నిన్నటితో విజయవాడ పుస్తక ప్రదర్శన ముగిసిపోయింది. చాలా రోజుల తర్వాత మళ్ళా పాత రోజుల్ని తలపించేలాంటి పుస్తక ప్రదర్శన. 1996 లో మొదటిసారి చూసాను విజయవాడ పుస్తకాల పండగని. ఆ తర్వాత పదేళ్ళ పాటు దాదాపుగా ప్రతి ఏడాదీ వస్తూనే ఉన్నాను. ఏదో ఒక సాహిత్యసభలో ప్రసంగిస్తూనే ఉన్నాను. మధ్యలో కొన్నాళ్ళు జిల్లాల వారీగా కూడా పుస్తక ప్రదర్శనలు ఏర్పాటు చేసారు. 2016 లో అటువంటి ఒక జిల్లా ప్రదర్శనలో నెల్లూరులో పాల్గొని వస్తూండగా ఆ రాత్రే, సగం దారిలో, డీమానిటైజేషన్ ప్రకటన వెలువడింది. ఆ తర్వాత మూడు నాలుగేళ్ళు తిరక్కుండానే కరోనా. ఈ నేపథ్యంలో, అసలు ఇన్ని రోజుల పాటు నిరాఘాటంగా ఒక పుస్తక ప్రదర్శన జరగడం, మళ్ళా మనుషులు సంతోషంగా ఈ ప్రాంగణంంతా కలయతిరగటం, ఒక సైక్లోనో, ఒక ఒమిక్రానో ఇంకా విజృంభించకుండానే పుస్తకప్రదర్శన పూర్తి కావడం నిజంగానే ఎంతో సంతోషిచదగ్గ విషయం.
ప్రతి సారీ పుస్తకప్రదర్శనలో ఒకటో రెండో సాహిత్య సభల్లో పాల్గొనే అవకాశం ఉండేది. కాని ఈ సారి నా పంట పండింది. ఆరేడు సభల్లో మాట్లాడేను. పుస్తక ప్రదర్శన ప్రాంగణానికి ప్రముఖ ప్రచురణ కర్త నవోదయ రామ్మోహనరావుగారి పేరు, సభావేదికకి కాళీపట్నం రామారావుగారి పేరు పెట్టారు. అందుకని మొదటిరోజు ఆ ఇద్దరితో నాకున్న అనుబంధం గురించి పంచుకొమ్మని అడిగారు నిర్వాహకులు. కారామాష్టారితో నా అనుబంధం గురించి ఇంతకు ముందు చాలాసార్లు రాసేను కాని నవోదయ రామ్మోహనరావుగారి గురించి రెండు మాటలు చెప్పాలి.
నేను 1982లో అంటే నా పందొమ్మిదో ఏట ఒక నవల రాసాను. దాన్ని ఆంధ్ర జ్యోతి వారపత్రిక నిర్వహించే నవలలపోటీకి పంపించాను. అందులో అది ఎంపిక కాలేదు సరికదా, సాధారణ ప్రచురణకి కూడా తీసుకోలేదు. కాని ఎట్లానో ఆ నవల గురించి ఆంధ్రజ్యోతి దినపత్రిక సంపాదకులు నండూరి రామ్మోహనరావుగారి దృష్టికి వచ్చింది. ఆయన ఆ నవలను సుబ్రహ్మణ్య శర్మగారి దగ్గర తీసుకుని దినపత్రికలో డైలీ సీరియల్ గా ప్రచురించడం మొదలుపెట్టారు. ఆయనా నవోదయరామ్మోహనరావు గారూ మంచిమిత్రులు. ఆయన ఆ నవలను సీరియల్ గా ప్రచురిస్తున్నప్పుడే నవోదయ రామోహనరావుగారు నాకో ఉత్తరం రాసారు. ఆ నవలను తాను పుస్తకంగా ముద్రించాలనుకుంటున్నాననీ, అందుకుగాను నాకు రెండువేలు రాయల్టీ, రెండు కాపీలో, పది కాపీలో కాంప్లిమెంటరీగా పంపిస్తాననీ. అది 1987 లో మాట. అప్పుడు నా నెల జీతం అయిదారువందలు వుండేది. అంటే మూడు నాలుగు నెలల జీతానికి సమానమైన పారితోషికం అన్నమాట. పారితోషికం అలా ఉంచి, అసలు ఒక ప్రచురణ కర్త నావంటి ముక్కూ మొహం తెలియని ఒక అనామక రచయితకు అలా ఉత్తరం రాయడమే అబ్బురం అనిపించింది నాకు. ఆయన అన్నట్టే పుస్తకం వేసారు, నాకు పారితోషికం పంపిచారు కూడా.
