(కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు – 2018కు కొలకలూరి ఇనాక్ ఎంపికైన సందర్భంగా ప్రత్యేక వ్యాసం)
స్వాతంత్య్రానంతర సాహిత్యపు తొలితరం కలంయోధుడు ఆచార్య కొలకలూరి ఇనాక్, కలంతో ఆరుదశాబ్దాలకు పైగా అలుపెరుగని సాహితీ సేద్యం చేస్తున్న కృషీవలుడు. ఇనాక్ కంటే ముందు సంఘసంస్కరణ దృక్పధంతో సాగిన సామాజిక ప్రయత్నాలు, వెలువడిన సాహిత్యం ఈ దేశపు ఆంటరానివాడల వరకు వ్యాపించలేకపోయాయి. విప్రవర్ణం చారిత్రకమైన సాహిత్యం సృజించినా దానికి పరిధులు, పరిమితులు లేకపోలేదు. సామాజిక విముక్తి మార్గంలో అట్టడుగు కులాల ప్రజలకు ఆ సాహిత్యం విముక్తిని చూపించలేకపోయింది. ఈ లోటును పూరించడానికి నాలుగు మూలస్తంభాల్లా నిలిచినవారు మహాకవి గుర్రం జాషువా, బోయి భీమన్న, కుసుమ ధర్మన్న, కొలకలూరి ఇనాక్లు. తెలంగాణ నుండి బోయ జంగయ్య కృషి కూడా విస్మరించలేనిది. నోరులేని వారి తరుపున వకాల్తా పుచ్చుకొని గొంతెత్తిన ఆత్మగౌరవ స్వరం ఇనాక్, ఆత్మగౌరవం, అవమానం, అమానుష వివక్షలను వస్తువులుగా స్వీకరించి, మానవత్వానికి పునాదులు వేసే మహోన్నత ఆశయంతో రచనలు చేశాడు ఇనాక్, మానవతా దృక్పథంతో ఒక్కడే ఒక ఉద్యమంగా రచనా వ్యాసంగం కొనసాగిస్తున్న ఇనాక్ కు చాలా ఆలస్యంగానైనా ఈ యేడాది కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు రావడం ముదావహం.
ఇనాక్ సాహిత్యం కేవలం సాహిత్యం కోసమే కాదు. కనీస హక్కులకు నోచుకోని లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు నింపడం కోసమే ఇనాక్ కలం పట్టాడు. ఆణగారిన ప్రజల పక్షాన నిలబడాలనుకున్నాడు. ఈ దృక్పథం ఆలవడడం వెనకాల తాను పుట్టిన వేజెండ్ల ఊరి నేపథ్యముంది. చీత్కారాలనే సత్కారాలుగా భావించి, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిన జీవన ప్రయాణం తనది. దళితులు తాము కులవ్యవస్థ వల్ల ఆపాదించబడిన బాధలకు కన్నీళ్లకు కారణమైన పరిస్థితుల మీద, మనుషుల మీద ఆగ్రహం వ్యక్తం చేయడం సహజం. ఈ విషయంలో ఇనాక్లో మాత్రం విశాల దృక్పథం చోటు చేసుకుంది. అదే ఆయనకు ఒక సాహిత్య జీవన దృక్పథాన్ని అందించింది. అదే మానవతావాద దృక్పధం.
బహుముఖీన సాహిత్య సృజన ఇనాక్ సొంతం. సాధారణంగా సాహిత్యకారులు ఒక ప్రక్రియలో పరిణతి సాధిస్తారు. అదే వారికొక గుర్తింపునిస్తుంది. ఇనాక్ మాత్రం కవిత్వం, కథ, నవల, నాటకం, విమర్శ పరిశోధన, అనువాదం.. ఇలా ఏడు ప్రక్రియల్లో, ప్రక్రియ ఏదైనా సాధికారికమైన పట్టుతో స్పజించి సాహితీ లోకానికి అందించాడు. ఇంతటి వైవిధ్యమున్న రచయితలు బహు అరుదు. ఇనాక్ యవ్వన కాలం నాటికి సాహిత్యంలో ఇప్పుడున్నంత వెసులుబాటు కూడా లేదు. కేవలం కొందరు మాత్రమే సరస్వతీ పుత్రులుగా, కళామతల్లి బిడ్డలుగా కీర్తించబడుతు న్నారు. వారందరికి ధీటుగా తన మార్గాన్ని తానే నిర్దేశించుకున్నాడు ఇనాక్, ఈ సాహసమే తెలుగు సాహిత్య చరిత్రలో ఇనాక్ పుటలను సృష్టించింది.
