ని, చుట్టు పక్కల పిల్లల్ని ఒకచోట చేర్చి కథలు చెపుతుండేవారు లేదా తల్లులు పిల్లలకు అన్నం తినిపిస్తూనో, నిదురపుచ్చుతూనో కథలు చెప్పడం, పాటలు వినిపించడం చేస్తుండేవారు. అనగనగా ఒక రాకుమారి… ఏటి గట్టున చెట్టు… చెట్టుమీద కాకి… అనగనగా ఒక రాజుకు ఏడుగురు కొడుకులు… ఇలా ప్రారంభించి వారు చెప్పే కథలు పిల్లలకు ఆసక్తిగా వుండేవి. ఈ కథలు వారిలో ఊహాశక్తికి పదును పెట్టేవి. కొత్త పదాలు తెలుసుకోవడం, పదాలను వాక్యంగా కూర్చడం, వాక్యాలను వరుస క్రమంలో చేర్చి కథగా చేయడం తెలుస్తుంది. ఎలా మాట్లాడాలో, ఎలా చెప్పాలో, ఎలాంటి అనుభూతులకు ఎలాంటి పదాలు వాడాలో అర్థమవుతుంది. పసితనంలో పిల్లలు ఎన్ని ఎక్కువ మాటలు తెలుసుకుంటే అంత ఎక్కువగా భాష మీద వారికి పట్టు లభిస్తుంది. అందుకనే కొత్తగా స్కూల్లో చేరిన పిల్లలకి పాటలు, గేయాలు కథల రూపంలోనే చదువు ప్రారంభిస్తారు. అయితే పస్తుతం వేగవంతమైన సమాజంలో సమష్టి కుటుంబాలు మాయమై చిన్న కుటుంబాలు ఏర్పడడం వల్ల కథలు చెప్పే అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతయ్యలు తక్కువయ్యారు. కనుక ఈ రోజుల్లో ఎన్ని టీవీ ఛానల్సు వున్నా, ఇప్పుడే పిల్లలకు పుస్తకాలు బాగా అవసరం. విూ పిల్లలు పెద్దయ్యాక మిమ్ములను వృద్ధాశ్రమాలలో చేర్చకూడదు అనుకుంటే వారితో మంచి పుస్తకాలు చదివించండి.
ఒకసారి ఏం జరిగిందంటే…
ఒకసారి జవహర్ లాల్ నెహ్రూ 7,8 అంతస్తుల భవనంలో వున్న తన కార్యాలయానికి లిఫ్ట్‌లో వెళుతున్నారట. మార్గమధ్యలో లిఫ్ట్ చెడిపోయింది. 20 నిముషాలపాటు ఆయనకు బయటి ప్రపంచంతో సంబంధమే లేదు. అప్పటికి రిపేరు అయింది. లిఫ్ట్ పైకి పోయేసరికి అక్కడవున్న ఉద్యోగ బందం అంతా కూడా నెహ్రూ గారు లోపల వున్నారు ఏమైందోనని చాలా గడగడలాడిపోతూవుంది. అయితే ఆయన మాత్రం ప్రశాంతంగా లిఫ్ట్ బారు చేతిలో ఒక చీటీ పెట్టి వెళ్లిపోయారట. ఆ చీటి తెరిచి చూసుకుంటే భవిష్యత్తులో ఎపుడైనా లిఫ్ట్ నిలిచిపోయినట్లయితే ఆ కాలం సద్వినియోగం చేయడంకోసం లిఫ్ట్‌లో రెండు మంచి పుస్తకాలు పెట్టండని రాసి వుందట. ఇది ఆ రోజుల్లోనే కాదు ఈ రోజుల్లో కూడా మనం ఆలోచించాల్సిన విషయం. అయన దేశ ప్రధానమంత్రి అయినా కూడా పుస్తకాలు చదవడమంటే అంత