ప్రాచీన ఆధునికతలకు మేలి మేళవింపు: గిరిధర్ గౌడ్

(జనవరి 4 న అఖో, విభో సంస్థ ‘సరి లేరు నీ కెవ్వరు ‘ విశిష్ట చిత్రరచనా పురస్కారం తో రాయన గిరిధర్ గౌడ్ ను తెనాలి లో సత్కరిస్తున్న సందర్భంగా..)

ప్రాచీన భారతీయ చిత్రకళకు ఆధునికతను అద్దుతూ, దేశ విదేశాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన గ్రామీణ చిత్రకారుడు రాయన గిరిధర్ గౌడ్, శివుని వాహనం నంది పై వందలాది చిత్రాలు గీసి, వృషభ చిత్రకారుడుగా తెలుగునాట సంచలన చిత్రకారుడు గిరిధర్. తెలుగు సినీ పరిశ్రమకు పుట్టినిల్లుగా, ప్యాషన్దకు మెట్టినిల్లుగా కీర్తి పొందిన తెనాలికి 20 కి.మీ. దూరంలో తపాలా కార్యాలయం కూడా లేని మారుమూల పల్లెటూరు గరువుపాలెంను, చిత్రకళకు గురువుపాలెంగా, చిత్రకళా ప్రపంచాన్ని తనవైపు చూసేలా ఆయన కృషి చేస్తున్నారు.
గుంటూరు జిల్లా రేపల్లెకు సమీపంలో గల గూడవల్లి గ్రామంలో మునెమ్మ – రాధాకృష్ణమూర్తి దంపతులకు 1965లో వీరు జన్మించారు. తండ్రి తెలుగు పండితుడు. ఆయనకు చిత్రకళ అంటే ప్రత్యేక అభిమానం. ఎన్టీఆర్ నటించిన మాయాబజార్, పాతాళభైరవి చిత్రాలు చూసి, గిరిధర్ చిన్నతనంలోనే ఆ సినిమాల్లో సెట్టింగుల్ని పలకపై గీయడం చూసి పాఠశాల చిత్రకళపాధ్యాయుడు, అడవి బాపిరాజు శిష్యుడు అయిన దివి సుబ్బరాయశాస్తి చిత్రకళలో అఆలు నేర్పించారు. బాల చిత్రకారుని భవిష్యత్తు గురించి తండ్రి ప్రముఖ చిత్రకళా సమీక్షకులు డా. సంజీవదేవ్, ఇటాలియన్ స్కాలర్ వై.వి.లక్షయ్యలను సలహా కోరగా వారు, భవిష్యత్తులో మంచి చిత్రకారుడుగా రాణిస్తాడని గిరిధరను ఆశీర్వదించారు.

గిరిధర్ చిత్రకళపై ఆసక్తి గమనించిన తండ్రి మైసూరులోని చామరాజేంద్ర ఆర్టు కాలేజిలో మొదటి బ్యాచ్లో బి.ఎఫ్.ఎ.లో చేర్చారు. తర్వాత రాజస్థాన్ వెళ్లి బనస్థలి విద్యాపీఠంలో జైపూర్, ఇటాలియన్ కుడ్య చిత్రాల మీద సాంకేతిక శిక్షణ పొందారు. ఈ సమయంలో వాడిన సహజ వనరులు, అవి వాడే మాధ్యమం, తయారీ విధానం తన మినియేచర్ చిత్రకళకు ఎంతో దోహదపడ్డాయి. రాజస్థాన్లో వనస్థలి విద్యాపీఠా విశ్వవద్యాలయంలో మ్యూరల్ కోర్సు, జయపురి ఫ్రెస్కో, ఇటాలియన్ ఫ్రెస్కో, సాంకేతిక విద్యలో మెళకువలు నేర్చుకొన్నారు. అంతేకాక నావల్ ఘడ్ రాజకుమార్ సంగ్రామసింగ్ వద్ద నున్న ఒరిజినల్ చిత్రాల్ని పరిశీలించడం జరిగింది. తర్వాత జయపూర్, ఉదయ్ఫుడ్, బోధ్ పూర్, శోభవటి, జైసల్ మీర్, సాలార్జింగ్ మ్యూజియంలోనున్న మినియేచర్ చిత్రాలు చూసి మినియేచర్స్ చిత్ర రచనకు సోపానాలుగా మార్చుకున్నారు. తర్వాత బరోడా వెళ్లి ఎం.ఎన్. విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎఫ్.ఎ. చేశారు. అక్కడ విభాగ అధిపతిగా నున్న గులాం మహమ్మద్ షేక్ వద్ద కుడ్య చిత్రకళలో ప్రత్యేక శిక్షణ పొందారు. పెద్ద చిత్రాలు నిర్భీతితో వేయడానికి ఇది దోహదపడింది. తర్వాత అనంతపురం జిల్లాలోని లేపాక్షి చిత్రాలను, అక్కడి చిత్రకారులు అనుసరించిన విధానాల్ని లోతుగా పరిశీలన చేశారు.