1954లో ‘ఉత్తరం’ అనే కథతో మొదలైన ఇనాక్ సాహిత్య ప్రస్థానం 96 పుస్తకాల మైలురాయిని చేరింది. సాహిత్యంలో ఆల్ రౌండర్ ప్రతిభను కనబరిచిన ఇనాక్గారిని విస్మరించే పరిస్థితి ఇవాళ ఎవ్వరికీ లేదు. కాకుంటే ఇనాక్ అనే ఈ సముద్రంలో కొందరికి కొన్ని దరులు మాత్రమే తెలుసు. కొలకలూరి ఇనాక్ అంటే కొందరికి కథా సాహిత్యంలో ‘ఊరబావి’, నాటక సాహిత్యంలో ‘మునివాహనుడు’, ‘జైహింద్ విమర్శలో ‘విమర్శిని’, ‘జానపద సాహిత్య విమర, పరిశోధనలో ‘వ్యాస పరిణామం’; నవలా సాహిత్యంలో ‘అనంత జీవనం, పులులబోను’ గుర్తుకొస్తాయి. పలు భార తీయ భాషలతో పాటు, విదేశీ భాషలైన జర్మన్, ఫ్రెంచ్ భాషల్లోకి సైతం ఇనాక్ రచనలు అనువాదమయ్యాయి. ఇక అనువాదంలో కూడా ఇనాక్ ది బలమైన ముద్ర. తన రచనలను తానే ఇంగ్లీషులోకి, అలాగే ఇంగ్లీషు రచనలను తెలుగులోకి అవలీలగా స్వయంగా అనువాదం చేసుకుంటాడు. అలాగే విశ్వవిద్యాలయాల్లో ఇనాక్ రచనలు సిలబస్లో పాఠ్యాంశాలుగా ఉన్నాయి. ఇనాక్ సాహిత్యం మీద 11జాతీయ సదస్సులు జరిగాయి. ఇనాక్ ‘అనంత జీవనం’ నవలకు 2015 సంవత్సరానికి గాను భారత దేశ అత్యున్నత సాహితీ పురస్కారం అయిన జానపీర్ వారి ‘మూర్తి దేవి’ అవార్డు తెలుగు సాహిత్యంలో అందుకున్న ఒకే ఒక్క రచయిత ఇనాక్, ఇనాక్ సాహిత్య కృషికి పద్మశ్రీ అవార్డు కూడా అందివచ్చి తనను తాను గౌరవించుకుంది.
ఇనాక్ రచనల్లో దేని విశిష్టత దానిదే. ప్రస్తుతం కేంద్ర సాహిత్య ఆకాడెమీ అవార్డుకు ఎంపికైన ‘విమర్శిని’ మరింత విశిష్టమైనది. సృజనకారుడు విమర్శ రాసేటపుడు అంత కటువుగా ఉండలేడు. కారణం సృజనకారుల మానసిక సంఘర్షణ వారికి తెలిసి ఉండడం. ఇనాక్ విమర్శినిలో ఇది కనపడదు. నిర్దయగా సాహిత్య ప్రక్రియలను బేరీజు వేస్తాడు ఇనాక్. తెలుగు వెలుగులు, కథానిక, నవల అనే మూడు భాగాలుగా ఉన్న విమర్శిని గ్రంథంలో ఇనాక్ అనేక కొత్త ప్రతిపాదనలు చేశాడు. సాహిత్యంలో అప్పటికే స్థిరపడిపోయిన భావనలను చాలా సులభంగా త్రోసిపుచ్చి, ఆధారాలతో కొత్త ప్రతిపాదనలు చేశాడు. భద్రిరాజు కృష్ణమూర్తి తెలుగు భాషలో నాలుగు మాండలికాలున్నాయంటే, ఇనాక్ అందుకు ఒప్పుకోడు. నాలుగు కాదు ఆరంటూ ఆధారాలతో నిరూపించాడు. సృజనకారుడిగానే కాదు, ఇనాక్లో ఉన్న భాషా నిపు బుడిని కూడా మనకు విమర్శిని మనకు పరిచయం చేస్తుంది.
ఇంత విస్తారంగా సాహితీ సేద్యం చేసిన ఇనాక్ తపన వెనుక ఈ దేశ మూల వాసుల శతాబ్దాల సంఘర్షణ ఉంది. ఏడు ప్రక్రియల్లో రచనలకు ఆయన ఎంచు కున్నది కూడా ఏడు సామాజిక సమూహాలు దళిత, బహుజన, గిరిజన, మైనారిటీ, స్త్రీ పేద, మానవత భావనల పునాదిగా ఇనాక్ సాహిత్యం కొనసాగింది. వస్తు, శిల్పాల ఎంపిక ఎలా ఉన్నా సరే, సరైన దృక్పథం లేని రచయితలు కాలగర్భంలో కలిసిపోతారు. ఎక్కడో ఒక చోట వారి సాహిత్య ప్రయాణానికి బ్రేక్ పడుతుంది. ఇనాక్లో మాత్రం ఇది జరగలేదు కారణం ఆయనలోని సాహిత్య దృక్పధమే. ఇనాక్ ఆరున్నర దశాబ్దాల సాహిత్యకృషి సాహిత్య గమనానికి దిశానిర్దేశం చేస్తోంది. ఆయన రచనలు చదివితే తెలుగు సమాజం యొక్క అంతర్ స్వరూపం అర్ధమవుతుంది. అందుకే ఆయన వర్తమాన, భవిష్యత్ తరాలకు ఒక విజ్ఞాన సర్వస్వం.
డా. పసునూరి రవీందర్