యిష్టం అంటే ఆశ్చర్యంగాను, ఆనందంగాను వుంటుంది. అంతేకాదు మనకు ఆదర్శవంతులైన ఎందరో నాయకులు – వారి తల్లులు బాల్యంలో చెప్పిన వీర గాథలు, కథలు విని ఉత్తమ పౌరులుగాను, సేవానురక్తులుగాను అయ్యారు. ఆ కథలు వారిలో మంచితనాన్ని నింపాయి. ఛత్రపతి శివాజీకి బాల్యంలో తన తల్లి జిజియాబాయి చెప్పిన వీరగాథలే ఆయన్ను సాటిలేని వీరుడిగా తీర్చిదిద్దాయని చరిత్ర చెబుతోంది. శ్రవణ కుమారుని కథను చదివి మహాత్మ గాంధీ తల్లిదండ్రులకు సేవానురక్తులయ్యారు. ఆయనే హరిశ్చంద్రుని చరిత్ర విని సత్యవాక్పరిపాలన వ్రతం చేపట్టారు. కడుపేద కుటుంబంలో పుట్టి స్కూలుకెళ్ళి చదువుకునే అదష్టానికి సైతం నోచుకోని ఆబ్రహాం లింకన్ అమెరికా అధ్యక్షుడు కాగలిగాడంటే అందుకు కారణం ఆయన బాల్యంలో కొనుక్కుని చదివే శక్తి లేక ఎవరి దగ్గరో అరువు తెచ్చుకొని చదివిన జార్జి వాషింగ్‌టన్ జీవిత చరిత్ర ఇచ్చిన స్ఫూర్తే కారణం.
ప్రముఖుల జీవిత చరిత్రలు, జాతినాయకుల జీవితాలు చదవడం వల్ల ముఖ్యంగా పిల్లల్లో ఆ నాయకుల జీవితాల్లోని త్యాగనిరతి, సేవాభావం, ఇతరులపట్ల ప్రేమ, ఇతరులతో స్నేహంగా వుండడం మొదలగు మంచి గుణాలు వారిలో అలవడే అవకాశం వుంది.
పాపం, పుణ్యం, ప్రపంచమార్గం/ కష్టం, సౌఖ్యం, శ్లేషార్థాలు ఏమీ ఎరుగనీ పువ్వులారా/ అయిదారేడుల పాపల్లారా/ మెరుపు మెరిస్తే, వాన కురిస్తే/ ఆకాశమున హరివిల్లు విరిస్తే/ అవి విూకే అని ఆనందించే కూనల్లారా అంటూ మహా కవి శ్రీశ్రీ చిన్నారులను గురించి ప్రస్తావించారు.
శిశువు జన్మించింది మొదలు బాల్యదశ వీడేవరకు వాని మనస్సుకు రంజకంగా వుండేదే ‘బాల సాహిత్యం’ అని బాల సాహిత్య పరిధిని వివరిస్తూ, చింతా దీక్షితులు అన్నారు.
బాల సాహిత్యం ‘తియ్యని మామిడిపండులా ఆపాత మధురంగా వుండాలి. చెప్పవలసిన విషయం పండు ఒలిచి చేతిలో పెట్టినట్లు వుండాలి. తికమకలు పనికిరావు. సూటిగా వుండాలి. భాష సరళంగా, లలితంగా వుండాలి అని బాల సాహిత్యంపై పరిశోధన చేసిన డా||వెలగా వెంకటప్పయ్య అన్నారు.
Book – Built in orderly organised knowledge.
”అక్షర రూపం దాల్చిన సిరా చుక్క లక్షల మెదళ్ళకు కదలిక” అంటూ సుప్రసిద్ధ కవి కాళోజీ నారాయణరావు పుస్తకం గొప్పతనాన్ని చక్కగా వివరించారు.