దేశంలో వివిధ ప్రాంతాల కళారీతుల్ని విస్తృతంగా పరిశీలించి, అన్నిటిని మేళవించి, తనదైన వినూత్న శైలిని సృష్టించుకొన్నారు. అంతటిలో సంతృప్తి చెందక, నలుపు-తెలుపు చిత్రాలు, గ్లాస్ పెయింటింగ్, నీటి రంగుల చిత్రాలు, నూనె రంగుల చిత్రాలు, కొన్ని చిన్న చిత్రాలు, కొన్ని పెద్ద చిత్రాలు, ఆధునిక, సంప్రదాయ, జానపద రీతుల్లో చిత్రించి, అన్నిట అందెవేసిన చెయ్యి అనిపించుకొన్నారు.
ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారులు పికాసో, రూబెన్స్, రేబ్రాంట్, హుస్సేన్ల చిత్రాలంటే గిరిధర్ కు ప్రత్యేక అభిమానం. చిత్రకళా వివరాల్ని శాస్త్రీయంగా కన్నడంలో వెలువడిన ‘విష్ణుధర్మోత్తర పురాణం’, వాల్మీకి రామాయణం, వ్యాస భారతం, కాళిదాసు ఋతు సంహారం, రవీంద్రుని గీతాంజలి తదితర గ్రంధాల్ని పరిశీలించి చిత్రాల్ని గీయడానికి ఉపక్రమించేవారు.

వీరు పావు శతాబ్దం నుండి ఆయన చిత్రాలు గీస్తున్నారు. చెన్నైకి చెందిన “సాక్షి” ఆర్టు గ్యాలరీలో తొలిసారి ఆయన చిత్రకళా ప్రదర్శన నిర్వహించారు. బెంగళూరు, ముంబాయి, హైద్రాబాద్, పది వ్యక్తిగత చిత్రకళా ప్రదర్శనలు, 30కి పైగా గ్రూప్ ప్రదర్శనలు నిర్వహించారు. మైసూరు, బాపట్ల, హైద్రాబాద్, అహ్మదాబాద్, అమలాపురం, శ్రీకాకుళం, తెనాలి, గుంటూరు, నెల్లూరు, న్యూఢిల్లీ, విజయవాడ తదితర ప్రాంతాలలో వివిధ అవార్డులు లభించాయి.
ఆయన అనేక సిరీస్లో చిత్రాలు విభిన్న పద్దతుల్లో గీచారు. వృషభ, కృష్ణలీల, ఋతు గణపతి, భారతమాట, సప్తతాండవాస్, మహాభారతం, దశావతారాలు, ప్రకృతి దృశ్యాలతో పాటు రాజరాజ నరేంద్రుడు, శ్రీకృష్ణ దేవరాయులు తదితరాలు ప్రసిద్ధినొందాయి.