పుస్తకప్రదర్శనలో రెండవరోజు జాషువా ప్రసిద్ధ కావ్యాలకు ఎమెస్కో సంష్త టీకాతాత్పర్యాలతో వెలువరించిన పుస్తకాల ఆవిష్కరణలో జాషువా సాహిత్యం గురించీ, వ్యక్తిత్వం గురించీ ప్రసంగించేను. నాలుగో రోజు రెండు సమావేశాలు. ఒకటి పి.పుల్లయ్య, శాంతకుమారి దంపతుల మీద వోలేటి శ్రీనివాస భాను రాసిన ‘అనురాగమూర్తులు ‘పుస్తకం ఆవిష్కరణ సందర్భంగా ఆ పుస్తకాన్ని పరిచయం చేసాను. ఆ రోజే రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఘంటసాల శతజయంతి సందర్భంగా విడుదల చేసిన శతవసంతాల ఘంటసాల పుస్తకావిష్కరణలో పాల్గొన్నాను. ఘంటసాల మీద ఒక పుస్తకం తెస్తున్నామనీ అందులో నా వ్యాసం కనీసం ఒక్కపేజీ అయినా ఉండాలనీ సాంస్కృతిక శాక సంచాలకుడు, చిత్రకారుడు, శిల్పి అయిన మల్లికార్జున రావు నన్ను ఎన్నో సార్లు అడిగాడు. అలాగే, అలాగే అంటో వున్నానుగానీ, ఆ వ్యాసం అందించలేకపోయాను. కానీ ఘంటసాల నన్ను వదల్లేదు. ఆ రోజు ఆ పుస్తక ఆవిష్కరణ సభలో మొదటి కాపీ నాకు అందించారు. ఒక కళాకారుడు మరొక కళాకారుణ్ణి ఎన్నడూ వదలడు అని చెప్పాను ఆ రోజు సభలో.
ఎనభైల మొదట్లో అమలాపురం నుంచి ఎక్స్ రే అనే కవితా పత్రిక ఒకటి వచ్చేది. దాన్ని నడిపిన కొల్లూరి కవిత్వానికి ఒక ప్రజాస్వామిక వేదికకోసం పాటుపడ్డవాళ్ళల్లో ఒకరు. ఇటీవల ఎక్స్ రే అవార్డు పొందిన సరికొండ నరసింహరాజు కవిత్వం ‘నెత్తుటి పాదాలు’ ఆవిష్కరణకు నన్ను కొల్లూరి ఆహ్వానించినప్పుడు సంతోషమనిపించింది. పుస్తక ప్రదర్శనలో అయిదవరోజు ఆ పుస్తకాన్ని ఆవిష్కరించి ప్రసగించాను.
మరొక రోజు వడ్డాది పాపయ్య శతజయంతి సభలో ఆయన గురించి నివాళి ప్రసంగం. ఇంతకుముదు అక్టోబరులో విజయవాడ వడ్డాది పాపయ్యను స్మరించుకున్న సంగతి ఇక్కడ రాసాను. ఆ విశేషాలన్నీ మరొకసారి పంచుకున్నాను ఆ రోజు.
పుస్తక ప్రదర్శనలో రెండు సభావేదికలు పెట్టారు. ఒకటి కాళీపట్నం రామారావు గారి పేరు మీద ఏర్పాటు చేస్తే మరొకటి సుప్రసిద్ధ శాస్త్రవేత్త యలవర్తి నాయుడమ్మ గారి పేరిట ఏర్పాటు చేసారు. ఆ వేదికమీద కూడా మాట్లాడే అవకాశం ప్రసిద్ధ కవి మిత్రుడు ప్రసాద మూర్తి వల్ల లభించింది. ఆయన కవిత్వ సంపుటాలు ‘గోల్డీ పద్యాలు’, ‘అమ్మ నాన్న ఒక సైకిల్’ పుస్తకాల ఆవిష్కరణ సభలో పాల్గొన్నాను, మాట్లాడేను.
ఒక పుస్తకప్రదర్శనలో ఇన్ని బుకింగులు దొరకడం ఇదే మొదటిసారి!
ఈసారి పుస్తక ప్రదర్శనని మరింత వెలిగించింది విద్యుద్దీపాలు కాదు, మా గిరిజన ఆశ్రమపాఠశాల చిన్నారులు, కస్తూర్బా విద్యాలయాల చిన్నారులూను. ప్రతి రోజూ పిల్లలు రకరకాల జానపద, గిరిజన నృత్యాలు చేసారు. వాళ్ళ ఆటలతో, పాటలతో పుస్తక ప్రాంగణం తుళ్ళిపడుతూనే ఉంది. నిన్నటికి కొత్త సంవత్సరం పూర్తిగా ప్రవేశించినట్టనిపించింది!
-వాడ్రేవు చిన వీరభద్రుడు
స్పూర్తిదాయక వ్యాసం…
ఆ అనుభవాలు సంతోషం కల్గించాయ …
ధన్యవాదములు