పిల్లలతో ఏఏ పుస్తకాలు చదివించాలి…
పురాణ కథలు చదవడంద్వారా తల్లిదండ్రుల మాటకు విలువివ్వడం, అన్నదమ్ముల ఆత్మీయతలు, మిత్రులతో మెలగాల్సిన వైనం, త్యాగబుద్ధి, తదితర విషయాలను నేర్చుకుంటారు. మన సంస్కృతిపై పురాణాలు, ఇతిహాసాల ప్రభావం అధికం. కాబట్టి అసలు పురాణాల్లో పేర్కొన్న విషయాల హేతుబద్ధత అర్థంకావడానికి ఇవి చదవాలి. పంచతంత్ర కథలు ద్వారా మిత్ర లాభం, మిత్ర భేదం వంటివి తెలుసుకుంటారు. కామిక్స్, జోక్స్ పుస్తకాలు చదివితే టెన్షన్ నుండి రిలీఫ్ పొందుతారు. స్వాతంత్య్ర వీరుల కథలు, జీవిత చరిత్రలు పుస్తకాలు పిల్లలలో ధైర్యం, సాహసం, దేశభక్తిని ప్రబోధిస్తాయి. పాపులర్ సైన్స్, విజ్ఞాన శాస్త్ర గ్రంథాలు, శాస్త్రజ్ఞుల జీవిత కథలు పిల్లలలో కొత్త ఆలోచనలు రేకెత్తిస్తాయి. శాస్తజ్ఞులులాగా తాము కూడా సమాజానికి వుపయోగపడే సేవలందించాలని ఉత్సాహపడతారు.
పెద్దలు పిల్లలతో ఏ పుస్తకాలు చదివించదలచినా అవి పిల్లల మనస్సుమీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయో అలోచించాలి. పిల్లలు చదివే పుస్తకాలలో అశ్లీలం, అసభ్యత, ద్వంద్వార్థ, సంభాషణలు కనిపించకూడదు. మొదట పెద్దవాళ్ళు చదివి బాగుంటేనే, పిల్లలచేత చదివించడం మంచిది.
అయితే నూతన సహస్రాభ్ది అనేక మార్పులను, అంతులేని వేగాన్ని మోసుకొచ్చింది. చదువులో పొటీతత్వం పెరిగింది. తల్లిదండ్రుల్లో ఒత్తిడిని పెంచింది. పిల్లల్లో పోటీతత్వం గణితం, సైన్సు వైెపు మొగ్గేట్టు చేసింది. కనుక నేటి పిల్లల్లో విద్యార్థి దశ నుండే భాష, సాంఘిక శాస్త్రాలు చదవాల్సిన అవసరం లేదని, చదివినా పాసయ్యేట్టుగా చదివితే చాలని చేసింది. ఇలాంటి సమయాలలో రేపటి పౌరులైన బాలలకు ఉత్తమ సాహిత్యాన్ని అందించాల్సిన అవసరం మరింత పెరిగింది. పసివాళ్లను పట్టించుకొని వాళ్ళకు అవసరమైన సాహిత్యాన్ని అందించాల్సిన బాధ్యత రచయితలపైనే వుంది. క్విజ్‌లు, జ్ఞాపకశక్తిని పెంచే ఇతర ప్రక్రియలు పిల్లల పరిజ్ఞానాన్ని ఐక్యుని కొలవడానికి ఉపయోగపడతాయేమోగాని వారి మానసిక వికాసానికి ఉపయోగపడవు. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే మనకు భవిష్యత్తులో ఐ.టి. ఎక్స్‌పర్ట్‌లు, కంప్యూటర్ నిపుణులు, బిజినెస్ మ్యాగనేట్లు, బిల్‌గేట్స్ దొరికితే దొరకవచ్చుగాని మహాత్మగాంధీలు, అబ్రహంలింకన్‌లు, మదర్ థెరిసాలు, వినోబాభావేలు; తెలుగు భాషకోసం ఎంతో కృషిచేసిన సి.పి.బ్రౌన్‌లాంటివారు మచ్చుకైనా కనబడరు. బాల్యంలో కళా, సాహిత్యాల అనుభూతులతో, వాటి పరిచయంతో పెరిగిన పిల్లలే భవిష్యత్తులో గొప్పవాళ్లు, కనీసం మంచివాళ్లుగా బతికే అవకాశం వుంది. సాహిత్య సామాజిక రంగాలతో స్పర్శవున్న వాళ్ళే ఉన్నత స్థానాలకు ఎదిగారన్న విషయం మర్చిపోకూడదు. మన జాతిపిత గాంధీ, భారత మొదటి ప్రధాని నెహ్రూ, లాల్‌బహుదూర్‌శాస్త్రి, ఇందిరాగాంధి, పి.వి. నరసింహారావు, వాజ్‌పాయి, అబ్దుల్‌కలాం లాంటివాళ్ళు సాహిత్యంతో సంబంధం లేనివాళ్లు కాదు. వీళ్లందరూ స్వయంగా రచయితలు కూడా. ఎక్కడ సాహిత్యం, కళలు వర్థిల్లుతాయో ఆ సమాజమే అభివృద్ధి చెందినట్లు లెక్క. ”ఒక ఊరి సంస్కృతిని ఆ ఊళ్లోవున్న పుస్తకాల షాపులను బట్టి అంచనా వేయవచ్చు అన్నారు” లాస్కీ మహాశయుడు.