కృష్ణా జిల్లా ఆత్మకూరు వాస్తవ్యులు కుదరవల్లి రాజారావు ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన చూసి స్పూర్తి పొంది వృషభ-1 సిరీస్లో 125, వృషభ-2లో 83, వృషభ-3లో 83 చిత్రాలు గీశారు. అదే విధంగా పోతన భాగవతం ఋతువర్ణనపై వర్ణ చిత్రాలు, తల్లీ బిడ్డల సిరీస్లో బిడ్డగా గణేశుడు, తల్లి దండ్రులుగా శివపార్వతులు ఇందులో ప్రధాన పాత్రధారులు, పౌరాణిక ప్రధాన లక్షణాలకు విరుద్ధంగా, ఇప్పటి తల్లీ బిడ్డల్ని ఆధునిక రీతుల్లో భంగిమలు, బిడ్డల్ని చూపించడం ఈ చిత్రాల ప్రత్యేకత. దేవతలు కూడా రాగద్వేషాలకు, ప్రేమ, మమతల వంటి మానవ సహజభావాలకు వారు అతీతం కాదు అన్నీ ఊహతోనే తల్లిబిడ్డలు సిరీస్ చేశారు.
మహా భారతంలోని కుంతి, గాంధారి, ద్రౌపతి, ధృతరాష్ట్రుడు, భీష్ముడు, అభిమన్యుడు తదితరుల స్వభావాల్ని లోతుగా తనదైన శైలిలో పరిశీలించి, వాటికి విభిన్నమైన విలక్షణమైన రీతుల్లో గీచారు. చారిత్రక ఆధారాలతో శ్రీకృష్ణదేవరాయులు బంగారు సింహాసనంపై ఆశీనులైనట్టు చూపించారు.
గిరిధర్ చిత్రాలన్నీ దేనికదే ఒక ప్రత్యేకత కల్గి వుంటుంది. ఏ చిత్రం మరో చిత్రంతో సంబంధం వుండదు. ఆ చిత్రాల్లో లాలిత్యం కంటే గంభీర్యం, అనుభూతి కంటే ఆలోచన ఎక్కువ. సునిశిత పరిశీలన, పట్టుదల, కృషి, రాజీపడకపోవడం అతన్నీ స్థానంలో నిలిపాయి. రిబ్రాంట్ లా వ్యాపార ఆసక్తితో కాక, తృప్తి కోసం చిత్రరచన చేస్తున్నారు. ఒకే విధమైన ముద్ర పడకుండా, వివిధ విషయాలి, అనేక అంశాల్ని సృజిస్తూ, వేర్వేరు మాధ్యమాల్లో అవిశ్రాంతంగా కృషి కొనసాగించడం ఆయన ప్రత్యేకత! ఆయన దృక్పధంలో రంగు అనేది ఒక ఆయుధం, ఒక సౌకర్యం. బసోలి స్కూల్ ప్రభావం వీరి రంగుల మేళవింపులో ఎక్కువగా వుంటుంది. సొంతంగా బ్రష్లు తయారు చేసుకోవడం ఆయన ప్రత్యేకతల్లో మరొకటి.

చిన్న కాన్వాస్పై కొన్ని హద్దులు అడ్డు అయినపుడు, ఆ భావోద్వేగాన్ని పెద్ద కాన్వాస్పై నిస్సంకోచంగా ఒక మంచి ఆయుధం వాడినట్లు తన చిత్ర రచనను ఆయన కొనసాగిస్తారు. అదే విధంగా సంప్రదాయ శైలిలో పలుకని భావాల్ని, సమకాలీన విషయాల్ని చిత్రించేటప్పుడు పెద్ద కాన్వాస్పై చిత్ర రచన చేస్తారు.

“నా మూలాలు ఎక్కడ వుంటే అక్కడే నాకు బలం. అందుకే ఇక్కడ ఏ విధమైన కళా వాతావరణం లేకపోయినా, నా జ్ఞాపకాలే ప్రేరణగా చిత్రరచణ కొనసాగిస్తున్నాను. ఎక్కడవున్న నేను పనిచేసేది ఒక్కటే, కనుక పల్లెటూరులోనే ఎక్కువ సమయం వెచ్చించే అవకాశానినొక వరంగా మల్చుకొన్నాను” అంటారు ఆయన.
పట్టణాల్లో విలాసవంతమైన జీవితం గడపటానికి అన్ని అర్హతలు ఉన్నా, గ్రమసీమతోనే అనుబంధాన్ని కొనసాగిస్తున్న గిరిధర్, ఆయన చిత్రాలు కూడా అదే విధమైన విలక్షణంగా చిత్రించడంలో పెద్ద ఆశ్చర్యం కాదు కదా..?

“వయస్సు తక్కువ వుండి ఓపిక ఇంకాస్తుంటే మీ వద్ద వుండి కొన్నేళ్లు శిష్యరికం చేద్దును” అని బాపు అన్నారంటే గిరిధర్ కళా ప్రతిభ ఎలాంటిదో వేరుగా చెప్పనక్కర లేదనుకొంటాను.

– సుంకర చలపతిరావు (9154688223)

9 thoughts on “ప్రాచీన ఆధునికతలకు మేలి మేళవింపు: గిరిధర్ గౌడ్

    1. ఆసక్తి, కృషి, పరిశ్రమ ఒకే చోటకు చేరితే ఫలితం ఎంత గొప్పగా ఉంటుందో గిరిధర్ గారి గురించి చదివితే తెలిసింది. గిరిధర్ గారు తెలుగువారు కావడం మన అదృష్టం.

  1. గిరిధర్ గౌడ్ గారి గురించి ..వారి చిత్రాలు గురించి చాలా చక్కగా వివరించారు…
    గిరిధర్ గౌడ్ గారికి… చక్కని వ్యాసాన్ని అందించిన సుంకర చలపతిరావు గారికి..కళాసాగర్ గారికి నమస్కారములు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap