మూడు దశాబ్దాల క్రితం కార్టూనిస్టుగా ఓనమాలు దిద్దిన పైడి శ్రీనివాస్, ప్రస్తుతం ఎలక్ట్రానిక్ మీడియాలో జర్నలిస్టుగా కొనసాగుతున్నారు. సుదీర్ఘ విరామం తరువాత ఇటీవలే తన కలానికి మళ్లీ పదును పెట్టి పలు అంశాలపై సోషల్ మీడియా లో కార్టూన్లు వేస్తున్నారు. మన కార్టూనిస్టులు శీర్షికన ఈ నెల పైడి శ్రీనివాస్ గారి పరిచయం మీ కోసం…
—
మా స్వస్థలం వరంగల్. నగరంలోని భద్రకాళి ఆలయం పరిసర ప్రాంతాల్లో నా బాల్యం గడిచింది. చిన్నతనం నుంచే బొమ్మలు గీయడం నా హాబీ. స్కూల్లో ఆ తరువాత కాలేజీలో వ్యాసరచనతో పాటు డ్రాయింగ్ కాంపిటీషన్స్లో మొదటి బహుమతి నాకే. ఆరవ తరగతిలో ఉన్నప్పుడు మొదటిసారి లైబ్రరీకి వెళ్లాను. ఆ తరువాత లైబ్రరీకి వెళ్లడం నాకో వ్యసనంగా మారింది. ఎంతలా అంటే… ప్రతిరోజూ ఉదయం కానీ సాయంత్రం కనీసం రెండు గంటలైనా లైబ్రరీలో గడపాల్సిందే. ఏదీ వదిలిపెట్టకుండా చదివేవాడిని. లైబ్రరీ పుస్తకాలే కాకుండా బయట షాపుల్లో నవలలు అద్దెకు తెచ్చుకుని చదివేవాడిని. ఆరోజుల్లో ఇంటికి ఆంధ్రభూమి వీక్లీ తెప్పించుకునేవాళ్లం. అందులో మల్లిక్ కార్టూన్లు నన్ను ఎంతగానో ఆకట్టుకునేవి. మల్లిక్ కార్టూన్లు చూసి నేను కూడా కార్టూన్లు గీసే ప్రయత్నం చేశాను. అయితే ఏ సైజులో గీయాలి…? ఎలా గీయాలి…? వాటిని పత్రికలకు ఎలా పంపించాలో తెలియదు. ఇండియన్ ఇంక్ అనేది నాకు ఒక బ్రహ్మ పదార్థంగా అనిపించేంది. అలాంటి సమయంలో పల్లకి అనే వారపత్రిలో రామ్మోహన్ అనే కార్టూనిస్టును పరిచయం చేస్తూ ఆయన అడ్రసు కూడా ప్రచురించారు. అప్పుడు ఆయన మాకు దగ్గర్లోనే ఉన్న పాలిటెక్నిక్ హాస్టల్లో ఉండేవారు. ఆయన దగ్గరకు వెళ్లి కార్టూన్లు ఎలా వెయ్యాలో అడిగి తెలుసుకున్నాను. నా మొదటి కార్టూన్ జాగృతి వారపత్రిలో అచ్చయింది. పత్రిక వారు పంపించిన కాంప్లిమెంటరీ కాపీలో నా కార్టూన్ చూసుకున్నప్పటి సంతోషం అంతా ఇంతా కాదు. వరుసగా నా కార్టూన్లు ప్రచురించి నన్ను ఎంకరేజ్ చేసింది జాగృతి పత్రికే. దాంతో పాటు ఇతర పత్రికల్లోనూ నా కార్టూన్లు ప్రచురించబడ్డాయి. ఆరోజుల్లో ఆంధ్రజ్యోతి వాళ్లు నిర్వహించిన కార్టూన్ల పోటీలో పాల్గొనేందుకు ప్రత్యేకంగా వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్లాను. ఇప్పుడు సాక్షిలో ఉన్న కార్టూనిస్టు శంకర్ కూడా ఆ పోటీలో పాల్గొన్నారు. ఆయనకు మొదటి బహుమితి వస్తే నా కార్టూన్కు ప్రత్యేక బహుమతి లభించింది. బహుమతిగా ఆంధ్రజ్యోతివాళ్లు పంపించిన చెక్కు ను ఎలా మార్చుకోవాలో తెలియదు. ఆ తరువాత ఆ చెక్కు ఎక్కడో పోయింది. కార్టూన్లతో పాటు జోక్స్ కూడా రాసి పత్రికలకు పంపించేవాడిని. ఆంధ్రభూమిలో నా జోక్స్ చాలా వచ్చాయి. వార్త దినపత్రికలో చెలి పేజీలో కూడా నా జోక్స్ వేసుకునేవారు. 2000 సంవత్సరంలో వార్త డెయిలీలో పార్ట్టైమ్ రిపోర్టర్గా జాయినయ్యాను. అందులో డెస్క్ ఇన్ఛార్జి శంకేషి శంకర్రావుగారు నన్ను ఎంతో ప్రోత్సహించారు. వారం వారం వార్త జిల్లా టాబ్లాయిడ్లో నా కార్టూన్లు వేసుకునేవారు.
ప్రపంచ ప్రఖ్యాత మిమిక్రీ కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్ మా ఇంటికి దగ్గర్లోనే ( కొత్తవాడ )ఉండేవారు. వార్తలో రిపోర్టర్గా ఉన్నప్పుడు ఒకసారి ఆయన్ను ఇంటర్వ్యూ చేసే అవకాశం వచ్చింది. వరంగల్ నగరానికే చెందిన ప్రముఖ రచయిత అంపశయ్య రాసిన అనుబంధాలు అనే నవలను నేనే ఫెయిర్ చేసిపెట్టాను. అందుకోసం ఆయన ఇచ్చిన పారితోషికంతో ఒక రిస్ట్వాచ్ కొనుక్కున్నాను. అది మూడేళ్ల పాటు నా చేతిని అంటిపెట్టుకుని ఉంది. అదొక తీపి గుర్తు. 2003లో ఈనాడు జర్నలిజం స్కూల్ ద్వారా ఈటీవీ 2లో సబ్ ఎడిటర్గా జాయినయ్యాను. 2008లో సాక్షి టీవీలో చేరాను.ఈమధ్యకాలంలో కార్టూన్లు వేసి పత్రికలకు పంపడానికి ఏమాత్రం అవకాశం లేకుండా పోయింది. అయినా ప్రతిరోజూ కార్టూన్లు గీయడం హాబీగా కొనసాగింది. 2017లో హైదరాబాద్లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా కార్టూన్ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. అందులో నా కార్టూన్ను కూడా ప్రదర్శించారు. అప్పటికి రెండు రాష్ట్రాల కార్టూనిస్టులకు కలిపి వాట్సాప్ గ్రూపు ఉందని నాకు తెలియదు. ఇతర కార్టూనిస్టులతో కూడా నాకు పరిచయం లేదు. ఆ ఎగ్జిబిషన్కు హాజరైన కార్టూనిస్టులను చూసిన తరువాత నాలో మళ్లీ కార్టూన్లు గీయాలనే ఆసక్తి పుట్టుకొచ్చింది. బాలీవుడ్ హీరోయిన్ శ్రీదేవి చనిపోయినప్పుడు వివిధ ఛానళ్లు చేసిన హడావిడి చూసి ఒక కార్టూన్ వేసి ఫేస్ బుక్కులో పెట్టాను. అది బాగా వైరల్ అయింది. నాలో ఉత్సాహం రెట్టింపైంది. ఏటీఎంలలో డబ్బులు లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులపై మరో కార్టూన్ వేశారు. అది కూడా బాగా వైరల్ అయింది. చాలా వాట్సాప్ గ్రూప్స్లో సర్క్యులేట్ అయింది. ఇక అప్పటి నుంచి క్రమం తప్పకుండా కార్టూన్స్ వేసి ఫేస్బుక్, వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేస్తున్నాను. తొటి కార్టూనిస్టుల సలహాలు, సూచనలు ప్రకారం నా కార్టూన్లకు మెరుగులు దిద్దుకుంటున్నాను. ఇటీవల రవీంద్ర భారతిలో తెలంగాణ కార్టూనిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్టూన్ ఎగ్జిబిషన్లో కూడా నా కార్టూన్ను ప్రదర్శించారు. అంతవరకు వాట్సాప్ గ్రూప్ ద్వారానే పరియం అయిన కొందరు మిత్రులను అక్కడ ముఖాముఖి కలుసుకునే అవకాశం వచ్చింది. నీ కార్టూన్ మా ఫ్రెండ్ తన ప్రొఫైల్ పిక్చర్గా పెట్టుకున్నాడు…నీ కార్టూన్ మా ఊళ్లో వాట్సాప్ గ్రూపుల్లో సర్క్యులేట్ అవుతుంది అని ఎవరైనా చెప్పినప్పుడు సంతోషం కలుగుతుంది. ఇక నా వృత్తిపరమైన విశేషాలు చెప్పాలంటే సాక్షి టీవీలో డింగ్డాంగ్ పేరుతో అయిదేళ్ల పాటు ప్రసారమైన పొలిటికల్ సెటైర్ ప్రోగ్రామ్ నేనే నిర్వహించాను. ఆ ప్రోగ్రామ్ స్క్రిప్ట్ నేనే రాసేవాడిని. దానికి ప్రముఖ నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం హోస్ట్. ఆ ప్రోగ్రాం అయిదేళ్ల పాటు నిరాటంకంగా ప్రసారం అయింది. డింగ్డాంగ్ కోసం ఎంతోమంది ఆతృతగా ఎదురుచూసేవారు. ఆ ప్రోగ్రామ్కు రెండు సార్లు ఎన్టీ ( నేషనల్ టెలివిజన్ ) అవార్డు వచ్చింది. ధర్మవరపు సుబ్రహ్మణ్యం అకాల మరణంతో ఆ ప్రోగ్రాం ఆగిపోయింది. మా ఛానల్ కోసం సేవ్ గర్ల్ చైల్డ్ కాన్సెప్టుతో ఒక ప్రోమో రూపొందించాను. దానికి యునిసెఫ్ అంతర్జాతీయ అవార్డు దక్కింది. కార్టూనిస్టు మల్లిక్పై అభిమానంతో ఆయన్ను కలుసుకోవాలని ఒకసారి హైదరాబాద్కు వెళ్లాను. కానీ కలుసుకోవడం వీలుకాలేదు. ఈనాడు కార్టూనిస్టు శ్రీధర్ గారి కార్టూన్లన్నీ నాకెంతో ఇష్టం. ఈటీవీ2 లో నేను పనిచేసిన అయిదు సంవత్సరాల్లో ఆయన్ను ఒక్కసారి కూడా కలుసుకోలేకపోయాను. అక్కడి నుంచి వచ్చేసే ముందు రామోజీ ఫిలిం సిటిలో శ్రీధర్గారిని కలుసుకున్నా…అప్పుడు ఆయన చెప్పిన సలహాలు కూడా నాకు ఎంతో ఉపయోగపడ్డాయి. ప్రస్తుతం నా కార్లూన్లకు లభిస్తున్న ఆదరణ చూసి రోజుకో కార్టూన్ వేయాలని నిర్ణయించుకున్నా. ఈ ఇంటర్వ్యూ ద్వారా నన్ను నేను పరిచయం చేసుకునే అవకాశం లభించడం గొప్ప అవకాశంగా భావిస్తున్నా.
-పైడి శ్రీనివాస్
పైడి శ్రీనివాస్ గారూ మీ కార్టూన్లు సింపుల్ లైన్లతో, మంచి భావ ప్రకటన తో చాలా బాగుంటాయి. వాటిలో వ్యంగ్యం, హాస్యం సమపాళ్లలో ఉంటాయి. మీ కార్టూన్ ప్రస్థానం ఇంకా బాగా ముందుకుసాగాలని కోరుకుంటున్నాను. అభినందనలు. మిమ్ములను పరిచయం చేసిన కళా సాగర్ గారికి ధన్యవాదాలు
very funny cartoons, congrats Srinivas garu.
పైడి శ్రీనివాస్ గారు మీ కార్టూన్లకు అభిమానిని. చాలా బాగుంటాయి మీ సెటైర్లు.