బాలలే విజ్ఞాన హేతువులు/ నేడు రేపుల మధ్య సేతువులు
చంద్ర బందుర సుధా శీతువులు/ మానవతకు వికాస హేతువులు అన్నారు శ్రీశ్రీ.*
బాల సాహిత్యం ప్రచురణను, అమ్మకాలను, లాభాపేక్షతో కాకుండా సమాజంలోని చిన్నారులను మంచి భారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు చేస్తున్న సామాజిక సేవగా భావించాలి. అప్పుడే బాలసాహిత్యానికి ఆదరణ లభిస్తుంది. చిన్నప్పటి నుండి పిల్లల్లో పఠనాసక్తిని పెంచితే మంచి పుస్తక పఠనం పిల్లలతో పాటు పెరుగుతుంది.
మానవుడికి వుండే అలవాట్లలో ఏ అలవాటు ఎక్కువైనా ప్రమాదమే. కానీ ఎంత ఎక్కువైనా ప్రమాదంలేని అలవాటు పుస్తక పఠనం మాత్రమే. సినిమాల వల్ల, ఛానల్స్‌లో వచ్చే చెడు కార్యక్రమాలవల్ల, చెడు మార్గాలు పట్టి చెడిపోయినవారు వున్నారేమో గానీ, పుస్తకాలు చదివి చెడిపోయినవారు లేరు. ప్రజల్ని బుక్ కల్చర్ వైపుకు మళ్లించాల్సిన అవసరం వుంది.
నేటి విూ మిత్రుడు రేపు శత్రువు కావచ్చు. తన బిడ్డలే తనను కాదనవచ్చు. నమ్మినవారు నట్టేట ముంచవచ్చు. కానీ నేటి ప్రపంచంలో మంచి మిత్రులుగా నమ్మదగిన నేస్తాలు పుస్తకాలు. కనుక పుస్తకాలను ప్రేమించండి! చదవండి! బహుమతులుగా యివ్వండి. మన పిల్లలకు వారసత్వంగా మంచి పుస్తకాలను ఇద్దాం. ఏమంటారు? మరి అందుకోసం మంచి పుస్తకాలను సేకరించాలికదా. అందుకు మంచి అవకాశం ఇస్తాయి పుస్తక ప్రదర్శనలు.
డిసెంబర్ వచ్చేసింది… పుస్తకాలు తెచ్చేసింది…
ప్రపంచంలో డిసెంబర్ నెల వచ్చిందంటే అందరికీ గుర్తుకొచ్చేది క్రిస్టమస్ పండుగ. అయితే రెండు తెలుగు రాష్ట్రాలలోని తెలుగు పాఠకులకు, రచయితలకు, ప్రచురణకర్తలకు, పుస్తకవిక్రేతలకు గుర్తుకు వచ్చే మరో పండుగ డిసెంబర్ 15 నుండి 25 వరకు సాగే హైదరాబాద్ బుక్ ఫెస్టివల్ వారు నిర్వహించే ‘హైదరాబాద్ బుక్ ఫెయిర్’. 1986లో ప్రారంభమయిన ఈ పుస్తక ప్రదర్శన భారతదేశంలోనే రెండవ అతిపెద్ద పుస్తకప్రదర్శనగా గుర్తింపు పొందింది. ఈ ప్రదర్శన కార్యక్రమాలలో పాల్గొనడం తమకు లభించిన గొప్ప గౌరవంగా రాష్ట్ర, కేంద్ర మంత్రులు, సుప్రసిద్ధ రచయితలూ, మేధావులు, రాజకీయనాయకులు, కవులు, కళాకారులు భావించే స్థితికి ఎదిగింది.
ఈ ప్రదర్శనలో బాలసాహిత్యం నుండి భారతం దాకా, ఫిక్షన్ నుండి ఫిలాసఫీ దాకా, కమ్యూనిజం నుండి రొమాంటిసిజం దాక, భక్తి, ముక్తి, రక్తి, అనురక్తిలపై పుస్తకాలు లభిస్తాయి. హరిశ్చంద్రుని గురించి చదవాలన్నా అనిల్ అంబానీలను గురించి తెలుసుకోవాలన్నా పుస్తకాలు లభిస్తాయి.
2014లో తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత నిర్వహిస్తున్న నాల్గో పుస్తకప్రదర్శన ఇది. ఇందులో తెలంగాణ రచయితల పుస్తకాలతో పాటు ఈ ప్రాంతపు చరిత్ర, సంస్కృతి, గేయాలు, పాటలు మొదలగునవి లభిస్తాయి. అంతేగాక పెద్దబాలశిక్ష నుండి పరిశోధనాత్మక పుస్తకాల దాకా ఇక్కడ కొలువుదీరి వుంటాయి.
తెలుగుతోపాటు ఆంగ్లం, హిందీ, ఊర్దూ, తమిళం కన్నడం మొదలైన భాషల్లో దేశనాయకులు, రచయితలు, స్వాములు, బాబాలు, వివాదస్పద వ్యక్తుల జీవిత చరిత్రలు, పాపులర్ సైన్స్, నిఘంటువులు, ప్రముఖుల ప్రసంగాలు, వ్యాకరణాలు, స్పీకింగ్ కోర్సులు, వ్యక్తిత్వ వికాసం, వివిధ ప్రాంతాల వంటకాల పుస్తకాలు; జనరల్ నాలెడ్జ్, జోతిష్యం, హస్తసాముద్రికం, క్విజ్ పుస్తకాలు, న్యాయ, వైద్య గ్రంథాలు… ఇట్లా వొకటేమిటి సృష్టిలో విభిన్న అంశాలకు సంబంధించిన అన్ని రకాల పుస్తకాలు ఈ బుక్‌ఫెయిర్‌లో 330 స్టాల్స్ ద్వారా లభిస్తాయి.
ఈ ప్రదర్శనలో రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రముఖ ప్రచురణకర్తలు, బెంగళూరు, పూనె, అహమ్మదాబాద్ ముంబయి, చెన్నై, ఢిల్లీ వంటి ప్రాంతాల నుంచి వచ్చే ప్రముఖ ప్రచురణ సంస్థలు పాల్గొంటున్నాయి. వివిధ విదేశీ ప్రచురణ సంస్థలు, వారి డిస్ట్రిబ్యూటర్లు, వారి వారి ప్రచురణలతో పాల్గొంటున్నారు. తెలుగు కార్టూనిస్టులు కార్టూన్ పుస్తకాలతో పెట్టిన స్టాల్ ప్రత్యేక ఆకర్షణ. కొనుగోలు చేసిన ప్రతిపుస్తకం వెలపై 10% తగ్గింపు వుంటుంది.
మాన్ ఇట్లా అంటాడు… పుస్తకాలు లేని ఇల్లు కిటికీలు లేని గది వంటిది. పుస్తకాలు కొనగల శక్తిగలవారు వారి పిల్లలకు మంచి పుస్తకాల్ని కొనిస్తే వారిని సక్రమంగా పోషించినట్లే”……
Good reference article..
Thanks
చాలా చక్కగా విపులీకరించారు .. మీకు ధన్యవాదాలు ..
Thanks
Good article
Thanks